మరి కొద్ది గంటల్లో మాజీ ముఖ్యమంత్రిగా మారనున్న యెడ్యూరప్పపై మరొక దెబ్బ పడింది. ఆయనపై లోకాయుక్త కనుగొన్న అవినీతి ఆరోపణలను విచారించడానికి కర్ణాటక గవర్నర్ ‘హంసరాజ్ భరద్వాజ్’ లోకాయుక్త పోలీసులకు అనుమతి మంజూరు చేశాడు. అక్రమ మైనింగ్ జరిపిన కంపెనీలతో కుమ్మక్కయ్యాడని లోకాయుక్త చేసిన ఆరోపణలపై క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి గవర్నర్ అనుమతి ఇచ్చేశాడు. దీనితో యెడ్యూరప్పకు కష్టాలు మరిన్ని పెరిగాయి. కాంగ్రెస్, బి.జె.పి పార్టీల మధ్య జరుగుతున్న ఈ నాటకటకం ఎంతవరకూ దారి తీస్తుందో చూడవలసి ఉంది. అయితే యెడ్యూరప్పతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతర మంత్రులు గాలి బ్రదర్స్, శ్రీరాములు ల విషయంపై గవర్నర్ ఆదేశాలు ఏం చెప్పిందీ, అసలు చెప్పిందీ లేనిదీ తెలియరాలేదు.
వారం రోజుల క్రితం సమర్పించిన లోకాయుక్త నివేదికను కర్ణాటక గవర్నర్ భరద్వాజ్ ఆమోదిస్తున్నట్లు ప్రకటించాడు. నివేదికలోని ఛాప్టర్ 22 లో యెడ్యూరప్పపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని లోకాయుక్త చేసిన సిఫారసును కూడా ఆమోదిస్తున్నట్టు గవర్నర్ ప్రకటించాడు. ఈ మేరకు రాజ్ భవన్ నుండి ప్రకటన వెలువడింది. లోకాయుక్త జస్టిస్ సంతోష్ హెగ్డే, అక్రమ మైనింగ్ విషయమై తాను జరిపిన దర్యాప్తు నివేదికను ప్రభుత్వంతో పాటు గవర్నరుకు కూడా పంపించాడు. నివేదికను అధ్యయనం చేశాక తన అభిప్రాయాన్ని తెలుపుతానని గవర్నర్ అప్పుడే ప్రకటించాడు.
రాజ్ భవన్ నుండి వెలువడిన ప్రకటన, “కర్ణాటక లోకాయుక్త చట్టం ప్రకారం తగు అధికారాలు కలిగిన గవర్నర్ (competent authority), నివేదికను, దానికి జతపరచపడిన ఇతర డాక్యుమెంట్లనూ జాగ్రత్తగా అధ్యయనం చేసిన తర్వాత, ‘కర్ణాటక లోకాయుక్త చట్టం 1994’, ‘అవినీతి నిరోధక చట్టం 1988’ లలో పొందుపరచబడిన అంశాలను అనుసరించి ఈ నిర్ణయం తీసుకుంది” అని పేర్కొంది. లోకాయుక్త కూడా లోకాయుక్త పోలీసుల ద్వారా తగిన చర్య తీసుకోవచ్చని గవర్నరు ప్రకటన తెలిపింది. “కర్ణాటక లోకాయుక్త ముందు ఉంచడానికి, కాంపిటెంట్ అధారిటీ (గవర్నర్) తీసుకున్న నిర్ణయాన్ని కర్ణాటక రిజిస్ట్రార్ కు పంపించామని సదరు ప్రకటన తెలిపింది.
యెడ్యూరప్పపై లోకాయుక్త సిఫారసు చేసినట్లు క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి మళ్ళీ బి.జె.పి ప్రభుత్వమే పూనుకోవాల్సి ఉంటుంది. అందుకే రాబోయే కొత్త ముఖ్యమంత్రి తన వర్గం వాడై ఉండడానికి యెడ్యూరప్ప శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాడు. కాని యెడ్యూరప్ప అభ్యర్ధికి బి.జె.పి అధిష్టానం తన అభ్యర్ధిని పోటీగా నిలబెట్టింది. ఇద్దరూ బి.జె.పి వారే కనుక మొదటి సారిగా దక్షిణ భారత దేశంలో బి.జె.పికి అధికారాన్ని రుచి చూపించిన యెడ్యూరప్పపై అవినీతి విచారణ చేపట్టేందుకు, ముందుకొస్తారా లేదా అన్నది అనుమానమే. ముందుకొచ్చినట్లయితే బి.జె.పికి, కాంగ్రెస్ పై ఆధిక్యత మానసిక ఆధిక్యత సాధించగలుగుతుంది. ఇటు కర్ణాటకలోనూ, అటు కేంద్ర స్ధాయిలోనూ బి.జె.పి ప్రతిష్ట పెరుగుతుంది. కాని ఈ అవకాశాన్ని బి.జె.పి స్వీకరించగలదా?

