2జి స్పెక్ట్రం కేటాయింపుల కోసం ప్రధాని మన్మోహన్ మంత్రుల బృందాన్ని ఎందుకు నియమించలేదని ఎ.రాజా ప్రశ్నించాడు. హోం మంత్రి చిదంబరాన్ని ఈ కేసులో సాక్షిగా పిలవాలని వాదించాడు. “ప్రధాన మంత్రి నాకంటే సీనియర్. ఆయన మంత్రుల బృందాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదు? మత్రుల బృందాన్ని ఏర్పాటు చేయడాన్ని ఆయన విస్మరించాడు. అది కుట్ర అవుతుందా?” అని రాజా తరపు న్యాయవాది సి.బి.ఐ స్పెషల్ కోర్టులో వాదించాడు. జస్టిస్ ఒ.పి.సైని జడ్జిగా ఈ కోర్టులో వ్యవహరిస్తున్నాడు. స్పెక్ట్రం కేటాయింపు సమయంలో ఆర్ధిక మంత్రిగా ఉన్న పి.చిదంబరంను కూడా సాక్షిగా పిలవాలని ఆయన కోరాడు.
“అప్పుడు ఆర్ధిక మంత్రిగా ఉన్న పి.చిదంబరం స్వాన్, యునిటెక్ కంపెనీలలో వాటాలు అమ్ముకోవడానికి అనుమతిని ఇచ్చాడు. కనుక ఆయన కోర్టుకు సాక్షిగా హాజరు కావలసిన అవసరం ఉంది. హోమంత్రి ఈ కేసులో ఏదో ఒక పక్షంవైపు కోర్టుకు సాక్షిగా హాజరు కావాలి. అన్ని నిర్ణయాలు హోమంత్రికి తెలిసే జరుగుతాయి కనుక ఆయన ఈ కేసులో సాక్షిగా హాజరు కావాలి” అని రాజా తరపు లాయర్ వాదించాడు. పూర్వాశ్రమంలో స్వయంగా లాయరుగా పనిచేసిన ఎ.రాజా ఒక దశలో తన లాయరును పక్కకు తప్పించి తానే వాదించాడు.
తాను కుట్రలో దోషినైతే మాజీ టెలికం మంత్రి అరుణ్ శౌరి కూడా దోషేనని ఎ.రాజా వాదించాడు. అదే సమయంలో తనకు ఎవరిపైనా నేరారోపణ చేయాలన్న ఉద్దేశ్యం లేదని రాజా పేర్కొన్నాడు. ఆయన లాయర్ సుశీల్ కుమార్ కూడా అదే చెప్పాడు. సోమవారం సుశీల్ కుమార్, ప్రధాన మంత్రి సమక్షంలో మాజీ ఆర్ధిక మంత్రి పి.చిదంబరం స్పెక్ట్రం వాటాల అమ్మకం కొనుగోళ్ళను ఆమోదించాడని పేర్కొన్న సంగతి విదితమే. ఐతే, కాంగ్రెస్ పార్టీ, కోర్టులో ఒక నిందితుడు చేసే వాదన సాక్ష్యంగా పరిగణింపజాలమని పేర్కొంది. మరోవైపు పి.చిదంబరం ప్రధాని సమక్షంలో స్వాన్, యూనిటెక్ షేర్ల అమ్మకానికి ఆమోదం తెలిపానని, అది లైసెన్సుల అమ్మకం కిందికి రాదని ప్రధాని వివరించింది వాస్తవమేననీ అంగీకరించాడు.
కేసులో లిటిగెంటు వాదనలు చేయడం ద్వారా, మంత్రివర్గ ఉమ్మడి బాధ్యతను తెరపైకి తీసుకురావడం ద్వారా రాజా తన డిఫెన్సు నడపడానికి నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. ప్రధానిని ఇరికిమ్చడం లేదని వాదిస్తూనే తప్పు జరుగుతున్నదని భావిస్తే ఆయన చూస్తూ ఎందుకు ఉండవలసి వచ్చిందని వాదిస్తున్నాడు. తన వాదన నేరారోపణ చేయడం కాదని తనను తాను డిఫెండ్ చేసుకుంటున్నానని కూడా ఎ.రాజా చెబుతుండడం గమనార్హం.
డి.ఎం.కె మంత్రుల అవినీతి నిర్ణయాలను ప్రధాన మంత్రి చూస్తూ ఊరకున్నాడన్నది వాస్తవం. అయితే సంకీర్ణ ప్రభుత్వంలో ఉండే బలహీనతల రీత్యా అప్పట్లో ఏమీ చేయలేకపోయారన్నది కాంగ్రెస్ వాదన చేయదలుచుకున్నా అది కోర్టులో పనికిరాదు కనుక ప్రధాని, చిదంబరంలు కోర్టు మెట్లు ఎక్కనున్నారో లేదో చూడవలసి ఉంది.
