కృష్ణ నాయకత్వంలో ఎంక్వైరీ కమిటీ వేసుకోండి -ఫోన్ ట్యాపింగ్‌పై ప్రధానికి యెడ్యూరప్ప సవాల్


ఇద్దరు వెధవలు కొట్లాడుకుంటూ తిట్టుకుంటున్నారట. “నువ్వు వెధవాయ్‌వి” అని ఒకడంటే, “నాకంటె నువు పెద్ద వెధవాయ్‌వి కదా” అని మరొకడు. చూసేవారికీ, వినేవారికీ ఇద్దరూ వెధవాయ్‌లేనని అర్ధమైపోతుంది. అలానే ఉంది కాంగ్రెస్, బి.జె.పి నాయకుల వ్యవహారం. కర్ణాటక లోకాయుక్త సంతోష్ హెగ్డె అక్రమ మైనింగ్‌లో సి.ఎం యెడ్యూరప్పకి పరోక్షంగా బాధ్యత ఉందని తన నివేదికలో పేర్కొన్న సంగతి తెలిసిందే. అది కాకుండా లోకాయుక్త తన ఫోన్ ట్యాపింగ్ చేసారని ఆరోపించాడు. రెండింటికి బాధ్యత వహిస్తూ యెడ్యూరప్ప రాజీనామా చేయాలని ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, జనదా దళ్ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. యెడ్యూరప్ప తాను రాజీనామా చేసేది లేదని నిరాకరిస్తున్నాడు. అక్రమ మైనింగ్‌లో తన పాత్ర లేదనీ, ఫ్యోన్ టాపింగ్ చేయడంలో కూడా తన పాత్రలేదని ఆయన చెబుతున్నాడు.

ఆరోపణలని నిరాకరించడమే కాకుండా యెడ్యూరప్ప ప్రధానికి లేఖ రాస్తూ సవాల్ విసిరాడు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు, విదేశాంగ శాఖ మంత్రి ఎస్.ఎం.కృష్ణ నేతృత్వంలో విచారణ కమిటిని నియమించుకోవచ్చని చెబుతూ ప్రధాని మన్మోహన్‌కి లేఖ రాశాడు. కమిటీలో ఎవరెవరు ఉండొచ్చో కూడా యెడ్యూరప్ప ప్రధానికి సూచించాడు. మాజీ ప్రధాని, జనతా దళ్ (ఎస్) అధిపతి హె.డి.దేవెగౌడ, అతని కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి హె.డి.కుమార స్వామి, కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకుడు సిద్దరామయ్య, జస్టిస్ సంతోష్ హెగ్డే… వీరందరినీ విచారణ కమిటీలో సభ్యులుగా ప్రధాని నామినేట్ చేయాలని తన లేఖలో కర్ణాటక సి.ఎం విజ్ఞప్తి చేశాడని ఆయన సన్నిహితులు చెప్పినట్లుగా ‘ది హిందూ’ పత్రిక తెలిపింది.

ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను తిరస్కరించిన బి.ఎస్.యెడ్యూరప్ప అక్రమ మైనింగ్‌పై లోకాయుక్త సంతోష్ హెగ్డె తయారు చేసిన నివేదికను లీక్ చేయడంలో కూడా తన పాత్ర లేదని తన లేఖలో పేర్కొన్నాడు. మారిషస్‌లో సెలవులు గడపడానికి వెళ్ళిన యెడ్యూరప్ప తన సెలవు రద్దు చేసుకుని వచ్చాడు. వస్తూనే ఆయన సంతోష్ హెగ్డే ఫోన్ ట్యాప్ చెయ్యడం క్షమించరాని నేరంగా అభివర్ణిస్తూ ఈ వ్యవహారంపై కేంద్ర బృందం విచారణ జరిపించాలని కోరాడు. తనకు గానీ, తన పార్టీకి గానీ ఫోన్ ట్యాపింగ్ లో పాత్ర లేదని స్పష్టం చేశాడు. ఫో ట్యాపింగ్ విషయం తనకు చాలా బాధ కలిగించిందనీ, లోకాయుక్త కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయం ఫిర్యాదు చేసినట్లయితే ఈ పాటికి దర్యాప్తు జరిగి ఉండేదని అన్నాడు.

“ఇప్పటికైనే మించింది లేదు. ఒక ముఖ్యమైన బృందాన్ని ఫోన్-ట్యాపింగ్ విషయాన్ని దర్యాప్తి చేయడానికి పంపమని నేను ప్రధానికి విజ్ఞప్తి చేయబోతున్నాను. ఇటువంటి క్షమించరాని నేరానికి పాల్పడేంత చెడ్డబుద్ధి తనకుగానీ, తన పార్టీకి గానీ లేదు” అని ఆయన విలేఖరులకు తెలిపాడు. గత వారం తన ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు వెల్లడించిన లోకాయుక్త సంతోష్ హెగ్డే దాని వెనుక ఒక రాజకీయ పార్టీ హస్తం ఉండి ఉండవచ్చని శనివారం సూచించాడు. యెడ్యూరప్ప సూచనకు స్పందించిన సంతోష్ హెగ్డే కేంద్ర బృందం విచారించాలన్న సూచనను ఆహ్వానించాడు. “అది కరెక్ట్. అదే జరగాలి. నేను అహ్వానిస్తున్నాను” అని సంతోష్ హెగ్డే అన్నాడు.

తనపై వచ్చిన ఆరోపణలకు విచారణ జరపడానికి కేంద్ర బృందాన్ని నియమించమని కోరడమే కాకుండా తనపై ఆరోపణలు చేస్తూ, తనను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నవారిని కూడా ఆ కమిటిలో సభ్యులుగా ఉండాలని కోరడం యెడ్యూరప్ప నేరుగా కాంగ్రెస్ హై కమాండ్ కే విసిరిన సవాలుగానే చెప్పుకోవచ్చు. ఐతే, అక్రమ మైనింగ్ వ్యవహారంలో లోకాయుక్త యెడ్యూరప్పను కూడా నిందింతుడిగా పేర్కొన్నందున దానికి కూడా ఆయన సమాధానం చెప్పి ఉంటే బాగుండేది. లోకాయుక్త విచారణ కూడా కర్ణాటక ప్రభుత్వ ఆదేశాల మేరకే జరగడం విశేషం.

ఇదిలా ఉండగా కర్ణాటక గవర్నర్ హెచ్.ఆర్.భరద్వాజ అక్రమ మైనింగ్‌పై లోకాయుక్త సమర్పించిన నివేదిక ఆధారంగా నిందుతులపై చర్యలు తీసుకోవడానికి ఉపలాటపడుతుండడం మరొక విశేషం. తనకు సమర్పించినట్లయితే తప్పకుండా చర్యలు తీసుకుంటానని ఆయన ప్రకటించాడు. కేంద్ర ప్రభుత్వం ఐనా తనను ఆదేశిస్తే చర్యలు తీసుకుంటానని కూడా చెబుతున్నాడు. మొత్తం మీద అక్రమ మైనింగ్ విషయంలో లోకాయుక్త నివేదిక, రాజకీయ పార్టిలనుండీ, ప్రభుత్వాల నుండీ ఎటువంటి స్పందనా ఆకర్షించకపోవడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు కర్ణాటకలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ లోకాయుక్త నివేదికలో దోషులుగా తేలాయి. అందరూ అక్రమ మైనింగ్‌ ద్వారా ఏదో మేరకు లబ్ది పొందినవారే కావడం గమనార్హం. భారత దేశంలోని రాజకీయ పార్టీలు ప్రజల ఆస్తులకు ట్రస్టీలుగా ఉండే అర్హత ఏనాడో కోల్పాయనడానికి సంతోష్ హెగ్డే నివేదిక ఒక ఉదాహరణ. ప్రజలిక నూతన ప్రత్యామ్నాయాన్ని వెతుక్కోక తప్పని పరిస్ధితి దేశంలో నెలకొని ఉంది.

వ్యాఖ్యానించండి