అమెరికా క్రెడిట్ రేటింగ్ తగ్గుదల తీవ్రమైన విషయమే -ఆర్ధిక మంత్రి ప్రణబ్


భారత ప్రభుత్వ ఆర్ధిక శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ అమెరికా క్రెడిట్ రేటింగ్ ని ఎస్ & పి రేటింగ్ సంస్ధ తగ్గించడంపై శనివారం స్పందించాడు. అమెరికా క్రెడిట్ రేటింగ్ తగ్గించడం “తీవ్రమైన విషయమే” అని అభివర్ణించాడు. అయితే విషయాలు పూర్తిగా తెలుసుకోకుండా వ్యాఖ్యానించడం తొందరపాటు అవుతుందనీ, అది సరైంది కాదనీ ఆయన వ్యాఖ్యానించాడు.

“అమెరికా క్రెడిట్ రేటింగ్‌ని డౌన్ గ్రేడ్ చేసిన చర్యని ఇంకా విశ్లేషించాల్సి ఉంది. దానికి కొంత సమయం కావాలి. విషయాలు పూర్తిగా తెలుసుకోకుండా వ్యాఖ్యానాలు చేయడం వలన ఫలితం ఉండదు” అని ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యానించినట్లుగా రాయిటర్స్ వార్తా సంస్ధ పేర్కొంది.

ఎస్ & పి క్రెడిట్ రేటింగ్ సంస్ధ అమెరికా సావరిన్ అప్పు బాండ్ల (ట్రెజరీస్ లేదా ట్రెజరీ బాండ్స్) రేటింగ్ ని టాప్ రేటింగ్ ఐన AAA నుండి AA+ కి తగ్గించిన సంగతి తెలిసిందే. రేటింగ్ ని ఒక మెట్టు తగ్గినట్లుగా ఇది సూచిస్తుంది. ప్లస్ గుర్తు అమెరికా సావరిన్ అప్పు విశ్వసనీయత ఏవైపుకి మొగ్గు చూపిస్తున్నదీ తెలుపుతుంది. అంటే + గుర్తు సమీప భవిష్యత్తులో రేటింగు పెరిగే అవకాశం ఉందని అర్ధం. మైనస్ (-) ఉన్నట్లయితే దాని తర్వాత రేటింగ్‌కి తగ్గే అవకాశాలున్నాయనీ. జాగ్రత్త పడకుంటే రేటింగ్ మరొకసారి తగ్గే అవకాశం ఉందనీ అర్ధం. AAA రేటింగ్ కంటె ఉన్నత రేటింగ్ లేదు కనక దానికి + ఔట్ లుక్ ఇవ్వరు. కాని – ఔట్ లుక్ ఇచ్చే అవకాశం ఉంది.

వ్యాఖ్యానించండి