సొంత ‘లోక్‌పాల్ డ్రాఫ్టు’ ను ఆమోదించిన కేంద్ర కేబినెట్, తిరస్కరించిన అన్నా హజారే బృందం


కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులు తయారు చేసిన లోక్ పాల్ డ్రాఫ్టును కేంద్ర ప్రభుత్వ కేబినెట్ గురువారం ఆమోదించింది. అన్నా హజారే నేతృత్వంలో పౌర సమాజ నాయకులు ఉద్యమం చేపట్టిన తర్వాత వారి డిమాండ్ మేరకు లోక్ పాల్ చట్టాని తెస్తామని హామీ ఇచ్చి ఆందోళన విరమింపజేసిన కేంద్ర ప్రభుత్వం మూడు నెలల అనంతరం లోక్ పాల్ చట్టం తెచ్చే వైపుగా మొదటి అడుగు వేసింది. అన్నా హజారే బృందం తయారు చేసిన జన్‌లోక్ పాల్ బిల్లులో సూచించిన 40 సూత్రాల్లో 34 సూత్రాలను కేబినెట్ ఆమోదించిన లోక్‌పాల్ బిల్లులో పొందుపరిచామని కేంద్ర న్యాయశాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్  చెబుతున్నప్పటికీ హజారే నాయకత్వంలోని పౌరసమాజ కార్యకర్తలు కేబినెట్ ఆమోదించిన లోక్‌పాల్ బిల్లును తమ అంచనాలకు తగినవిధంగా లేదని తిరస్కరించారు. ఇక అన్నా హజారే ప్రకటించిన మేరకు ఆగస్టు 16 తేదినుండి శక్తివంతమైన లోక్‌పాల్ బిల్లు కోసం ఆమరణ నిరాహార దీక్ష జరగడం తధ్యంలా కనిపిస్తోంది.

కేంద్ర మంత్రులు చెబుతూ వచ్చినట్లుగా ప్రధాని పదవిని లోక్‌పాల్ పరిధిలోకి తేవడానికి కేబినెట్ ఆమోదించిన బిల్లులో అవకాశాలు లేవు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా లోక్‌పాల్ పరిధిలోకి రారు. ప్రధాని పదవిలో ఉన్నంతవరకూ వారిపై లోక్‌పాల్ విచారించజాలదు. లోక్‌పాల్‌కి ప్రాసిక్యూట్ చేసి అధికారం లేదు. కేవలం విచారణ జరిపి తీసుకోదగిన చర్యలను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి సిఫారసు చేసే అధికారం మాత్రమే ఉంటుంది. ప్రధాని కాకుండా ఇతర కేంద్ర మంత్రులు, గ్రూప్-ఎ అధికారులపై వచ్చే ఫిర్యాదులను, లోక్‌పాల్ ఎవరి అనుమతి లేకుండానే విచారించవచ్చు. కేబినెట్ సమావేశంలో ప్రధాని పదవిని కూడా లోక్‌పాల్ పరిధిలోకి తేవాలని ప్రధాని మన్మోహన్ కోరినప్పటికీ ఇతర సభ్యులు అంగీకరించిలేదని సమాచార ప్రసార శాఖ మంత్రి అంబికా సోనీ తెలిపారు. ప్రభుత్వం స్ధిరత్వంపైన ప్రభావం పడకుండా ఉండడానికి ప్రధానిని లోక్‌పాల్ నుండి మినహాయించామని ఆమె తెలిపింది. ఆగస్టు 1 నుండి ప్రారంభమయ్యే వర్షాకాల సమావేశాల్లో మొదటి రెండు రోజుల్లో లోక్‌పాల్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నామని ఆమె తెలిపింది.

లోక్‌పాల్ వ్యవస్ధలో ఒక ఛైర్‌పర్సన్ కాక ఎనిమిది మంది సభ్యులు ఉంటారు. వారిలో సగం మంది న్యాయవవస్ధ నుండి నియమితులవుతారు. సొంత ప్రాసిక్యూషన్ వ్యవస్ధ, పరిశోధనా విభాగం లోక్ పాల్ కలిగి ఉంటారు. అవసరమైన అధికారులు, సిబ్బందిని సమకూరుస్తారు. సిటింగ్ లేదా రిటైర్డ్ ఛీఫ్ జస్టిస్ లోక్ పాల్ ఛైర్‌పర్సన్‌గా నియమితులవుతారు. సభ్యులుగా మాజీ లేదా సిటింగ్ సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, హైకోర్టుల ప్రధాన న్యాయ మూర్తులు నియమితులు కావడానికి అర్హులు. మచ్చ లేని సమగ్రత ఉండి పాతిక సంవత్సరాల పాలనా అనుభవం ఉన్నవారు, అవినీతి, విజిలెన్స్ కేసులతో అనుభవం ఉన్నవారు లోక్ పాల్ సభ్యులుగా నియమితులవుతారు. డ్రాఫ్టు తయారిలో బి.జె.పి నాయకుడు అరుణ్ జైట్లీని, ఇతర పౌర సమాజ నాయకులనూ సంప్రదించామని ఖుర్షీద్ తెలిపాడు. ఇతర అంశాలు ఇంకా ఇలా ఉన్నాయి:

  • ప్రధానిపై వచ్చే అవినీతి తదితర ఆరోపణలను ఆయన పదవిలో లేనప్పుడు మాత్రమే విచారిస్తారు.
  • మంత్రులు, ఎం.పిలు, మరే ఇతర సంస్ధ, బోర్డు, అధారిటీ, కార్పొరేషన్, ట్రస్టు, సొసైటీ లేదా పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటైన స్వయం ప్రతిపత్తి గల సంస్ధ మొ.న వాటిలో పనిచేసే గ్రూప్-ఎ అధికారులు లేదా తత్సమాన మైన హోదా గల అధికారులపై వచ్చే అవినీతి ఆరోపణలను లోక్ పాల్ విచారిస్తుంది.
  • ప్రాసిక్యూషన్‌కి ప్రతిపాదించిన కేసులలో కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973 లోని సెక్షన్ 197 ప్రకారం గానీ, అవినీతి నిరోధక చట్టం 1988 లోని సెక్షన్ 19 ప్రకారంగానీ లోక్ పాల్ ఎవరి అనుమతిగానీ, ఆమోదంగానీ తీసుకోనవసరం లేదు.
  • అవినీతికి పాల్పడిన పబ్లిక్ సర్వెంట్లు అవినీతి మార్గాల్లో సంపాదించిన ఆస్తులను జప్తు చేసే అధికారం లోక్ పాల్ కి ఉంటుంది.
  • అవినీతి కేసులకు అవి రిజిస్టర్ అయినప్పటి నుండీ ఏడు సంవత్సరాల కాల పరిమితి ఉంటుంది. అవినీతి నిరోధక చట్టం కింద ప్రస్తుతం కాల పరిమితి లేదు. దీనిద్వారా బాధ్యత, పారదర్శకతలు ఉండేలా జాగ్రత్త తీసుకున్నామని, ఇది ముఖ్యమైనదనీ న్యాయ మంత్రి ఖుర్షీద్ చెపుతున్నాడు. “పరిమితి లేని రక్షణ ఇవ్వడం మేం కోరుకోవడం లేదు. అలాగే వారిని (అవినీతిపరులను!) తోడేళ్లకు విసరడం కూడా మేం కోరుకోవడం లేదు” అని ఖుర్షీద్ అన్నాడు. (తోడేళ్లను తోడేళ్లకు విసిరేస్తే తలెత్తేది మిత్రత్వమే గానీ ప్రమాదం ఏం ఉంటుంది? ఖుర్షీద్ వివరించి ఉంటే బాగుండేది)
  • ప్రధాని నాయకత్వంలోని తొమ్మిదిమంది సభ్యులతో కూడిన సెలెక్షన్ ప్యానెల్ లోక్‌పాల్‌ని ఎన్నుకోవడానికి నియమిస్తారు. వీరిలో లోక్ సభ స్పీకర్, లోక్‌సభ, రాజ్య సభలలోని ప్రతిపక్ష నాయకులు, ఒక మంత్రి, ప్రఖ్యాత న్యాయ కోవిదులు ఉంటారు. (ప్రజలకు ముఖ్యమైన అంశం ఇదే. లోక్ పాల్‌ని మళ్ళీ ప్రధాని, ప్రతిపక్ష, పాలకపక్ష రాజకీయ నాయకులు, వారికి నచ్చిన న్యాయ కోవిదులు కలిసి ఎన్నుకుంటారన్నమాట! అవినీతికి పాల్పడడానికి అవకాశం ఉన్నవారే తమను విచారించే లోక్‌పాల్‌ను ఎన్నుకుంటారన్నమాట! ఎప్పుడో సంతోష్ హెగ్డె లాంటివారో, లేదా ప్రస్తుత ఛీఫ్ జస్టిస్ కపాడియా లాంటివారో పొరపాటున లోక్ పాల్ గా నియమితులయితే తప్ప లోక్ పాల్ వ్యవస్ధను నిర్వీర్యం చేసే అంశం ప్రధానంగా ఇదే)
  • లోక్‌పాల్ పదవీ కాలం 5 సంవత్సరాలు. విచారించడమే తప్ప ప్రాసిక్యూట్ చేసే అధికారం లోక్ పాల్ కి లేదు. పాసిక్యూట్ చేయమని సుప్రీం కోర్టుకి సిఫారసు చేయవచ్చు.
  • సుప్రీం కోర్టుకు రిఫర్ చేస్తూ దేశ అధ్యక్షుడు లోక్‌పాల్‌ని అవసరమైతే తొలగించగలరు.

వ్యాఖ్యానించండి