రెడ్డి బ్రదర్స్ లలో ఒకరైన కర్ణాటక రెవిన్యూ మంత్రి కరుణాకర రెడ్డి తనపైన అక్రమ మైనింగ్ ఆరోపణలు చేసినందుకు లోకాయుక్త జస్టిస్ సంతోష్ హెగ్డె బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు. తనపైన లోకాయుక్త చేసిన ఆరోపణల్లో వాస్తవం లేనందున క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశాడు ఓబులాపురం మైనింగ్ కంపెనీ డైకెక్టరుగా తాను 2004 లోనే రిటైర్ అయ్యాననీ, ఆ మేరకు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ వద్ద రికార్డులు కూడా ఉన్నాయనీ కరుణాకర రెడ్డి తెలిపాడు.
లోకాయుక్త నివేదికలోని 8వ ఛాప్టర్‌లో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని కరుణాకర్ రెడ్డి అన్నాడు. ఆధారాలేవీ లేకుండా చేసిన ఈ ఆరోపణలు తనను చాలా బాధించాయని కరుణాకర్ తెలిపాడు. “నాకు కంపెనీతో ఎటువంటి సంబంధాలు లేవు. నివేదికలో తన పేరు ప్రస్తావించినందున రాష్ట్రానికి తప్పుడు సందేశం అందినట్లయ్యింది” అని ఆయన తెలిపాడు. సాధారణ వ్యక్తి గానీ, రాజకీయ నాయకుడు గానీ తనపై ఆరోపణలు చేసినట్లయితే వారికి సమాచారం అందుబాడులో లేదు కాబట్టి తప్పుడు ఆరోపణలు చేసినట్లు భావించవచ్చనీ, లోకాయుక్త లాంటి బాధ్యత గల సంస్ధ నివేదికను సపర్పించడానికి ముందు జాగ్రత్తగా డాక్యుమెంట్లను పరీక్షించి ఉండవలసిందని ఆయన అన్నాడు.
తనకు వ్యతిరేకంగా డాక్యుమెంట్లు ఉన్నట్లయితే కనీసం తనకు వివరణ ఇచ్చే అవకాశం ఇచ్చి ఉండవలసిందనీ, అది చేయకుండా లోకాయుక్త రాష్ట్రాన్ని, దేశాన్నీ తప్పుదారి పట్టించి తనను బాధపోట్టాడని కరుణాకర రెడ్డి ఆరోపించాడు. “ఏ చెడ్డ ఉద్దేశ్యంతో ఈ నివేదికను తయారు చేశారు నాకు తెలియదు” అని ఆయన అన్నాడు.
లోకాయుక్త సమాధానం
కరుణాకర రెడ్డి ఆరోపణలకు లోకాయుక్త సంతోష్ హెగ్డె సమాధానం చెప్పాడు. మంత్రి నుంది తనకు లేఖ అందినట్లయితే సాక్ష్యాలను తెలియజేస్తూ తాను స్పందిస్తూ ప్రత్యుత్తరం రాస్తానని సంతోష్ హెగ్డె తెలిపాడు. ఆయన ఫుల్ టైమ్ డైరెక్టర్. అతను ఎప్పుడు రాజీనామా చేశాడో కూడా మాకు తెలుసు. చట్ట వ్యతిరేకత ఉంది. ఆయన చట్ట వ్యతిరేకతకు ఆవల లేడు. ఆయనను నోటీసు ఇవ్వనివ్వండి. సమాధానం చెబుతాను. అని హెగ్డె అన్నాడు.
వ్యక్తిగతంగా దాడి చేయడం ద్వారా నిజాయితీగా పని చేసే వాళ్ళను బెదరగొట్టి లొంగదీసుకోవలనుకోవడం అవినీతి మాఫియా లక్షణం. పబ్లిక్ సర్వెంట్‌గా ఉంటూ మంత్రిత్వం వెలగబెడుతున్నందున హెగ్డేను అవమానించడానికి తన మాఫియా స్వరూపాన్ని పూర్తిగా బైట పెట్టలేకపోతున్నారు గానీ లేనట్లయితే తమ నిజస్వరూపం చూపడానికి మాఫియాకి పెద్దగా అభ్యంతరాలుండవు. లోకాయుక్త కోరినట్లు ఆయనకి లేఖ రాసి వివరాలు తెప్పించుకుని ఆ తర్వాత స్పందిస్తే కరుణాకర రెడ్డి ఆరోఫణలకు విశ్వసనీయత ఉంటుంది.
