ప్రజలు రాజకీయ నాయకుల వద్ద డబ్బులు తీసుకునో, మద్యం తాగో వారికి ఓట్లు గెలిపించినా ఎవరు అవినీతిపరులన్న విషయంలో వారు స్పష్టంగానే ఉన్నారని సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ సంస్ధ నిర్వహించిన “స్టేట్ ఆఫ్ ది నేషన్” సర్వేలో వెల్లడయ్యింది. భారత దేశ వ్యాపితంగా 1300 లొకాలిటీలలో జరిగిన ఈ సర్వే ప్రకారం ఎన్నికల్లో నెగ్గిన ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు సమాజంలో అత్యంత అవినీతిపరులుగా ప్రజలు భావిస్తున్నారు. సర్వేలో పాల్గొన్నవారిలో 43 శాతం మంది రాజకీయ నాయకులు అత్యంత అవినీతిపరులుగా చెప్పగా, 32 శాతం మంది ప్రభుత్వోద్యోగులు అత్యంత అవినీతిపరులుగా భావించారు.
వివిధ విభాగాల (డిపార్ట్‌మెంట్) వారీగా అత్యంత అవినీతి పరులను ఎన్నుకోమని కోరినపుడు గ్రామీణ, పట్టణ వాసులతో పాటు ధనిక, పేదలు కూడా పోలీసులే అత్యంత అవినీతిపరులుగా ఢంకా భజాయించారు. పోలీసులు అవినీతిపరులన్న వారి నిష్పత్తి వివిధ వర్గాల ప్రజల్లో మారుతూ వచ్చింది. గ్రామీణ పేదల్లో 19 శాతం మంది పోలీసులు అత్యంత అవినీతిపరులని చెప్పగా, పట్టణ ధనికుల్లో 42 శాతం మంది అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనికి కారణం స్పష్టమే. గ్రామీణ పేదల వద్ద ఎంత అవినీతితో ఉన్నా సంపాదించ గలిగేది స్వల్పమే. అదే పట్టణ ధనికుల వద్ద ఎంత పిండుకుంటే అంత! అందుకే పట్టణ ధనికుల్లో అత్యధికులు పోలీసుల అవినీతిపై ధ్వజమెత్తారు.
అవినీతిపై జరిగిన ప్రస్తుత సర్వే భారత దేశంలో పాలనావ్యవస్ధ నిర్మితమైన తీరును ప్రతిబింబించింది. గ్రామీణ ప్రాంతాల్లోగానీ, పట్టణ ప్రాంతాల్లో గానీ అధికారం ఎవరి వద్ద కేంద్రీకృతమై ఉంటే వారే అత్యధిక అవినీతి పరులుగా ప్రజల్లో పేరు సంపాదించుకున్న సంగతి సర్వేలో వెల్లడయ్యింది. గ్రామీణ పేదలకు (ధనికులకు కూడా) పంచాయితీలు, తహసీల్ ఆఫీసులు అత్యంత అవినీతి కేంద్రాలుగా ఉన్నాయి. పంచాయితీలు అవినీతి పరులని 24 శాతం మందీ, తహసీల్దారు ఆఫీసులు అవినీతిపరులని 18 శాతం మందీ అభిప్రాయం చెప్పారు. “సెంటర్ ఆఫ్ ది స్టడీస్ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్” జరిపిన ఈ సర్వే 19 రాష్ట్రాల్లో నిర్వహించారు. సామాన్య మానవుడి జీవనం ఎవరితో ఎక్కువగా ముడిపడి ఉన్నదో అర్ధం అయినపుడు, వ్యాపారులు, న్యాయ వ్యవస్ధ, మీడియాలు అతి తక్కువ అవినీతిపరులుగా భావించపడడం పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించదు.

గ్రామీణ పేదల్లో 3 శాతం, పట్టణ పేదల్లో 12 శాతం మంది మాత్రమే రేషన్ షాపులు అత్యంత అవినీతిమయంగా భావించారు. ప్రభుత్వాసుపత్రులు అవినీతిమయంగా గ్రామీణ పేదలలో 3 శాతం, పట్టణ పేదల్లో 6 శాతం భావిస్తున్నట్లు తేలింది. ఆసుపత్రుల సౌకర్యాలు భారత దేశంలో అత్యధికులకు అందుబాటులో లేవన్న విషయం దీని ద్వారా స్పష్టమవుతుంది.


NGOలలో కూడా అవినీతి ఎక్కువగా ఉంది. మన దేశంలోని NGOలకి విదేశాల నుంచి దండిగానే నిధులు వస్తాయి.
అవును. కేవలం డబ్బుకోసమే ఎన్.జి.ఒ లను స్ధాపిస్తున్నారు. వచ్చే నిధుల్ని స్వార్ధానికి వాడుకుంటున్నారు. వీరిపైన పర్యవేక్షణ కూడా పెద్దగా లేనట్లుంది.
ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్మెంట్‌వాళ్ళకి మాత్రమే NGOల విరాళాల లెక్కలు చూసే అధికారం ఉంది. పోలీసులకి ఆ అధికారం లేదు. అందుకే NGOలు అవినీతి చెయ్యగలుగుతున్నాయి.
అవునా ప్రవీణ్? ఎన్.జి.ఓ లు ప్రజలకు బాద్యులు కాదు. అందుకనే వారి అవినీతిని ఎత్తి చూపడం కుదరదు. ఒక్క డోనర్లకు తప్ప.
NGOలకి డబ్బులు ఇచ్చేది సాధారణ దాతలు కాదు, విదేశీ దాతలు. అందుకే ఇక్కడి స్థానికులు NGOలని ప్రశ్నించరు.