ఆర్.బి.ఐ జులై ద్రవ్య విధాన సమీక్షలో భాగంగా పదకొండవసారి తన వడ్డీ రేట్లు పెంచింది. ఊహించినదాని కంటె ఎక్కువగా పెంచడంతో షేర్ మార్కెట్లు బేజారెత్తాయి. అమ్మకాల ఒత్తిడికి గురై సెన్సెక్స్ సూచి 1.87 శాతం పతనమైంది. అమెరికా సమయానికి అప్పు చెల్లింపులు చేయలేకపోవచ్చన్న అనుమానాలు ఒకవైపు పెరుగుతుండగా ఆర్.బి.ఐ వడ్డీ రేట్ల పెంపుదలలో తీవ్రతను చూపడంతో షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. 25 బేసిస్ పాయింట్లు పెంచవచ్చని అందరూ అంచనా వేస్తుండగా ఆర్.బి.ఐ గవర్నరు మరొకసారి మార్కెట్ అంచనాలకు అందకుండా 50 బేసిస్ పాయింట్లు పెంచి ప్రజలకు అప్పులను మరింత ప్రియం చేశాడు. దానికి ఆయన చెబుతున్న ఒకే ఒక్క కారణం ద్రవ్యోల్బణం. ద్రవ్యోల్బణంతో అధికధరలు ఒకవైపు బాదుతుంటే, అప్పులు కూడా ప్రియం చేస్తూ వడ్డీ రేట్లు పెంచడం తడిసి మోపెడయినట్లయ్యింది.
రెపో రేటును 7.5 శాతం నుండి 8 శాతం పెంచగా, రివర్స్ రెపో రేటును 6.5 శాతం నుండి 7 శాతానికి పెంచాడు. వాణిజ్య బ్యాంకులు ఆర్.బి.ఐ వద్ద తీసుకునే అప్పుపై వసూలు చేసే వడ్డీ రేటును రెపో రేటుగానూ, వాణిజ్య బ్యాంకులు, ఆర్.బి.ఐ వద్ద డబ్బు డిపాజిట్ చేసినప్పుడు చెల్లించే వడ్డీ రేటును రివర్స్ రెపో రేటుగానూ పిలుస్తారు. రెపో, రివర్స్ రెపోల పెంపుతో వ్యక్తిగత, కార్పొరేటు లోన్లకు వడ్డీ రేట్లను వాణిజ్య బ్యాంకులు మరొకసారి పెంచనున్నాయి. వ్యక్తిగత, కార్పొరేట్ అప్పులు ప్రియం అయ్యి, పెట్టుబడులకు రుణం లభ్యత కష్టం అవుతుందన్న అంచనాతో షేర్ మార్కెట్లు తీవ్రంగా నష్టపోయాయి. సెన్సెక్స్ 353.07 పాయింట్లు (1.87 శాతం) నష్టపోయి 18518.22 వద్ద ముగియగా, నిఫ్టీ 105.45 పాయింట్లు (1.86 శాతం) నష్టపోయి 5574.85 వద్ద క్లోజయ్యింది.
“ఆర్ధిక వృద్ధి రేటులో తగ్గుదల కనపడుతున్నప్పటికీ ద్రవ్యోల్బణం ఒత్తిడి బలంగా ఉంది. మేక్రో ఎకనమిక్ విధానాలకు ద్రవ్యోల్బణం సమస్యగా కొనసాగుతోంది. ఈ పరిశీలన ఆధారంగా ద్రవ్య విధాన రెపోరేటు, రివర్స్ రెపోరేట్లను 50 బేసిస్ పాయింట్ల చొప్పున పెంచడానికి నిర్ణయించాము. పెంపుదల వెంటనే అమలు లోకి వస్తుంది” అని ఆర్.బి.ఐ గవర్నరు దువ్వూరి సుబ్బారావు ద్రవ్యవిధాన సమీక్షను ప్రకటిస్తూ తెలిపాడు. మార్చి 2010 తర్వాత ఆర్.బి.ఐ తన వడ్డీ రేట్లను పెంచడం ఇది 11వ సారి. గత మూడు నెలల్లొ ఇది మూడోసారి. మే నెలలో 50 బేసిస్ పాయింట్లు, జూన్‌లో 25 బేసిస్ పాయింట్లు పెంచిన ఆర్.బి.ఐ మళ్ళీ ఇపుడు 50 బేసిస్ పాయింట్లు పెంచడంతో వ్యక్తిగత అప్పులపై వసూలు చేసే వడ్డీ రేట్లను బ్యాంకులు పెంచుతాయి. మరే దేశంలోనూ సెంట్రల్ బ్యాంకులు ఇంత తీవ్ర స్ధాయిలో వడ్డీ రేట్లు పెంచలేదు. ఆర్ధిక వృద్ధి రేటు పది శాతం వరకూ నమోదు చేస్తున్న చైనా సైతం ఆర్ధిక సంక్షోభం అనంతరం ఇప్పటికీ మూడు సార్లే వడ్డీ రేటు పెంచింది.
ఆర్ధిక వృద్ధి (జి.డి.పి వృద్ధి రేటు) ఉధృతంగా సాగుతున్నపుడు డబ్బు చెలామణి ఆర్ధిక వ్యవస్ధలో పెరిగిపోయి ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది. కానీ ఇండియా జి.డి.పి వృద్ధి రేటు గత రెండు మూడు నెలలుగా తగ్గిపోయింది. ఐనప్పటికీ ద్రవ్యోల్బణం కట్టడి చేయడంలో ఆర్.బి.ఐ, ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయి. దేశంలో ద్రవ్య చెలామణి పై ప్రభుత్వమూ, ఆర్.బి.ఐ లకు నియంత్రణ లేదని దీనితో అర్ధమవుతోంది. దేశంలో విచ్చలవిడిగా చెలామణి అవుతున్న నల్లడబ్బు, దొంగడబ్బులను ప్రభుత్వాలు నియంత్రించ లేకపోవడమే దీనికి కారణంగా చెప్పవచ్చు. దేశంలో నోట్లు ఎంత విలువలో చెలామణిలో ఉన్నదీ ఆర్.బి.ఐ నియంత్రణలో ఉండాలి. బ్యాంకుల నిధులను నియంత్రణలో ఉంచడం ద్వారా ఆర్.బి.ఐ ఈ నియంత్రణను సాధించగలగాలి. కానీ బ్యాంకులతో సంబంధం లేకుండా చెలామణీ అయ్యేది నల్లడబ్బు. ధనికులు, కోటీశ్వరులు విలాసాలకు విస్తృతంగా ఖర్చు చేసే డబ్బులో అత్యధిక భాగం నల్లడబ్బే కావడంతో, అది ఆర్.బి.ఐ నియంత్రణలో లేని ‘డబ్బు చెలామణి’ కావడంతో ద్రవ్యోల్బణం కట్టలు తెంచుకుంటోంది. ద్రవ్యోల్బణం ఇప్పుడు అధికారికంగా 9.4 శాతం ఉందని ఆర్.బి.ఐ గవర్నర్ చెప్పాడు. అనధికారికంగా 15 శాతం వరకూ ఉంటుందని ఆర్ధిక విశ్లేషకుల అంచనా.
నల్లడబ్బును అరికట్టలేని ఆర్.బి.ఐ, ప్రభుత్వాలు అవసరాల కోసం చెలామణిలో ఉన్న డబ్బుని చెలామణినుండి తగ్గించడానికి వడ్డీ రేట్లు పెంచుతోంది. దీనితో అంతిమంగా అధికధరల వలన సామాన్యుడే బలిపశువుగా మారుతున్నాడు. నిజవేతనాలు నానాటికి కార్మికులకు, ఉద్యోగులకు తగ్గిపోతుండగా అధిక ధరలు వారిపై గొరుచుట్టుపై రోకలి పోటు అవుతున్నాయి. ద్రవ్యోల్బణాన్ని ఈ ఆర్ధిక సంవత్సరం చివరికి అంటే 31 మార్చి 2012 నాటికి 6 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆర్.బి.ఐ నమ్మకం కుదరక ఇప్పుడది 7 శాతానికి పెంచింది. లక్ష్యాన్ని చేరుకోలేక దాన్ని మరింత దగ్గరికి లాక్కొవడమన్నమాట! ఇకముందు జరిపే ద్రవ్యవిధాన సమీక్షల్లో వడ్డి రేట్ల పెంపుదల ఉండబోదని ఆర్.బి.ఐ చెప్పలేని పరిస్ధితుల్లో ఉంది.
