అమెరికా ఆర్ధిక వృద్ధిలో తగ్గుదల అనుకున్నదానికంటే ఎక్కువగా ఉందని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రెండవ క్వార్టర్‌లో (ఏప్రిల్ నుండి జూన్ 2011 వరకు) అమెరికా ఆర్ధిక వ్యవస్ధ 1.3 శాతం మాత్రమే వృద్ధి చెందింది. ఇది కూడా వార్షిక రేటు మాత్రమే. క్వార్టరులో చూస్తే 0.35 శాతమే అమెరికా ఆర్ధిక వ్యవస్ధ రెండో క్వార్టర్ లో వృద్ధి చెందింది. ఇంకా ఘోరం ఏమిటంటే, మొదటి క్వార్టర్ లో (జనవరి నుండి మార్చి 2011 వరకు) అమెరికా ఆర్ధిక వృద్ధి ఇప్పటివరకు భావిస్తున్నట్లు 1.9 శాతం కాకుండా 0.4 శాతం వార్షిక రేటుతో మాత్రమే వృద్ధి చెందిందని కామర్స్ డిపార్ట్‌మెంట్ వెల్లడించిన గణాంకాలు తెలుపుతున్నాయి.
ఆర్ధిక బలహీనతను సూచిస్తున్న ఈ గణాంకాలు, అప్పు పరిమితిని పెంచుకోవడానికి మల్లగుల్లాలు పడుతున్న అమెరికా కాంగ్రెస్, సెనేట్ లపై మరింత ఒత్తిడి తేనున్నాయి. ఆర్ధిక వృద్ధి నెమ్మదించినట్లయితే బడ్జెట్ లోటు తగ్గించడం మరింత కష్ట తరంగా మారుతుంది. ఆగస్టు లోగా అప్పు పరిమితిని పెంచకపోయినట్లయితే అమెరికా ఆర్ధిక వ్యవస్ధ అప్పు చెల్లింపులు చేయలేక డిఫాల్ట్ అయ్యి అపకీర్తిని మూటగట్టుకుంటుంది. అది అంతటితో ఆగితే ఫర్వాలేదు కానీ, అటువంటి అపకీర్తి మార్కెట్లలో విశ్వాసాన్ని నశింపజేసి మరొక సారి క్రెడిట్ క్రంచ్ ఏర్పడడానికి, తద్వారా అర్ధిక మాంద్యంలోకి దిగజారడానికి అవకాశాలు ఏర్పడతాయి.
కాంగ్రెస్, సెనేట్ లు త్వరగా ఒక ఒప్పందానికి రావాలని ఒబామా కోరుతున్నాడు. “ఈ సంక్షోభం నుండి బైటికి రావడానికి మనకు అనేక మార్గాలున్నాయి. కాని మనకున్న సమయం దాదాపుగా అయిపోవచ్చింది. ఒక ఒప్పందానికి రాకపోతే దేశం AAA క్రెడిట్ రేటింగ్ ను కోల్పోవలసి ఉంటుంది. అది క్షమించరానిది” అని ఒబామా కాంగ్రెస్, సెనేట్ సభ్యులకు హిత బోధ చేశాడు. ఆర్ధిక గణాంకాలను రివైజ్ చేసిన అనంతరం అమెరికా జిడిపి మొదటి క్వార్టర్లో 0.1 శాతం (వార్షిక రేటు0.4 శాతం), రెండో క్వార్టర్ లో 0.3 శాతం (వార్షిక రేటు 1.2 శాతం) పెరిగినట్లుగా స్పష్టమయ్యింది.
వినియోగదారులు సరుకుల కొనుగోలు బాగా తగ్గించడంతో రెండవ క్వార్టర్ లో అనుకున్నదాని కంటే ఘోరంగా జిడిపి వృద్ధి పడిపోయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే వినియోగదారులు సరుకులను కొనుగోలు చేయకపోవడానికి వారు వినియోగదారుల్లో విశ్వాసం సన్నగిల్లడంతో ముడిపెడుతున్నారు. విశ్వాసం సన్నగిల్లినంత మాత్రాన వినియోగదారులు తమ అవసరాలను తీర్చుకోవడం మానెయ్య బోరు. వారికి ఎదురవుతున్న ప్రధాన అడ్డంకి వారి కొనుగోలు శక్తి పడిపోవడమే.
నిరుద్యోగం అధికారిక లెక్కల ప్రకారమే 9 శాతానికి పైగా నమోదయ్యింది. అనేక మంది ఉద్యోగాలు దొరకవన్న నిర్ధారణకి వచ్చి అందుకోసం ప్రయత్నాలు మానేయడంతో వారి సంఖ్య లెక్కలోకి రావడం లేదు. అందువలన వాస్తవ నిరుద్యోగం అంతకు రెట్టింపు ఉండగలదని అనేక మంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇవన్నీ పరిగణించినపుడు సరుకుల కొనుగోలు తగ్గడానికి గల అసలు కారణాలపై అవగాహన ఏర్పడుతుంది.
అమెరికా ఆర్ధిక వృద్ధిలో తగ్గుదల నిజానికీ గత సంవత్సరంలోనే ప్రారంభమయ్యింది. గత సంవత్సరం చివరి క్వార్టర్ లో ఆర్ధిక వృద్ధి రేటు గతంలో భావించినట్లుగా 3.1 శాతం కాక 2.3 శాతం మాత్రమేనని కూడా తాజా గణాంకాల్లో స్పష్టం అయ్యింది. ఈ సంవత్సరం రెండవ అర్ధ భాగంలోనైనా ఆర్ధిక వ్యవస్ద వేగాన్ని పుంజుకుంటుందన్న సూచనలు కూడా కనిపించడం లేదని ఆర్ధిక విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రతి జులై నెలలోనూ కామర్స్ విభాగం సమీక్షా నివేదికలని వెలువరిస్తుంది. అందులో వార్షిక ఆర్ధిక గణాంకాలకు మరిన్ని వాస్తవ సంఖ్యలను జత చేసి అసలు గణాంకాలను పొందుపరచడానికి ప్రయత్నం చేస్తుంది. అటువంటి సమీక్షనే ఈ జులైలో కూడా అమెరికా కామర్స్ విభాగం నిర్వహించింది. దానిలో 2007-2009 కాలంలో అమెరికాలో సంభవించిన మాంద్యం (ది గ్రేట్ రిసెషన్) గతంలో అంచనా వేసినదానికంటే తీవ్రంగా ఉన్నట్లు కనుగొంది. దానితో పాటు 2010 లో జిడిపి వృద్ధి రేటు అంచనా కంటే శక్తివంతంగా ఉందని చెప్పడం కొంత ఊరట.


అమెరికాని గుడ్డిగా అనుసరించే మనకు, ముఖ్యంగా మన ప్రధాని, ప్రఖ్యాత ఆర్థిక శాస్త్రవేత్త మన్మోహన్ సింగ్ గారికి ఈ విషయం అర్థమైతే బావుణ్ణు.
ఆ ఛాన్సే లేదు, వనమాలి గారూ.