అమెరికా ప్రజలు అమెరికా కాంగ్రెస్ (House of Representatives or Congress) పనితీరుని అత్యధిక సంఖ్యలో వ్యతిరేకిస్తున్నారు. గతంలో ఎన్నడు లేనంత అధిక స్ధాయిలో వ్యతిరేకిస్తున్నారు. అమెరికా కాంగ్రెస్ లోని రిపబ్లికన్ సభ్యులు, డెమొక్రట్ సభ్యులు రుణ పరిమితిని మరో 2.4 ట్రిలియన్ డాలర్లు పెంచాలనీ, బడ్జెట్ లోటుని 2.1 ట్రిలియన్ డాలర్లు తగ్గించాలనీ ఒప్పందం కుదుర్చుకుని చట్టాన్ని ఆమోదించాక జరిపిన సర్వేలో అమెరికా ప్రజల్లో 82 శాతం మంది కాంగ్రెస్ పనితీరు బాగాలేదని తేల్చారు. న్యూయార్క్ టైమ్స్, సిబిఎస్ న్యూస్ సంస్ధలు జరిపిన దేశ వ్యాపిత సర్వేలో ఈ అభిప్రాయం వ్యక్తం అయ్యిందని రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. సర్వే ఫలితాలని ఇక్కడ చూడవచ్చు.
82 శాతం అమెరికన్లు కాంగ్రెస్ పనితీరుని ఆమోదించడం లేదని చెప్పగా 14 శాతం ఆమోదిస్తున్నామని తెలిపారు. గత 34 సంవత్సరాల్లో అమెరికన్లు ఎన్నడూ ఇంత పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేయలేదని సర్వే నివేదిక తెలిపింది. గత సర్వే, మే 2010 లో నిర్వహించగా అందులో 77 శాతం మంది కాంగ్రెస్ పనితీరుని వ్యతిరేకించారు. రుణ పరిమితి పెంపు, బడ్జెట్ లోటు తగ్గింపు ల కోసం అమెరికాలోని ఇరు పార్టీలు నెలల తరబడి చర్చించి కూడా చివరి నిమిషం దాకా ఒక ఒప్పందానికి రాలేక పోయారు. దానితో అమెరికా ఆర్ధిక వ్యవస్ధపై ప్రపంచ స్ధాయి మదుపుదారులకు విశ్వాసం సన్నగిల్లింది. అమెరికా త్వరలో కోలుకుంటుందన్న నమ్మకం కోల్పోయారు.
రుణ పరిమితి పెంపుకొసం జరిగిన చర్చలలో రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యులు వ్యవహరించిన తీరు ఆమోదయోగ్యంగా లేదని 72 శాతం ప్రజలు అభిప్రాయం తెలిపారు. అదే విధంగా 60 శాతం మంది ప్రజలు చర్చలలో డెమొక్రట్ కాంగ్రెస్ సభ్యులు వ్యవహరించిన తీరు సరిగ్గాలేదని భావించారు. రుణపరిమితి పెంపు ఒప్పందంలో పన్నుల ఆదాయాన్ని పెంచడంతో పాటు, ఖర్చులను కూడా తగ్గించి ఉండాల్సిందని సగం మంది (యాభై శాతం) భావించగా, 44 శాతం మంది కేవలం బడ్జెట్ ఖర్చుల కోత పైనే ఆధారపడి బడ్జెట్ కంట్రోల్ చట్టాన్ని రూపొంచించి ఉండాల్సిందని పేర్కొన్నారు. ఒప్పందం కోసం డెమొక్రాట్లు, రిపబ్లికన్లు సాగించిన యుద్ధం దేశానికి ఏది మంచిదో అన్నదాన్ని దృష్టిలో పెట్టుకుని జరపకుండా రాజకీయ ప్రయోజనాల కోసమే జరిగిందని 82 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఒప్పందం కోసం రిపబ్లికన్లు రాజీ పడింది పెద్దగా లేదని సగం మందికి పైగా అభిప్రాయపడగా, ఒబామా, డెమొక్రట్లు పెద్దగా రాజీపడింది లేదని 34 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఒప్పందం కోసం జరిగిన చర్చలలో ఒబామా సరిగా వ్యవహరించలేదని 47 శాతం భావించగా, 46 శాతం మంది ఒబామా వ్యవహరణ సరిగా ఉందని భావించారు. మొత్తం మీద ఒబామా పనితీరు పట్ల ఆమోదం ఎప్పటిలా స్ధిరంగా 48 శాతం వద్ద ఉందని సర్వే తెలిపింది. ఆగస్టు 2, 3 తేదీల్లో సర్వే జరిగిందని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.

అవును, అమెరికాను నిలువరించాల్సింది అమెరికా ప్రజలే. వాళ్ళూ సిద్ధమవుతున్నట్లుంది.