హెలికాప్టర్ కూల్చివేత సందర్భంగా జరిగిన పరస్పర దాడుల్లో ఎనిమిది మంది తాలిబాన్ ఫైటర్లు కూడా చనిపోయారని తాలిబాన్ తెలిపింది. “ఒక ఇంటిలో ఉన్న మా ముజాహిదీన్లపై వారు దాడి చేయాలనుకున్నారు. కాని వారి దాడిని మా ముజాహిదీన్లు ప్రతిఘటించి ఆర్.పి.జి తో హెలికాప్టర్ ను కూల్చివేశారు” అని తాలిబాన్ల ప్రతినిధి “జబీహుల్లా ముజాహిద్” టెలిఫోన్ ద్వారా తెలిపినట్లు రాయిటర్స్ తెలిపింది. “ఈ పోరులో 8 మంది ముజాహిదీన్లు అమరులైనారు. 38 మంది అమెరికన్లు చనిపోయారు. ఈ రోజు వాళ్ళు కూలిపోయిన హెలికాప్టర్ భాగాలనూ, వారి సైనికుల శరీరాల భాగాలనూ తీసుకెళ్ళారు” అని జబీహుల్లా తెలిపాడు.
హెలికాప్టర్ తనంతట తానే కూలిపోయిందని ఆఫ్ఘనిస్ధాన్ అధ్యక్షుడు తెలిపినప్పటికీ అది వాస్తవానికి తూర్పు ఆఫ్ఘనిస్ధాన్‌లో జరిగిన దాడిలో కూల్చివేసినట్లు కనిపిస్తున్నదని అమెరికా అధికారు ఒకరు తెలిపినట్లుగా ఎ.పి (అసోసియేటెడ్ ప్రెస్) వార్తా సంస్ధ తెలిపింది. అమెరికా సైనికులు పెద్ద సంఖ్యలో చనిపోయినప్పుడల్లా అమెరికా అధికారులు ప్రభుత్వంతో పాటు కార్పొరేట్ పత్రికలన్నీ అదేదో స్వయంకృత్యం వల్ల చనిపోయారనీ, అందులో తాలిబాన్‌ల పాత్ర లేదని చెప్పడానికి ప్రయత్నించడం సాధారణంగా మారింది. ఐక్యరాజ్య సమితి సైతం ఆఫ్ఘన్ యుద్ధంలో పౌరుల మరణాల సంఖ్యను విడుదల చేసినప్పుడల్లా వారి చావుకు ప్రధాన కారణం తాలిబాన్లు, ఆల్-ఖైదాలేననీ చెబుతుంది. అసలు ఎక్కడినుండో వచ్చి దురాక్రమణ దాడి చేసినవాడిని వదిలిపెట్టి, ఆ దురాక్రమణపైన పోరాడుతున్నవారిని చావులకు బాధ్యులుగా ఐక్యరాజ్యసమితి చెప్పడం అమెరికాకి సమితి చేసే సేవలకు పరాకాష్ట.
