ఖనిజం రవాణా చేస్తున్న ట్రక్కులు బళ్ళారి మైనింగ్ కార్పొరేషన్ కి చెందినవిగా గుర్తించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇనుప ఖనిజాన్ని రవాణా చేయడానికి తాము జులై 30 న పర్మిట్లు పొందినట్లుగా డ్రైవర్లు చెబుతున్నారనీ, కాని ఖనిజం తవ్వకాలను, రవాణాను వెంటనే సస్పెండ్ చేస్తున్నట్లుగా సుప్రీం కోర్టు జులై 29, శుక్రవారమే తీర్పు ఇచ్చినందున ఈ రవాణా చట్ట విరుద్ధమని కలెక్టర్ తెలిపారు. రవాణాదారులకు లభించిన పర్మిట్ కూడా చట్టవిరుద్ధమేనని ఆయన తెలిపాడు.
బళ్ళారి ఇనుప గనుల్లో అతిగా తవ్వకాలు జరుపుతున్నందున పర్యావరణానికి తీవ్రమైన హాని జరుగుతున్నదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.హెచ్.కపాడియా గత కొన్ని నెలలుగా హెచ్చరిస్తున్నాడు. జాతి సంపద కొద్దిమంది మాఫియా, రాజకీయ నాయకులు, అధికారులు కుమ్మక్కయ్యి సొంతం చేసుకోవడం హేయమయిన చర్య. ఉచ్ఛనీఛాలు ఎరుగని రాజకీయనాయకులు, అధికారులు, నేరస్ధుల గుంపు గతంలో అనేక హత్యలకు, నేరాలకు పాల్పడి గనులను యధేచ్ఛగా విదేశాలకు తరలించి సొమ్ము చేసుకుంది. ప్రస్తుతం సుప్రీం కోర్టు కొరడా ఝళిపిస్తున్నందున ఇన్ని అక్రమాలు బైటపడుతున్నాయి.
సుప్రీం కోర్టు కేవలం కొద్ది కాలం పాటు మాత్రమే క్రియాశీలకంగా వ్యవహరిస్తేనే ఇన్ని అక్రమాలు వెల్లడయ్యాయి. అదే కోర్టు నిజంగా తనపనిని తాను ఎల్లవేళలా చేసుకుంటూ పోయినట్లయితే మరెన్ని అక్రమాలు వెల్లడవుతాయో ఊహకందని విషయం. కాని ఎల్లవేళలా సుప్రీం కోర్టు క్రియాశీలకంగా ఉంటూ శ్రీ మహావిష్ణువు లాగా అవతారం ఎత్తినట్లు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ఛేయజాదు. అది యుగ ధర్మం కూడా కాదు. ప్రజలే అందుకు పూనుకోవాలి.
