కుప్ప కూలిన షేర్ మార్కెట్లు, వణికిస్తున్న అమెరికా, యూరప్ సంక్షోభాలు


శుక్రవారం బి.ఎస్.ఇ సెన్సెక్స్ 383.31 పాయింట్లు (2.19 శాతం) నష్టపోయి 17305.87 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఎన్.ఎస్.ఇ నిఫ్టీ సూచి 120.55 పాయింట్లు (2.26 శాతం) నష్టపోయి 5211.25 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఒక దశలో సెన్సెక్స్ మానసిక స్ధాయి17000 పాయింట్లకు తక్కువగా 16990.91 వరకూ పడిపోయి ఆ తర్వాత కోలుకుంది. నిఫ్టీ కూడా ఓ దశలో 5200 పాయింట్లకు తక్కువగా 5116.45 వరకూ పడిపోయి అనంతరం కోలుకుంది. అమెరికా రుణ సంక్షోభం, యూరప్ సావరిన్ అప్పు సంక్షోభాలు ప్రపంచ మదుపుదారులని తీవ్రంగా వణికిస్తుండడంతో మార్కెట్లు శుక్రవారం తీవ్రంగా నష్టపోయాయి.

గత 14 నెలల్లో భారత షేర్ మార్కెట్లు ఇంత దారుణంగా నష్టపోవడం ఇదే మొదటిసారి. అమెరికా డబుల్ డిప్ వైపుకి (రెండోసారి వరుసగా రిసెషన్‌కి గురవడాన్ని డబుల్ డిప్ అంటారు) పయనిస్తున్నదన్న భయాలతో, నిధుల (ఫండ్స్) సంస్ధలు పెద్ద ఎత్తున అమ్మకాలకు దిగడంతో షేర్లు ఆగా నష్టపోయాయని బిజినెస్ లైన్ పత్రిక తెలిపింది. గత సంవత్సరం జూన్ 10 తేదీన నిలిచిన స్దానం వద్ద బి.ఎస్.ఇ ప్రస్తుతం నిలబడి ఉంది. అంటే ఇన్నాళ్లు బి.ఎస్.ఇ సంపాదించుకున్న మార్కెట్ క్యాపిటలైజేషన్ మొత్తం ఈ శుక్రవారంతో తుడిచిపెట్టుకుపోయింది.

వివిధ సెక్టార్లుగా విభజించబడిన మొత్తం 13 సెక్టార్ల సూచిలూ భారీ నష్టాలతో ముగియడం గమనార్హం.  ఐ.టి, మెటల్స్, రియాల్టీ, ద్రవ్య రంగం, ఆయిల్ మరియు గ్యాస్, పెట్టుబడి సరుకులు రంగాల షేర్లు పతన బాటలో ముందున్నాయి. అమెరికా మాంద్యం ఎదుర్కోనున్నదన్న భయాలు, యూరోజోన్ రుణ సంక్షోభాల వలన, భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి అమెరికా, యూరప్ ల షేర్లు అధిక స్ధాయిలో నష్టపోయాయి.

వ్యాఖ్యానించండి