టెలికం (2జి) కుంభకోణంలో మన్మోహన్, చిదంబరంలు రాజీనామా చేయాలి -బి.జె.పి


Gadkari, Ravishankar Prasad

విలేఖరుల సమావేశంలొ బి.జె.పి అధ్యక్షుడు నితీష్ గడ్కారి, పార్టీ ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్

మాజీ టెలికం మంత్రి ఎ.రాజా 2జి స్పెక్ట్రం లైసెన్సులను చౌకరేట్లకు జారీ చేసిన నిర్ణయంలో ప్రధాని మన్మోహన్ సింగ్, అప్పటి ఆర్ధిక మంత్రి పి.చిదంబరం పాత్ర కూడా ఉందనీ, వారికి తెలియకుండా ఏ నిర్ణయమూ జరిగే అవకాశం లేదనీ ఢిల్లీలోని సి.బి.ఐ ప్రత్యేక కోర్టుకు విన్నవించుకున్న నేపధ్యంలో వారిద్దరూ వెంటనే రాజీనామా చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. కర్ణాటక లోకాయుక్త సంతోష్ హెగ్డే ఫోన్‌ను ట్యాప్ చేయడం, అక్రమ మైనింగ్ కుంభకోణంలో కర్ణాటక సి.ఎం యెడ్యూరప్పకు కూడా పరోక్ష పాత్ర ఉందని లోకాయుక్త నివేదికలో పేర్కొనడం… ఈ రెండింటికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న నేపధ్యంలో బి.జె.పికి తమ కర్ణాటక సంక్షోభం నుండి దృష్టిని కాంగ్రెస్ మీదికి మళ్ళించడానికి అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదని స్పష్టమవుతోంది. ఎ.రాజా కోర్టులో చేసిన వాదనలను తెలుసుకోవడంతోనే బి.జె.పి అధ్యక్షుడు నితీష్ గడ్కారి హడావుడిగా విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి మన్మోహన్, చిదంబరంల రాజీనామాలను డిమాండ్ చేయడం దీనినే సూచిస్తోంది.

2జి స్పెక్ట్రం లైసెన్సుల జారీ ప్రధాని, ఆర్ధికమంత్రి లకు తెలియకుండా జరగలేదని ఎ.రాజా కోర్టుకు తెలిపినందున “చట్టపరమైన, రాజకీయ, నైతిక భాద్యత వహించి వారిద్దరూ రాజీనామా చేయాలని నితీష్ గడ్కారి డిమాండ్ చేశాడు. గత కొన్ని వారాలుగా చిదంబరం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న బి.జె.పి మొదటిసారిగా ప్రధాని మన్మోహన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. కర్ణాటక పరిణామాలనుండి గుక్క తిప్పుకునేందుకు బి.జె.పికి ఇది గొప్ప అవకాశంగా లభించిందని భావించవచ్చు. కాంగ్రెస్ పార్టీ తన భాగస్వామ్య పార్టీ డి.ఎం.కె ను ఇప్పటివరకూ బలిపశువుగా చేస్తూ వచ్చిందనీ, 2జి విషయంలో గానీ, కామన్ వెల్త్ గేమ్స్ విషయంలో గానీ కేబినెట్ క్లియరెన్స్ లేకుండా, ప్రధాని, ఆర్ధిక మంత్రిలకు తెలియకుండా నిర్ణయాలు జరిగే అవకాశమ్ లేదనీ బి.జె.పి అధ్యక్షుడు విమర్శించాడు.

ఇటీవల బి.జె.పి ప్రతినిధి వర్గ సి.బి.ఐ డైరెక్టర్ ని కలిసి 2జి కుంభకోణంలో చిదంబరం పాత్రను విచారించాల్సిందిగా కోరిన సంగతిని బి.జె.పి గుర్తు చేసింది. తమ ఆరోపణలకు డాక్యుమెంటరీ సాక్ష్యం ఉందని ఆయన విలేఖరుల సమావేశంలో తెలిపాడు. గడ్కారి వాదన ప్రధానంగా చిదంబరం పై కేంద్రీకృతమై ఉంది. 2జి స్పెక్ట్రంను వేలం వేయాలన్న ద్రవ్య మంత్రిత్వ శాఖ (ఫైనాన్స్ మినిస్ట్రీ) చేసిన సిఫారసులను పట్టించుకోకుండా, టెలికం లైసెన్సులను కొన్ని ఎన్నుకున్న గ్రూపు కంపెనీలకు జనవరి 2008లో కేటాయించేందుకు చిదంబరం మార్గం సుగమం చేశాడని గడ్కారీ విలేఖరుల సమావేశంలో ఎత్తి చూపాడు. ఎన్.డి.ఎ 2003లో అనుసరించిన విధానం ప్రకారం టెలికం మంత్రిత్వ శాఖ ఆర్ధిక మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరిపి స్పెక్ట్రం ధరలను నిర్ణయించాల్సింది ఉందనీ గడ్కారీ గుర్తు చేశాడు.

తన ముందు మంత్రుల విధానాలనే తాను అనుసరించానన్న రాజా వాదన గురించి ప్రశ్నించగా గడ్కారీ, “సి.బి.ఐ ఏ సంవత్సరం నుండైనా టెలికం విధానాలపై దర్యాప్తు చేసుకోవచ్చని తెలిపాడు. 2003 నుండైనా, లేదంటే 1947 సం నుండైనా సరే విచారణ జరుపుకోవడానికి మాకెటువంటి అభ్యంతరం లేదు” అని గడ్కారీ ప్రకటించాడు. తమ పార్టీవారు అవినీతికి పాల్పడినట్లు తేలితే వారిని శిక్షిస్తామని సోనియా గాంధీ ప్రకటనను నమ్మడమంటే, పాకిస్ధాన్ అవినీతిని ఎదుర్కోవడానికి కట్టుబడి ఉంటుందని చెబితే దానిని నమ్మడంతో సమానమని తెలిపాడు. (మధ్యలో పాకిస్ధాన్‌ని లాగడం ఏమిటో అర్ధం కాని విషయం!) “ఆవిడ 2జి కుంభకోణంలో భాగం ఉన్న తమ పార్టీ వారిని శిక్షించడానికి ఏ చర్యలు ప్రతిపాదిస్తుందో చెప్పాలని గడ్కారి కోరాడు.

వ్యాఖ్యానించండి