రుణ సంక్షోభాన్ని అమెరికా ప్రభుత్వం ఎదుర్కొన్న పద్దతిపై చైనా మొదటిసారిగా స్పందించింది. సంక్షోభాన్ని ఎదుర్కొన్న తీరుని తీవ్రంగా ఎండగట్టింది. కనీసం కామన్ సెన్స్ కూడా లేదని లెఫ్ట్ అండ్ రైట్ వాయించింది. డాలర్ ఆధిపత్యం వహించే రోజులు పోయాయని హెచ్చరించింది. ఇలాగే ఉంటే మరో కరెన్సీని అంతర్జాతీయ కరెన్సీగా ఎన్నుకోవాల్సి ఉంటుందని క్లాస్ పీకింది. ఆర్దిక వ్యవస్ధని అప్పులపై ఆధారపడి నడపడాన్ని ఎద్దేవా చేసింది.
అమెరికా రుణ సంక్షోభం నుండి బైటపడడానికి రాజకీయ పక్షాలు జరిపిన చర్చలు నెలల తరబడి సాగిన సంగతి విదితమే. అన్ని రోజులు చర్చలు జరిపినా సరైన పధకాన్ని సిద్ధం చేయలేకపోయామని అమెరికా అధ్యక్షుడు ఒబామా తో పాటుప్రతినిధుల సభ, సెనేట్‌ల సభ్యులు అనేక మంది అంగీకరిస్తున్నారు. చివరి నిమిషంలో కుదిరిన ఒప్పందం మార్కెట్లను సంతృప్తి పరచకపోవడంతో ప్రపంచ వ్యాపితంగా షేర్ మార్కెట్లు శుక్రవారం తీవ్రంగా నష్టపోయాయి.
అమెరికా ఒప్పందం కుదుర్చుకున్న తీరుని చైనా కఠిన పదజాలంతో విమర్శించింది. ‘అప్పుకి బానిసైపోవడాన్ని’ నిరసించింది. రాజకీయ పార్టీలు చర్చల్లో “హ్రస్వ దృష్టి”ని ప్రదర్శించాయని పేర్కొంది. ఇలాగే కొనసాగితే ప్రపంచానికి మరొక స్ధిరమైన అంతర్జాతీయ కరెన్సీ అవసరమవుతుందని హెచ్చరించింది. చైనా ప్రభుత్వ పత్రిక జిన్‌హువాలో శనివారం నాడు అమెరికా బడ్జెట్ కంట్రోల్ చట్టంపై కఠిన వ్యాఖ్యలు ప్రచురితమయ్యాయి. “ప్రపంచానికి ఏకైక అగ్ర రాజ్యంగా ఉన్న అమెరికాకి చైనా, అత్యధిక అప్పులిచ్చింది కనుక తన వ్యవస్ధాగత రుణ సమస్యలను సరైన రీతిలో పరిష్కరించుకోవాలని కోరే ప్రతి హక్కూ చైనాకి ఉంది. సరైన రీతిలో సమస్యలను పరిష్కరించడం ద్వారా అమెరికా ట్రెజరీస్‌లో చైనా పెట్టుబడులు భద్రంగా ఉండేలా చూడలని కోరే హక్కు ఉంది” అని జిన్‌హువా పత్రిక తగులాడింది.
మిలట్రీ ఖర్చుల్లోనూ, సామాజిక సంక్షేమ పధకాల ఖర్చుల్లోనూ కోత పెట్టడం ద్వారా అప్పు వ్యసనానికి బానిసగా ఉండే విషయంలో కొంత “కామన్ సెన్స్” ని ఉపయోగించాలని చైనా అమెరికాని కోరింది. “ఇప్పటి దాకా తనకు తాను సృష్టించుకున్న ఆందోళన కర పరిస్ధితులనుండి బైటపడడానికి అప్పు తెచ్చి సర్దడం ద్వారా అమెరికా బైటపడుతూ వచ్చింది. కాని అలాంటి పాత మంచి రోజులు పోయాయన్న బాధాకరమైన వాస్తవాన్ని అమెరికా గుర్తించవలసి ఉంది” అని జిన్‌హువా పత్రిక రాసింది. మరొకసారి అమెరికా క్రెడిట్ రేటింగ్ తగ్గినట్లయితే ప్రపంచ ఆర్ధిక పునరుద్ధానం ప్రమాదంలో పడే అవకాశాలు చాలా ఉన్నాయని చైనా హెచ్చరించింది. ప్రముఖ రేటింగ్ సంస్ధ స్టాండర్డ్ & పూర్, అమెరికా క్రెడిట్ రేటింగ్‌ను AAA నుండి AA+కి తగ్గించిన సంగతి విదితమే. అప్పుల భారం, బడ్జెట్ లోటు లు పెరిగిపోవడంతో ఆర్ధిక వ్యవస్ధ బలహీనపడుతున్నదని గుర్తించిన ఎస్ & పి, రేటింగ్ ను తగ్గించేసింది.
“అమెరికా డాలర్లను జారీ చేయడంపైన (ముద్రించడం పైన) అంతర్జాతీయ పర్వవేక్షణ ఉంచవలసిన అవసరం తలెత్తింది. ఏ ఒక్క దేశం వలనైనా ఉద్భవించే వినాశకర పరిణామాలనుండి రక్షణ పొందడం కోసం మరొక నూతన, స్ధిరమైన ప్రపంచ కరెన్సీ ఆవిష్కరణ కూడా ఒక ప్రత్యామ్నాయంగా ఉంచుకోవాల్సిన అగత్యం ఏర్పడింది” అని జున్‌హువా పేర్కొంది. అంటే అమెరికా ఒక పద్ధతి, సూత్రం, నియమం లేకుండా డాలర్లను ముద్రిస్తూ సొంత ప్రయోజనాలను సాధించడానికి ప్రయత్నిస్తున్నదనీ, తద్వారా తాను స్వయంగా సంక్షోభంలో కూరుకు పోతూ, ప్రపంచమంతటినీ సంక్షోభంలోకి లాక్కెళుతున్నదనీ అందువలన అమెరికా ఇష్టమొచ్చినట్లు డాలర్లు ముద్రించకుండా అంతర్జాతీయ స్ధాయిలో ఒక పర్యవేక్షణా కమిటీయో, సంస్ధో ఉండాలని చైనా అభిప్రాయపడుతోంది.
ప్రపంచ ద్రవ్య మార్కెట్లకు అమెరికా క్రెడిట్ రేటింగ్ తగ్గింపు, పెద్ద ప్రమాదాన్ని తెచ్చి పెట్టిందని చైనా ఆర్ధికవేత్తలు నిందిస్తున్నారు. అమెరికా ట్రెజరీ బాండ్లను పెద్ద ఎత్తున కొనుగోను చేసిన చైనా అర్జెంటుగా తన విదేశీ మారక ద్రవ్యాన్ని వివిధీకరించాలని (diversification) వారు కోరుతున్నారు. అంటే అధిక మొత్తంలో డాలర్లలో తన విదేశీ మారక ద్రవ్యాన్ని నిలవ ఉంచుకునే బదులు దాన్ని తగ్గించి ఇతర అంతర్జాతీయ కరెన్సీలలోనికి తన సొమ్ముని తరలించాలనీ తద్వారా డాలర్‌కి వచ్చే ప్రమాదాం నుండి బైటపడొచ్చనీ వారు భావిస్తున్నారు. వివిధీకరణని వేగవంతం చేయాలని వారు కోరుతున్నారు.
“కనీసం స్వల్పకాలిక పరిధిలో ద్రవ్య సంస్ధలలో అలజడులు తద్యం. చైనా డాలర్లలో నిలవ ఉంచుకున్న విదేశీ ద్రవ్య నిలవలపై సంక్షోభం ప్రభావం నేరుగాపడుతుంది. డాలర్లలో ఉన్న చైనా పెట్టుబడుల విలువ తగ్గిపోతుంది. నిల్వల విలువ కుదించుకుపోవడం మొదలయ్యాక ఆ ప్రభావ ఫలితం ఎక్కువగా ఉంటుంది” అని రిజర్వ్ రీసర్చి ఇన్‌స్టిట్యూట్ డైరెక్టరు (సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఫైనాన్స్ అండ్ ఎకనమిక్స్ వద్ద ఉన్నది) లీ జీ వ్యాఖ్యానించాడని రాయిటర్స్ సంస్ధ తెలిపింది. తన రుణ సమస్యల పట్ల బాధ్యతాయుతంగా అమెరికా వ్యవహరించాలనీ లేనట్లయితే అమెరికా ట్రెజరీస్ మార్కెట్ లో ఉండే అస్ధిరత ప్రపంచ ద్రవ్య వ్యవస్ధను నాశనం చేసి ప్రపంచ ఆర్ధిక వృద్ధిని కూడా నష్టం చేస్తుందని ఈ వారం మొదట్లో చైనా కోరింది అపుడెవరూ చైనా వాక్కులను పట్టించుకోలేదు.
తన డాలర్ పెట్టుబడుల్ని సంరక్షించాలని చైనా అమెరికాని పదే పదే కోరింది. చైనా వద్ద $3.2 ట్రిలియన్ల విదేశీ మార్క ద్రవ్యం నిలవ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అందులో 2/3 వంతు, అంటే 2.133 ట్రిలియన్ డాలర్లు డాలర్లలోనే ఉన్నాయని అంచనా. “చైనా ఇక డాలర్లలో పెట్టుబడులను ఆపేసి ఇతర కరెన్సీల్లో పెట్టడం అనివార్యం అవుతుంది. అమెరికా ట్రేజరీ బాండ్లు ఇక ఏ మాత్రం భద్రం కావు” అని లీ జీ పేర్కొన్నాడు. ఎస్&పి డౌన్ గ్రేడ్ వలన అమెరికా మరోసారి ద్రవ్య విధానాన్ని మరింత సడలించవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే ఫెడరల్ రిజర్వు వడ్డీ రేటు సున్న వద్ద నిలిపి ఉంచిన అమెరికాకి ఇక బెయిలౌట్లను ఇచ్చే పరిస్ధితిలో లేదు. చేయవలసిందల్లా అమెరికా ట్రెజరీ బాండ్లను అమెరికా ఫెడరల్ బ్యాంకే కొనుగోలు చేసి మార్కెట్ లోకి డాలర్ల ప్రవాహాన్ని వదలడం.
గత సంవత్సరం రెండో అర్ధభాగం నుండి అమెరికా ఆర్ధిక వృధి నెమ్మదించడంతో దానికి పునరుత్తేజం కల్పించడానికి ఫెడరల్ రిజర్వ్, క్యూ.ఇ 2 (Quantitative Easing-2) అనే పేరుతో ట్రెజరీ బాండ్లను 600 బిలియన్ డాలర్లమేరకు కొనుగోలు చేసి మార్కెట్ లోకి వదిలింది. దానితో డాలర్లు మార్కెట్ ను ముంచెత్తాయి. ఎమర్జింగ్ దేశాలయిన చైనా, ఇండియా, బ్రెజిల్ తో పాటు జపాన్, జర్మనీ, ఫ్రాన్సు, ఇంగ్లండ్ దేశాలు కూడా ఆ చర్యను తీవ్రంగా ఖండించాయి. దానివలన ఎమర్జింగ్ దేశాల్లోకి డబ్బు వెల్లుగవెత్తడంతో అక్కడ ద్రవ్యోల్బణ కట్టు తప్పింది. ఆర్ధిక పునరుత్తేజం పేరుతో మరొక క్యు.ఇ (క్యు.ఇ-3) ని ఫెడరల్ రిజర్వు తెస్తే అమెరికా పునరుత్తేజం పొందటం ఏమోగానీ ఇండియాలో ధరలు ఎవరికీ అందుబాటులో ఉండవు.
అమెరికాకి మూడవ క్వాంటిటేటివ్ ఈజింగ్ కి దగ్గరవుతోందనీ, అది జరిగితే ప్రపంచ ఆర్ధిక కార్యకలాపాల్లో అస్ధిరత ఏర్పడుతుంది. ప్రపంచ స్ధాయిలో ధరలూ పెరుగుతాయని విశ్లేషకులు భయపడుతున్నారు. ఇక అమెరికా వేసే ప్రతి అడుగునీ అనేక సంస్ధలు, ప్రభుత్వాలు పరిశీలిస్తాయి.

కొన్ని పదాలని తెలుగులో వ్రాయడం అవసరం.
కామన్ సెన్సు – ఇంగితం, ఇంగితజ్ఞానం’
ఎమర్జింగ్ దేశాలు = అభ్యుత్థాన దేశాలు
ఓబుల్ రెడ్డి గారూ, తెలుగు భాష వాడుక కోసం మీరు కృషి చేస్తున్నట్లు మీ సూచన బట్టి అర్ధం అవుతోంది. మీ సూచనకు ధన్యవాదాలు కూడా.
అయితే కొన్ని ఇంగ్లీషు (ఆంగ్లం రాసి ఉండాల్సింది. కానీ ముందు మదికి తట్టే పదం ఆంగ్లంలోనే ఉంటోంది) పదాలు తెలుగీకరించబడ్డాయి. ఎంతగానంటే ఇంగ్లీషు పదం లేకుండా మాట్లాడ్డం, రాయడం బాగా కష్టమైపోయినంతగా. మీరు సూచించిన రెండింటిలో ఇంగిత జ్ఞానం సరైందే. అదే వాడి ఉండవలసింది. కాని ఎమర్జింగ్ దేశాలు అనేది వాస్తవానికి ఆర్ధిక పదజాలంలో భాగంగా తెలుగులో ఇమిడి పోయింది. తెలుగు పత్రికలు రాసేటప్పుడు గానీ, సాధారణంగా ఆర్ధిక పరిణామాల గురించి కొంచెం తెలిసిన వారు మాట్లాడుకునేటప్పుడు గానీ ఎమర్జింగ్ దేశాలు అంటేనే అటువంటి ఆర్ధిక సంభాషణకి అర్ధవంతంగా ఇముడుతుంది. మీరు సూచించిన ‘అభ్యుత్ధాన దేశాలు’ నిజానికి సంస్కృత పదం. పోనీ ఆంగ్లం (అమ్మయ్య!) కంటే సంస్కృతం దగ్గరే అనుకున్నా, వ్యవహారికంలో సంస్కృతం కంటే ఆంగ్లమే దగ్గరై కూర్చుంది. ఇది భాషా సమస్యల్లో ఒకటి అయి ఉండవచ్చు. ముఖ్యంగా వ్యవహారంలో.
మీ ప్రశంసకి కృతజ్ఞతలు.
అంటే ఇప్పటికే ఉన్న సంస్కృత పదాలు తప్ప మనకి మనం కొత్తగా సంస్కృత అనువాదాల్ని కల్పించుకుని వాడడం తప్పంటారా ? సంస్కృతం మనకు పరాయిభాష కాదు. కానీ ఇంగ్లీషు ఎప్పటికీ పరాయి భాషే. ఎమర్జింగ్ అనేది నగర నాగరీక ఆంగ్ల విద్యావంతులకు తప్ప ఎవరికి అర్థమవుతుంది ? ఎమర్జింగ్ కి అనువాదం దొరక్క/ లేదా తెలియక ఇప్పటిదాకా ఏ దేశీ పదాన్నీ సమానార్థకంగా వాడి ఉండకపోవచ్చు. కానీ లభించినప్పుడు వాడడం మంచిది కదా !
ఎన్నో దాస్యాలలో ఉన్నాం. భాషాదాస్యం కూడా ఎందుకు జతగా ? భాషాదాస్యం క్రమంగా భావదారిద్ర్యానికి దారితీస్తుంది. ప్రతీ ఆలోచనకీ తెల్లవాళ్ళు పేరుపెడితే తప్ప వాడుకోలేని పరిస్థితి వస్తుంది. శూన్యమేధస్సులతో అన్నిటికీ పశ్చిమం వైపు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. బహుశా ఇప్పటికే వచ్చింది.
జనానికి అర్థం కావడంతో పాటు భాషని సరికొత్త పదకల్పనలతో పరిపుష్టం చేయడం కూడా అవసరమే. కొత్తపదాల్ని కల్పించుకోలేని భాష ఆఖరికి ఉన్న పదాల్ని సైతం కాపాడుకోజాలదు. Growth is life. వాడుతూ ఉంటే జనానికి అర్థమవుతూ ఉంటుంది. మీరు వాడిన వివిధీకరణ అనే పదం కొన్ని సంవత్సరాల క్రితం మాధ్యమాలలో లేదు. కానీ ఎవరో కల్పించి వాడగా చూసి అర్థం చేసుకొని అందరూ వాడుతున్నారు. అలాగే వాడగా వాడగా పదాలు వ్యవహారంలోకి వస్తాయి. ఒకసారెక్కడో చదివాను. వాడితే అన్నీ వ్యావహారికమే. వాడకపోతే అంతా గ్రాంథికమే అన్నాడు ఆ రచయిత.
చదువులో (కనీస శాస్త్ర పరిజ్ఞానం వచ్చి ఉన్న చదువులు. అంటె పది లేదా ఇంటర్ వరకు) భారతీయులంతా (ఇక్కడ తెలంగాణ, సీమాంధ్ర వాసులంతా అనాల్లెండి) సమానులుగా లేరు. అదొక ముఖ్య సమస్య. అందరూ, లేకుంటే అత్యధికులు (మెజారిటీ అని రాసి, అది తీసేసి ఇది రాశా) అక్షరాశ్యులై ఉంటే కొత్త పదాల్ని సంస్కృతం నుండి తీసుకొని ప్రచారంలో పెట్టవచ్చు. కానీ అత్యధికులు నిరక్ష్యరాస్యులు. వారికి ఆంగ్లం ఎలాగో సంస్కృతమూ అలాగే. ఇంకా చెప్పాలంటె ఆంగ్ల పదాలు పలికినంత తేలికగా సంస్కృత పదాలు పలకలేము కనక వారికి సంస్కృతమే కష్టం. జ్ఞానం ఉన్నవారు తరచుగా ప్రజలతో వ్యవహరించవలసి వచ్చినపుడు సంస్కృతం కంటే ఆంగ్ల పదాలే ఎక్కువగా తెలుగీకరించబడిన పరిష్దితి ఉంది. నా బ్లాగ్ లో నేను చర్చించే విషయాలు, వివిధ మార్గాల ద్వారా, అంటే సభలు సమావేశాలు మొ.న మార్గాల ద్వారా పామరుడితో కూడా సంభాషించవలసిన విషయాలు. అందుకని ఆంగ్ల పదాల వాడుక తప్పదేమో.
మనం ఏ సూత్రం పెట్టుకున్నా అది పండిత పామరులందరికీ సౌకర్యవంతంగా ఉండక తప్పదు. తెలుగు భాషను కాపాడుకుంటూనే విజ్ఞాన సముపార్జనకు ఆంగ్లం ఉపయోగించక, నేర్వక తప్పదు. దానికి ముఖ్యమైన షరతు ఆంగ్లం కంటే తెలుగు తక్కువనీ, పరువు తక్కువనీ భావించకుండా ఉండాలి. ఆంగ్లంలో మాట్లాడ్డం, రాయడం పరువును పెంచేదిగా గుర్తించడం, భావించడం చేయకుండా ఉండాలి. తమిళులు ఈ విషయంలో మనకంటే ముందున్నారు. వారి భాషాభిమానం చాల గొప్పది, కొన్ని సార్లు దురభిమానంగా అనిపించినప్పటికీ.
అవున్నిజమే. చాలా దాస్యాల్లొ ఉన్నాం. అందులో భాషా దాస్యం కూదా ఆందోళనకర స్ధాయిలోనే ఉంది. భాషా దాస్యం, భావ దారిద్రానికి అన్నిసార్లూ దారి తీయకపోవచ్చు. భాషాభిమానం కొనసాగిస్తూనే పరభాషల్లో ప్రావీణ్యం సంపాదించడాన్ని అగౌరవంగా చూడాల్సిన పని లేదు కదా. ఎమర్జింగ్ అనేది ఆర్ధిక పరిభాషగా పత్రికల చదువరులలో ఆర్ధిక పుటలను ఆసక్తిగా చదివేవారికి సుపరిచయం. అంతే కాకుండా కొన్ని ఆర్ధిక అంశాలను తెలిపెటప్పుడు కొంత సులభ గ్రాహ్యంగా ఉపయోగపడగల పదం. అటువంటి కొన్ని ఆంగ్లపదాలని తెలుగు భాషకి నష్టకరంగా చూడాల్సిన అవసరం లేదేమో అన్నది నా భావన. అంతే.
అవునవును. కొత్త పదాల్ని సృష్టించడం చాలా అవసరం. మన ముందుతరానికి తెలియని అనేక ఉత్పత్తులు వేలల్లొ లేదా లక్షల్లో పుట్టుకొస్తున్నపుడు వాటికి కొత్త పదాల్ని సృష్టించుకోవాల్సిందే. కాని సంస్కృతం ఉచ్ఛారణకి కష్టం, వ్యవహారానికి బహు కష్టం. వాడితే అన్నీ వ్యవహారికమే రచయిత అన్నట్లు. కాని అసలు వాడకానికి ప్రారంభించడానికి కూడా అనువుగా లేకపోతే ఇక వాడుక లోకి రాకపోవడానికే ఎక్కువ అవకాశాలున్నాయనుకుంటా.