భారీ నష్టాల్లో షేర్ మార్కెట్, శుక్రవారం 400 పాయింట్ల పైగా పతనం


ఈ వారం చివరి వ్యాపార దినం అయిన శుక్రవారం భారీగా నష్టపోతున్నాయి. వ్యాపారం ప్రారంభమైన గంటలోపే 400 పాయింట్లకు పైగా బి.ఎస్.ఇ సెన్సెక్స్ నష్టపోయింది. ఇది దాదాపు 2.4 శాతానికి సమానం. బి.ఎస్.ఇ సెన్సెక్స్ 2.4 శాతం నష్టపోయి 17,268 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా ఎన్.ఎస్.ఇ నిఫ్టీ కూడా 2.4 శాతం నష్టపోయి 5204 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. యూరప్ అప్పు సంక్షోభం స్పెయిన్, ఇటలీలకు పాకవచ్చునని అనుమానాలు విస్తృతం కావడం, అమెరికా ఆర్ధిక వ్యవస్ధ మరోసారి మాంద్యం (రిసెషన్) లోకి జారుకుంటుందన్న భయాలు తలెత్తడంతో మార్కెట్లలో అమ్మకాల జోరు పెరిగింది. కొనేవారే కరువయ్యారు. షేర్లను ఎందుకు దగ్గర ఉంచుకోవాలో అర్ధం కావడం లేదని పలువురు మదుపుదారులు వ్యాఖ్యానిస్తున్నారు.

గురువారం అమెరికా ప్రధాన షేర్ల సూచిలు భారీగా పతనమైనాయి. ఈ సంవత్సరం అక్కడి మార్కెట్లు సాధించిన లాభాలన్ని నిన్నటి పతనంతో ఒక్క దెబ్బకు తుడిచి పెట్టుకుపోయాయి. డౌ జోన్స్ సూచి 4.31 శాతం నష్టపోయి 11,383.68 పాయింట్ల వద్ద ముగియగా, ఎస్ & పి సూచి 4.78 శాతం నష్టపోయి 1200 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. నాస్‌డాక్ సూచి 5.08 శాతం నష్టపోయి 2556 పాయింట్ల వద్ద ముగిసింది. యూరప్ షేర్ మార్కెట్లు సైతం ఇదే స్ధాయిలో నష్టపోయాయి. అమెరికా, యూరప్ ల వద్ద సంక్షొభం నుండి బైటపడడానికి అవసరమైన చర్యలు ఇంకేమైనా మిగిలి ఉన్నాయా లేదా అని మదుపుదారులు అనుమానిస్తున్నారు. దానితో షేర్ల అమ్మకం కట్లు తెచ్చుకుంది.

వ్యాఖ్యానించండి