కర్ణాటక ముఖ్యమంత్రి తనపై లోకాయుక్త నివేదికలో అక్రమ మైనింగ్ కుంభకోణంలో భాగస్వామ్యం వహించిన ఆరోపణలు చేయడంతో హైకమాండ్ ఆదేశాల మేరకు రాజీనామా చేస్తానని యెడ్యూరప్ప అంగీకరించినా, తీరా కేంద్ర పరిశీలకులు వచ్చాక మొండికేశాడు. కొన్ని షరతులు విధించి అవి నెరవేరితేనే రాజీనామా చేస్తానని చెబుతున్నాడు. తన మద్దతుదారులను పెద్ద సంఖ్యంలో తన అధికారిక నివాసం వద్దకు పిలిపించుకుని వారి చేత ఆందోళన చేయిస్తునాడు. యెడ్యూరప్పను కొనసాగనివ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనితో కర్ణాటక వచ్చిన కేంద్ర బృందం తమ అధ్యక్షుడిని తదుపరి కార్యాచరణ కొసం సంప్రదిస్తున్నారు.
అక్రమ మైనింగ్ పై లోకాయుక్త నివేదికను ప్రభుత్వానికి, గవర్నరుకు సమర్పించాక, అందులో యెడ్యూరప్పపై ప్రత్యక్ష ఆరోఫణలు ఉన్నట్లు స్పష్టమైంది. బి.జె.పి అత్యున్నత నిర్ణాయక సంస్ధ పార్లమెంటరీ బోర్డు సమావేశమై యెడ్యూరప్ప వెంటనే రాజీనామా చేయాలని కోరింది. రాజీనామా చేయడానికి అంగీకరించిన యెడ్యూరప్ప ఆదివారం వరకు సమయం కోరాడు. తర్వాత బెంగుళూరు వచ్చి తన మద్దతుదారులతో చర్చలు జరిపాక రాజీనామాకు షరతులు విధించాడు. తాను సూచించిన వ్యక్తికే ముఖ్యమంత్రి పీఠం అప్పజెప్పడం, తనను కర్ణాటక బి.జె.పికి అధ్యక్షుడిగా నియమించడం, మంత్రివర్గ నియామకాలు తన ఇచ్ఛానుసారం జరగాలని కోరడం తదితర షరతులను యెడ్యూరప్ప విధించాడు. తన అనుచరురాలు శోభకు కనీసం ఉప ముఖ్యమంత్రి పదవినైనా ఇవ్వాలని యెడ్యూరప్ప కోరాడని తెలుస్తోంది.
శుక్రవారం కేంద్ర పరిశీలకులుగా రాజ్‌నాధ్ సింగ్, అరుణ్ జైట్లీలు బెంగుళూరుకు వచ్చి చర్చలు ప్రారంభించారు. పార్టీకి చెందిన ఎం.ఎల్.ఎ ల అభిప్రాయాలను తీసుకొని బి.జె.పి లెజిస్లేచర్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసి నూతన ముఖ్యమంత్రిని ఎన్నిక చేయడానికి ప్రయత్నించారు. శాసన సభా పక్ష సమావేశం జరగవలసిన సమయం పలుమార్లు వాయిదాపడి చివరికి నిరవధికంగా వాయిదా పడింది. ఎం.ఎల్.ఎల లోని ఒక సెక్షన్ కేంద్ర పరిశీలకులను కలవగా, మెజారిటీ సభ్యులు యెడ్యూరప్ప అధికారిక నివాసం వద్ద సమావేశం అయ్యారు. యెడ్యూరప్పను కొనసాగించనట్లయితే ఎన్నికలు జరపాలే తప్ప మరొకరికి అధికారం అప్పగించడానికి వీల్లేదని వారు డిమాండ్ చేస్తున్నారు.
యెడ్యూరప్ప అధిష్టానాన్ని ధిక్కరించి కొత్త పార్టీ ఏర్పాటు చేయడానికి ప్రయత్నించని సంగతిని అతని అనుచరులు గుర్తు చేస్తున్నారు. బి.జె.పి అగ్ర నాయకుడు ఎల్.కె.అద్వానీ యెడ్యూరప్ప షరతుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ నిర్ణయాన్ని శిరసావహించాలనీ లేనట్లయితే ప్రభుత్వాన్ని వదులుకోవడానికైనా తాము సిద్ధమేనని ఆయన తేల్చి చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా కర్ణాటక గవర్నర్ హెచ్.ఆర్.భరద్వాజ కర్నాటకలో జరుగుతున్న పరిణామాల పట్ల ఒక నివేదిక తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రపతికీ పంపనున్నట్లు తెలుస్తోంది. గవర్నరు, అక్రమ మైనింగ్ పై సమర్పించబడిన లోకాయుక్త నివేదికను అధ్యయనం చేస్తున్నాడు. అందులోని అంశాల ఆధారంగా గవర్నరు తాను స్వయంగా మరొక సంక్షోభాన్ని కర్ణాటక ప్రభుత్వంలో సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

