భారత పత్రికలు పాకిస్ధాన్ విదేశాంగ మంత్రి హైనా రబ్బానీ ఖర్, తనను భారత పత్రికలు ‘ఫ్యాషన్ ఐకాన్’ గా అభివర్ణించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతి చోటా పేపరాజ్జీ ఎదురవుతూనే ఉంటుందనీ పత్రికలు అలా వ్యవహరించడం సరికాదని పాకిస్ధాన్ మీడియా వేసిన ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపింది. ఆ ప్రశ్న అనంతరం మరో ప్రశ్న వేయడానికి మీడియాకి అనుమతి ఇవ్వకుండా వెళ్ళిపోయేంతగా హైనా రబ్బానీ తనపై వచ్చిన ముద్ర పట్ల ఆగ్రహం చెందింది. ఇటీవల భారత పాక్ దేశాల మధ్య శాంతి చర్చల కోసం పాకిస్ధాన్ విదేశాంగ మంత్రి భారతదేశం పర్యటించిన సంగతి తెలిసిందే.
హైనా రబ్బాని పర్యటనలో ఇరు దేశాల సంబంధాలు ఏ రూపు తీసుకోనున్నాయి అన్న అంశం కంటే భారత పత్రికలు హైనా వేషధారణ పైనె అధికంగా కేంద్రీకరించినట్లుగా మీడియాయే స్వయంగా తెలియజేసుకుంది. ఆమె ధరించిన ముత్యాల నుండి, హేండ్ బ్యాగ్‌ల వరకూ వివిధ వార్తలను ఇండియా పత్రికలతో పాటు పాక్ పత్రికలు కూడా కధనాలు రాశాయి. ఆమె ఏయే సమావేశానికి ఏయే హేండ్ బ్యాగ్ తో వచ్చిందీ ఫోటోలతో కధనాలు రాశాయి.
కానీ పాకిస్ధాన్ నుండి ఆ దేశ యువ మంత్రిగా ఇండియా వచ్చిన హైనా రబ్బానీ ఒక బాధ్యత గల అధికారిగా, చర్చలు జరపనున్న ఒక ఉన్నత స్ధాయి మంత్రిగా భారత దేశ మంత్రులు, అధికారులతో ఎలా వ్యవహరించగలిగిందీ, పర్యటనలో ఆద్యంతం చర్చాంశాలపై ఆమె వ్యక్తపరిచిన కమేండ్ ఇవన్నీ గుర్తించడంలో భారత పత్రికలు విఫలమయ్యాయి. “ది హిందూ” లాంటి కొన్ని పత్రికలు గౌరవనీయమైన కధనాలు రాసినప్పటికీ అత్యధిక శాతం అందుకు భిన్నంగా రాశాయి. వీరి ధోరణిని చూసిన “వాల్‌స్ట్రీట్ జర్నల్” లాంటి విదేశీ పత్రికలు భారత, పాక్ పత్రికల ధోరణిపైనే ప్రత్యేక కధనం రాయడం గమనార్హం. హైనా ఇండియాలో అడుగుపెట్టినప్పటినుండీ ట్విట్టర్ లో అనేక వ్యాఖ్యలు ఆమెపై వెల్లువెత్తాయని వాల్‌స్ట్రిట్ జర్నల్ తెలిపింది.
భారత సినీ నటి గుల్ పనాగ్ ట్విట్టర్ లో ఇలా రాసింది “హైనా రబ్బానీ కనిపిస్తున్న విధం నాకు నచ్చింది. మూవీ స్టార్ ధరించే సన్ గ్లాసెస్ తో, తలను కప్పుకుని, బర్కిన్‌ని గట్టిగా పట్టుకుని. ఆమె బ్రిలియంట్ కూడా అయి ఉంటుంది. ఆమెకు మంచి జరగాలి” అని రాసింది. సినీ నటిగా గుల్ పనాగ్ ఇంతకంటె మెరుగైన వ్యాఖ్యానం చేయగలదని ఆశించలేము. తన పరిధిలో గౌరవంగానే గుల్ పనాగ్ వ్యాఖ్యానించిందని చెప్పుకోవచ్చు
పాకిస్ధాన్ పత్రిక ‘డెయిలీ టైమ్స్’ కి చెందిన ఆదివారం అనుబంధం “మంచి అభిరుచిని తెలిపే ఆభరణాలు, రాబర్టో కావల్లీ సన్ గ్లాస్‌లు, హెర్మెస్ బర్కిన్ బ్యాగ్, పాత ముత్యాల ఆభరణాలు, ఇవే ఖర్ అంటే” అంటూ ఘోరంగా ట్విట్టర్ లో రాసింది. తమ దేశ మంత్రిలో ఆభరణాలు తప్ప మరొకటి చూడలేని బలహీనతకు ఆ పత్రిక తప్పకుండా దోషిగా నిలబడాల్సి ఉంది. ‘ది హిందుస్ధాన్ టైమ్స్’ పత్రిక కాలమిస్టు సీమా గోస్వామి “పాకిస్ధాన్ కొత్త విదేశాంగ శాఖ మంత్రి ‘హైనా రబ్బానీ ఖర్’ పాక్ వదిలిన ‘సామూహిక విధ్వంసక మారణాయుధం’ (weapon of mass distraction) అనుకుంటా” అని రాసింది. మహిళా కాలమిస్టు అయి ఉండి కూడా పాకిస్ధాన్‌లోని మత కట్టుబాట్లను అధిగమించి, పిన్న వయసులోనే విదేశాంగ మంత్రి కాగలిగిన ఒక యువ మహిళా మంత్రిపట్ల స్పందించవలసిన తీరు ఇది కాదన్నది స్పష్టమే.
ముంబైకి చెందిన టాబ్లాయిడ్ పత్రిక ‘ముంబై మిర్రర్’, తన వార్తకు పెట్టిన హెడ్డింగ్ “భారత దేశంపై దిగిన పాకిస్ధాన్ బాంబు” (Pak Bomb Lands in India) అని. సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ కి డిప్యుటీ ఎడిటర్ గా వ్యవహరిస్తున్న ‘సాగరిక ఘోస్’ “హైనా రబ్బాని అందంగానే ఉంది. కాని పాకిస్ధాన్ దేశ పరిస్ధితి ఘోరంగా ఉండగా, హైనా ధరించిన బ్యాగ్, ఆ పరిస్ధితిని ప్రతిబింబించేదిగా లేదు. సరైన ఎన్నిక కాదు” అని విమర్శించింది. హైనా తాను అందంగా ఉందీ లేనిదీ సాగరికను అడిగిందీ లేనిదీ మనకు తెలియదు కానీ హైనా చేస్తున్న చర్చలు, ప్రకటనలపైన దృష్టి సారించే బదులు ఆమె బ్యాగ్ పై సారించాల్సిన అవసరం ఒక వార్తా సంస్ధ ఎడిటర్ కు ఏమి ఉన్నదీ తెలియజెబితే బాగుండేది.
హైనా రబ్బానిపై ఇటువంటి వ్యాఖ్యానాలు చేసినవారిలో అత్యధికులు మహిళలే కావడం ఇంకా ఆందోళన గొలిపే అంశం. పురుష మంత్రులు, అధికారులు రోజూ వస్తూ పోతూనే ఉన్నా, వారు ధరించే రిస్ట్ వాచీల ఖరీదు, మోడళ్లపై ఎప్పుడూ ఏ పత్రికా వ్యాఖ్యానించిన సంఘటన లేదు. వారు ధరించే టై కలర్, సూట్ మోడల్, షూ కంపెనీ, వాటి ధరలు ఇవన్నీ ఎన్నడూ చర్చాంశం కాలేదు. పాక్ విదేశీ మంత్రి ఒక మహిళ కావడం, అందునా ఒక యువతి మంత్రిగా రావడం వలన ఇటువంటి వికారాలన్నీ పత్రికలు ఒలకబోసుకున్నాయి. వారి దృష్టి హైనా లో రాజకీయ నాయకురాలి కంటే ఒక అందమైన యువతిని చూడడానికే ఆత్రపడింది. మళ్ళీ ఈ పత్రికలే, ఈ మహిళా విలేఖరులే మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినం రోజున మహిళ హక్కుల పరిరక్షణ గురించి పేజీలు నింపడానికి సిద్ధమవుతారు.

మహిళ, పైగా పాకిస్ధాన్ మహిళ… అందువలనే ఈ అసహ్యమైన రాతలు…………………..
agreed. Yesterday i’ve read an article by you with 13 pics of her, is there any specific reason behind that?
హైనా రబ్బాని భారత దేశాన్ని సందర్శించిన సందర్భంగా ఆమె పర్యటన ఫోటోలను ప్రచురించడం వెనక నిర్ధిష్ట కారణాలు ఉన్నాయి.
… ముస్లిం మత మౌఢ్యం ఉందనుకుంటున్న పాకిస్ధాన్‌లొ యుక్త వయసులోనే ఒక స్త్రీ మంత్రి స్ధాయికి చేరుకుందని చెప్పడం (బేనజీర్ భుట్టోకి ఉన్నట్లుగా ఈమెకు వారసత్వ అనుకూలత లేదు)
… భారత విదేశాంగ మంత్రి ఎస్.ఎం.కృష్ణ సీనియర్ మంత్రి. అయినా ఆయన వద్ద హైనా ఏమాత్రం తొట్రుపడలేదు. చాలా చొరవగా ఆయనతో వ్యవహరించిన విషయం ఫోటోల్లో వెల్లడయ్యింది.
… హైనా రబ్బానీలో వ్యక్తమయిన విశ్వాసం. చాలా కాన్ఫిడెంట్‌గా హైనా రబ్బాని కనిపించింది. చిన్న వయసులో, అదీ ఇండియాలాంటి వైరి దేశంలో అటువంటి కాన్ఫిడెన్స్ కనబరచడం ఆమె అభినందించవలసిన విషయం.
… స్వదేశీ, విదేశీ పత్రికలు చాలావరకు ఆమె అందం, ఫ్యాషన్ లపై కేంద్రీకరించాయి. అవి కాకుండా అసలు విషయాలున్నాయని చెప్పడం
మగవాడు అందంగా తయారై ఖరీదైన వాచ్‌లు, ఉంగరాలు పెట్టుకుంటే అతన్ని ఫాషన్ ఐకాన్ ఎందుకు అనుకోరు? ఆడవాళ్ళని మాత్రమే అలా అనుకోవాలా?