అమెరికా రుణ పరిమితి పెంపుకు ఒప్పందం, ప్రతినిధుల సభ ఆమోదం


ఆగస్టు 2 లోగా అమెరికా రుణ పరిమితిని పెంచుతూ చట్టాన్ని ఆమోదించాల్సి ఉన్న నేపధ్యంలో అనేక వారాల పాటు చర్చలు, తర్జన భర్జనలు జరిగాక ఎట్టకేలకు, అమెరికా ప్రతినిధుల సభ లోని డెమొక్రటిక్, రిపబ్లికన్ సభ్యులు, వైట్ హౌస్ మధ్య ఆగస్టు 1 న ఒప్పందం కుదిరింది. ఒప్పందం మేరకు ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన “ది బడ్జెట్ కంట్రోల్ యాక్ట్ 2011” ను  సభ్యులు 269-161 ఓట్ల తేడాతో ఆమోదం తెలిపారు. ప్రతినిధుల సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు ఎగువ సభ ‘సెనేట్’లో ఆమోదం పొందవలసి ఉంది. సెనేట్ ఆమోదం అయ్యాక అధ్యక్షుడి సంతకంతొ బిల్లు చట్టంగా అమలు లోకి వస్తుంది. ఈ ప్రక్రియ మంగళవారం లోపు పూర్తికావలసి ఉంది.

అనేక వారాల పాటు చర్చోపచర్చలు జరిగాక ఆదివారం నాడు రిపబ్లికన్, డెమొక్రాట్ పార్టీల పార్లమెంటేరియన్లు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. రిపబ్లికన్లు తయారు చేసిన బడ్జెట్ లోటుని తగ్గించే చట్టం ఆమోదం, ఒబామా కోరుతున్న రుణ పరిమితి పెంచే చట్టం ఆమోదం రెండూ ఒకదానికొకటి ముడి పెట్టడంతో, అమెరికా రోజూవారీ అవసరాలకు డబ్బు కొరవడినా, ఖర్చుల కోసం రుణ పరిమితిని పెంచి కొత్త అప్పులను సేకరించే పని సాధ్యం కాకుండా పోయింది. ప్రతినిధుల సభ ఆమోదించిన బిల్లు ప్రకారం అమెరికా బడ్జెట్ లోటుని వచ్చే పదేళ్ళలొ 2.1 ట్రిలియన్ (రు.94,50,000 కోట్లు – అక్షరాలా కోటి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు) డాలర్ల మేరకు తగ్గించవలసి ఉంటుంది. అంటే సంవత్సరానికి సగటున 210 బిలియన్ (రు.9,45,000 కోట్లు – అక్షరాలా  లక్షలు ఎనభైవేల కోట్ల రూపాయలు) డాలర్ల లోటు తగ్గించ వలసి ఉంటుంది.

సెనేట్ కూడా బిల్లుని ఆమోదిస్తే 14.3 ట్రిలియన్ డాలర్లకు మించి అమెరికా అప్పు చేయడానికి అవకాశం లభిస్తుంది. అదనంగా మరో 2.4 ట్రిలియన్ డాలర్లమేరకు అప్పులు చేయడానికి ప్రతినిధులు సభ ఆమోదించిన బిల్లు అనుమతిస్తుంది. అంటే నూతన పరిమితి 16.7 ట్రిలియన్ డాలర్లు గా చెప్పుకోవచ్చు. బిల్లులో విచక్షణాధికారాలతో చేసే ఖర్చులపై పరిమితి విధించినట్లు తెలుస్తోంది. ఎంటైటిల్‌మెంట్ సౌకర్యాలను సంస్కరించ వలసి ఉంది. అని రిపబ్లికన్ సభ్యుడు ఒకరు తెలిపారు. ప్రతినిధుల సభ, సెనేట్ సభ్యుల మాటలను బట్టి, మొత్తం మీద ఒప్పందంలో రిపబ్లికన్ల మాటే ఎక్కువ చెల్లుబాటు అయినట్లు కనిపిస్తోంది. బడ్జెట్ లోటు తగ్గించే పేరుతో ప్రజలపైన సరికొత్త పన్నులను విధించడానికి ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది.  ఓటింగ్ జరిపాక ప్రతినిధుల సభ సభ్యులు వేసవి సెలవుల కోసం సుదీర్ఘ విరామం తీసుకున్నారు. సెప్టెంబరు నెలలో మళ్ళీ కొత్త సెషన్ ప్రారంభమవుతుంది.

వ్యాఖ్యానించండి