భారత షేర్ మార్కెట్లు మంగళవారం కూడా పతనమయ్యాయి. అమెరికా రుణ సంక్షోభం దరిమిలా ఎస్&పి రేటింగ్ సంస్ధ అమెరికా క్రెడిట్ రేటింగ్ తగ్గించడంతో సోమవారం ప్రపంచవ్యాపితంగా షేర్ మార్కెట్లు భారీగా నష్టపోయీన సంగతి తెలిసిందే. మంగళవారం భారత షేర్లు విపరీతమయిన ఎగుడుదిగుడులకు గురయ్యాయి. దాదాపు 1600 పాయింట్ల మేరకు గత ఐదు రోజులుగా ఉత్ధాన పతనాలకు గురైన భారత షేర్లు ప్రారంభంలో సోమవారం నాటి ధోరణిని కొనసాగిస్తూ భారిగా పతనమైన సూచిలు మధ్యాహ్నానికి కోలుకుని లాభాల బాట పట్టినప్పటికీ సెషన్ ముగిసేనాటికి నష్టాలను నమోదు చేశాయి.
ఇన్‌వెస్టర్లు, ఐ.టి లాంటి బ్లూ ఛిప్ షేర్లను సైతం అమ్మకానికి పెట్టడంతో పాటు, ప్రపంచ వ్యాపితంగా షేర్లు పతనం కావడంతో బి.ఎస్.ఇ, ఎన్.ఎస్.ఇ లు భారీగా నష్టపోయాయి. మరో పక్క చైనా ద్రవ్యోల్బణం గత మూడు సంవత్సరాలలో అత్యధిక స్ధాయికి పెరగడంతో షేర్లు మరింత ఒత్తిడికి లోనయ్యాయి. 30 షేర్ల సెన్సెక్స్ సూచి మధ్యాహ్నానికల్లా 17000 పాయింట్ల మార్కుని దాటింది. కాని అమెరికా యూరప్ ల రాజకీయ నాయకులు సంక్షోభ పరిస్ధితులను సరిగా అధిగమించలేరన్న అనుమానాలు తలెత్తడంతో షేర్ల సూచి పతనమయింది. మంగళవారం సెషన్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 132.27 పాయింట్లు నష్టపోయి 16857.91 వద్ద క్లోజయ్యింది.
ఇన్ఫోసిస్, టి.సి.ఎస్ లాంటి ఐ.టి సర్వీసుల షేర్లు మంగళవారం ఎక్కువగా నష్టపోయాయి. సెన్సెక్స్ పతనంలో ఇవి ప్రధాన పాత్ర పోషించాయి. ఇన్ఫోసిస్ రు.90.9 నష్టపోయి రు.2377.10 వద్ద ముగియగా, టి.సి.ఎస్ రు.42/- నష్టపోయి రు.967.25 వద్ద ముగిసింది. అర్.ఐ.ఎల్ షేరు రెండు శాతం పైగా నష్టపోయింది.
50 షేర్ల ఎన్.ఎస్.ఇ సూచి 45.65 పాయింట్లు నష్టపోయి, 5072.85 పాయింట్ల వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లు ఆరు శాతం వరకూ పతనం కాగా యూరోపియన్ షేర్లు ప్రారంభంలోనే పతనం కావడంతో మార్కెట్ సెంటిమెంట్ ప్రధానంగా ప్రతికూలంగా కొనసాగుతోంది. గత రాత్రి అమెరికా షేర్లు అత్యధికంగా 6 శాతం వరకూ నష్టపోయాయి. అక్టోబరు 2008 తర్వాత ఒకేరోజు ఇంత స్ధాయిలో నష్టపోవడం ఇదే ప్రధమం కావడం గమనార్హం. ప్రారంభంలో తీవ్రంగా నష్టాలకు గురైన యూరప షేర్లు భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల సమయానికి కొన్ని స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. జర్మనీ షేర్లు నష్టాల్లో ఉండగా, బ్రిటన్, ఫ్రాన్సులు స్వల్ప లాభాలను నమోదు చేస్తున్నాయి. ఐతే ఈ ధోరణి ముగిసేవరకూ కొనసాగడంపై అనుమానాలున్నాయి.

