అమెరికా షేర్ మార్కెట్లు సోమవారం నాడు అతలాకుతలం అయ్యాయి. ప్రధాన షేర్ సూచిలు దారుణంగా పతనం అయ్యాయి. అమెరికా రుణ పరిమితి పెంపుదల కోసం, బడ్జెట్ లోటు తగ్గింపు కొసం రిపబ్లికన్లు, డెమొక్రట్ల మధ్య గత శుక్రవారం కుదిరిన ఒప్పందం అమెరికా రుణ సంక్షోభాన్ని ఏమాత్రం శాంతపరచబోదని మదుపుదారులు భావించడంతో మదుపుదారులు ప్రపంచ షేర్ మార్కెట్లలో అమ్మకాలకు పరుగులెత్తారు. అమెరికా షేర్ మార్కెట్లు పెద్ద ఎత్తున అమ్మకాల ఒత్తిడికీ లోనై అత్యధిక స్ధాయిలో పతనం అయ్యాయి.
పై పట్టికలో చూపినట్లుగా ప్రధాన సూచి “డౌజోన్స్ ఇండస్ట్రియల్ ఏవరేజ్,” మరీ ఘోరంగా 5.55 శాతం నష్టపోగా, ఎస్&పి సూచి 6.66 శాతమూ, నాస్‌డాక్ కాంపోసిట్ సూచి 6.9 శాతమూ నష్టపోయాయి. 2008 నాటి “ది గ్రేట్ రిసెషన్” కాలంలో కూడా ఒకే రోజు ఇంత పెద్ద ఎత్తున షేర్ మార్కెట్లు కూలిపోవడం జరగలేదు. వస్తూత్పత్తులు, సరుకుల మారకాలకు సంబంధించిన అసలు మార్కెట్లకు ప్రతిబింబంగా ‘మనీ’షి మస్తిష్కంలో జనించిన షేర్ మార్కెట్లు చివరికి అసలు మార్కెట్లను సైతం అల్ల కల్లోలం చేయడానికి కారణం ఏమిటో మార్కెట్ ఎకానమీ ఆర్ధిక పండితులు కారణాలు చెప్పవలసి ఉంది. అత్యంత కృత్రిమంగా వస్తువులు, సరుకులు లేదా సర్వీసుల మారకం ఏమీ జరగకుండానే రాత్రికి రాత్రి ట్రిలియన్ల కొద్దీ సొమ్ము మార్కెట్ కేపిటలైజేషన్ గా కోల్పోవడం ఏ సహజత్వానికి ప్రతీకో మార్కెట్ పండితులు చెప్పవలసి ఉంది.
స్పెక్యులేషన్: అసలు పరిణామాలేవీ జరగకుండానే, కేవలం ఊహలతో, అంచనాలతో షేర్ మార్కెట్లు కుప్పకూలడం, కష్టపడి ఆర్జించిన సొమ్ముని షేర్ మార్కెట్లలో పెట్టి కలలు కంటున్న మధ్య తరగతి వారి కలల సౌధాన్ని రాత్రికి రాత్రే కూల్చి వేయడం సాధారణంగా మారుతున్న నేపధ్యంలో అసలు ఈ షేర్ మార్కెట్ల వలన లబ్దిపొందుతున్నదెవరో తేల్చ వలసిన కర్తవ్యం ప్రభుత్వాల పైన ఉంది. ఒక దేశంలో సంక్షోభం వచ్చినంతనే, ప్లేగు వ్యాది వచ్చి గంటల్లో భూమండలం అంతా వ్యాపించినట్లుగా ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ మొత్తం గజ గజలాడుతున్న పరిస్ధితి ఎవరి సుఖ భోగాలకు దారితీస్తున్నదో మార్కెట్ ఎకానమీ పండితులు వివరణ ఇవ్వవలసిన అవసరం ఉంది.
మంగళ వారం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 3 గంటలకు యూరప్ లోని ప్రధాన దేశాలు బ్రిటన్ (ఎఫ్.టి.ఎస్.ఇ), ఫ్రాన్స్ (సి.ఎ.సి), జర్మనీ (డి.ఎ.ఎక్స్) ల షేర్ మార్కెట్ల పతనాన్ని పై టేబుల్ సూచిస్తుంది. సోమవారం దాదాపు 3 నుండి 5 శాతం వరకూ పతనమైన ఈ షేర్ల సూచిలు ఈరోజు కూడా 3 శాతం నుండి 5 శాతం వరకూ దారుణంగా నష్టపోయాయి. అంటే రెండు రోజుల్లోనె యూరోపియన్ మార్కెట్లు 6 శాతం నుండి 10 శాతం వరకూ నష్టపోవడం, తద్వారా కొన్ని వందల బిలియన్ల డాలర్ల మార్కెట్ కేపిటలైజేషన్ తుడిచిపెట్టుకుపోవడం నిజంగా మార్కెట్ ఎకానమీ గొప్పతనాన్ని సూచించేవా లేక ఆ వ్యవస్ధలోనె అంతర్గతంగా దాగిఉన్న వినాశకర వైరుధ్యాలను విప్పిచూపేవా అన్న విషయాన్ని కన్సర్వేటివ్ ఆర్ధిక విధానాల ప్రభోధకులు, నూతన ఆర్ధిక విధానాల ప్రచారకులు, నయా ఉదారవాద ఆర్ధిక విధానాల సమర్ధకులు ఇప్పటికైనా అంగీకరించవలసి ఉన్న అగత్యం వచ్చింది.
లాటరీ టిక్కెట్ల కొనుగోళ్ళు గా మారిన షేర్ మార్కెట్ల పెట్టుబడులు ఇప్పుడు లాస్ వేగాస్ కాసినో క్లబ్బులుగా అభివృద్ధి చెందాయి. ఎన్నో మధ్యతరగతి జీవుల ఆశలను మోస్తూ, కొద్దిమంది ధనార్జనాపరుల మోసాల సంపాదనలకు నిలయంగా మారాయి. ఎంతమంది హర్షద్ మెహతాలు, మరెంతో మంది కేతన్ పరేఖ్ లూ షేర్ మార్కెట్ల నిజస్వరూపాన్ని విప్పిచూపినా ప్రజలు వాటిబారిన పడడం తగ్గడం లేదు. ఒకప్పుడు డబ్బు మిగిలితే బ్యాంకుల్లోనో, ఫిక్స్‌డ్ డిపాజిట్లుగానో, రికరింగ్ డిపాజిట్లుగానో దాచుకునే మధ్య తరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాలు ఇప్పుడు తక్షణ లాభాలను ఆశిస్తూ తమ కష్ట ఫలితాన్ని షేర్లలొ ధారపోస్తున్నారు. మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు, ఫ్యాక్టరీలు ఒకప్పుడు అప్పులు కావాలంటే పూర్తిగ బ్యాంకులపైనా, సొంత పెట్టుబడులపైనా ఆధారపడేవి. ఇప్పుడు వారు పబ్లిక్ ఇస్యూలకు వెళ్తూ నేరుగా ప్రజలనుండే డబ్బుని పెట్టుబడులను పొందగలుగుతున్నారు. దానికి ప్రతిఫలంగా వాటాలు (షేర్లు) ఇస్తున్నామంటూ చెప్పి, ఆనక బిలియనీర్ల ఆర్ధిక మోసాల గారడీలకు బలిచేస్తున్నారు.
మూడు సంవత్సరాల క్రితమే ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ పెను సంక్షోభానికి లోనై కొద్దిగా కోలుకుంటున్నట్లు కనిపిస్తోంది. మార్కెట్ ఆర్ధిక వ్యవస్ధల విలయతాండవాన్ని కళ్ళరా చూసి, జీవితాలకు సరిపడా అనుభవించి కూడా మళ్ళీ అవే మోసాల ముంగిట ప్రభుత్వాలన్నీ నిలవడం ఎవరిని ఉద్ధరించడానికి? మార్కెట్ ఎకానమీ విషపుత్రిక షేర్ మార్కెట్ నిస్సందేహంగా కాసినో ఓనర్లు అన దగిన బడా వాల్‌స్ట్రీట్ కంపెనీలకే. షేర్లలో సురక్షితంగా ఉంటుందని భావిస్తూ, లాభాలు కూడా ఇబ్బడి ముబ్బడిగా వస్తాయని ఆశించే సామాన్య వేతన జీవులు, ఛోటా మదుపుదారులు, చిన్న వ్యాపారస్తులకు చివరికి మిగిలేది ఆశనిపాతాలూ, ఆకస్మిక పతనాలూ, గుండె కోతలే కాదా?!

