భారత షేర్ మార్కెట్ల పతనం కొనసాగుతోంది. అమెరికా రుణ పరిమితి పెంపుపై సోమవారం ఒప్పందం కుదరడంతో లాభాలు పొందిన షేర్ మార్కెట్లు, మంగళవారం పాత భయాలు తిరిగి తలెత్తడంతో నష్టాలకు గురయ్యాయి. అమెరికా ఆర్ధిక వ్యవస్ధ వృద్ధి నెమ్మదించడం, యూరప్ లోని బలహీన ఆర్ధిక వ్యవస్ధలున్న దేశాల్లో అప్పు సంక్షోభంపై తిరిగి ఆందోళనలు తలెత్తడం, భారత ఆర్ధిక వృద్ధికి అధిక ద్రవ్యోల్బణం ప్రతిబంధకంగా మారడం… ఇవన్నీ రంగం మీదికి రావడంతో షేర్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి.
బి.ఎస్.ఇ సెన్సెక్స్ ఐదు వారాల కనిష్ట స్ధాయికి పడిపోయింది. 204.44 పాయింట్లు (1.12 శాతం) కోల్పోయి 18283.55 వద్ద ముగియగా, ఎన్.ఎస్.ఇ నిఫ్టీ 60.25 పాయింట్లు (1.09 శాతం) నష్టపోయి 5456.55 వద్ద క్లోజయ్యింది. సోమవారం అమెరికా రుణ పరిమితి పెంపుపై ఒప్పందం షేర్ మార్కెట్లకు ఊపునిచ్చిందనీ, కానీ చైనా పారిశ్రామిక వృద్ధి నెమ్మదించడంతో పాటు ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ వృద్ధి రేటు బాగా తగ్గుతుందన్న భయాలు మళ్ళీ షేర్ మార్కెట్లను ఆవహించాయనీ విశ్లేషకులు భావిస్తున్నారు.
రియాల్టీ, మెటల్స్, బ్యాంకింగ్, ఐ.టి రంగాల షేర్లు అధికంగా నష్ట పోగా, సెన్సెక్స్‌లో టాప్ షేర్లయిన ఇన్ఫోసిస్, ఐ.సి.ఐ.సి.ఐ, ఎస్.బి.ఐ, ఆర్.కాం లాంటి షేర్లు బాగా నష్టపోయాయి. ప్రధాన మంత్రి ఆర్ధిక సలహా మండలి భారత దేశ ఆర్ధిక వృద్ధి ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి గతంలో భావించినట్లు 9 శాతం కాకుండా 8.2 శాతానికే పరిమితమవుతుందని చెప్పడంతో మార్కెట్ లో కొనుగోళ్లు పడిపోయాయని బ్రోకర్లను ఉటంకిస్తూ ‘ది హిందూ’ పేర్కొంది. అంతే కాకుండా అమెరికా మాన్యుఫాక్చరింగ్ పరిశ్రమ బలహీనంగా కోలుకుంటున్న సంకేతాలు వెలువడడంతో అమ్మకాల జోరు పెరిగిందని వారు తెలిపారు.
అయితే సి.పి.ఎం పార్టీ నాయకులు సీతారం యేచూరి, ప్రధాని సలహామండలి తన వృద్ధి రేటు అంచనా తగ్గించినప్పటికీ తగ్గించిన రేటు కూడా తక్కువేమీ కాదనీ, దాని ఆధారంగా సలహా మండలి, ఇండియా ఆర్ధిక వృద్ధి ఊపు తగ్గిందని, దెబ్బతిన్నదనీ చెప్పడం పరస్పర విరుద్ధ పరిశీలన అనీ అభిప్రాయం వ్యక్తం చేశారు. అర్ధిక వృద్ది రేటు తగ్గిందని చెబుతూ, ఆ సాకుతో రిటైల్ రంగ ప్రవేటీకరణ లాంటి సంస్కరణల బిల్లులను ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం చూస్తున్నదని ఆయన ఆరోపించాడు.

