ఈ వారం మూడవ రోజు కూడా బారత షేర్లు పతన బాటలో కొనసాగాయి. సెన్సెక్స్, నిఫ్టీ రెండు ప్రధాన షేర్ల సూచీలు దాదాపు ఒక శాతం నష్టాలు చవిచూశాయి. అమెరికా రుణ పరిమితి పెంపు పైనా, బడ్జెట్ లోటు తగ్గింపు పైనా అక్కడి చట్ట సభలు, వైట్ హౌస్ లు ఒక అంగీకారానికి వచ్చినప్పటికీ మార్కెట్లు లేదా మదుపుదారులు సంతృప్తి చెందలేదు. రుణ పరిమితి పెంపు, బడ్జెట్ లోటు తగ్గింపు లకు సంబంధించిన చర్చలు సుదీర్ఘ కాలంపాటు సాగడంతో అమెరికా ఆర్ధిక వ్యవస్ధపై మదుపుదారులకు విశ్వాసం దెబ్బతిన్నదని విశ్లేషకులు భావిస్తున్నారు. బడ్జెట్ లోటు తగ్గింపు కోసం రిపబ్లికన్లు, డెమొక్రట్లు చేసుకున్న ఒప్పందం అంచనాకు తగ్గట్లుగా లేదని మదుపుదారులు భావిస్తున్నట్లుగా రాయిటర్స్ లాంటి కార్పొరేట్ పత్రికలు చెబుతున్నాయి.
సుదీర్ఘ కాలం సాగిన చర్చలు రేటింగ్ సంస్ధలను ఆలోచనలో పడవేసాయని విశ్లేషకులు చెబుతున్నారు. రుణ పరిమితి పెంపు ద్వారా అమెరికా అప్పులు చెల్లించలేని పరిస్ధితినుండి బైటపడింది. కానీ అమెరికా సావరిన్ అప్పు లేదా ట్రెజరీ బాండ్ల రేటింగ్ ను రేటింగ్ సంస్ధలు తగ్గించే ప్రమాదం మాత్రం అలాగే కొనసాగుతోంది. దానితో అమెరికా ఆర్ధిక పరిస్ధితి పై అనుమానాలు ఇంకా కొనసాగుతుండడంతో ఆ ప్రభావం భారత షేర్ మార్కెట్లపై పడింది. బి.ఎస్.ఇ సెన్సెక్స్ 169.34 పాయింట్లు (0.94 శాతం) నష్టపోయి 17940.55 వద్ద క్లోజ్ కాగా, ఎన్.ఎస్.ఇ నిఫ్టీ 51.75 పాయింట్లు (0.95 శాతం) నష్టపోయి 5404.80 పాయింట్ల వద్ద ముగిసింది.
