అక్రమ మైనింగ్‌ను అనుమతించి ముడుపులు అంగీకరించిన కర్ణాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్ప ఎట్టకేలకు రాజీనామా చేయనున్నాడు. అధికారం చేపట్టినప్పటినుండి నిరంతరం గండాలతో నెట్టుకుంటూ వచ్చిన బి.ఎస్.యెడ్యూరప్ప ముఖ్యమంత్రిత్వం ముగింపుకు వచ్చింది. సి.ఎం నేరుగా అక్రమ మైనింగ్ కుంభకోణంలో భాగం పంచుకున్నాడని లోకాయుక్త జస్టిస్ సంతోష్ హెగ్డె నివేదిక స్పష్టం చేయడంతో బి.జె.పి నాయకత్వం యెడ్యూరప్పను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని గురువారం ఆదేశించింది. లోకాయుక్త నివేదిక దృష్ట్యా కర్ణాటకలో నాయకత్వాన్ని మార్చాలని నిర్ణయించి ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
భారత దేశంలో కేంద్రంలోని ప్రధాని, మంత్రులతో పాటు ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు అక్రమాలకు పాల్పడవచ్చుగానీ బైటపడకూడదు. అక్రమాలకు పాల్పడినట్లు ఎన్ని ఆరోపణలైనా రావచ్చు, దేశం మొత్తం వేలెత్తి చూపవచ్చు, కానీ దర్యాప్తు చేసేవారిని మేనేజ్ చేసుకోలేకపోతే రాజీనామాల వంటి స్వల్ప శిక్షలు తప్పవు. లోకాయుక్త నివేదికపై కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏమి చర్యలు తీసుకోనున్నాయో చూడవలసి ఉంది. ప్రభుత్వాలు ఏమైనా చర్యలు తీసుకుంటాయన్న నమ్మకం తనకు లేదని లోకాయుక్త ఇప్పటికే తెలిపారు. ఏమన్నా చర్యలు తీసుకుంటే సుప్రీం కోర్టు మాత్రమే తీసుకోవాలని ఆయన రెండు రోజుల క్రితం తెలిపారు.
68 ఏళ్ళ యెడ్యూరప్ప దక్షిణ భారత దేశంలోని ఒక రాష్ట్రంలో బి.జె.పిని ప్రధమంగా అధికారంలొకి తెచ్చిన వ్యక్తి. బి.జె.పి పార్లమెంటరీ బోర్డు గురువారం సమావేశమై కర్ణాటకలో నాయకత్వ మార్పు రావాలని ఏకగ్రీవంగా నిర్ణయించి, యెడ్యూరప్పను వెంటనే రాజీనామా చేయాలని ఆదేశించింది. నితిన్ గడ్కారి నివాసంలో జరిగిన బి.జె.పి పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం బి.జె.పి ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ ఈ మేరకు విలేఖరులకు తెలిపాడు. బి.జె.పిలో అత్యున్నత నిర్ణాయక సంస్ధ ఐన పార్లమెంటరీ బోర్డు, కర్ణాటకలో యెడ్యూరప్ప స్ధానంలో ముఖ్యమంత్రిగా మరొకరిని ఎన్నుకోవడానికి సీనియర్ నాయకులు రాజ్‌నాధ్ సింగ్, అరుణ్ జైట్లీలను పరిశీలకులుగా పంపించాలని నిర్ణయించింది. మే 2008లో ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన యెడ్యూరప్ప 27 నెలల అనంతరం పదవికి రాజీనామా చేయనున్నాడు.
పార్లమెంటరీ బోర్డు సమావేశానికి పార్టీ అగ్ర నాయకత్వం ఎల్.కె.అద్వాని, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, రాజ్‌నాధ్ సింగ్, వెంకయ్య నాయుడు తదితరులు హాజరయ్యారు. బోర్డు నిర్ణయాన్ని యెడ్యూరప్పకి తెలియజేశామని బి.జె.పి ప్రతినిధి నిర్మలా సీతారం తెలిపారు. కర్ణాటక పార్టీలో తిరుగుబాటు రావచ్చన్న సూచనను ఆమె తిరస్కరించారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని యెడ్యూరప్ప పార్టీ అధ్యక్షుడుకి ఇప్పటికే తెలిపారని ఆమె చెప్పారు.

Hi we seen your blog it’s quite interesting please visit our blog kalahastikalavahini.blogspot.com it also matter something – Thank you