అమెరికా రుణ సంక్షోభం ప్రభావం ఇండియాపై ఎలా ఉంటుంది? -2


(ఒకటవ భాగం తరువాయి)

ఇండియాలాగే చైనా కూడా. చైనా, పైకి తన కంపెనీలను ప్రవేటీకరణ చేసినట్లు చూపుతుంది. ప్రభుత్వ రంగ సంస్ధలన్నింటినీ ఈక్విటీ కంపెనీలుగా మారడానికి ఆ దేశం అనుమతించింది. కొన్ని ఈక్విటీలను స్వదేశీ, విదేశీ ప్రవేటు మదుపుదారుల చేతుల్లో పెట్టింది. ఇది పైకి పూర్తిగా ప్రవేటీకరణ జరిగినట్లుగా కనిపించింది. వాస్తవానికి చైనాలొని అన్ని రంగాల కంపెనీల్లో చైనా ప్రభుత్వం కొన్ని వ్యూహాత్మకమైన చర్యలు తీసుకుని ప్రవేటీకరణ కావించిన కంపెనీలపై కూడా తన పట్టు పోకుండా జాగ్రత్త పడింది. దానితో చైనాలోని ద్రవ్య రంగ కంపెనీలతో పాటు ఇతర కంపెనీలు కూడా పశ్చిమ దేశాల ఆర్ధిక వ్యవస్ధలతో పరిమితి స్ధాయిలోనే అనుసంధానం చేయబడ్డాయి. అందువలనే ఇండియా, చైనా లాంటి దేశాలు ప్రపంచ ఆర్ధిక సంక్షోభం నుండి చాలా వరకు దూరంగా ఉండగలిగాయి. ఈ పరిస్ధితిని భారత పాలక వర్గాలు కూడా గుర్తించారనేందుకు కొన్ని వ్యాఖ్యానాలు, నిట్టూర్పులు సంక్షోభ సమయంలో వెలువడ్డాయి. కాని “కుక్క తోక వంకరే” అన్నట్లు వారి బుద్ధులు మారలేదు.

నూతన ఆర్ధిక విధానాల అమలుకు సకల ప్రయత్నాలు

భారత పాలకులు నూతన ఆర్ధిక విధానాలను వేగవంతం చేయడానికి సర్వశక్తులనూ ఒడ్డుతున్నారు. వివిధ రాజకీయ ఎత్తుగడులకు పాల్పడుతున్నారు. ఒకటి వాగ్దానం చేసి పార్లమెంటులో మరొకటి ఆమోదిస్తున్నరు. రాజకీయంగా బద్ద శత్రువులవలే తగువులాడుకుంటూనే సంస్కరణల బిల్లుల్ని మూజువాణీ ఓటుతోనో, కత్తిరించబడిన మెజారిటీతోనో ఆమోదింపజేస్తున్నారు. కొన్ని సార్లు బిల్లుల పేర్లు మాత్రమే చదివి అనేక బిల్లుల్ని గుత్తగా ఒకేసారి ఓటింగ్‌లో ఆమోదించిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. అంటే పార్లమెంటులోని రాజకీయ పార్టీలన్నీ వాటాల వద్ద శతృవుల్లా కొట్టుకుంటూ, విదేశీ యజమానుల ప్రయోజనాలు నెరవేర్చడంలో సిగ్గులేకుండా కలిసి పోతున్నారు. వారి దళారీ ప్రయోజనాలు వారిని అలానే నడిపిస్తాయి మరి.

భారత దేశంలో నూతన ఆర్ధిక విధానాలను ఇప్పటివరకూ బహుళజాతి సంస్ధలు కోరుకున్నంత వేగంగా అమలు చేయకపోవడానికి ప్రధాన కారణం కార్మికులు, ప్రజల పోరాటలే. అవే లేనట్లయితే ఈ పాటికి భారత దేశ ఆర్ధిక, ద్రవ్య రంగాలు అమెరికా, యూరప్ దేశాల ఆర్ధిక వ్యవస్ధలతో పూర్తిగా అనుసంధానించబడి ఉండేది. తత్ఫలితంగా 2008 నాటి ఆర్ధిక సంక్షొభానికి కోలుకోలేని దెబ్బ తగిలి ఉండేది. అది గ్రహిస్తూ కూడా నూతన ఆర్ధిక విధానాలను భారత పాలకులు అమలు చేయడానికి, వారు తమ తరపున తాము నిర్ణయాలు తీసుకునే పరిస్ధితుల్లో లేకపోవడమే కారణం. ఎప్పుడూ మొఖం ఎత్తి విదేశీ కంపెనీల భాగస్వామ్యాల ద్వారా రాలిపడే వాటాల కోసమే తప్ప తమ పెట్టుబడులతో తామే పూర్తి లబ్ది పొందుదామన్న ధ్యాస, తెగువ భారత బడా పెట్టుబడిదారులకు లేకపోయింది. వాటాల ద్వారా లబ్ది పొందుతుంటేనే భారత దేశ పెట్టుబడుదారులు ప్రపంచ కుబేరుల్లో స్ధానం సంపాదించుకోగలుగుతున్నారు. అదే వారు స్వతంత్రతతో భారత దేశ సంపద అంతా తమకే అన్న నిర్ణయంతో విదేశీ బహుళజాతి సంస్ధలతో పోటీ పడినట్లయితే ప్రపంచ కుబేరులెవరికీ అందనంత ఎత్తులో వారు ఉండేవారేమో!

భారత దేశ ఆర్ధిక వ్యవస్ధ ఏ స్ధితిలో ఉన్నదీ చూడడానికి ఇది చిన్న ఉపోధ్ఘాతం. ఈ పరిస్ధితి నేపధ్యంలో చూసినపుడే అమెరికా అప్పు సంక్షోభం, రుణ పరిమితి పెంపు మరియు బడ్జెట్ లోటు తగ్గింపుల కోసం కుదిరిన ఒప్పందమూ భారత దేశంపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్న విషయం గ్రహించగలుగుతాము. అమెరికాలోని ఇరు రాజకీయ పక్షాలు కుదుర్చుకున్న ఒప్పందం ప్రధానంగా కార్మికులు, ఉద్యోగులు, ఇతర శ్రామిక వర్గాల ఆర్ధిక జీవనంపైన ఎక్కుపెట్టబడి ఉంది. ఇంకా చెప్పాలంటే ఒప్పందంలో భాగంగా శ్రామిక ప్రజలపై చేయనున్న దాడుల తీవ్రత ఇంకా తక్కువగానే ఉన్నదని రిపబ్లికన్ పార్టీ పార్లమెంటేరియన్లు చాలా మంది దానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. డెమొక్రట్లలో కొంతమంది బిల్లు ఉద్యోగుల పట్ల, వృద్ధుల ఆరోగ్య భీమా పట్లా మరీ కఠినంగా ఉందని బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయగా, రిపబ్లికన్లలోని మితవాద తీవ్రవాదులు తగినంత కఠినంగా లేదని బిల్లుకివ్యతిరేకంగా ఓటు వేశారు. మొత్తం మీద రెండు పార్టీలలోని మోడరేట్ల వలన బిల్లు గట్టెక్కి ఒబామా సంతకంతో చట్టంగా మారింది.

రిపబ్లికన్లు, డెమొక్రట్ల సిగపట్లు

బడ్జెట్ కంట్రోల్ చట్టంగా మారిన ఒప్పందంలో పొందుపరచబడిన అంశాలు ఇప్పటివరకూ నిర్ణయాలు మాత్రమే. అవి అమలు చేయవలసిన నిర్ణయాలు. ఒప్పందం కుదిరిందని ప్రకటించాక ప్రపంచ వ్యాప్తితంగా షేర్ మార్కెట్లు ఒక రోజు లాభాలు చవిచూశాయి. కాని ఒప్పందంలోని నిర్ణయాలు అమలవుతాయా అన్న అనుమానాలతో షేర్ మార్కెట్లు మళ్ళీ వరుసగా నష్టాలను ఎదుర్కొంటున్నాయి. వచ్చే పది సంవత్సరాల్లో 2.1 ట్రిలియన్ డాలర్ల లోటు తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించగా, వాస్తవానికి ఎస్&పి రేటింగ్ సంస్ధ అమెరికా క్రెడిట్ రేటింగ్ తగ్గించకుండా ఉండాలంటే రానున్న పది సంవత్సరాల్లో 4 ట్రిలియన్ డాలర్లు తగ్గించాల్సి ఉంటుందని పేర్కొంది. మూడీస్, ఫిఛ్ రేటింగ్ సంస్ధలు ఇంత తగ్గించాలని చెప్పలేదు కానీ 2.1 ట్రిలియన్ డాలర్లు తక్కువనీ, సరిపోదనీ మాత్రం చెప్పాయి. బడ్జెట్ లోటు తగ్గించే విషయంలో రిపబ్లికన్లు, డెమొక్రట్ల వద్ద విభేధాలు తలెత్తాయి. వృద్ధుల ఆరోగ్య భీమా, నిరుద్యోగ భృతి లాంటివి తగ్గించి, మధ్య తరగతిపైన మరిన్ని పన్నులు వేయడం ద్వారా లోటు తగ్గించాలని రిపబ్లికన్లు కోరుతున్నారు. ధనికులపైనా, కార్పొరేట్ కంపెనీలూ వాల్‌స్ట్రిట్ కంపెనీల పైనా పన్నులు పెంచడానికీ, కొత్తవి వేయడానికి అసలు వీల్లేదని వారు పట్టుదలగా ఉన్నారు. అంటే రిపబ్లికన్ల వాదన ప్రజలకు పూర్తిగా ప్రతికూలంగానూ, కంపెనీలు, ధనికులకు అనుకూలంగానూ ఉందన్నమాట!

డెమొక్రట్ల వాదన దీనికి భిన్నంగా ఉన్నట్లు కనిపిస్తుంది. అంటే నిజంగా భిన్నంగా ఉండదా? అంటే ఉండదనే సమాధానం. వృద్ధుల ఆరోగ్య భీమాను కత్తిరించడం గానీ, రద్దు చేయడం గానీ చెయ్యక తప్పదని అంగీకరిస్తూనే అది అతిగా ఉండరాదని వారు వాదించారు. వృద్ధుల ఆరోగ్య భీమాలో ప్రభుత్వం భరించే ఖర్చులో రిపబ్లికన్లు డిమాండ్ చేసినంతగా కాకుండా కొంత కోత విధిస్తే చాలని వాదించారు. సామాజిక పధకాలలో కోత తగ్గించాలని వాదిస్తూ దానికి బదులుగా కార్పొరేట్ కంపెనీలపైనా, ధనికులపైనా, వాల్‌స్ట్రిట్ కంపెనీల్లాంటి బడా సంస్ధలపైనా పన్నులు పెంచడం, ఉన్న పన్నులని పెంచడం ద్వారా రెవిన్యూ పెంచుకుని తద్వారా లోటు తగ్గిద్దామనీ డెమొక్రట్లు చెబుతున్నారు. జార్జి బుష్ హయాంలో ప్రపంచ ఆర్ధిక సంక్షోభం ఫలితంగా బడా కంపెనీలకు ఇచ్చిన పన్ను రాయితీలను కొన్ని తగ్గించాలని మరికొన్ని రద్దు చేయాలనీ డెమొక్రట్లు కోరారు. రిపబ్లికన్లు, జార్జి బుష్ ఇచ్చిన పన్ను రాయితీలను ముట్టుకోవడానిక్ వీల్లేదని మొండి పట్టుపట్టారు. పైగా వారికిచ్చిన పన్ను రాయితీలను ప్రజలపై పన్నులు వేసి వసూలు చేసుకోవాలని గట్టిగా డిమాండ్ చేశారు.

అయితే డెమొక్రట్ల వాదన వారు పైకి చెబుతున్నంత పక్కా కాదు. వారి దృష్టి ముఖ్యంగా ఒబామా దృష్టి వచ్చే సంవత్సరం జరిగే అధ్యక్ష ఎన్నికలపైన ఉంది. రెండోసారి పోటీ చేస్తున్నందున సామాజిక భద్రతా పధకాల కోత లేదా రద్దు లాంటి ప్రజా వ్యతిరేక చర్యలు అతని ఎన్నిక అవకాశాలు దెబ్బతీస్తాయని భయపడుతున్నాడు. అందువలన ఒక మాదిరిగా పోదామని మాత్రమే డెమొక్రట్లు వాదిస్తున్నారు తప్ప అసలుకే ప్రజలమీద పన్నులు వెయ్యొద్దని కాదు లేదా ధనికులని, బడా కంపెనీలపైన ఇబ్బడి ముబ్బడిగా పన్నులు వేసి రిపబ్లికన్లు వర్ణించినట్లు పీల్చి పిప్పి చేద్దామనీ కూడా కాదు. ఈ ప్రతిష్టంభన అనంతరం చివరి నిమిషంలో ఒక రాజీ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందంలో రిపబ్లికన్ల వాదనలే ప్రధానంగా కనిపిస్తున్నాయి. కాకుంటే రిపబ్లికన్లు కోరుతున్న చర్యలను ఒకేసారి కాకుండా నెమ్మదిగా, దశలవారీగా అమలు చేద్దామన్న ఒక్క మినహాయింపు మాత్రమే డెమొక్రట్లు పొందారు. 2013 లోపల మళ్ళీ రిపబ్లికన్లు గొడవ చేయకుండా ఒబామా చూసుకున్నాడు. కానీ ప్రజల నెత్తిన పడే భారాల్లో ఏమీ తగ్గుదల లేదు. ఒకే సారి వేసే బదులు భారాలను ఒక్కొటొక్కటి వేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు.

బడ్జెట్ కంట్రోల్ ఒప్పందం, 2011

రిపబ్లికన్లు, డెమొక్రట్లు పరస్పర అంగీకారంతో ఒక బిల్లుని ఆమోదించడానికి ప్రయత్నాలు చేస్తే దానిని ద్వైపాక్షిక పరిష్కారం (bipartisan approach) అంటారు. ద్వైపాక్షిక చర్చల ద్వారా ఆమోదించిన బడ్జెట్ కంట్రోల్ చట్టంలో ప్రధాన అంశాలను కొన్నింటిని చూద్దాం. ఆగస్టు 2 నాటికి అమెరికా ట్రెజరీలో డబ్బు లేదు. 14.3 ట్రిలియన్ల మేరకు అప్పు తీసుకోవడానికి అనుమతి ఉండగా అది జూన్ నెలలోనే పూర్తయ్యింది. మళ్ళీ అప్పు తేవాలంటే అమెరికా ప్రతినిధుల సభ, సెనేట్ లు ఆమోదం తెలిపాలి. బడ్జెట్ కంట్రోల్ చట్టం ద్వారా మొత్తం 2.4 ట్రిలియన్ డాలర్లు కొత్త అప్పు చేయవచ్చని చట్టంలో ఆమోదించారని చెప్పుకున్నాం. ఇది ఒకేసారి చేయడానికి వీల్లేదు. తక్షణం రుణ పరిమితిని 400 బిలియన్ డాలర్లు (14.3 ట్రిలియన్ల నుండి 14.7 ట్రిలియన్లకు) పెంచడానికి చట్టం అనుమతించింది. దీని ద్వారా ఉద్యోగులలు, మిలట్రీ జీతాలు చెల్లించడం, చేసిన అప్పులు మెచ్యూరిటీ అయితే మొత్తం చెల్లించడం, కొన్నింటిపై వడ్డీలు చెల్లించడం, ఆరోగ్య భీమా ఖర్చులు చేస్తారు. అంటే ఈ మొత్తం మార్కెట్లకు తక్షణం రిలీఫ్ ఇస్తుంది. అమెరికా ట్రెజరీ బాండ్లు కొన్న మదుపుదారులు తమకు రావలసిన మొత్తాన్ని సమయానికి పొందగలరన్న మాట!

ఆ తర్వాత ఫిబ్రవరి 2012 నెలలో మరో 500 బిలియన్లు (15.2 ట్రిలియన్లకు) రుణ పరిమితిని పెంచుకోవచ్చు. దీనిని కాంగ్రెస్ తిరస్కరించవచ్చు. కానీ రాజకీయంగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు అధ్యక్షుడు వారి తిరస్కరణను వీటో చేయవచ్చు. ఈ లోపు అమెరికా బడ్జెట్ లోటులో 2.1 ట్రిలియన్ల మేరకు తగ్గించడానికి తగు చర్యలను ప్రభుత్వం తీసుకోవాలి. ఒప్పందంలో ప్రధాన అంశం ఇదే. దీనివద్దే ఇరుపక్షాలు అన్ని రోజులు చర్చలు జరిపాయి. ప్రభుత్వ బడ్జెట్‌లో లోటు తగ్గించడం రెండు విధాలుగా చెయ్యవచ్చు. ఒకటి పన్నులు వేసి ఆదాయం పెంచుకోవడం. రెండు, అసలు బడ్జెట్ ఖర్చులనే తగ్గించి లోటు తగ్గించడం. ఈ రెండింటినీ వీలుని బట్టి ప్రభుత్వాలు అనుసరిస్తాయి. ఎమర్జింగ్, పేద దేశాలకు అప్పులు, సహాయల పేరుతో సొమ్ములిచ్చి ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకు, పశ్చిమ దేశాల ప్రభుత్వాలు ఒత్తిడి తెచ్చి ఈ రెండింటినీ తమకు అనుకూలంగా అమలు చేయిస్తాయి. ప్రజలపై భారం వేయరాదని ప్రభుత్వం భావిస్తే పన్నులను బడా కంపెనీలు, ధనికుల పైన వేసి, పెట్టుబడిదారులు కంపెనీలకు ఇచ్చే రాయితీలు, సబ్సిడీలను తగ్గించడమో రద్దు చేయడమో చేస్తాయి. ఇప్పటి ప్రభుత్వాలేవీ ప్రజానుకూలం కానందున దానికి సరిగ్గా వ్యతిరేకంగా చేస్తాయి. ఉద్యోగులు, కార్మికులు, ఇతర శ్రామిక వర్గాలపై మరిన్ని కొత్త పన్నులు వేస్తూ, వారి సంక్షేమం కోసం చేసే రాయితీలు, సబ్సిడీల ఖర్చులలో కొన్నింటిని రద్దు చేయడం, మరి కొన్నింటిని కోత పెట్టడం చేస్తాయి. బడ్జెట్ కంట్రోల్ చట్టం కూడా సరిగ్గా అదే ప్రధానంగా చేయబోతున్నది.

అక్టోబరు 2011 నుండి 917 బిలియన్ డాలర్లమేరకు బడ్జెట్ ఖర్చులు తగ్గించే కార్యక్రమం మొదలు కావాలి. నవంబరులో కాంగ్రెషనల్ కమిటీ 1.5 ట్రిలియన్ డాలర్ల ఖర్చు తగ్గింపుకి తగిన సిఫారసులతో నివేదికని సిద్ధం చేయాలి. ఈ కమిటీ ఏర్పాటు చెయాలని చట్టంలో నిబంధన విధించారు. కాంగ్రెస్, సెనేట్‌ల నుండి 12 మంది సభ్యులతో “ప్రత్యేక సంయుక్త కమిటి” వేయాల్సి ఉంటుంది. ఈ కమిటీ కొత్త పన్నులు వేసే సిఫారసులు చేయరాదనీ కన్ని ఉన్న పన్నుల పద్ధతిలో మార్పులు చేయవచ్చనీ నిబంధన ఉన్నట్లు కొన్ని తెలియ జేయగా  మరికొన్ని అలాంటిదేమీ లేదని రాశాయి. మొత్తం ఏదైనా ప్రజలకు ప్రతికూలంగా మార్చ వచ్చు. ఉన్న పద్ధతిని మాత్రమే మార్చాలని నిబంధన ఉంటే పన్నుల ఆదాయాన్ని అలాగే ఉంచుతూ ఎవరెవరి వద్ద ఎంత పన్నులు వసూలు చేయాలో నియమ నిబంధనలు మారుస్తూ నిర్ణయించవచ్చు. ఇది ప్రజలకు ప్రతికూలంగానే ఉంటుందన్నది చెప్పనవసరం లేదు. డిసెంబరులో వచ్చే క్రిస్ట్‌మస్ పండగ నాటికి కమిటీ చేసే నిర్ణయాలను కాంగ్రెస్, సెనేట్ లు ఎటువంటి షరతులు లేకుండా, మార్పులు చేర్పులు లేకుండా ఆమోదించాలి.

ఈ నిబంధన దగ్గర రెండు మార్గాల్ని ఒప్పందం చూపింది. కమిటీ పధకాన్ని కాంగ్రెస్ తిరస్కరిస్తే ఆటోమేటిక్ గా కొన్ని ఖర్చులలో కోతలు అమలులోకి వస్తాయి. ఈ కోతలని గత కొన్ని నెలల చర్చలలో ఇరు పక్షాలు తయారు చేసి ఉంచాయి. ఈ కోతలలోని వివిధ అంశాలు ఇరు పార్టీలకూ అమోదయోగ్యంగా లేవని తెలుస్తోంది. అంటే ఒక పక్షానికి కొన్ని ఆమోదయోగ్యంగా ఉంటే అవి వైరి పక్షానికి అలా లేవు. మరికొన్ని ఒక పక్షానికి ఆమోదయోగ్యంగ లేకపోతే, అవి వైరి పక్షానికి బ్రహ్మాండంగా ఉన్నాయి. వాటిపైన రగడ ఎంతకీ తెగదు. కనుక అక్కడికి వెళ్లకుండానే కమిటీ సిఫారసులని ఇరుపక్షాలూ ఆమోదించేలా పధకం సిద్ధం చేసారు. కమిటీ పధకం తిరస్కరణకి గురైతే అటోమేటిక్‌గా అమలయ్యే కోతలు జనవరిలో మొదలవుతాయి. ఈ కోతల్లో సగం డిఫెన్సు బిల్లులో అమలవుతాయి. మిలట్రీ ఖర్చుల్ని తగ్గించడానికి రిపబ్లికన్లు సాధారణంగా అంగీకరించరు. ఈ కోతలు డిఫెన్సు వరకే కాక హోమ్ లాండ్ సెక్యూరిటీ లాంటి ఇతర విభాగాలకి వర్తించేలా వారు బేరసారాలు సాగించి ఒప్పించారు. ఆ విధంగా డిఫెన్సు పైనే పూర్తి కోతలు అమలు కాకుండా చూడాలని వారి ఆత్రుత. వృద్ధులకు అమెరికా ఫెడరల్ ప్రభుత్వం “మెడికేర్” పధకాన్ని అమలు చేస్తోంది. కోతల్లో భాగంగా మెడికేర్ లో కూడా కోతలు విధించబోతున్నారు. అత్యంత పేదలకి, పెన్షనర్లకీ ఈ కోతలు వర్తించవని చెబుతున్నారు కానీ అమలులో కాని తేలదు.

చివరి భాగం బాలెన్స్‌డ్ బడ్జెట్ కి సంబంధించినది. సమతులిత ఆహారం లాగా సమతులిత బడ్జెట్ అన్నమాట. అంటే భవిష్యత్‌లో ఎంత ఆదాయం వస్తే అంతే ఖర్చు పెట్టడం. ఈ సంవత్సరం చివరిలోపు దీనికి సంబంధించి రాజ్యాంగంలో ఒక సవరణ చేయాలని ఒప్పందం చేసుకున్నారు. కాంగ్రెస్, సెనేట్ లు రెండూ ఈ సవరణపై ఓటింగ్ నిర్వహించాలి. ఉభయ సభల్లొనూ ఈ బిల్లుకి 2/3 వంతు మెజారిటీ ఉండాలి. ఈ సవరణ ఎలాగోలా ఆమోదం పొందితే అప్పుడు అధ్యక్షుడు ఒబామా మరో 1.5 ట్రిలియన్ డాలర్లు (16.7 ట్రిలియన్ల పరిమితి) రుణపరిమితి పెంచుకోవచ్చు. సవరణ ఆమోదం పొందకపోతే కనక ఒబామా 1.2 ట్రిలియన్ డాలర్లు (16.4 ట్రిలియన్ల పరిమితి) మేరకు రుణాన్ని పెంచుకోవచ్చు. సమతులిత బడ్జెట్ సవరణ ఆమోదం పొందే సమస్య అసలు లేనే లేదు. ద్రవ్యోల్బణం పైనా, అప్పుల పైనా నడిచే పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్ధలు అవి లేకుండా మనగలగడం అసాధ్యం, అసంభవం. ఆదాయం మేరకు ఖర్చులు చేయాలంటె మొదట నష్టపోయేది ప్రభుత్వాల వద్ద అప్పులు తీసుకునే కార్పొరేట్ బహుళజాతి కంపెనీలే. భారమంతా ప్రజల మీద వెయ్యాలని భావిస్తే కార్మిక వర్గ ఆందోళనలను అమెరికా ప్రభుత్వం మరింత ముందుకు జరుపుకున్నట్లే అవుతుంది.

ఇండియాపై ప్రభావం

అమెరికా ఆర్ధిక వ్యవస్ధ కేంద్రంగా ఉన్న ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలోని అభివృద్ధి చెందిన దేశాలతో పాటు, ఎమర్జింగ్ దేశాలు కూడా అమెరికా వినియోగదారీ సంస్కృతిపై ఆధారపడి ఉన్న సంగతిని మొదట గమనించాలి. అలాగని పూర్తిగా అమెరికాపైనే అధారపడే ఈ దేశాలు ఉన్నాయని చెప్పడం కూడా సరైంది కాదు. జపాన్, జర్మనీ, ఫ్రాన్సు లాంటి ప్రధాన ఆసియా, యూరప్ దేశాలతో పాటు చైనా, ఇండియా, బ్రెజిల్ లాంటి ఎమర్జింగ్ దేశాలు కూడా అమెరికా వినియోగదారులు చేసే ఖర్చులపై ఆధారపడి ఉన్నాయి. ఆ దేశాలనుండి జరిగే ఎగుమతులలో ప్రధాన భాగం అమెరికాకే జరుగుతున్నాయి. జపాన్‌లో అణు ప్రమాదం సంభవించాక అక్కడినుండి జరిగే ఎగుమతులు పడిపోయి దాని ప్రభావం అమెరికాపై కూడా పడింది. జపాన్ నుండి వచ్చే దిగుమతుల కొనుగోలుకు అమెరికన్లు పెట్టే ఖర్చు తగ్గడంతో ఆ మేరకు పన్నుల రాబడి తగ్గింది. వినియోగదారుల ఖర్చు తగ్గడం లేదా పెరగడం అనేది అమెరికా ఆర్ధిక వ్యవస్ధ తీరుతెన్నులను నిర్ణయించడంలో ఒక ప్రామాణికంగా పరిగణిస్తారు. అది అమెరికన్ల ఖర్చులు తగ్గిపోయినట్లుగా సూచిస్తుంది. అమెరికన్లు ఖర్చును తగ్గిస్తే అది ఆర్ధిక బలహీనతగా మార్కెట్లు పరిగణించి అమెరికాకి అనుకూలంగా జరిగే ఆర్ధిక కార్యకలాపాల్లో పరిమితిని విధించుకుంటారు. ఆ గొలుసుకట్టు చర్యలు కొనసాగి షేర్లు పతనం కావడానికో, అమెరికా ఆర్ధిక వ్యవస్ధపై నమ్మకం సడలడానికో దారితీస్తుంది. ఆ పరిస్ధితి మళ్ళీ మిగిలిన ఆర్ధిక వ్యవస్ధలపై పడుతుంది. అదొక విషవలయంగా మారిపోయే పరిస్ధితి తలెత్తుంది. ఇలాంటి విషవలయాలు ఆర్ధికవ్యవస్ధలో ఇంకా ఉంటాయి.

ఒప్పందంలో భాగంగా అమెరికా చేపట్టనున్న బడ్జెట్ కోతలు లేదా పొదుపు చర్యలు భారత దేశ ఆర్ధిక వ్యవస్ధపై ప్రభావం చూపనున్నాయి. భారత ఆర్ధిక వ్యవస్ధ అభివృద్ధి చెందిన అమెరికా, యూరప్ దేశాల ఆర్ధిక వ్యవస్ధలతో వివిధ అంశాల్లో అనుసంధానించబడి ఉంది. ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానం అమలు జరిగినంతకాలం ప్రధానంగా రష్యాతో అనుసంధానం కావించబడిన భారత వ్యవస్ధ ప్రస్తుతం ప్రధానంగా అమెరికాతో పీటముడి వేసుకుని ఉంది. ఎగుమతుల దగ్గర్నుండి పెట్టుబడుల వరకూ ఈ ముడి విస్తరించి ఉంది. నూతన ఆర్దిక విధానాల అమలు, అమెరికాతో కుదిరిన వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం మున్నగు అంశాల ద్వారా ఇండియా ఆర్ధిక వ్యవస్ధ అమెరికాకి అనుసంధానం అయి ఉంది. తక్కువ ధరకు శ్రామిక శక్తిని అందించే దేశంగా, ఓట్ సోర్సింగ్ సర్వీసులను చౌక ధరలకు అందించే దేశంగా, విస్తారంగా ఉన్న ఖనిజాల వంటి ముడి సరుకులను సరఫరా దేశంగా ఇండియా కొనసాగుతున్నది.

రుణ పరిమితి పెంపుకూ, బడ్జెట్ లోటు తగ్గింపుకూ కుదిరిన ఒప్పందంలో పేర్కొన్నట్లు కాంగ్రెస్, సెనేట్ ల సభ్యులతో నియమించబడిన కమిటీ చేయనున్న నిర్ణయాలు ఇండియాపై ప్రభావం కలగ జేస్తాయి. బడ్జెట్ ఖర్చులలో వేటికి కమిటీ ప్రాధాన్యం ఇస్తుందీ తేలినట్లయితే ఇండియాపై పడే ప్రభావం ఏ రంగాలలో ఉండేదీ ఒక అంచనాకు రావచ్చు. అమెరికా రుణ సంక్షోభం వలన ఇండియా జిడిపి వృద్ధి రేటుకి సంబంధించిన విజయ గాధపై ప్రభావం పడుతుందని ప్రధాన మంత్రి ఆర్ధిక సలహా మండలి ఛైర్మన్ సి.రంగరాజన్ ఇప్పటికే ప్రకటించి ఉన్నాడు. “అమెరికా ఆర్ధిక వృద్ధిలో ఏమైనా తగ్గుదల సంభవిస్తే అది ఇండియా ఎగుమతుల సామర్ధ్యంపై ప్రభావం చూపుతుంది” అని సి.రంగరాజన్ ఆగస్టు 1 తేదిన విలేఖరులతో చెప్పినట్లుగా ఐ.ఎ.ఎన్.ఎస్ వార్తా సంస్ధ తెలిపింది. 2008-09 రెండవ అర్ధ భాగంలో (అక్టోబర్ 2008 నుండి మార్చి 2009 వరకు) ఆర్ధిక సంక్షోభం వలన అమెరికా ఆర్ధిక వ్యవస్ధ క్షీణించడంతో భారత్ ఎగుమతులు తీవ్ర స్ధాయిలో పడిపోయిన సంగతిని ఆయన గుర్తు చేశాడు. 2011-12 ఆర్ధిక సంవత్సరానికి భారత ఎగుమతులు 330 బిలియన్ డాలర్లు (రు.14,85,000 కోట్లు) ఉంటాయని అంచనా వేస్తున్నట్లు ఆయన వివరిస్తూ దీనిలో తగ్గుదల సంభవిస్తే అది ఇండియా జిడిపి వృద్ధి రేటుపై ప్రభావం చూపిస్తుందన్న రంగరాజన్ హెచ్చరిక ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. ఇండియా జిడిపి 2010-11లో 1.538 ట్రిలియన్లు ఉంటుందని ఐ.ఎం.ఎఫ్ అంచనా వేసింది. అంటే ఇండియా జిడిపిలో దాని ఎగుమతుల వాటా 21.5 శాతం ఉంది. దాదాపు ఐదోవంతు భాగం జిడిపిని అందించే ఎగుమతులు తగ్గితే అది అనివార్యంగా జిడిపి వృద్ధి రేటుపై గణనీయ ప్రభావం చూపుతుంది.

అమెరికా కాంగ్రెస్, సెనేట్ ల కమిటీ దిగుమతులలో కోత విధించాలని భావించినట్లయితే అది ఇండియా జిడిపి ని ప్రభావితం చేస్తుంది. భారత ఇన్ఫర్మేషన్ టెక్నాలజి అమెరికా ఎగుమతులపైనే అధికంగా ఆధారపడి ఉంది. ఇన్ఫోసిస్, మహీంద్రా సత్యం, విప్రో లాంటి పెద్ద కంపెనీలు అమెరికాకె ఎక్కువగా సాఫ్ట్‌వేర్ సర్వీసులను ఎగుమతి చేస్తాయి. సాఫ్ట్ వేర్ దిగుమతులపై కోత విధిస్తారేమోనని ఈ కంపెనీలు ఒకింత భయపడుతున్నాయంటే అతిశయోక్తి కాదేమో. వీరు అమెరికాలో పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. “2008 నాటి ‘ది గ్రేట్ రిసెషన్’ (మహా మాంద్యం) నుండి మేము కొన్ని పాఠాలు నేర్చుకున్నాం” అని ఇన్ఫోసిస్ సి.ఇ.ఓ క్రిస్ గోపాల క్రిష్ణన్ మైసూరులో విలేఖరులతో మాట్లాడుతూ ఇటీవల అన్నాడు. అమెరికా మార్కెట్లలో తాము జాగ్రత్తగా ఉంటామని, అమెరికా రుణ సంక్షోభం ఎదుర్కోవడానికి తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని కూడా ఆయన తెలిపాడని యాహూ న్యూస్ వెబ్‌‌సైట్ తెలిపింది.

హె.సి.ఎల్ టెక్నాలజీస్ సి.ఇ.ఓ వినీత్ నాయర్ ‘లైవ్ మింట్’ వార్తా వెబ్ సైట్ కి ఇంటర్వ్యూ ఇస్తూ ఇలా అన్నాడు. “అమెరికాలో మళ్ళీ మాంద్యం (రిసెషన్) సంభవిస్తే, బడా కంపెనీలు దెబ్బతింటే అది అమెరికాకి చెందిన మొత్తం ఐ.టి ఖర్చులపై గణనీయమైన ప్రభావం పడుతుంది” అని వినీత్ అన్నాడు. అమెరికా ఐ.టి ఖర్చుల్ని తగ్గించుకుంటే, అమెరికాకి ఐ.టి సర్వీసుల్ని ఎగుమతి చేసే ఇండియా ఉత్పత్తి అనివార్యంగా దెబ్బ తింటుంది. అమెరికా పధక రచన చేసుకున్న బడ్జెట్ ఖర్చుల కోత అమెరికా మళ్ళీ మాంద్యంలోకి వెళ్ళడానికి దోహదపడుతుందని ఇన్‌వెస్టర్లు ఇప్పటికే భయపడుతున్నారు.

రానున్న నెలల్లో లేదా క్వార్టర్లలో అమెరికా ఆర్దిక వ్యవస్ధ నెగిటివ్ వృద్ధి నమోదు చేయవచ్చని చాలామంది విశ్లేషకులు భావిస్తున్నారు. బడ్జెట్ ఖర్చుల కోత అందుకు కారణంగా చూపుతున్నారు. ఎగుమతి ఆధారిత పరిశ్రమలు, కంపెనీలన్నీ అమెరికా రుణ సంక్షోభం వలన నష్టపోతాయని విశ్లేషకులు ఏకాభిప్రాయంతో ఉన్నట్లు పత్రికల విశ్లేషణలు తెలియజేస్తున్నాయి. రుణపరిమితి పెంపుకు ఒప్పందం కుదిరినప్పటికీ అమెరికా రుణ సంక్షొభం ఇంకా ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధకు భయం గొలుపుతూనే ఉంటుందని చైనా అధికారిక పత్రిక పీపుల్స్ డైలీ ఆగష్టు 2 పేర్కొన్నట్లుగా రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. అయితే, డాలర్ ఆధిపత్యం నుండి తప్పించుకోవడానికి అడ్డదారులేవీ లేవని ఆ పత్రిక చెప్పడం గమనార్హం. అమెరికా ప్రాధమికంగా డిఫాల్ట్ నుండి తప్పించుకున్నప్పటికీ దాని సావరిన్ అపు సమస్యలు పూర్తిగా తొలగిపోలేదనీ పక్కకు నెట్టబడిన ఆ సమస్యలు మళ్ళీ తలెత్తుతాయని ఆ పత్రిక చెబుతూ ఈ అంశం అమెరికా ఆర్ధిక రికవరీని ప్రమాదంలో పడవేసిందని తెలిపింది. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ ఎదుర్కోనున్న ప్రమాదాలు కొనసాగుతున్నాయని ఆ పత్రిక అంచనా వేసింది.

పీపుల్స్ డైలి అభిప్రాయాలు ఖచ్చితంగా చైనా ప్రభుత్వ అభిప్రాయాలు అయి ఉండాలని లేదు. అయినా అవి ప్రభుత్వ అభిప్రాయాల ధోరణిని ప్రతిబింబిస్తాయి. చైనా అమెరికా ట్రెజరీ బాండ్లలొ (అప్పులో) పెద్ద ఎత్తున ($2 ట్రిలియన్లకు పైగా) పెట్టుబడులు పెట్టి ఉండడంతో చైనా కూడా ఆందోళనగా ఉంది. చైనా విదేశీ మారక ద్రవ్య నిల్వలు $3.2 ట్రిలియన్లలో 70 శాతం ($2.24 ట్రిలియన్లు) డాలర్లలోనే ఉండడం గమనార్హం. అమెరికా రుణపరిమితి పెంపు చైనాకు రెండు వైపులా పదునున్న కత్తిలాంటిదని చైనా విశ్లేషకుడొకరు వ్యాఖ్యానించాడు. అమెరికా ట్రెజరీ బాండ్లలొ పెట్టుబడులు పెట్టడం ఎంత లాభమో, అంత ప్రమాదం కూడా అని ఆయన చెప్పదలిచాడు.

అమెరికా రుణపరిమితి పెంపు చర్చలు సుదీర్ఘంగా కొనసాగడంతో అది మదుపుదారుల ఆసక్తిని, విశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. దానితో ఒప్పందం కుదిరినా అది అవసరమైన అనుకూలమైన ప్రభావాన్ని కలగజేయలేకపోయింది. దానితో ఇప్పటికె బలహీనంగా ఉన్న అమెరికా అర్ధిక వృద్ధి మరింత బలహీన పడుతుంది. ఖర్చుల కోత నిరుద్యోగాన్ని పెంచుతుంది. ఆదాయాలు, సంపధల పంపిణీలలో అసమానతలు మరింత తీవ్రం కానున్నాయి. ఏ బడ్జెట్ లోటు తగ్గించడానికైతే పొదుపు చర్యలు కోత చర్యలు ప్రకటించారో ఆ చర్యల వలన తగ్గిపోయే రెవిన్యూ ఆదాయం ఆ లక్ష్యాన్ని మరింత దూరం చేస్తుంది. ఫలితంగా ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడం, అమెరికాకి ఎగుమతులు చేసే దేశాలకు అవకాశాలు తగ్గిపోవడం జరుగుతుంది. ఫలితం షరా మామూలే. ఓకదానినొకటి ప్రోత్సహించుకునే విష వలయాలు వరుసగా ఆర్ధిక ప్రక్రియలను చుట్టేస్తాయి.

అమెరికా ఆర్ధిక సమస్యలకు పరిష్కారంగా కాంగ్రెస్, సెనేట్ లు ఎంచుకున్న ఖర్చుల తగ్గింపు మార్గం దాని అర్ధిక సంక్షోభాన్ని మరింత తీవ్రం చేస్తుందే తప్ప పరిష్కరించదు. గ్రీసు రుణ సంక్షోభం ఆ నిజాన్ని నిర్ద్వంద్వంగా నిరూపించింది. దానివలన అమెరికా ఆర్ధిక ఆరోవ్యంపై ఆదారపడి ఉన్న ఇండియాలాంటి దేశాలు కూడా తగిన ఫలితాన్ని అనుభవిస్తాయి. అది రాకుండా ఉండాలంటే అమెరికాతో ఆధారపడడాన్ని తగ్గించుకుని దేశీయ వనరులను వినియోగించుకుంటూ స్వయం పోషకంగా మారే ఆర్ధిక విధానాలు భారత దేశాన్ని కొంతమేరకైనా కాపాడుతాయి.

15 thoughts on “అమెరికా రుణ సంక్షోభం ప్రభావం ఇండియాపై ఎలా ఉంటుంది? -2

 1. Though not related to above, i would like to know your comments and observation on this.

  News in eenadu “http://www.eenadu.net/story.asp?qry1=20&reccount=27”

  China digging near the indian ocean.

  The approval given by the International Seabed Authority to the Chinese for undertaking deep sea mining in the Indian Ocean is a worrisome development because few of Beijing’s moves can be taken at face value. Although the Chinese have sought permission for exploration and mining on the plea of a growing demand for minerals, the military implications of the exercise are obvious, especially for a country whose muscle flexing against Vietnam, the Philippines and Japan on the control of disputed islands along their coastline are indications enough of its expansionist ambitions.
  Since India does not feature among the countries with which China is eager to establish tension-free, friendly relations, the prospect of Chinese warships operating in the Indian Ocean on the pretext of mining operations cannot but be a matter of concern to New Delhi. As the Indian directorate of naval intelligence has warned, the excuse given by China will be handy for Beijing to maintain ‘a continuous presence’ not far from Kanyakumari, where the Chinese would be able to collect oceanographic and hydrological data legitimately.
  While the external affairs ministry is reportedly trying to find ways and means of legally stopping the Chinese venture, it is doubtful whether such avowedly ‘exploratory’ manoeuvres can be prevented on the ground of suspicion.
  All that India can do is to ask the Seabed Authority to ensure that the Chinese adhere strictly to the terms of the licence for exploration and mining operations. The request itself will make it clear to the Authority as well as to the Chinese that India does not think that Beijing tells the whole truth while seeking such clearances in sensitive regions. It is worth remembering that the Chinese claims about the civilian usage of its deep sea submersible is not believed by the military experts of other countries.

 2. హిందూ మహా సముద్రంలో చైనా కార్యకలాపాల పట్ల ఇండియా వ్యక్తం చేసిన భయాలు న్యాయమైనవి, సహజమైనవి. చైనా ఖనిజ వనరుల కోసమే అన్వేషణ జరిపినా తన ఉనికిని మిలట్రీ కారణాల కోసం వినియోగించబోదని గ్యారంటీ లేదు. ప్రపంచ వనరులపైన ఆధిపత్యం కోసం బయల్దేరడం పెట్టుబడిదారీ వర్గాల అభివృద్ధిలో జరిగే సహజ పరిణామం. తాము వృద్ధి చెందిన దేశంలోని వనరులు, మార్కెట్లు సరిపోనప్పుడు తన పెట్టుబడులను తిరిగి లాభాలుగా రియలైజ్ చేసుకోవడం కోసం పెట్టుబడిదారులు దేశం దాటి ప్రయత్నిస్తారన్నది చరిత్ర చూపిన సత్యం. అది మొన్న బ్రిటన్ కావచ్చు, నిన్న అమెరికా కావచ్చు, ఈరోజు చైనా కావచ్చు, రేపు ఇండియా కూడా కావొచ్చు. అయితే చైనా పెట్టుబడిదారుల లాగా ఇండియా పెట్టుబడిదారులకు స్వతంత్రత కొరవడినందున వారు బైటి దేశాల వనరుల కోసం వెళ్ళినా, అవి వారి మాస్టర్లయిన అమెరికా, యూరప్ కంపెనీల ప్రయోజనాలకు లోబడి ఉండే అవకాశాలే ఎక్కువ.

  ఇక్కడొక చిత్రం ఉంది. హిందూ మహా సముద్రంలోనే అమెరికా డిగోగార్షియాలో సైనిక స్ధావరం ఏర్పాటు చేసుకుంది. భారత పాలకులు ఇండియా సెక్యూరిటీ పట్ల అంత పట్టింపు ఉంటే డిగో గార్షియాలో అమెరికా నేరుగా సైనిక స్ధావరమే ఏర్పాటు చేసుకున్నపుడు అభ్యంతరం తెలిపిందా? లేదు. పొరుగునే ఉన్న ఆఫ్ఘనిస్ధాన్‌లో అమెరికా ఏకంగా యుద్ధమే తలపెడితే అభ్యంతరం చెప్పడం బదులు సహకారం అందిస్తానని ఉవ్విళ్ళూరింది (ఎన్.డి.ఎ ప్రభుత్వం, ఆఫ్ఘన్ యుద్ధ ప్రారంభ కాలంలో అమెరికా యుద్ధ విమానాలకి ఆయిల్ రీఫిల్లింగ్ చేస్తామని విజ్ఞప్తులు కూడా చేసింది.) భారత పాలకుల ప్రయోజనాలు (భారత పెట్టుబడిదారుల ప్రయోజనాలు అనొచ్చు) అమెరికా ప్రయోజనాలకు లోబడి ఉంటాయనడానికి ఇది స్పష్టమైన రుజువు.

  అది సరే. ఈ అంశంపై నా అభిప్రాయం కోరడానికి కారణం? నేను రాసినదానికి మీ స్పందన కూడా ఇవ్వండి.

 3. ఏ ప్రాంతం భవిష్యత్తును కానీ ఆ ప్రాంతంలోని ప్రజలకే వదిలిపెట్టాలి. వారు ఏవైపు వెళ్లదలుచు కుంటే అటు వెళ్లనివ్వాలి. అది ఆయా ప్రాంతాల ప్రజలకు ఉండే సహజ హక్కు. అది అరుణాచల ప్రదేశ్, టిబెట్, కాశ్మీర్ లకు కూడా వర్తిస్తుంది. ఈ ప్రాంతాల ప్రజల అభిప్రాయాలు పట్టించుకోకుండా, గౌరవించకుండా ఇండియా, చైనాలు ‘అది మాది’ అనడం సరికాదు. అలా అనడం ఆయా ప్రాంతాల ప్రజల హక్కులను నిరాకరించడమే.

  నేను రాసినదానికి మీ స్పందన కూడా ఇవ్వండి.

 4. మీరు రాసింది ప్రమాదకరమైనది.అలాటి స్వయమ్నిర్ణయాధికారం కాశ్మీర్కే ఎందుకివ్వాలి?చైనాలొ టిబెట్కి,ఉయిఘర్కీ,పాకిస్తాన్లో సింధ్కి, బలూచ్కి, పశ్చిమ ఆసియాలో ఖుర్దులకీ ,ఇంకా ప్రపంచంలో ఎన్నో దేశాలలో ప్రాంతాలకీ ,మైనారిటీలకీ ఇవ్వాలి.ఆ దేశాలన్నీ ఊప్పుకొంటాయా? అసలు పాకీస్తాన్ ,చైనాలు వాటి భూభాగాలు ఒదులుకొంటాయా? టిబెట్ని దురాక్రమణ చెయ్యకపొతే చైనాకు ,భారత్కు సరిహద్దే లేదు.ఇటువంటి వాదనలు తేవడం మన దేశ ప్రయోజనాలకి, భద్రతకి విరుద్ధమని గ్రహించండి. రమణారావు.ముద్దు

 5. ఒక్క కాశ్మీరుకే స్వయం నిర్ణయాధికారం ఇవ్వాలనీ మిగిలినవాటికి ఇవ్వరాదని నేనెక్కడ చెప్పాను రమణారావుగారూ? టిబెట్ ని చైనా దురాక్రమణ చేసింది గానీ, కాశ్మీరుని ఇండియా దురాక్రమణ చేయలేదా? టిబెట్ స్వతంత్ర దేశంగా ఉంటే చైనాకి బదులు టిబెట్ తో ఇండియాకి సరిహద్దు ఉంటుంది. కాశ్మీరు స్వతంత్ర దేశం ఐతే కాశ్మీరుకీ ఇండియాకి సరిహద్దు ఉంటుంది. ఒకటి ఇస్తే ఇంకో వందివ్వాలి అని వాదించడం సరైందికాదని నా అభిప్రాయం. కాశ్మీరు సమస్య గానీ లేదా మరొక ప్రాంత సమస్య గానీ ఆ ప్రాంత ప్రజల జాతి, సంస్కృతి, చరిత్ర ఇత్యాది అంశాలపై ఆధారపడి ఉంటుంది తప్ప మరో పది ఇవ్వాలి, లేదా వందివ్వాలి అన్న అంశంపై ఆధారపడి ఉండదు.

  రష్యా విప్లవం వచ్చాక లెనిన్ జాతులకు విడిపోయే హక్కును రాజ్యాంగం లోనే కల్పించాడు. అప్పుడు బాల్టిక్ రిపబ్లిక్కులు లిధుయెనియా, లాత్వియా, ఎస్తోనియాలు రష్యానుండి విడిపోయాయి. కాని మరో మూడు సంవత్సరాలకి రష్యాతోనే తమకు భద్రత ఉందని గ్రహించి తిరిగి యు.ఎస్.ఎస్.ఆర్ లో కలిసి పోయాయి. తమ జాతికి ప్రత్యేకంగా ఉన్న హక్కులు, ఐడెంటిటీ ఇత్యాదికి ఉమ్మడి దేశంలోనే రక్షణ దొరుకుతుందని భావిస్తే ఏ ప్రాంతమూ విడిపోవడానికి అసక్తి చూపవు. దానినే తిప్పి చూస్తే, ఏ ప్రాంతమైనా లేక జాతి అయినా విడిపోవాలని కోరుకుంటున్నట్లయితే ఆ దేశంలో వారి హక్కులకు భంగం కలుగున్నదని, తాము అణచివేతకు గురవుతున్నామని భావిస్తున్నట్లు అర్ధం. ఆ భయాలను పోగొట్టడం బదులు భద్రతకి నష్టం అన్న పేరుతో బలవంతంగా కలిపి ఉంచితే తీవ్రవాదం తలెత్తక తప్పదు. భద్రతకి నష్టం అనుకుంటే కాశ్మీరు ప్రజల్లో ఫ్లెబిసైట్ నిర్వహిస్తానని నెహ్రూ హామీ ఎందుకు ఇచ్చాడు? హామీ మేరకు ఫ్లెబిసైట్ నిర్వహించమంటే షేక్ అబ్దుల్లాని 17 సంవత్సరాలు నెహ్రూ జైల్లో ఎందుకు పెట్టాడు? కాశ్మీరుకి ఐదు సంవత్సరాల పాటు ప్రదాని రాష్ట్రపతి ఉన్నారన్న సంగతి మీకి తెలుసా? పాక్ ఆక్రమిత కాశ్మీరుకి దాదాపు అటువంటి రాజకీయ హక్కులే ఉన్నాయన్నది మీకు తెలుసా? స్వతంత్ర సమయంలో ఇండియాతో తమకు రక్షణ ఉంటుందని భావించిన కాశ్మీరీలు ఇప్పుడు ఇండియాని అంతగా ఎందుకు ద్వేషిస్తున్నారు? వీటన్నింటికి సమాధానాలు వెతకండి అప్పుడే కాశ్మీరు సమస్య నిజానికి ఏమిటో అర్ధం అవుతుంది. పెద్దలు చెప్పింది వినడంలో తప్పులేదు. కాని వాటిని గుడ్డిగా నమ్మడం సరైంది కాదు. మనం స్వతంగా పరిశీలన విశ్లేషణలు జరిపి వాస్తవాలతో సరిచూసుకోవాలి.

  కాశ్మీరు అయినా, టిబెట్ అయినా ఏదైనా మట్టి, పచ్చిక, పచ్చదనం, యాపిల్స్, టూరిజం ఆదాయం ఇవే కాదు. వీటన్నింటీకంటే ముఖ్యం అక్కడి జనం. ఆ జనానికి ఒక చరిత్ర ఉంటుంది. ఒక జాతి, మతం, నీతి, సంస్కృతి ఉంటుంది. అవి కాపాడబడాలని కోరుకుంటారు. తమ ప్రాంతంలో సంపంద తమకే చెందాలని కోరుకుంటారు. అది సహజమైన హక్కు. నేను చెప్పేది కాదిది. ఐక్యరాజ్య సమితి గుర్తించిన హక్కులివన్నీ. వారిది వారికి దక్కని నాడు ఏ ప్రాంతంవారైనా ఏదో రూపంలో నిరసన తెలుపతారు. సరైన పరిష్కారం చూపకుండా పోలీసులను దింపి నరకం చూపిస్తే తీవ్రవాదం తలెత్తే అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి. అది ఏ ప్రాంతమైనా సరే.

  మనకి ప్రమాదకరమైంది సరే. మరి ఇప్పుడున్న పరిస్ధితి తమకు ప్రమాదకరమైందని కాశ్మీరీలు భావిస్తున్నారు కదా? వారి భావనలు, అభిప్రాయాలు వారివి కావా? వాటికి విలువు లేదా? ఈ అంశాలకు పరిశీలించకుండా గుడ్డిగా కాశ్మీరు మన తల లాంటిది. నుదుటిపై బొట్టులాంటిది అని వట్టిపోయిన అలంకారాలు చెప్పుకుంటె మనకు బాగుంటుందేమో కాని అణచివేతకు గురవుతున్నవారికి అణచివేతలాగానే ఉంటుంది. దాన్నుండి బయటపడ్డానికి ప్రయత్నం చేస్తారు.

  భారత ప్రభుత్వం కాశ్మీరును గెలుచుకోవాలంటే ముందు కాశ్మీరీలను గెలుచుకోవాలి. వారి నమ్మకాన్ని సంపాదించాలి. వారి హక్కులు, భాష, సంస్కృతి రక్షించబడతాయని నమ్మించగలగాలి. అప్పుడే వారు ఇండియ తమదని భావిస్తారు. అలాకాక బలవంతంగ కలుపుకోవాలని చూస్తే ఇప్పుడు ఎదురవుతున్నట్లే వ్యతిరేకత ఎదురవుతుంది.

 6. @VISEKHAR:

  కాశ్మీర్ గురించి రాసిన పై కామెంట్ అద్భుతంగా ఉంది.

  ‘దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్’ అనే మాటను మరచి కాశ్మీర్ మనది అని ఎంత గట్టిగా అరిస్తే అంత దేశభక్తి ఉన్నట్లుగా ఫీలైపోయే పరిస్తితి ప్రస్తుతం కనిపిస్తుంది.

 7. సూరజ్ గారు కాశ్మీరు గురించి నేను చెప్పిన విషయాన్ని ప్రశాంతంగా ఆలోచించి విశ్లేషించుకోవడం చాలా తక్కువగా కనిపిస్తుంది. అలాంటి తక్కువ మందిలో మీరూ ఉన్నందుకు సంతోషంగా ఉంది.

 8. ఈ అంశంపై నా అభిప్రాయం కోరడానికి కారణం?
  If you remember i once said that i like your patience in writing down everything with your detailed analysis 🙂
  I asked this not to test your knowledge, but to know your thoughts.
  భారత పాలకులు ఇండియా సెక్యూరిటీ పట్ల అంత పట్టింపు ఉంటే డిగో గార్షియాలో అమెరికా నేరుగా సైనిక స్ధావరమే ఏర్పాటు చేసుకున్నపుడు అభ్యంతరం తెలిపిందా? లేదు.
  you have a point there. but i dont know the reason, everyone in our neighborhood seem to dislike us!
  అమెరికా మన ఆశాదీపం అని కూడా అనుకోవచ్చు కద. లేదా మన ఇరుగు పొరుగు దేశాల మధ్య గొడవలు వాల్లు ఎగదోసినవే అని కూడా అనుకోవచ్చు. ఈ రాజకీయ climate లో ఏది నిజమో ఎవరు చెప్పగలరు.

  ఒకవేళ పాకిస్తాన్ చైనా లతో మనకి మంచి సంబంధాలు ఉంటె ప్రమాదం అగ్రరాజ్యనికే కదా?

 9. సంజయ్, మీ భావం నాకు అర్ధమయ్యింది. మీరు నన్ను టెస్ట్ చేస్తున్నారని కాదు. మీ అవగాహనని నా రాతల్లో ఏమన్నా గుర్తిస్తున్నారా లేదా తెలుసుకుందామని. మీరు నా ఓపికని మెచ్చుకుంటున్నారు గాని, విషయంపై మీ అభిప్రయాలేవీ చర్చించలేదు.

  దక్షిణాసియాలో ఇండియా తనను తాను పెద్దన్నలా భావించుకుంటుంది. అది ఇండియన్ల తప్పు కాదు. ఇండియా పాలకులు, వారి విధానాలు అలా ఉన్నాయి కనుక పొరుగువారు ఇస్టపడ్డం లేదు. కాని అమెరికా, యూరప్ ల ముందు వీళ్ళు పిల్లుల్లా ముడుచుకుంటారు. పాకిస్ధాన్ ఐనా అప్పుడప్పుడూ అమెరికాపైన వ్యతిరేక ప్రకటనలు ఇవ్వడం, కొన్ని నిర్ణయాలను అమెరికాకి వ్యతిరేకంగా తీసుకోవడం చేస్తుంది గాని ఇండియాకి ఆ చరిత్ర లేదు.

  అవును. పాకిస్ధాన్, చైనాలతో మనకి మంచి సంబంధాలుంటే అది నిస్సందేహంగా అమెరికాకి ప్రమాదం. యూరప్ దేశాలు కలిసుండడం వల్లనే యూరోపియన్ యూనియన్ ఏర్పడి అమెరికా అధిక్యానికి అవి ఉమ్మడి సవాలు విసిరాయి. అందుకే మనకీ, పాక్‌కీ మధ్య కాశ్మీరు వివాదం అలాగే కొనసాగేలా జాగ్రత్త పడతుంది. చైనాతో మనకున్న సరిహద్దు వివాదాన్ని కూడా రెచ్చగొడుతుంది. చైనాతో మనం స్నేహ సంబంధాలు పెరుగుతుంటే గనక అమెరికా ఏదో ఒక వివాదం రెచ్చగొట్టకుండా ఉండదు.

  అమెరికా మనకు ఏమవుతుందీ అన్నది దాని కార్యకలాపాలను బట్టీ మన దేశ హక్కుల్ని, సార్వభౌమాధికారాన్నీ గుర్తించడంపైన ఆధారపడి ఉంటుంది. అది వ్యక్తుల, లేదా గ్రూపుల స్వంత అభిప్రాయాలపైన ఆధారపడి ఉండదు. అది మీరైనా, నేనైనా, ఇంకొకరెవరైనా అంతే. ఏది నిజమో చెప్పలేకపోతే మనుగడ కష్టం అవుతుంది.

  గతంలో జరిగిన సంగతుల్జి విశ్లేషించుకుంటే దండలో దారంలా ఒక క్రమం (ప్యాట్రన్) కనిపిస్తుంది. వర్తమానంలో జరుగుతున్న సంగతులతో కూడా అదే క్రమాన్ని మనం చూడగలగాలి. లేనట్లయితే మనం గుర్తించిన క్రమం కరెక్టు కాదని నిర్ణయించుకొని మరొక క్రమాన్ని ఏమైనా గుర్తించగలమేమో ప్రయత్నించాలి. ఆ విధంగా గతానికీ, వర్తమానానికీ ఉన్న సంబంధాన్ని సరిగా పట్టుకోగలిగితే అది ఇంకా కొనసాగుతూ ఉంటుంది కనుక దాని ఆధారంగా భవిష్యత్తులోని ప్రధాన పరిణామాలని గానీ, లేక వాటి ధోరణిని గాని అంచనా వేయగలుగుతాము. శాస్త్రాల పుట్టుక కూడా ఇలాగే కదా జరిగింది. వివిధ సంఘటనలను లేదా అంశాలను ఒక క్రమపద్దతిలో అమర్చగలిగితే అది శాస్త్రంగా రూపుదిద్దుకుంటుంది. సామాజిక పరిణామాలకి కూడా ఇది వర్తిసుంది కనుకే చరిత్ర, సోషియాలజీ, పొలిటికల్ ఎకానమీ లాంటి శాస్త్రాలు పుట్టాయి. కదా? వివిధ దేశాల ఉద్దేశ్యాలు, ఎత్తుగడలు ఆ విధంగానే అంచనా వేయగలుగుతాము.

 10. మీ అవగాహనని నా రాతల్లో ఏమన్నా గుర్తిస్తున్నారా లేదా తెలుసుకుందామని. – Ofcourse i found a connection there. That is why i am replying.
  మీరు నా ఓపికని మెచ్చుకుంటున్నారు గాని, విషయంపై మీ అభిప్రయాలేవీ చర్చించలేదు.- (myreply) you have a point there. – ఇది నా అభిప్రాయం.

  భారత ప్రభుత్వం కాశ్మీరును గెలుచుకోవాలంటే ముందు కాశ్మీరీలను గెలుచుకోవాలి. వారి నమ్మకాన్ని సంపాదించాలి. వారి హక్కులు, భాష, సంస్కృతి రక్షించబడతాయని నమ్మించగలగాలి.

  ప్రస్తుత రాజకీయ పరిస్తితుల్లో ఇది కష్టమనే చెప్పాలి.

  ఎవరితో ఎందుకు పోరాటం చేయ్యాలో, చేస్తున్నామో ప్రజలకి ఇప్పుడు తెలుస్తోందని అనుకోను.

  మన రాష్ట్రంలోనే ఇది గమనించవచ్చు.

  ఒక పెట్టుబడిదారు మీదనో లెక రాజకీయ నాయకుల మీదనో, ఒక (అ)వ్యవస్థ మీదనో చెయ్యల్సిన పోరాటన్ని సాధారణ పౌరుల మీదకి మళ్ళిస్తున్నారు.

  ఉదా: ఒక సామన్య పౌరుడికి కాష్మిర్/తెలంగాన/సమైక్యాంధ్ర ఎందుకు కావాలో, దానికి ఎవర్ని నిందించాలో తెలుసా?

  ఒక సారి ప్రజల్లో చూడండి. తెలంగాన అంధ్ర ప్రజలు ఒకర్నొకరు ద్వేషించుకొవడం మొదలుపెట్టారు.

  ఎందుకు అంటే వారికే తెలీదు. ఒక సామన్యుడు ఎవరికి అన్యాయం చేస్తాడు? పోనీ మా ప్రాంతమే గొప్పదని వాదించేవాడు వాడి ప్రాంతం బాగు కోసం ఏమి చెయ్యడు.

  అందరు ఉద్యమంలొ ఉన్నారు కాబట్టి వాడు కుడా సాటి వాడిని ద్వేషిస్తాడు.

  ఇన్నాళ్ళూ మతం ఒక్కటె ప్రధానం అయింది, ఇప్పుడు ప్రాంతం, భాష కూడా.

  who is responsible for hindu/muslim riots? who should be responsible if there are riots in Telengaana region? who should be responsible if there is a permanent divide between the telugu speaking people?
  why should i hate the person next to me???
  what i have done to my community to start crying on others?

  as long as politicians with motives are there, people will simply be scapegoats.

 11. ప్రస్తుత రాజకీయ పరిస్ధితుల్లొ కాశ్మీరు పరిష్కారం కష్టమా సులభమా అన్నది కాదు సమస్య. అసలు కాశ్మీరు సమస్య పరిష్కారం కావాలని భారత పాలకులు గానీ, పాక్ పాలకులు గానీ, వీరిమీద పెత్తనం చేసే అమెరికాకి గానీ ఉందా అన్నదే సమస్య. వారికి సమస్య పరిష్కారం కావాలని ఉంటే అది పెద్ద సమస్య కాదు. ఎక్కువ కాలం కూడా తీసుకోదు. ఎలా పరిష్కరించాలో, ఏమి చేయాలో వారికి బాగానే తెలుసు. తెలుసు కనుకనే పరిష్కారం కాకుండా ఉండడానికి తగిన ప్రయత్నాలను విజయవంతంగా చేస్తున్నారు.

  కాశ్మీరు టెర్రరిజం అని ఆరోపిస్తూ, వారిపై సాగించే దమనకాండను కొనసాగిస్తూ ఉంటే వారు ఇండియాను తమ దేశంగా గుర్తించరు. కాశ్మీరు ప్రజలు మనఃస్ఫూర్తిగా ఇండియాలో భాగం కావాలంటే మాత్రం భారత ప్రభుత్వం తన నిర్బంధ విధానాన్ని ఆపి వారి ఆకాంక్షలకు సరిగా స్పందించాలి. వారి హక్కుల్ని, సంస్కృతినీ, భాషనీ, స్వతంత్రతనీ గుర్తించాలి. ఐతే, భారత పాలకులకి కాశ్మీరు ప్రజల ఆకాంక్షల్ని గుర్తించే మంచి బుద్ది లేదు. ఒక్క కాశ్మీరే కాదు, భారత దేశ ప్రజల ఆకాంక్షలమీదనే వారికి గౌరవం లేదు. వాటిని తీర్చాలన్న అవగాహనే లేదు. వారికి కావలసింది వారి ప్రయోజనాలు, వారిని పోషిస్తున్న కుబేరుల ప్రయోజనాలు, వారితో కుమ్మక్కైన విదేశీ బహుళజాతి కంపెనీల ప్రయోజనాలు. జనం, జనం కోరికలు, జీవనం అవన్నీ వారికి అనవసరం. జనం కోసం ఏమన్నా చేస్తే అది ఓట్ల కోసమే.

  సంజయ్ గారూ, ప్రజలకి తేలికగా అర్ధమయ్యేలా అంతా స్పష్టంగా ఉంటే వాళ్ళెప్పుడో తమకు కావలసిన అసమానతలు లేని సమాజాన్ని సాధించుకునే వారు. సామాజిక సమస్యల పరిష్కారానికి అనేక మంది పండితులు అనేక సిద్ధాంతాలని ప్రచారంలోకి తెచ్చారు. సవాలక్షా అధ్యయనాలు, పుస్తకాలు, ధీసిస్ లు ఉన్నాయి. సిద్ధాంతాలు రాయగలవారిలోనే చాలా మందికి సమస్యల పరిష్కారానికి ఎవరిమీద ఎవరు పోరాటం చెయ్యాలో చెప్పలేని పరిస్ధితుల్లో ఉన్నారు. ఇక ప్రజలకు ఎలా తెలుస్తుంది చెప్పండి? సమస్యల పరిష్కారాల కోసం ముందుకు వచ్చేవారిని ప్రజలు సహజంగానే ఆదరిస్తారు. వారి చరిత్రలు, ఉద్దేశ్యాలు తెలుసుకుని అనుసరించాలని అనుకోరు. కాని అలా ముందుకు వచ్చేవారిపైన చిత్తశుద్ధితో కృషి చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఇప్పటి రాజకీయ పార్టీలకు అది లేదు, స్వార్ధం తప్ప. అందుకే ప్రజలు మళ్ళీ మళ్ళీ మోసపోతున్నారు. చిత్త శుద్ధి ఉన్నవారు తక్కువ సంఖ్యలో కనిపిస్తున్నారు. వీటిని తెలుసుకున్న మీలాంటివారు చేయవలసింది, ప్రజలకు తెలియదు అని వాపోవడం కాదు, తెలియని వారికి తెలియ జెప్పడం చేయాలి.

  స్వార్ధ పరులు ప్రతి ఉద్యమంలోను ఉంటారు. మనం చూడవలసింది. ఆ ఉద్యమం ప్రధానంగా చేస్తున్న డిమాండ్‌ని మాత్రమే. నిజమే తెలంగాణ రాజకీయ నాయకులు, ధనికులు సీమాంద్ర నాయకులతో పాటు ప్రజల్ని కూడా ఆడి పోసుకుంటున్నారు. అలాగే సీమాంద్ర నాయకులు చాలామంది లేని ఉద్రిక్తలను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో సెంటిమెంటు అంటున్నవారికి అసలు తెలంగాణ సమస్య అర్ధం కాలేదని చెప్పాల్సి ఉంది. ఎవరు ఎలా ఉన్నా మనం చూడవలసింది. ఉద్యమంలో పెద్ద ఎత్తున కదులుతున్న ప్రజల్ని. ప్రజలు లేరని కొందరంటున్నా వాస్తవాన్ని వారు దాచలేరు. తెలంగాణ నాయకుల్లో చాలామంది బఫూన్లు, స్వార్ధపరులు, వసూల్ రాజాలు ఉన్నారు. వారు ప్రధానం కాదు. సీమాంధ్ర రాజకీయ నాయకులు, పెట్టుబడిదారులు కొంతమంది తెలంగాణ నాయకులను పోషిస్తున్నారు కూడా. అలా పోషించబడుతున్నవారు ఉద్యమాల్లో పాల్గొంటూనే ఉద్రక్తతలు రెచ్చగొట్టడానికీ, ఉద్యమ తీవ్రత తగ్గించడానికీ, పక్కదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. వీరంతా స్వార్ధపరులు. వారి గొంతు ఎంత పెద్దదైనా అయి ఉండవచ్చుగాక! కానీ తెలంగాణ ఉద్యమ నేపధ్యంలో పట్టించుకోదగినవారు కారు. నాకైతే ఉద్యమ పార్టీ అని చెప్పుకుంటున్న పార్టీ నాయకుడి పైనే అనుమానాలున్నాయి. తెలంగాణ ఉద్యమం పేరుతో ఆయన సంపాదించిన్ ఆస్తులు అపారం. స్వయంగా సీమాంధ్రులతో వ్యాపారాలున్నాయి. కానీ మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో మందిలో బతికి బట్టకడుతున్నాడు. ఇవన్నీ పాలకులకీ, వారి పోషకులైన ధనికులకీ చెందిన సంగతైతే తెలంగాణ ప్రజలకి సంబంధించినది కేవలం తెలంగాణ రాష్ట్రం మాత్రమే.

  ప్రజలకి ఎవరిమీద పోరాటం చేయాలో తెలియక పోవచ్చు. కానీ వారికి తమ సమస్యలేమిటో స్పష్టంగానె తెలుసు. తెలంగాణ/సమైక్యాంధ్ర/ఇంకోటి ఎందుకు కావాలని ప్రజలకి తెలుసా అని ప్రశ్నించుకుని దానికి సమాధానం తెలియదు అని వస్తే ఇక ఉద్యమం సరైంది కాదు అని చెప్పదలుచుకుంటే… అది కరెక్టు కాదని నా భావన. మొత్తంగా ఉద్యమం చేసే డిమాండు వెనక వారున్నారా లేదాని చూడాలి. ఒక్కోసారి కొంతమంది ప్రజలను మోసపుచ్చి, ద్వేషం రెచ్చగొట్టి అనవసర కారణాలకి ప్రజల చేత ఉద్యమాల పేరుతో అల్లర్లు చేయించవచ్చు. వారిని చూపి న్యాయమైన ఉద్యమాలను కూడా ఆకోవలోకే నెట్టరాదు. ఏది అన్యాయం, ఏది న్యాయం అన్నది పరిస్ధితులే తెలియజెపుతాయి.

 12. తెలంగాణ/సమైక్యాంధ్ర/ఇంకోటి ఎందుకు కావాలని ప్రజలకి తెలుసా అని ప్రశ్నించుకుని దానికి సమాధానం తెలియదు అని వస్తే ఇక ఉద్యమం సరైంది కాదు అని చెప్పదలుచుకుంటే… అది కరెక్టు కాదని నా భావన. I totally agree.

  ఇన్ని ఉద్యమాలు చేస్తేనే మన తోలుమందం ప్రభుత్వాలు చలించట్లేదు. ఇక వదిలేస్తే ఎం జరుగుతుందో తెలిసిందే.

  కాని దశ, దిశ ఇచ్చేది ఎవరు?

  ప్రజల ఆవేశాన్ని ఆలోచనగా ఎవరు మార్చగలరు?

  మీరే మనకి తెలంగాణా కాదు సమైక్యాంధ్ర కాదు కావలిసినది, అభివ్రుద్ధి కావాలి అని చెప్పి చూడండి. ఎవరు వింటారు?

  యాసని హేళన చెయ్యకూడదు అంటే వింటారా?

  కనిపించిన ప్రతీ అంధ్రా వాడు చెడ్డవాడు కాదు అంటె వింటారా?

  అందరు అల్ల అనుకుంటున్నారని కాదు. కాని సమాజంలొ నవ్య రీతులని చూస్తుంటే అలాగే అనిపిస్తోంది.

  అంతెందుకు పెద్ద చదువులు చదివి విశాల భావాలు ఉంటాయని అనుకునే వాళ్ళలో కూడ ఇదె థింకింగ్ ఉంది.

  నేను ఎన్నో ఆఫీసుల్లో గమనించాను. ఎదురవగానే మొదటి ప్రశ్న మీది ఏ ఊరు? సరదాగానే అడిగినట్టు అనిపించినా చివుక్కుమంటుంది.

  ఒకప్పుడు మీది ఏ కులం అనేవారు ఇప్పుడు ఇది.

  ప్రజలకి ప్రజలే మొదటి శత్రువలని నా అభిప్రాయం

  మతంతో, ప్రాంతంతో, భాషతో, వర్ణంతో తనని తాను identify చేసుకునేంతవరకు ఈ సమస్యలకి పరిష్కారం ఉందా అనిపిస్తుంది

 13. ప్రజలకీ ప్రజలకీ పెట్టి రాజకీయ నాయకులు తమాషా చూస్తుంటారు. సరదాకి కాదు, దానివలన వారికి ఉపయోగం ఉంది. ప్రజల ఓట్లతో ఎన్నికైన తమనుండి ప్రజలు తమ కష్టాలు తీర్చుతారని ఆశిస్తారు. రాజకీయ నాయకులేమో తమ వ్యాపారాలు కాపాడుకోవడానికి, ఆస్తులు పెంచుకోవడానికి, తమ నేరాలకు శిక్ష పడకుండా మేనేజ్ చేసుకోవడానికి మాత్రమే అధికారం కాంక్షిస్తారు. అధికారంలోకి రావడానికి ప్రజలకు కావలసిన వాగ్దానాలు చేసి పవర్ వచ్చాక ఏమీ చేయకపోయినా ప్రజలు అడుగుతారు. అలా అడగకుండా ఉండాలంటే ప్రజలు వేరే విషయాల్లో బిజీగా ఉండాలి. అక్కడే వారికి ఇటువంటి ఉద్యమాలు అక్కరకు వస్తాయి. ఇప్పుడు తెలంగాణ అకరకొచ్చింది. ఇంకోసారి తీవ్రవాదం అంటారు. మరొక సారి మతం, కులం ఇలా… వారికి అక్కరకొచ్చే సమస్యలు బోలెడు.

  ప్రజలకి జ్ఞానం తెలివిడి ఎక్కడి నుండి రావాలి? సమాజం నుండే రావాలి. వారు నమ్మే రాజకీయ నాయకులు మోసం చేస్తున్న సంగతి వారికి తెలియనంత కాలం, నిజాలను గ్రహించే జ్ఞానం వారికి రానంత కాలం వారి పరిస్ధితి అలాగే ఉంటుంది. ప్రజలు ఉన్న సమాజం ఇప్పుడు ప్రజల చేతిలో లేదు. వారి ఆలోచనలు, భావాలు, దృక్పధాలు, అలవాట్లు, సంస్కృతి అన్నింటినీ ఈ సమాజాన్ని గుప్పెట్లో పెట్టుకున్న ధనికవర్గాలు శాసిస్తున్నాయి. వారి చేదిలో విద్యా వ్యవస్ధ, మీడియా, ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలకు సరైన జ్ఞానం అందడం జరగదు. ప్రయత్న పూర్వకంగా వారిని పక్కదారి పట్టించే వారిని వదిలి ప్రజలపైనే నేరం మోపడం సబబు కాదు. ప్రజలెన్నడూ వివాదాలు కోరుకోరు. వారి మానాన వారిని వదిలేస్తే వారి భవిష్యత్తు వారు నిర్ణయించుకుంటారు. అవసరమైతే మంచి భవిష్యత్తుని పోరాడి సాధించుకుంటారు. ఈ వ్యవస్ధలో ఆధిపత్యం కలిగి ఉండే తమ ప్రయోజనాలకు అనుగుణంగా ఆడిస్తున్న రాజకీయ నాయకులు, కుబేర పెట్టుబడి దారులు, వారిని చెప్పుచేతుల్లో పెట్టుకున్న విదేశీ బహుళజాతి కంపెనీలు సమాజంలోని చెడుగులకు ప్రధాన కారకులు. సమాజం బాగుపడాలంటే ఇప్పుడున్న వ్యవస్ధలో సాధ్యం కాకపోవచ్చు. ప్రజలు పూనుకుని వ్యవస్ధను తమ ప్రయోజనాలకు అనుగుణంగా మార్చుకోవాల్సి ఉంటుంది.

 14. ప్రజలెన్నడూ వివాదాలు కోరుకోరు. వారి మానాన వారిని వదిలేస్తే వారి భవిష్యత్తు వారు నిర్ణయించుకుంటారు. అవసరమైతే మంచి భవిష్యత్తుని పోరాడి సాధించుకుంటారు. – చాలా ఉదాత్తమైన భావన్.

  కాని అంగీకరించలేను. ఎవరి పరిధిలో వాళ్ళు నిలువెల్లా స్వార్ధాన్ని దురభిమానాన్ని విచలవిడితనాన్ని కలిగిఉన్నారు.

  బాధలు పడేవాళ్ళు అందరూ మంచివాళ్ళు, అమాయకులు అనలేము కద

  ఇప్పుదు మంచి minority శేఖర్ గారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s