సర్వేలో ‘జన లోక్‌పాల్’కు 80% మద్దతు, ఎన్నికల్లో పోటీచేయాలని కాంగ్రెస్ సవాల్


కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి కపిల్ సిబాల్ నియోజక వర్గం ‘చాందినీ చౌక్’ పార్లమెంటరీ నియోజక వర్గంలో అన్నా హజారే బృందం లోక్ పాల్ డ్రాఫ్టులపై సర్వే నిర్వహించిన సంగతి విదితమే. సర్వేలో ప్రభుత్వ డ్రాఫ్టు ‘లోక్ పాల్’ బిల్లు, అన్నా బృందం రూపొందించిన ‘జన్ లోక్‌పాల్’ బిల్లులు వివిధ ప్రధాన అంశాలపై ఏమేం ప్రతిపాదిస్తున్నదీ ఉదహరిస్తూ, అందులో ఏ అంశాలకు తాము మద్దతు ఇస్తున్నదీ గుర్తించవలసిందిగా కోరారు. మొత్తం 4 లక్షల కుటుంబాలలో అన్నా బృందం సర్వే కాగితాలను పంచినట్లు తెలిసింది. పంచిన రెండు రోజుల తర్వాత తిరిగి ప్రజలు గుర్తుపెట్టిన సర్వే కాగితాలను తిరిగి సేకరించి ఫలితాలను లెక్కిస్తునట్లు వారు తెలిపారు.

సోమవారం నాటికి లెక్కించిన ఫలితాలలో 82 శాతం మంది “జన్ లోక్‌పాల్” బిల్లుకు మద్దతు తెలిపినట్లుగా తేలిందని అన్నా హజారే బృందం ప్రకటించింది. 72,000 మంది అందించిన సమాధాన పత్రాలను లెక్కించాక ఈ ఫలితం తేలిందనీ, మిగిలినవాటిని కూడా లెక్కిస్తున్నామని వారు తెలిపారు. ఈ ఫలితాలు చూస్తే చాందినీ చౌక్ నియోజకవర్గానికి పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్న కపిల్ సిబాల్ ఇంకా తన నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడా అన్న అనుమానం కలుగుతోందని పౌర సమాజ కార్యకర్త అరవింద్ కేజ్రీవాల్ అన్నాడు. ప్రధాని, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ లపై వచ్చే అవినీతి ఆరోపణలు, పార్లమెంటులో ఎం.పిల ప్రవర్తన… వీటిని లోక్ పాల్ బిల్లు పరిధినుండి ప్రభుత్వ బిల్లు మినహాయించింది. దీనిని అన్నా హజారే బృందం గట్టిగా వ్యతిరేకిస్తోంది.

అయితే కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వంలోని మంత్రులు అన్నా హజారే బృందం జరిపిన సర్వేను విమర్శిస్తున్నారు. ప్రజల మద్దతే హజారేకి ఉన్నట్లయితే 2014 పార్లమెంటు ఎన్నికల్లో సర్వే నిర్వహించిన “చాందినీ చౌక్” నుండి పోటీ చేయాలని కాంగ్రెస్ ప్రతినిధి మనీష్ తివారి సవాలు విసిరాడు. “సర్వే గురించి నేనూ విన్నాను. చాందినీ చౌక్ నియోజక వర్గం నుండి 2014 ఎన్నికల్లో ఆయన పోటీ చేయవచ్చు. అప్పుడు నిజమేమిటో స్పష్టంగా వెల్లడవుతుంది” అని మనీష్ అన్నాడని ‘ది హిందూ’ పత్రిక తెలిపింది.

ఎప్పుడో 2014 లో జరిగే ఎన్నికలని గోదాగా నిర్ణయించడం ద్వారా అప్పటిదాక హజారే బృందం నుండి దాడులు ఎదురుకాకుండా ఉంటాయని మనీష్ ఆశించి ఉండవచ్చు. అదీ కాక రాజకీయ పార్టీలు ప్రభుత్వంలో ఉండగా కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలు నెరవేర్చి వందల కోట్లను ఎన్నికల చందాలుగా పొందుతారు. ఆ డబ్బునే ఓటర్లకు పంచి, మద్యం తాగించి ఓట్లు కొనుగోలు చేస్తారు. ఆ పని అన్నా హజారే బృందం చేయలేరన్న ధైర్యం కూడా మనీష్ తివారిని ఎన్నికల సవాలు విసరడానికి ప్రోత్సహించి ఉండవచ్చు. ఎన్నికల సంగతెలా ఉన్నా సర్వేకి సరైన సమాధానం చెప్పవలసిన అవసరం ప్రభుత్వం పైనా మంత్రులపైనా ఉంది.

పార్లమెంటు విచక్షణ, తెలివిడిలపై హజారే బృందం విశ్వాసం ఉంచాల్సిన అవసరం ఉందని మనీష్ తివారి అన్నాడు. “మీరు సర్వేలు చేయవచ్చు. కాని రాజ్యాంగం యొక్క మౌలిక నిర్మాణంతో మీరు ఆటలాడలేరు” అని మనీష్ తివారి పనిలో పనిగా ఒక నీతి బోధ కూడా చేశారు. కపిల్ సిబాల్, అన్నా హజారే బృందం ప్రతిపాదించిన “జన్ లోక్‌పాల్” బిల్లుని ఉదహరిస్తూ, ప్రభుత్వానికి సమాంతరమైన వ్యవస్ధను ఏర్పాటు చేయజాలమని పేర్కొన్నాడు.

రాజ్యాంగ మౌలిక నిర్మాణంతో ఆటలాడగూడదన్నది నిజమే. ప్రభుత్వానికి సమాంతర వ్యవస్ధను ఏర్పాటు చేయరాదన్నదీ నిజమే. అయితే కాంగ్రెస్ నాయకుడు, మంత్రి చెబుతున్నట్లు రాజ్యాంగంతో ఆటలాడుతున్నదీ, సమాంతర వ్యవస్ధను నడుపుతున్నదీ ఎవరు? ఈ మంత్రులూ, వారి అనుచరులూ, వారి కార్పొరేట్ మిత్రులూ… వీరు కాదా సమాంతర వ్యవస్ధలను నడుపుతున్నది? నల్లడబ్బుతో సమాంతర ఆర్ధిక వ్యవస్ధ నడుస్తున్నదని ప్రభుత్వాలే అనేక సార్లు చెప్పాయి. అటువంటి నల్లడబ్బుని విదేశాలనుండి వెనక్కి తెప్పిద్దామని ప్రత్యేక పరిశోధనా బృందం సుప్రీం కోర్టు నియమిస్తే తాత్, వీల్లేదు అని కోర్టులో రివ్యూ పిటిషన్ వేసింది ప్రధాని, మంత్రులు కాదా? దేశంలో అన్ని రంగాల్లోనూ మాఫియా సామ్రాజ్యాలు విస్తరించి ఉన్నాయి. అక్రమ మైనింగ్ దగ్గర్నుండి సెజ్ ల పేరుతో వెలసిన రియాల్టీ మాఫియాల వరకు నడుపుతున్నది ఈ రాజకీయ నాయకులు, వారి మిత్రులు కాదా?

అసలు సమాంతర వ్యవస్ధలను అట్టే పెట్టుకుని, దాని మీద ఈగ కూడా వాలనివ్వకుండా అడ్డుపడుతూ కాపలా కాస్తున్న మంత్రులు, రాజకీయ నాయకులు రాజ్యాంగం గురించి నీతి పాఠాలు వల్లించడం ఏ విధంగా అర్ధం చేసుకోవాలి?!

వ్యాఖ్యానించండి