ఇండియా జి.డి.పి వృద్ధి రేటు Vs. ద్రవ్యోల్బణం -కార్టూన్


రెండంకెల జి.డి.పి వృద్ధి రేటు కోసం భారత ప్రభుత్వ ఆర్ధిక విధానాల రూపకర్తలు మన్మోహన్, ప్రణబ్, అహ్లూవాలియా, చిదంబరం తదితరులు కలలు కంటుండగా అధిక స్ధాయిలో కొనసాగుతున్న ద్రవ్యోల్బణం వారి కలలను కల్లలుగా మారుస్తోంది. 9 శాతం జిడిపి వృద్ధి రేటుకి మురిసిపోయే మన పాలకులు ఆహార, ఎనర్జీ ద్రవ్యోల్బణాల వలన దేశ ప్రజానీకం జీవనం దుర్భరంగా మారిందన్న సంగతిని పట్టించుకోరు. ఆర్ధిక గణాంకాలతో ఓ ఊహా ప్రపంచం నిర్మించుకుని సంతుష్టి చెందడమే తప్ప నిజ జీవితంలో అధిక ధరలకు సతమతవుతున్న కోట్లాది భారతీయుల ఆక్రందనలు వీరి చెవులకు సోకవు.

అధిక ద్రవ్యోల్బణం పాలకుల జిడిపి వృద్ధి రేటు కలలను కూడా ఛిద్రం చేస్తోంది. ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి ఆర్.బి.ఐ వడ్డీ రేట్లు పెంచుతూ పోతోంది. దానితో వాణిజ్య బ్యాంకుల వడ్డీ రేట్లు కూడా పెరిగి కార్పొరేట్లకు పెట్టుబడుల లభ్యత ఖరీదుగా మారించి. ఫలితంగా బ్యాంకుల నుండి రుణాలు తీసుకోవడం తగ్గిపోయి, ఆ ప్రభావం ఆర్ధిక వ్యవస్ధలోని ఉత్పత్తి కార్యకలాపాలపై ప్రతికూలంగా పడుతోంది. దాని ఫలితమే ఆర్ధిక వ్యవస్ధ వృద్ధి రేటు నెమ్మదించడం. జి.డి.పి వృద్ధిరేటుకు ఆటంకంగా మారిన ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి వడ్డీ రేట్లు పెంచుతుంటే, దాని వలన కూడా ఆర్ధిక వృద్ధి దెబ్బతినడం మన పాలకులు ఎదుర్కొంటున్న డబుల్ డోస్.

Growth and Inflation

కార్టూనిస్టు: పరేష్, దుబాయ్, ది ఖలీజ్ టైమ్స్

వ్యాఖ్యానించండి