“జపాన్ కాంగ్రెస్ ఎగైనెస్ట్ అటామిక్ అండ్ హైడ్రోజన్ బాంబ్స్” మొదటి సమావేశం, భూకంపం, సునామీల వలన అణు ప్రమాదం సంభవించిన ఫుకుషిమాలో సోమవారం ప్రారంభమయ్యింది. అణు విద్యుత్ పరిశ్రమకు ఇక అంతం పలకాలని ఆ సదస్సు కోరింది. అణు విద్యుత్ కానీ, అణు బాంబులు కానీ ఏవీ వాంఛనీయం కాదనీ రెండూ మానవాళికి ప్రమాదకారులేననీ సమావేశం తెలిపింది. రిక్టర్ స్కేల్ పై 9 పరిమాణంతో మార్చి 11 న ఫుకుషిమా దైచి అణు ప్లాంటు వద్ద సంభవించిన అణు ప్రమాదం చెర్నోబిల్ ప్రమాదం తర్వాత అంతటి ప్రమాదకరంగా నిర్ధారించారు. రేడియేషన్ లీకేజిని ఇప్పటికీ అరికట్టలేక పోతున్నారు.
ఫుకుషిమా వద్ద సముద్రంలోని నీరు, భూమి, ప్లాంటు, చుట్టూ ఉన్న వాతావరణం అన్నీ రేడియేషన్ తో నిండిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో నిత్య వాడుకునే నీరు, గాలి, ఆహార పదార్ధాలలలో కూడా రేడియేషన్ ప్రవేశించింది. దానితో జపాన్ నుండి దిగుమతి అయ్యే సరుకులన్నింటినీ ఆయా దేశాలు రద్దు చేసుకున్నాయి. ఫలితంగా జపాన్ ఆర్ధిక వృద్ధికి కూడా ప్రమాదం ముంచుకొచ్చింది. ఇంతా చేసి ఫుకుషిమా దైచి కర్మాగారాన్ని ప్రమాదరహితంగా శుభ్రపరిచి, పూడ్చి పెట్టడానికి కొన్ని దశాబ్దాలు పడుతుందని జపాన్ ప్రభుత్వం గత నెలలో ప్రకటించింది. భూకంపం, సునామీల వలన 210 బిలియన్ డాలర్లు, జపాన్ (రు.9,45,000 కోట్లు) నష్టపోయిందని జపాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో అణు నష్టం కలవక పోవడం గమనార్హం.
శుభ్రపరిచే ప్రక్రియ ప్రారంభించడానికే పది సంవత్సరాలు పడుతుందని జపాన్ అటామిక్ ఎనర్జీ కమిషన్, ఫుకుషిమా అణు ప్లాంటు ఆపరేటర్ అయిన టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ లు ప్రకటించాయి. 2021 సంవత్సరంలో ఫుకుషిమా రియాక్టర్లలో కరిగిపోయిన అణు ఇంధనాన్ని తొలగించడానికి అవసరమైన ప్రక్రియను ప్రారంభంచాలని టెప్కో లక్ష్యంగా పెట్టుకుంది. ఫుకుషిమాలో ప్రమాదానికి గురయిన అణు రియాక్టర్లను నాశనం చేయడం ప్రారంభించడానికి అనేక దశాబ్దాలు పడుతుందని అణు పరికరాల తయారీదారులు, అణు రియాక్టర్ ఆపరేటర్లు, ప్రభుత్వాధికారులు కూడా అంగీకరిస్తున్నారని జపాన్ ప్రభుత్వ టెలివిజన్ ఛానెల్ ఎన్.హెచ్.కె తెలిపింది.
అంటే స్ధూలంగా చూస్తే, ఫుకుషిమా అణు రియాక్టర్ల వద్ద శుభ్రం చేయడానికి తగిన పరిస్ధితులు ఏర్పడడానికి 10 సంవత్సరాలు, తర్వాత కర్మాగారాన్ని శుభ్రం చేయడానికి 20 లేదా 30 సంవత్సరాలు (20 సం అని తోషిబా కంపెనీ చెబుతుండగా, కాదు 30 సం. అని హిటాచి వాదిస్తోంది), అక్కడి నుండి శుభ్రం చేసిన అణు కర్మాగారాన్ని పూడ్చిపెట్టడానికి మరికొన్ని సంవత్సరాలు పడుతుందని తేలుతోంది. ఆ తర్వాత మాత్రమే ఫుకుషిమా మానవనివాస యోగ్యమయ్యిందీ లేనిదీ చెప్పలేము. ఇవన్నీ అయ్యాక కూడా ఫుకుషిమా మానవ నివాస యోగ్యం అవుతుందని చెప్పలేమని గుర్తించాలి.
ఈ నేపధ్యంలో జరిగిన సమావేశం, అణు పరిశ్రమకు మొత్తానికి -శాంతియుత ప్రయోజనాలకా లేక యుద్ధ ప్రయోజనాలకా అన్నదానితో సంబంధం లేకుండా- అంతం పలకాల్సిందేనని అణు పరికరాలు లేని సమాజం కోసం కృషి చేయాలని కోరింది. సమావేశానికి నాయకత్వం వహించిన కొయిచి కావానో “మనం ‘ఫుకుషిమాలు ఇక వద్దు’ అని నినదించాలి” అని పేర్కొన్నాడు. “అణ్వాయుధాలను రద్దు చేయాలన్నదానిపైనే మన దృష్టిని కేంద్రీకరిస్తూ వచ్చాము. అణు విద్యుత్ కర్మాగారాలకు వ్యతిరేకంగా జరగవలసిన ప్రచారాన్ని బలహీన స్దాయిలో ఉంచాం” అని కొయిచి వివరించాడు. అణ్వాయుధాలు మాత్రమే ప్రమాదకరమైనవని ప్రచారం చేస్తూ అణు విద్యుత్ ఉత్పత్తిని శాంతియుత ప్రయోజనాల కిందికి వర్గీకరించడంతో అణు విద్యుత్ ప్లాంటులు ప్రమాదరహితమైనవన్న అభిప్రాయం ప్రజల్లో వ్యాప్తి చెందడానికి కారణమయ్యామని కొయిచి చెప్పదలిచాడు.
“అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం” (ఎన్.పి.టి – Nuclear Non-Proliferation Treaty) గానీ, “సమగ్ర అణు పరీక్షల నిషేధ ఒప్పందం” (సి.టి.బి.టి – Comprehensive Test Ban Treaty) గానీ అణ్వాయుధాల వ్యాప్తి నిరోధానికీ, అణు పరీక్షల నిషేధానికీ ఉద్దేశించినవే తప్ప అసలు అణు సాంకేతిక పరిజ్ఞానం వలన ఎదురయ్యే ఇబ్బందులను చర్చించేందుకు ప్రయత్నాలేవీ జరగలేదు. ఈ రెండు ఒప్పందాలను అడ్డు పెట్టుకుని అమెరికా తదితర పశ్చిమ రాజ్యాలు అణ్వస్త పాటవాన్ని మరింత పెంచుకుంటూ బలహీన దేశాలకు కనీసం అణు విద్యుత్ ప్రయోజనాలను కూడా నిరాకరిస్తూ వచ్చాయి. ఐతే, శాంతియుత ప్రయోజనాలు అని ఆమోద ముద్ర వేసిన అణు విద్యుత్ ఉత్పత్తి వలన కూడా అణ్వస్త్రాల స్ధాయిలో ప్రమాదం సంభవించగల అవకాశాలను శాస్త్రవేత్తలు సైతం విస్మరిస్తూ వచ్చారు. దానితో ఊహలకు అందని ప్రమాదాలకు సరైన రీతిలో సంసిద్ధంగా ఉండడంలో విఫలమయ్యాం.
ఫుకుషిమా ప్రమాదం సంభవించాక అమెరికా అణు కర్మాగారాల వద్ద పరిస్ధితులను సమీక్షించిన స్వతంత్ర నిపుణులు అమెరికాలో ఉన్న దాదాపు అన్ని విద్యుత్ ప్లాంటులవద్దా భద్రతా పరిస్ధితులను మెరుగుపరచాల్సి ఉందని వెల్లడించారు. కానీ అణు పరిశ్రమల లాబీ తమ పరిశ్రమను, దాని ద్వారా వచ్చే లాభాలనూ వదులుకోవడానికి సిద్ధంగా లేదు. అమెరికా, జపాన్, యూరప్ లలోని అణు రియాక్టర్లు తదితర పరికరాల తయారీదారులు ఇప్పటికే అణు పరిశ్రమలో పెట్టిన పెట్టుబడులను వదులుకోడానికి సుతరామూ ఇష్టపడరు. ప్రమాదాలు ఎన్నిజరిగినా పర్వాలేదు, ఎంతమంది చచ్చినా పర్వాలేదనే భావిస్తారు తప్ప పెట్టుబడిని, లాభాలను మాత్రం వదులుకోరు. దానితో ప్రపంచ వ్యాపితంగా ఎన్ని ఉద్యమాలు జరిగినా, పెట్టుబడిదారుల పక్షం వహించే ప్రభుత్వాలు అణు నిషేధం విధించడానికి అంగీకరించడం లేదు.
ఫుకుషిమా ప్రమాదం మరొక్కసారి మానవాళికి అవకాశం ఇచ్చినట్లయింది. అణు ప్రమాదాలు ఏరీతిలో సంభవిస్తాయో వెల్లడించింది. ఇంతవరకు మానవ ప్రపంచం ఎరుగని అనేక రీతుల్లో అణు ప్రమాదాలు సంభవించడానికి అవకాశాలు దండిగా ఉన్నాయని వెల్లడించింది. భారత ప్రభుత్వం కూడా ఈ పాఠాలను నేర్చుకోవలసి ఉండగా అది అందుకు నిరాకరిస్తోంది. పశ్చిమదేశాలు తమ తమ అణు ప్లాంటుల వద్ద ఉన్న భద్రతా పరిస్ధితులపై బహిరంగ ప్రకటనలు చేస్తూ పాత పరిస్ధితిని వివరించి ఫుకుషిమా అనంతరం తాము తీసుకున్న జాగ్రత్తలను తెలుపుతూ వివరాలను ప్రజలకు అందజేస్తుండగా భారత ప్రభుత్వం మాత్రం ‘మన ప్లాంట్లు భద్రంగా ఉన్నాయని, భద్రతా పరిస్ధితులను సమీక్షించామనీ, అంతా బాగానే ఉందనీ ఒక ప్రకటన జారీ చేసి చేతులు దులుపుకుంది. అంటే వారి భరోసాలు మారుమాట్లాడకుండా ప్రజలు అంగీకరిస్తారన్న నమ్మకమే కాకుండా, అంగీకరించి తీరాలన్న ధోరణి కూడా భారత పాలకుల్లో కనిపిస్తోంది. దీన్ని మార్చవలసింది భారత ప్రజలే. ప్రభుత్వాలు తమ చర్యలన్నింటినీ ప్రజలకు వివరించే పరిస్ధితికోసం ప్రజలు కృషి చేయవలసి ఉంది.


