నార్వే ఊచకోత నిందితుడికి ఇంగ్లండ్‌ రైటిస్టు తీవ్రవాదులతో సంబంధాలు?!


Anders Behring Breivik arrested

Anders Behring Breivik arrested

నార్వే ఊచకోతతో యూరప్ ఉలిక్కిపడింది. తమ దేశాల్లొ రైటిస్టుల గురించి ఆరా తీయడం ప్రారంభిస్తున్నారు. నార్వే రాజధాని ఓస్లోలో జంట దాడుల్లో 92 మందిని ఊచకోత కూసిన ఏండర్స్ బెహ్రింగ్ బ్రీవిక్, తనకు ఇంగ్లండులోని రైటిస్టు తీవ్రవాద సంస్ధలతో సంబంధాలున్నాయని చెప్పడంతో స్కాట్లండ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ముఖ్యంగా “ఇంగ్లీష్ డిఫెన్సు లీగ్” (ఇ.డి.ఎల్) సంస్ధతొ తనకు గట్టి సంబంధాలున్నాయని బ్రీవిక్ తెలిపాడు. ఇ.డి.ఎల్ సంస్ధ కూడా ముస్లిం వ్యతిరేక సంస్ధ. వలసదారులను వ్యతిరేకిస్తుంది. బహుళ సంస్కృతి (మల్టి కల్చరలిజం) విధానాన్ని కూడా వ్యతిరేకిస్తుంది. బ్రీవిక్ సొంతం చేసుకున్న లక్షణాలన్నీ ఈ సంస్ధకి ఉన్నాయి.

ఇంటర్నెట్‌లో పోస్ట్ చేసిన 1500 పేజీల బ్రీవిక్ మేనిఫెస్టో లండన్ 2011 డేట్‌లైన్ తో ప్రచురించబడి ఉంది. తన అసలు పేరుకు ఆంగ్ల అనువాదం అయిన ‘ఆండ్రూ బెర్విక్’ పేరుతో ఈ డాక్యుమెంటుని బ్రీవిక్ పోస్ట్ చేశాడు. డాక్యుమెంటులో ఇంగ్లండుతో తనకు సంబంధాలున్న విషయాన్ని అనేక చోట్ల ప్రస్తావించాడు. ఇంగ్లీష్‌మేన్ ఐన రిచర్డ్ తనకు మెంటర్ గా అందులో పేర్కొన్నాడు. మధ్య యుగాలకి చెందిన క్రిస్టియన్ క్రూసేడ్లయిన ‘నైట్స్ టెంప్లార్’ (Knights Templar) కు వారసుడిగా తనను అబివర్ణించుకుంటూ లండన్‌లో ఇద్దరు ఇ.డి.ఎల్ సభ్యులు ఏప్రిల్ 2002లో నిర్వహించిన మీటింగ్‌లో తనను రిక్రూట్ చేసుకున్నారని రాసాడు. అంతే కాకుండా తన ఫేస్ బుక్ ఎకౌంట్‌లో 600 మందికి పైగా ఇ.డి.ఎల్ సబ్యులు స్నేహితులుగా ఉన్నారనీ, వారిలో చాలామందితొ మాట్లాడాననీ రాసుకున్నాడు.

“నిజానికి వారికి సంపద్వంతం కావించబడిన సైద్ధాంతిక మెటీరియల్‌ని ప్రారంభంలోనే సరఫరా చేసిన వ్యక్తుల్లో నేను ఒకరిని” అని బ్రీవిక్ మేనిఫెస్టోలో రాశాడు. వలసదారులను ఎక్కువమందిని అనుమతించి బ్రిటన్‌ను మరింత బహుళ సంస్కృతుల దేశంగా మార్చినందుకుగాను ఇంగ్లండ్ మాజీ ప్రధానులు టోనీ బ్లెయిర్, గార్డన్ బ్రౌన్ లతో పాటు ప్రిన్స్ ఛార్లెస్‌ను ‘బ్రీవిక్ మేనిఫెస్టో’లో ద్రోహులుగా అభివర్ణించాడు. బ్లెయిర్, మాజీ ఫారెన్ సెక్రటరీ జాక్ స్ట్రాలు తాము ఎక్కువమందిని వలసదారులను అనుమతించి ఇంగ్లండును బహుళజాతి సంస్కృతుల దేశంగా మార్చిన సంగతిని దాచిపెట్టారని ఆరోపించాడు. ముస్లిం తీవ్రవాదులతో కుమ్మక్కైన “వార్ క్రిమినల్స్”గా పేర్కొంటూ ఉంచిన ఫోటో గ్యాలరీలో బ్రౌన్ ఫోటోను చేర్చాడు. ‘ఆక్స్‌ఫర్డ్ సెంటర్ ఫర్ ఇస్లామిక్ స్టడీస్’ తో లింకులు ఉన్నందుకు ప్రిన్స్ ఛార్లెస్‌ను విమర్శించాడు. ఇన్ని రాసిన బ్రీవిక్‌తో తనకు సంబంధం లేదని ఇ.డి.ఎల్ ప్రకటించడం గమనార్హం.

వాస్తవానికి టోని బ్లెయిర్ యుద్ధోన్మాది జార్జి బుష్ తో కుమ్మక్కయ్యి ఆఫ్ఘనిస్ధాన్, ఇరాక్ లపై దురాక్రమణ యుద్ధాలకు దిగిన అసలు సిసలు యుద్ధోన్మాది. ఐక్యరాజ్యసమితి, మిత్ర రాజ్యాలు అని ఏమీ లేకుండా యుద్ధానికి దిగుతున్న జార్జి బుష్ ని ఆపి చేసేది పాలిష్‌డ్ గా చేయాలని చెప్పి ఐక్యరాజ్యసమితి లో భద్రతా సమితి నాటకం ఆడించిన గుంటనక్క టోనీ బ్లెయిర్. టోనీ బ్లెయిర్ సలహా తర్వాతనే జార్జి బుష్ టెర్రరిజంపై ప్రపంచ యుద్ధం అంటూ భద్రతా సమితి చేత తీర్మానం చేయించాడు. “మీరు మావైపు లేనట్లయితే టెర్రరిజం వైపు ఉన్నట్లే” అని దురహంకార పూరిత ప్రకటనలు జారీ చేశాడు. ఇరాక్‌ని సర్వనాశనం చేసి, లక్షల మంది ఇరాక్ పిల్లలను, మహిళలను, వృద్ధులను ఊచకోత కోసి అంతా ముగిశాక ఇరాక్‌లో సామూహిక విధ్వంసక మారణాయుధాలు ఉన్నాయని పొరబాటుబడ్డామని “సారీ” చెప్పారు జార్జి బుష్, టోనీ బ్లెయిర్‌లు. టోని బ్లెయిర్ ఎంత దురహంకారి అంటే ఇరాక్‌లో ‘సామూహిక విధ్వంసక మారణాయుధాలు’ లేవని తెలిసినా సద్దాంని చంపడానికైనా ఆ దేశంపై దాడి చేయడం సరైందేనని యుద్ధానంతర విచారణ కమిటీ ముందు చెప్పాడు. అటువంటి పచ్చి యుద్ధోన్మాది, లక్షల మంది ముస్లింలను ఊచకోత కోయించిన టోనీ బ్లెయిరే ‘ద్రోహి’ అనీ, ‘ముస్లిం తీవ్రవాదులతో కుమ్మక్కయ్యారనీ ఆరోపిస్తున్న బ్రీవిక్ మహాశయుడు మనుషులుగా ఎవరిని గుర్తిస్తాడో మానవ మాత్రులెవరైనా ఊహించగలరా!?

బ్రిటన్‌కి చెందిన మితవాద తీవ్రవాద సంస్ధలను, వైట్ సూపర్ మాసిస్టుల గురించిన భయాలను తేలికగా తీసుకున్నందుకు బ్రిటిష్ ప్రధాని ఇటీవల ఇంగ్లండులో విమర్శలు ఎదుర్కొన్నాడు. వైట్ సూపర్ మాసిస్టులను తేలిగ్గా తీసుకుంటూ ముస్లిం తీవ్రవాదం పైనే అధిక కేంద్రీకరిస్తున్నాడని ఆయన విమర్శలు ఎదుర్కొన్నాడు. నార్వే ఊచకోత నిందితుడు తనకు బ్రిటిష్ రైటిస్టు మెంటర్ అని చెప్పడంతో బ్రిటన్ ప్రధాని ఛైర్మన్‌గా గల నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్, రైటిస్టు గ్రూపుల వలన ఎదురయ్యే భద్రతా సమస్యలను తిరిగి సమీక్షించాలని పోలీసులని ఆదేశించింది. బ్రీవిక్స్ చెప్పిన విషయాలలొ వాస్తవమెంతో తేల్చాలని ఆదేశించింది.

వ్యాఖ్యానించండి