ఇంటర్నెట్ సెక్యూరిటీ నిపుణులు, ఇంటర్నెట్ చరిత్రలో మున్నెన్నడూ ఎరగనంత పెద్ద స్ధాయిలో సైబర్ దాడులు జరిగినట్లు గుర్తించారు. ఈ హ్యాకింగ్ దాడులను గుర్తించిన మెకేఫీ (McAfee)సంస్ధ ఈ దాడుల వెనుక ఒక దేశ ప్రభుత్వం ఉందని చెబుతూ, ఆ దేశం పేరు చెప్పడానికి నిరాకరించింది. ఐక్యరాజ్యసమితి, ప్రభుత్వాలు, కంపెనీలతో సహా 72 సంస్ధల నెట్ వర్క్‌లు సైబర్ దాడులకు గురయినట్లు గుర్తించారు. హ్యాకింగ్‌కి పాల్పడింది ఎవరో చెప్పడానికి మేకేఫీ నిరాకరించినప్పటికీ, ఈ వార్తను పత్రికలకు తెలిపిన సెక్యూరిటీ నిపుణుడు, దాడుల వెనక చైనా ఉన్నదని చెప్పినట్లుగా రాయిటర్స్ తెలిపింది.
సైబర్ దాడులు వరుసగా ఐదు సంవత్సరాల పాటు జరిగాయని నిపుణులు తెలిపారు. ఐక్యరాజ్య సమితి, తైవాన్, ఇండియా, దక్షిణ కొరియా, వియత్నాం, కెనడా, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏసియన్ నేషన్స్ (ఎ.ఎస్.ఇ.ఎ.ఎన్), ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐ.ఒ.సి), ప్రపంచ డ్రగ్స్ వ్యతిరేక సంస్ధ, డిఫెన్సు కాంట్రాక్టుల నుండి ఉన్నత సాంకేతిక సంస్ధల వరకూ అనేక కంపెనీలు సైబర్ దాడులకు గురయిన వాటిలో ఉన్నాయని మెకేఫి తెలిపింది.
ఐక్యరాజ్య సమితికి విషయంలోనైతే హ్యాకర్లు, జెనీవాలోని ఐక్యరాజ్య సమితి సెక్రటేరియట్‌కి చెందిన కంప్యూటర్ సిస్టంలోనికి 2008 లో జొరబడ్డారు. జొరబడ్డాక రెండు సంవత్సరాల పాటు అక్కడ దాక్కొని ఉండి తమ పని కానిచ్చారు. ఆ రెండు సంవత్సరాలలొ నిశ్శబ్దంగా సమితి రహస్య వివరాలనన్నింటినీ జల్లెడ పట్టారని మెకేఫీ తెలిపింది. ఈ దాడుల బాధిత సంస్ధల విస్తృతి చూసి తామే నిశ్చేష్టులమయ్యామని మెకేఫీ ప్రతినిధి, 14 పేజీల నివేదిక తయారు చేసిన డిమిట్రీ అల్పెరోవిఛ్ తెలిపాడు. “దొంగిలించిన డేటాను ఏం చేస్తున్నదీ తెలియకపోవడం ఒక సమస్య. అయితే దొంగిలించిన వివరాలలో ఏ కొద్ది భాగాన్ని వినియోగించినా -మెరుగైన పోటీనిచ్చే ఉత్పత్తులు తయారు చేయడం, ప్రత్యర్ధి టీం ఎత్తుగడల వివరాలను దొంగిలించడం ద్వారా పోటీదారులను కీలకమైన పోటీ వద్ద ఓడించడం- జరిగే ఆర్ధిక నష్టం భారీగా ఉంటుంది. అదొక ఆర్ధిక బెదిరింపు సమస్యగా తయారవుతుంది” అని డిమిట్రీ తెలిపాడు.
డిఫెన్స్ రంగ కంపెనీలలో చొరబాటుపై నిర్వహిస్తున్న పరిశోధనలో భాగంగా 2009లో కనిపెట్టిన ‘కమేండ్ అండ్ కంట్రోల్’ సర్వర్ లోని అంశాలను సమీక్షిస్తూ, గత మార్చి నెలలో అనేక వరుస దాడులను గుర్తించారు. ఈ సందర్భంలోనె మకేఫీ దాడుల విస్తృతిని గుర్తించారు. ఈ సైబర్ దాడులను మెకేఫీ “ఆపరేషన్ షేడీ ర్యాట్” (Operation Shady RAT) గా పేరు పెట్టారు. 2006 మధ్య నుండీ ఈ దాడులు మొదలయ్యాయని గుర్తించారు. ఈ నేపధ్యంలో ఇంకా కనిపెట్టని చొరబాట్లు కూడా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. ర్యాట్ అంటే రిమోట్ యాక్సెస్ టూల్ అని అర్ధం. దీనిని అటు హ్యాకర్లు, ఇటు సెక్యూరిటీ నిపుణులూ సుదూర ప్రాంతాల్లోని కంప్యూటర్లలోనికి ప్రవేశించడానికి వినియోగిస్తారు.
కొన్ని దాడులు ఒక నెలపాటు సాగితే మరికొన్ని సంవత్సరాల తరబడి సాగాయని మెకేఫీ తెలిపింది. సుదీర్ఘ దాడి ఒక ఆసియా దేశానికి చెందిన ఒలింపిక్ కమిటీ కంప్యూటర్లపై జరిగిందనీ అది 28 నెలల పాటు ఆప్పుడప్పుడూ ఆపుతూ, తిరిగి కొనసాగిస్తూ, జరిగిందనీ తెలిపింది. కొన్ని కంపెనీలు, ప్రభుత్వాలు అదేపనిగా దాడికి గురవుతున్నాయనీ దానివలన ఆర్ధిక సానుకూలతను కోల్పోతూ రహస్యాలను కూడా దాచుకోలేని పరిస్ధితి తలెత్తుతున్నదని సెక్యూరిటీ విశ్లెషకులు భావిస్తున్నారు. ‘ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్’ పరంగా చూస్తే ఇది అతి పెద్ద సంపద తరలింపుగా పేర్కొనవచ్చని తెలుపుతున్నారు. ఈ దాడుల భారీతనం భయం గొలిపేదిగా ఉందని ఆల్పెరోవిఛ్ రాయిటర్స్ తో మాట్లాడుతూ అన్నాడు.
బాధిత 72 సంస్ధలకూ దాడుల సంగతి తెలిపామని అల్పెరోవిఛ్ తెలిపాడు. ఈ దాడులపై ప్రపంచ వ్యాపితంగా విచారన జరుగుతోందని ఆయన తెలిపాడు. “సెంటర్ ఫర్ స్ట్రేటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్” సంస్ధలో సైబర్ నిపుణుడైన జిమ్ లూయిస్ కి దాడుల విషయాన్ని వివరించామని మెకేఫీ తెలిపింది. ఈయన దాడుల వెనక చైనా ఉన్నట్లు అనుమానిస్తున్నాడు. దాడులకు గురైన కొన్ని టార్గెట్లు చైనా ప్రయోజనాలకు ఉపయోగపడగల సమాచారం కలిగి ఉన్నాయని తెలిపాడు.
2008 ఒలింపిక్స్ కి ముందు అనేక దేశాల ఒలింపిక్ కమిటీల కంప్యూటర్ వ్యవస్ధలతో పాటు ఐ.ఒ.సి కంప్యూటర్లలోకి కూడా పెద్ద ఎత్తున చొరబాట్లు జరిగాయి. మరొవైపు తైవాన్ దేశాన్ని చైనా తిరుగుబాటు చేసిన రాష్ట్రంగా గుర్తిస్తుంది. వీరి మధ్య ఇటీవల కొన్ని ఆర్ధిక సంబంధాలు మెరుగుపడినా, రాజకీయ ఉద్రిక్తలు కొనసాగుతున్నాయి. “రష్యా కూడా అయిఉండవచ్చు. కానీ రష్యాకంటే చైనా వైపే వేలెత్తి చూపడానికే ఎక్కువ అంశాలు కనపడుతున్నాయి” అని లూయిస్ అంటున్నాడు.
సమితి కంప్యూటర్లలో హ్యాకింగ్ చేసినట్లయితె ఒక్క చైనా, రష్యాలకే కాదు, అమెరికా, యూరప్ లకు కూడా ఉపయోగమే. అయినా లూయిస్ దృష్టి చైనా, రష్యాలపైనే దృష్టి పెట్టడం చూస్తే అసలు సైబర్ దాడుల ఆరోపణలే రాజకీయ దృష్టికోణం నుండి వస్తున్నాయా అని అనుమానం కలుగుతోంది. దానికి కూడా లూయిస్ సమాధానం చెబుతున్నాడు. ఇటువంటి దాడులకు పాల్పడగల సామర్ధ్యం అమెరికా, బ్రిటన్ లకు కూడా ఉంది. “కానీ మేము మా మీదే గూఢచర్యానికి పాల్పడం కదా? అలాగే బ్రిటన్లు మా మీద గూఢచర్యానికి పాల్పడదు” అని లూయిస్ అంటున్నాడు. కనుక దాడులకు పాల్పడింది చైనాయె అని నమ్మొచ్చని లూయిస్ పరోక్షంగా నమ్మబలుకుతున్నాడు.
అంతా చైనా మీదికి నెట్టేస్తున్న లూయిస్ వాదన ఆధార రహితంగానూ, పశ్చిమ దేశాలను వెనకేసుకొచ్చేదిగానూ ఉంది. తప్పుదారి పట్టించేది గానూ ఉంది. నిజానికి ఇంత పెద్ద ఎత్తున సంవత్సరాల తరబడి సైబర్ దాడులు చేయగల సామర్ధ్యం, అటువంటి అవసరమూ, దాడులకు పాల్పడిన చరిత్రా ఒక్క అమెరికాకే ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి పై దాడిని “మాపై దాడి”గా లూయిస్ ఎలా చెబుతున్నాడో అర్ధం కాని విషయం. ఐక్యరాజ్య సమితి భవనాలు, ప్రధాన కేంద్రం న్యూయార్క్ లోనో లేక ఇతర అమెరికా నగరాల్లోనో ఉన్నంత మాత్రాన దానిని అమెరిన్లు “మాది”గా చెప్పుకోవచ్చా? ఇండియాపై సైబర్ దాడి చేయడానికి చైనా కంటే అమెరికాకే ఎక్కువ అవకాశాలున్నాయి.
అసలు ప్రపంచం అంతా రాయబారుల పేరుతో గూఢచర్యం నిర్వహిస్తున్న సంగతీ, అ గూఢచర్యం ఎంత అధమ స్ధాయిలో ఉన్నదీ వికీలీక్స్ వెల్లడించిన డిప్లొమేటిక్ కేబుల్స్ ద్వారా వెల్లడయింది కదా! అనేక దేశాల ఒలింపిక్ కమిటీల కంప్యూటర్లను హ్యాక్ చేయడానికి ఒక్క చైనానే ఎందుకు అనుమానిస్తున్నట్లు? అమెరికా ఎందుకు కాదు? అమెరికాలోని కంపెనీలు ఒక దానితో మరొకటి పోటీ పడుతుంటాయి. ఆ పోటీలు తీవ్ర స్ధాయికి కూడా చేరుతుంటాయి. సుదూర కంప్యూటర్లను హ్యాక్ చేసే పరికరం అందరికీ అందుబాటులో ఉండగా ఒక్క చైనాపైనే అనుమానాలు వ్యక్తం చేయడం సబబు కాదు.
మానవ హక్కులను ప్రపంచంలోనే అత్యధిక స్ధాయిలో, పరమ ఘోరంగా, కడు పాశవికంగా ఉల్లంఘించేది అమెరికా. కాని అదే అమెరికా మానవ హక్కులపై ప్రపంచానికి తెగ పాఠాలు చెబుతుంది. ప్రతి సంవత్సరం ఆయా దేశాలపై మానవ హక్కుల రికార్డులను తయారు చేసి ప్రకటిస్తుంది. ముఖ్యంగా చైనా మానవ హక్కుల ఉల్లంఘన పట్ల, భారత దేశంలోని బాల కార్మికుల పట్లా అమెరికా తెగ ఉబలాటం ప్రదర్శిస్తుంది. ఆ రెండు దేశాలకు నీతులు చెప్పడానికి సందర్భం వచ్చినప్పుడల్లా ప్రయత్నిస్తుంది. ఇండియా సరళీకృత ఆర్ధిక విధానాలను అమలు చేస్తూ పశ్చిమ దేశాల బహుళజాతి సంస్ధల పెట్టుబడులను దేశంలోకి అనుమతిస్తూ, వారికి కొన్ని పన్నుల మినహాయింపు కూడా ఇస్తుండడంతో ఇటీవల కాలంలో ఇండియా బాల కార్మికుల మానవ హక్కుల హరణ అమెరికాకి కనపడడం లేదు. కాని భారత బాల కార్మికుల శ్రమతొ తయారైనవని చెబుతూ అమెరికా గతంలో అనేక నివేదికలు తయారు చేసి తివాచీల్లాంటి ఉత్పత్తులను నిషేధించింది కూడా. అటువంటి అమెరికా నిస్సిగ్గుగా ఏకంగా మూడు దేశాల సార్వబౌమాధీకార హక్కులనే కాలరాస్తూ అక్కడి ప్రజల ధన, మాన, ప్రాణ నష్టాలకు యధేచ్ఛగా పాల్పడుతున్నా అది మానన హక్కుల కిందికి రాదు. ఆ విధంగానే సైబర్ హక్కులు, ప్రైవసీ హక్కులు, ఇంటర్నెట్ న్యూట్రాలిటీ లాంటి అంశాలపై లెక్చర్లు దంచే అమెరికా సైబర్ దాడులకు పాల్పడడానికి నూటికి నూరు పాళ్ళూ అవకాశాలున్నాయని చెప్పవచ్చు.
బుధవారం అమెరికాలో సెక్యూరిటీ నిపుణులు, హ్యాకర్ల సదస్సు జరగనుంది. ఆ సందర్భంగా మెకేఫీ ఈ నివేదిక వెల్లడించినట్లు తెలుస్తోంది. “బ్లాక్ హ్యేట్ కాన్ఫరెన్స్” గా పిలిచే ఈ సభ లాస్ వేగాస్ లో జరగనుంది. తమ నైపుణ్యాన్ని సెక్యూరిటీ పెంచడానికి వినియోగించే హ్యాకర్లను ఈ సదస్సుకు అనుమతిస్తారు. లాక్‌హీడ్ మార్టిన్ కార్ప్ (ఆయుధాల తయారీ సంస్ధ), ఐ.ఎం.ఎఫ్, సిటీ గ్రూప్ ఇంక్, సోనీ కార్ప్ తదితర సంస్ధలపై జరిగిన హ్యాకింగ్ దాడులను ఈ సభలో చర్చిస్తారని తెలుస్తోంది. నిత్యం వాడుతున్న సాఫ్ట్ వేర్లలో సెక్యూరిటీ బలహీనతలు ఏమన్నా ఉంటే వాటిని నిపుణులు సభలో వెల్లడించవచ్చు.

