జులై 22 తేదీన నార్వేలో సమ్మర్ క్యాంప్ కోలాహలంలో మునిగి ఉన్న టీనేజి యువతీ యువకులు 85 మందిని ఊచకోత కోసిన ముస్లిం ద్వేషి, మితవాద క్రిస్టియన్ తీవ్రవాది ఏండర్స్ బెహ్రింగ్ బ్రీవిక్ తో ఇండియాతో గల కనెక్షన్ ఒకటి బైటపడింది. ఆందోళన పడవలసిన కనెక్షన్ కాదు గాని, అనూహ్యమైన కనెక్షన్. బ్రీవిక్ వెబ్‌సైట్ లో ఉంచిన మానిఫెస్టోలో పేర్కొన్న తీవ్రవాద సంస్ధ సభ్యులు ధరించడానికి బ్యాడ్జిని తయారు చేయడానికి ఆయన భారత దేశానికి చెందిన ఒక ముస్లిం వ్యక్తికి ఆర్డర్ ఇచ్చిన సంగతి వెల్లడయ్యింది. నార్వే రాజధాని ఓస్లో నగరంలో ప్రధాని కార్యాలయం వద్ద మొదట బాంబు పేలుళ్లకు పాల్పడి పోలీసుల దృష్టిని మళ్ళించాక బ్రీవిక్, సమీపంలో ఉన్న ఉటావో ద్వీపంలో పాలకపార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మర్ క్యాంప్‌పై దాడి చేసి విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో 85 మంది నార్వే దేశస్ధులు మరణించిన సంగతి తెలిసిందే.
ఇంటర్నెట్‌లో బ్రీవిక్ ఉంచిన 1500 పేజీల మానిఫెస్టొలోని వివరాలు వెల్లడవుతున్నకొద్దీ ఘటనకు ముందు అతని కార్యకలాపాలు తెలుస్తున్నాయి. భారత దేశంలో పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న వారణాసిలో ఒక ఆర్ట్ కంపెనీని తమ సంస్ధ బ్యాడ్జి డిజైన్ తయారు చేయడానికి బ్రీవిక్ ఎన్నుకున్నాడు. సంస్ధ పేరు ఇండియన్ ఆర్ట్ కంపెనీ. సంస్ధ అంటే పెద్ద కంపెనీ ఏమీ కాదు. వారణాసిలోని ఇరుకైన దారుల్లో ఉన్న ఓ చిన్న ఇల్లు. సాంప్రదాయక నేతపనివారికి
వారణాసి నిలయం. వేగంగా మారుతున్న ఆర్ధిక వాతావరణ పరిస్ధితుల్లో వీరి జీవనం దుర్భరంగా మారింది. మహమ్మద్ అస్లాం అన్సారి, ఇండియన్ ఆర్ట్ కంపెనీ పేరు పెట్టుకుని ఇంటర్నెట్ లో చిన్న యాడ్ ఇచ్చాడట. ఆర్డర్ ఇచ్చేవారు కోరిన డిజైన్‌లో బ్యాడ్జిలు నేసి సరఫరా చేయడం ఇతను పనిగా పెట్టుకోవాలనుకున్నాడు.
ఢిల్లీనుండి ‘ది హిందూ’ విలేఖరి ఫోన్ చేసి విచారించినప్పుడు అన్సారీ చాలా ఆశ్చర్యపోయాడు. తన కోసం ఆంగ్ల దినపత్రిక విలేఖరి ఫోన్ చేయడం ఏమిటా అని. సోమవారం ఫోన్ చేసి మాట్లాడినపుడు అన్సారి “అవును, నార్వేకి చెందిన వారి కోసం రెండు శాంపిళ్ళు తయారు చేసి ఇచ్చాను. కాని అది సంవత్సరం క్రితం” అని చెప్పాడు. అతను తయారు చేసిన బ్యాడ్జికి నార్వేలో జరిగిన హత్యాకాండకి సంబంధం ఏమిటో మొదట అతనికి బోధపడలేదు. నార్వే రాజధాని ఓస్లోలో జరిగిన ఘటనను వివరించాక షాక్‌తో పాటు ఆశ్చర్యానికి గురవ్వడం అన్సారి వంతయ్యింది. “నన్ను ఈమెయిల్‌లో సంప్రదించిన అతని పేరు కూడా నాకు గుర్తు లేదు. తాను ఇచ్చిన డిజైన్‌లో బ్యాడ్జి తయారు చేసి పంపమని నన్ను కోరాడు” అని అన్సారి తెలిపినట్లు ది హిందూ తెలిపింది.
తమ సంస్ధకు ‘జస్టిసియర్ నైట్’ (Justiciar Knight) గా బ్రీవిక్ నామకరణం చేశాడు. అమరవీరులను సూచించే ఎరుపు శిలువ పైనుండి కిందివరకు దిగేసి ఉన్న తెలుపు కపాలం నుదుటిపై కమ్యూనిజం, ఇస్లాం, నాజీయిజంలను సూచించే గుర్తులు ఉన్నదే తమ బ్యాడ్జిగా బ్రీవిక్ మేనిఫెస్టోలో అభివర్ణించాడు.
అన్సారి, అంతర్జాతీయంగా వ్యాపారం వస్తుందన్న ఆశతో తన ఇండియన్ ఆర్ట్ కంపెనీ గురించి రెండు వెబ్‌సైట్లలో ప్రకటన ఇచ్చానని తెలిపాడు. నార్వె నుండి కపాలంలోకి కత్తి దూరి ఉండే ఓక డిజైన్ తయారు చేయమని ఈ మెయిల్ వచ్చిందనీ దాని ప్రకారం రెండు శాంపిళ్ళు తయారు చేసి కొరియర్ పోస్టులో సంవత్సరం క్రితం పంపానని తెలిపాడు. వెస్ట్రన్ యూనియన్ ద్వారా కొద్దిగా డబ్బు (మానిఫేస్టోలొ 150 డాలర్లు పంపినట్లు బ్రీవిక్ రాసాడు) వచ్చిందని చెబుతూ అన్సారీ తనకు పెద్ద మొత్తంలో ఆర్డర్ వస్తుందని ఆశించానన్నాడు. కానీ మళ్ళీ సమాచారం ఏమీ రాలేదని అన్సారీ చెప్పాడు. ఇంటర్నెట్ తనకేమీ కలిసి రాలేదని అన్సారి తెలిపాడు. తన ఆదాయమే అంతంత మాత్రం ఐతే తన ఎకౌంట్ హాక్ చేశారనీ అంతటితో తన ఆశలు కూడా ఆగిపోయాయని తెలిపాడు. తన కుటుంబ మగ్గాన్ని వేరొకరికి అద్దెకు ఇస్తూ దానితోనే గడుపుతున్నానని చెప్పాడు. మీటరుకి రు.150 ఇస్తారనీ, అందులో సగం నేసినవారికి వెళ్తుందనీ మిగిలినదానితో జీవితం కష్టంగా గడుస్తోందని అన్సారి తన బతుకు కష్టం చెప్పుకున్నాడు.


