ఈ ఒక్క వారంలోనే ప్రపంచ షేర్ మార్కెట్లు మొత్తం 2.5 ట్రిలియన్లు నష్టపోయాయని రాయిటర్స్ తెలిపింది. ఇది రు.1.125 కోట్ల కోట్లకు లేదా రు.1,12,50,000 కోట్లకు సమానం. ఫ్రాన్సు వార్ధిక స్ధూల జాతీయోత్పత్తి కూడా సరిగ్గా ఇంతే ఉంటుంది. ఒక ప్రధాన అభివృద్ధి చెందిన దేశ జిడిపితో సమానంగా ప్రపంచ షేర్ మార్కెట్లు ఈ ఒక్క వారంలోనే (ఆగస్టు 1 నుండి 5 వరకు) నష్టపోయాయన్నమాట!
ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ “డబుల్ డిప్” వైపుకి మరొక “ది గ్రేట్ రిసెషన్” దిశగా పయనిస్తున్నదన్న భయాలు వ్యాపించడం, యూరప్ సావరిన్ రుణ సంక్షోభం ఇటలీ, స్పెయిన్ లకు సైతం వ్యాపించనుందని సంకేతాలు వెలువడం షేర్ మార్కెట్లు కుదేలవడానికి దారితీశాయి. యూరప్‌లో ఇటలీ, స్పెయిన్ దేశాలు పెద్ద ఆర్ధిక వ్యవస్ధలున్న దేశాలు. అవి రుణ సంక్షోభంలో (చెల్లించగల వడ్డీతో అప్పు దొరకని పరిస్ధితి) కూరుకున్నట్లయితే ఆ దేశాలకు సరిపడా బెయిలౌట్ ప్యాకేజిని సమకూర్చడం యూరప్ దేశాలకు జఠిలంగా మారుతుంది.
దాదాపు వంద బిలియన్ యూరోల బెయిలౌట్ ప్యాకేజిని గ్రీసుకి ఇవ్వడానికే కిందా మీదా పడ్డ ఇ.యు దేశాలు స్పెయిన్, ఇటలీ ఆర్ధిక వ్యవస్ధలను నిలపగల బెయిలౌట్ ఇవ్వడం పెద్ద సమస్యగా మారుతుంది. అదీ కాక యూరోజోన్ దేశాల ట్రెజరీ బాండ్లలో పెట్టుబడులు పెట్టిన ప్రవేటు మదుపుదారులను కూడా సంక్షోభంలో కొంత భాగాన్ని భరించాలని జర్మనీ, ఫ్రాన్సులు కోరుతున్నాయి. అంటె గతంలో అప్పులిచ్చినవారు కొంత ఆదాయాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. ఇది ఎంతవరకూ సఫలం అయ్యేదీ గ్రీసు విషయంలోనె ఇంకా తేలలేదు. ఇక స్పెయిన్, ఇటలీల కోసం తేలుతుందన్న గ్యారంటీ లేదు.
ఈ వారంలో ఎం.ఎస్.సి.ఐ అన్ని దేశాల ప్రపంచ సూచి 8.6 శాతం పడిపోయింది. నవంబరు 2008 (ప్రపంచ ఆర్ధిక సంక్షోభం తీవ్రంగా ఉన్న కాలం) నుండి ఇంత స్ధాయిలో షేర్ మార్కెట్లు ఒకే వారం నష్టపోవడం ఇదే ప్రధమం. ఒక్క అమెరికా ఎస్&పి సూచి మాత్రమే 840 బిలియన్ డాలర్ల మేరకు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈ వారం కోల్పోయింది. యూరోపియన్ షేర్లను కొలిచే ఎం.ఎస్.సి.ఐ సూచి 817 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ నష్టపోయింది.
గురువారం అమెరికా, యూరప్ లలోని షేర్ మార్కెట్లు తీవ్రంగా నష్టపోవడం, భారత వృద్ధి రేటు బలహీనపడడంతో శుక్రవారం భారత షేర్లు కూడా తీవ్రంగా నష్టపోయాయి. అమెరికా, యూరప్ సంక్షోభాల ప్రభావం ఇండియా షేర్లపై తీవ్రంగా పడి, రెండు శాతం పైగా నష్టపోయాయి. శుక్రవారం వెలువడనున్న అమెరికా వినియోగదారుల ఖర్చుల ధోరణి గణాంకాలు, ఉపాధి నిరుద్యోగాల గణాంకాలు ఆశాజనకంగా లేకపోతే అమెరికా, యూరప్ లు మరోరోజు తీవ్రంగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
