ఎం.ఎల్.ఎ హరీష్ రావు ఏ.పి భవన్‌లోని అధికారిపై చేయి చేసుకోవడం ద్వారా ప్రజాస్వామ్య సంస్కృతినే అవమానపరిచాడు. సహజ న్యాయ సూత్రాన్ని విస్మరించాడు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అత్మహత్యకు పాల్పడిన యాదిరెడ్డి మృతికి సంతాపం తెలియ జేసేందుకు ఏపి భవన్ అధికారులు ఒక రకంగా ఆటంకం కలిగిస్తే హరీష్ రావు మరో విధంగా ఆటంకం కలిగించాడు. యాదిరెడ్డి మృతి పట్ల సంతాపాన్ని సజావుగా తెలియజేయడానికి ఎదురైన ఆటంకాల్లొ తానూ పాత్రధారిగా మారాడు. ఒక ఆత్మ త్యాగానికి దక్కవలసిన విలువనూ, కేంద్రీకరణనూ దక్కకుండా పాక్షికంగానైనా అడ్డుకున్నాడు. యాదిరెడ్డి అత్మాహుతిని సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నించాడన్న ఆరోపణలను ఎదుర్కొని చివరికి అత్మాహుతినే అవమానపరిచేలా వ్యవరించాడు.
టి.ఆర్.ఎస్ పార్టీని ఏర్పాటు చేశాక 2009 వరకూ తెలంగాణ రాష్ట్ర డిమాండ్ సాధన కోసం కె.సి.ఆర్ పెద్దగా చేసిందేమీ లేదు. 2004 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌తో రెండో ఎస్.ఆర్.సి ఏర్పాటుకి లోపాయకారి ఒప్పందం చేసుకుని తెలంగాణ ప్రజలకు మాత్రం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి మద్దతు తెలిపిందనీ, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రం ఏర్పాటుకి సహకరిస్తుందని అబద్ధం చెప్పాడు. కాంగ్రెస్‌తో సీట్ల ఒప్పందం చేసుకున్నాడు. అప్పుడు కె.సి.ఆర్ గానీ, టి.ఆర్.ఎస్ ఇతర నాయకులుగానీ ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని తెలంగాణ ప్రజల్ని మళ్ళీ గందరగోళంలో పడేశాడు. వై.ఎస్ మరణానంతరం తప్ప కె.సి.ఆర్ తెలంగాణ కోసం నిర్ధిష్టంగా ఒక ఆందోళనను చేపట్టలేకపోయాడు. అది కూడా నిరాహారదీక్షను విరమించడానికి ప్రయత్నించి విద్యార్ధులనుండి వ్యతిరేకత రావడంతో దీక్షను కొనసాగించడం వలన కె.సి.ఆర్ కి రాజకీయంగా పునర్జన్మ లభించింది. తెలంగాణకి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో ఆ పునర్జన్మ రాజకీయ శక్తిగా మారింది.
తెలంగాణ డిమాండ్‌ని ప్రస్తుతం ఉన్న స్ధాయికి తీసుకురావడంలో ప్రధాన భాద్యత ప్రజా ఉద్యమాలది. ఉస్మానియా విద్యార్ధుల ఉద్యమం ప్రధానంగా ప్రారంభంలో నాయకత్వ పాత్ర పోషించింది. క్రమంగా లాయర్లు ఆ ఉద్యమాన్ని అందుకున్నారు. ఈ రెండు వర్గాల మిలిటెంట్ ఉద్యమాల వలన మాత్రమే టి.ఆర్.ఎస్ పార్టీకి ఇపుడున్న పలుకుబడి లభించింది తప్ప ఆ పార్టీ స్వయంగా ప్రయత్నించి సంపాదించింది కాదు. విద్యార్ధులు, లాయర్ల ఉద్యమం వాస్తవానికి కె.సి.ఆర్ చేతుల్లో లేదు. అందువలన వారి ఉద్యమాలను ఆటంకపరచడానికి తద్వారా తెలంగాణ డిమాండ్ తన చుట్టూ తిరగడానికి కె.సి.ఆర్ తెరవెనుక ప్రయత్నాలు అనేకం చేశాడు. తెరముందు కూడా తన ఉద్దేశ్యాలను పరోక్షంగా తెలియజేస్తూ వచ్చాడు. “విద్యార్ధులారా మీరు చదువుకోండి, తెలంగాణ రాష్ట్రం తేవడానికి మేమున్నాం కదా” అని అనేక సార్లు వివిధ సందర్భాల్లో పత్రికల సమావేశాల్లో గానీ, బహిరంగ సభల్లో గానీ అటువంటి ప్రకటనలు చేశాడు. కాని కె.సి.ఆర్ ఉద్దేశ్యాన్ని కనిపెట్టిన ఉద్యమకారులు ఆయన హామీలను పరిగణలోకి తీసుకోలేదు.
విద్యార్ధులు, యువకులు, ఉద్యోగులు, లాయర్లు ఇంకా ఇతర సెక్షన్ల ప్రజానీకం చేస్తున్న ఉద్యమాల్లో అనేకం కె.సి.ఆర్ లేదా టి.ఆర్.ఎస్ చేతుల్లో లేనప్పటికీ వారి ఉద్యమాల రాజకీయ ఫలితం మాత్రం టి.ఆర్.ఎస్ కే దక్కడం నేడు తెలంగాణలో నెలకొని ఉన్న విచిత్ర పరిస్ధితి. దానికి కారణాలు ఉన్నాయి. టి.ఆర్.ఎస్ లాగా తెలంగాణ ప్రజలకు కేవలం తెలంగాణ ప్రజల కోసమే అన్న ముద్రతో మరే పార్టీ లేకపోవడం ఒక కారణం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు “మాది జాతీయ పార్టీ. అన్ని పరిస్ధుతులను దృష్టిలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది” అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. కాని నిజానికి కాంగ్రెస్ కి ఉన్న ఆ పరిస్ధితే వారు తెలంగాణకి అనుకూలంగా ఎన్ని వేషాలు వేసినా అవి రాజకీయ ఫలితాలుగా లేదా ఎన్నికల ఫలితాలుగా తర్జుమా కావడం సాధ్యపడలేదు.
తెలుగు దేశం పార్టీ అధినేత ఐతే “ఇరు ప్రాంతాలూ నాకు ముఖ్యమే. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలు రెండూ నాకు రెండు కళ్లలాంటివి” అని చెప్పి అపఖ్యాతి పాలయ్యాడు. చంద్రబాబు పార్టీ ప్రయోజనాల రీత్యా, అధికార రాజకీయాల రీత్యా రెండు కళ్ళ సిద్ధాంతం ఆయనకు నిజం కావచ్చుగానీ తెలంగాణ ప్రజలకు కావలసింది అది కాదు. ఒక రాజకీయ పార్టీగా కూడా ఒకే సమస్యకు ప్రాంతాలవారిగా రెండు నిర్ణయాలను ప్రకటించడం వారికి అధికారమే పరమావధి తప్ప ప్రజలు కాదు అని రుజువు చేయడానికి దోహదం చేసింది. అందువల్లనే తెలంగాణలోని తెలుగుదేశం నాయకులు తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా ఉద్యమాలలో పాల్గొన్నప్పటికీ, స్వయంగా కొన్ని కార్యక్రమాలని చేపట్టినప్పటికీ, చివరికి తెలంగాణ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినప్పటికీ వారి ఆందోళనలు, ప్రకటనలు రాజకీయ ప్రయోజనాలలోకి తర్జుమా కాలేదు.
ఇక బి.జె.పి విషయానికి వస్తే ఆ పార్టీకి తెలంగాణలో ప్రజా పునాది లేదు. ఎన్నికల పార్టీ కనుక ప్రజా ఉద్యమాలతో పునాది సంపాదించుకునే ప్రయత్నం అది చేయదు. ఆ పార్టీ స్వయంగా కొన్ని విజయవంతమైన బహిరంగ సభలు నిర్వహించగలిగినప్పటికీ అవి ఓట్లుగా మారడానికి అది చాలదు. కనుక బి.జె.పి పార్టీ చేసిన ఉద్యమాలు కూడా రాజకీయ ప్రయోజనాలుగా ఆ పార్టీ అందిపుచ్చుకునే పరిస్ధితి లేదు. తెలంగాణ రాష్ట్రం కోసం శక్తివంతంగా, నిరంతరం పని చేస్తున్న మరొక రాజకీయ పార్టీ, సి.పి.ఐ(ఎం.ఎల్-న్యూ డెమొక్రసీ). ఈ పార్టీ విప్లవ రాజకీయాలు కలిగిన పార్టీ. దాదాపు తెలంగాణ రాష్ట్రాలన్నింటా ఉనికి ఉన్న ఈ పార్టీ తెలంగాణ ఉద్యమంలో ఒక ప్రధాన ఉద్యమ పార్టీగా అవతరించింది. అయితే ఈ పార్టీ పైన చెప్పిన రాజకీయ పార్టీలకు రాజకీయంగా సహకరించే పార్టీ కాదు.
తెలంగాణ డిమాండ్ వరకు కలిసి రావచ్చునేమో గాని, రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఈ పార్టీలతో ఎన్నికల ఒప్పందాలకు దిగేది కాదు. వీరి ఉద్యమాలు ప్రధానంగా ప్రజా పునాదిని దృష్టిలో పెట్టుకుని సాగుతాయి తప్ప ఎన్నికలు, ఓట్లు దృష్టిలో ఉంచుకుని కాదు. ఈ పార్టీ ఎన్నికల్లో కూడా పోటీ చేసినప్పటికీ, మరొక విప్లవ రాజకీయాల కోసం పనిచేసే పార్టీతో గానీ, లేదా ప్రజల ప్రయోజనాలను కాపడతాడని భావించిన ఇండిపెండెంట్లతో కాని ఎన్నికల ఒప్పందం చేసుకుంటుంది తప్ప వామ పక్షాలుగా చెప్పుకునే సి.పి.ఐ, సి.పి.ఎం పార్టీలతో కూడా ఎన్నికల పొత్తు పెట్టుకోదు. కనుక ఈ పార్టీ చేసిన ఉద్యమాల ఫలితం ఎన్నికల్లో ఆ పార్టీకే దక్కుతుంది. పొత్తులు ఉండవు గనక మరొక ప్రధాన రాజకీయ పార్టీకి వారి ఓట్లు వెళ్ళే అవకాశాలు లేవు. సి.పి.ఎం పార్టీకి తెలంగాణలో పొత్తు పెట్టుకునే పార్టీ దొరుకుతుందో లేదో ఇప్పుడే చెప్పలేం. సి.పి.ఐ పార్టీ టిడిపి తో పొత్తు పెట్టుకుంటుందనడంలో సందేహం లేదు. కానీ “సన్యాసి సన్యాసి రాసుకుంటే రాలేది బూడిదే” అన్న చందంగా వారి పొత్తు తేలడానికే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇవన్నీ చెప్పడం ఎందుకంటే టి.ఆర్.ఎస్ కి వచ్చిన పలుకుబడి, ఓట్లు, రాజకీయ ప్రయోజనాలకు మూలం ఎక్కడుంది అని చెప్పడానికి. టి.ఆర్.ఎస్ ఎం.ఎల్.ఎ లు రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసినపుడు ఓట్లన్ని గుత్తగా ఆ పార్టీకే పోలయ్యాయి. ప్రధాన పార్టీలు టి.డి.పి. కాంగ్రెస్ లకు డిపాజిట్లు కూడా దక్కలేదు. ఇదంతా తమ ప్రతిభే అని టి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు ఈనాడు భావిస్తున్నారు. కాని అందులో నిజం లేదని వారు గ్రహించవలసి ఉంది. పైన చెప్పినట్లుగా కాంగ్రెస్, టి.డి.పి,బి.జె.పి పార్టీలు తెలంగాణ రాష్ట్రం కోసం చేస్తున్న ఉద్యమాలు రాజకీయ ప్రయోజనాలుగా తర్జుమా అయ్యే క్రమంలో ఒక్క టి.ఆర్.ఎస్ కే లాభిస్తున్నాయి తప్ప ఇతర పార్టీలకు లాభించడం లేదు. దానికి కారణాలు పైన చెప్పుకున్నవే. మరే ఇతర పార్టీ కూడా [సి.పి.ఐ(ఎం.ఎల్-న్యూ డెమొక్రసీ), బి.జె.పిలు తప్ప] ఎటువంటి శషభిషలు లేకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బేషరుతుగా ఆమోదం తెలియజేయడం లేదు. ఫలితంగానే ఈ పార్టీలన్నీ ఉద్యమాలలో పాల్గొంటున్నా వారి వారి శ్రమకు తగ్గ ఓట్లు వారికి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
జాతీయ పార్టీ అనో, రెండు కళ్లు అనో చెప్పకుండా కాంగ్రెస్, టి.డి.పిలు తెలంగాణకు సంపూర్ణ మద్దతు తెలిపితే వారిని తెలంగాణ ప్రజలు ఆదరిస్తారు. అటువంటి పార్టీ ఖచ్చితంగా టి.ఆర్.ఎస్ కి పోటీని ఇవ్వగలుగుతుంది. కాని అదే చేస్తే ఆ రెండు పార్టీలకు సీమాంధ్రలో పుట్టగతులుండవన్న భయం వెంటాడుతోంది. అన్ని పార్టీలూ కూడబలుక్కుని తెలంగాణకు ఆమోదం తెలిపితే పరిస్ధితిలో మార్పు ఉండవచ్చు. కాని అది జరగదు కనుక కాంగ్రెస్, టి.డి.పిలు తెలంగాణ ఏర్పాటుకు సంపూర్ణ మద్దతును ఇవ్వలేవు. సంపూర్ణ మద్దతు ఇవ్వలేవు కనుక రాజకీయంగా అవి ప్రజా మద్దతును పొందలేవు. కాంగ్రెస్, టి.డి.పిలకు ఇదొక విషమ పరిస్ధితి. ఈ నేపధ్యంలోనే అంతిమంగా అందరి శ్రమనూ కొల్లగొట్టి రాజకీయంగా టి.ఆర్.ఎస్ ఒక్కటే లాభపడుతోంది.
ఇది గ్రహించని టి.ఆర్.ఎస్ పార్టీ, దాని నాయకులు తమకు వస్తుందన్నదంతా తమకు చెందిందే అని భ్రమిస్తున్నారు. ప్రజల సంపూర్ణ మద్దతు ఉందని భావిస్తున్న నేపధ్యంలో నిరభ్యంతరంగా విచ్చలవిడితనానికి దిగుతున్నారు. టి.ఆర్.ఎస్ పార్టీ తమది ఉద్యమ పార్టీ అని చెబుతున్నా, ఆ లక్షణాలేవీ దానికి లేవు. సంప్రతింపులు, లాబీయింగ్ అంటూ కాలం గడుపుతూ, వసూళ్ళు చేసుకుంటూ నెట్టుకురావడం తప్ప దానికి ప్రజల పట్ల, వారి ప్రయోజనాల పట్ల గౌరవం లేదు. 2009 ఎన్నికల్లో పోటీ చేసిన స్ధానాల్లో చాలా కొద్ది చోట్ల మాత్రమే విజయం దక్కించుకున్న టి.ఆర్.ఎస్ నాయకులు, ముఖ్యంగా కె.సి.ఆర్ మూడు లేదా నాలుగు వారాల పాటు ఇంటినుండి బైటికి రాలేదు. బైటికి వచ్చాక తమని గెలిపించకపోవడం, తక్కువ సీట్లు ఇవ్వడం ప్రజల తప్పిదం అన్నట్లుగా కె.సి.ఆర్ మాట్లాడాడు. కేవలం తెలంగాణ కొసమే పార్టీ పెడితే తెలంగాణ ప్రజలు తమను గాక ఇంకెవరినో గెలిపించడం ఏమిటన్న చందంగా మాట్లాడాడు.
కాని ప్రజలు కె.సి.ఆర్, ఆయన కుటుంబ సభ్యులు, ఇతర ఎం.ఎల్.ఎ లు వసూళ్లకోసం, కాంట్రాక్టుల కోసం, స్వార్ధ ప్రయోజనాల కోసం ఎన్ని తిప్పలు పడుతున్నదీ, ఎంత దిగజారుతున్నదీ గమనించినందునే టి.ఆర్.ఎస్ కి ఆ తీర్పుని ఇచ్చారని గ్రహించడం లో ఆ పార్టీ విఫలమయ్యింది. ఈ వైఫల్యం ప్రజలను, వారి ఆకాంక్షలను, వారి ప్రయోజనాలను గౌరవించి, వాటికోసం నిజాయితిగా పోరాడడానికి టి.ఆర్.ఎస్ పార్టీకి ఉండవలసిన నిబద్ధతత లేకపోవడం నుండే సంక్రమించిందని వారు గుణపాఠం తీసుకోవడంలో విఫలమయ్యారు. అందువల్లనే తాము అతి తక్కువ సీట్లతో సరిపెట్టుకోవలసి వచ్చిందన్న నిజాన్ని ధైర్యంగా ఎదుర్కొనలేక పోయారు. తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రం పట్ల ఉన్న ఆకాంక్ష వల్లనే తమ పలుకుబడి నిలబడి ఉందని గ్రహించడం లేదు.
గమనించవలసిన విషయం ఏమిటంటే టి.ఆర్.ఎస్ పార్టీ గానీ, కె.సి.ఆర్ అతని కుటుంబ సభ్యులు గానీ ఇప్పటికే తమను ఆవహించిన మత్తునుండి బైటికి రాలేక పోతున్నారు. ఇతర రాజకీయ పార్టీల ద్వంద్వ విధానాల వలన వారి ఉద్యమ శ్రమ కూడా తమకు ఓట్ల రూపంలో లాభిస్తున్నదని గమనించలేక పోతున్నారు. తమకు వస్తున్న ఆదరణ అంతా తమ శ్రమ ఫలితమే అని భ్రమిస్తున్నారు. దానితో ప్రజల పట్ల ఉండవలసిన వినయ, విధేయతల స్ధానంలో వారిలో అహంభావం చొటు చేసుకుంది. తాము చెప్పిందేదైనా కరెక్టే అన్న భావనలో మునిగి పోయి ఉంటున్నారు. తెలంగాణ ఉద్యమం, ప్రజలు, ఆందోళనలు, విజయవంతంగా కొనసాగుతున్న నిరసనలు అన్నీ తమ పెరట్లో మొలిచిన కూరగాయల మొక్కలుగా భావిస్తూ ఆ మొక్కల ఫలాలను కోసుకోవడానికి కిందా మీదా చూసుకోకుండా ఆబగా ఎగబడుతున్నారు. వారి అహంభావం వారి చేత అనేక చిత్ర విచిత్రమైన ప్రకటనలను చేయిస్తోంది.
నిన్నగాక మొన్న రాజకీయాల్లోకి వచ్చిన కె.టి.ఆర్, ఈ దేశంలోని ప్రతి సీనియర్ రాజకీయ నాయకుడిపైనా ఏదో ఒక అహంభావపూరిత వ్యాఖ్యానం చేసి ఉంటాడన్నది నిజం. తెలంగాణ యాస పేరు చెప్పి, తెలంగాణ సంస్కృతి పేరు చెప్పి అనేక మంది నాయకులను, సంఘాలను, సంస్ధలను దూషించడం, ఎగతాళి చేయడం, వ్యంగ్య వ్యాఖ్యానాలు చేయడం కె.సి.ఆర్, హరీష్, కె.టి.ఆర్ ల దినచర్యగా మారింది. తమ అధినాయకుడు కె.సి.ఆర్ గానీ ఆయన కుమారుడో, అల్లుడో గాని పక్కన లేనప్పుడు టి.ఆర్.ఎస్ నాయకులు చాలా వినయ సంపన్నులుగా, పద్ధతి కలవారిగా కలిపిస్తారు. వారు పక్కన ఉంటే గనక వారి వినయం, రాజకీయ నాయకులకు ఉండాల్సిన హుందాతనం అన్నీ మర్చిపోయి వీరంగం వేస్తుంటారు. ప్రజా ఉద్యమ రంగం అంటే గౌరవం ఉన్నవారు ఏనాటికైనా మాట్లాడ్డానికి కలలో సైతం ఊహించలేని పదాలను, భాషనూ, వాగాడంబరాన్ని ప్రయోగిస్తూ కె.సి.ఆర్ కుటుంబ నాయక గణం హద్దు మీరి ప్రవర్తిస్తోంది.
ఉద్యమాలలో వీరి వ్యవహారం, ఆందోళనా కార్యక్రమాల్లో వీరి ఆచరణ కూడా వీరి ధోరణికి ఏ మాత్రం తక్కువ ఉండదు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజకీయ ఎత్తులు, ఉద్యమాల నిర్వహణలపైన కంటే తెలంగాణ పేరు చెప్పి వసూళ్ళు దండు కోవడానికి వీరు నిన్నటివరకూ ప్రధమ ప్రాధాన్యం ఇచ్చారు. అదుర్స్ సినిమా, సీమాంధ్రుల సినిమా అని చెప్పి సినిమా ప్రదర్శనను అడ్డుకున్న కె.సి.ఆర్ కుమార్తె, ఆ సినిమా నిర్మాత గుడివాడ నానీతో వారి సినిమా ప్రదర్శించబడాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసిందని నానీయే బహిరంగంగా ప్రకటించాడు. ఉద్యమం అని ప్రకటించి దాన్ని విరమించడానికి డబ్బులు డిమాండ్ చేయడం నైతిక పతనానికి పరాకాష్ట. నాని చెప్పింది అబద్ధం అని నమ్మడం కంటే నిజం అని నమ్మడానికే సరిపోయినన్ని ఉదాహరణలు అప్పటికే ఉన్నాయి.
మొదట కాంగ్రెస్ వద్ద మెహర్బానీ కోసం మిలియన్ మార్చ్‌ని వాయిదా వేయాలని బలవంత పెట్టిన కె.సి.ఆర్, అందులో విఫలం కావడంతో చివరికి నామమాత్రంగానైనా పాల్గొనక తప్పలేదు. మిలియన్ మార్చ్ ని వాయిదా వేయాలన్నా వినకుండా జరపడానికే రాజకీయ జె.ఎ.సి నిర్ణయించడంతో ఆ కార్యక్రమంపైన కె.సి.ఆర్ ఒక్క ప్రకటన చేయకుండా దానికి మద్దతు లేదన్నట్లుగా మౌనంగా ఉండిపోయాడు. ట్యాంకు బండ్ మీదికి రావడం ప్రధాన కార్యక్రమం గా మారిని నేపధ్యంలో టి.ఆర్.ఎస్ ఆ పని చేయడాని అసలు పూనుకోలేదు. చివరికి న్యూడెమొక్రసీ పార్టీ వారి కార్మిక సంఘం కార్యకర్తలు వందలాదిగా ట్యాంక్ బండ్ పైన బ్యారికేడ్లను తోసుకుంటూ, పోలీసుల్ని నెట్టుకుంటూ వెళ్ళి పెద్ద పెట్టున నినాదాలివ్వడంతో సమీపంలోనే వివిధ ప్రాంతాల్లో దాగి ఉన్న ఇతర పార్టీల కార్యకర్తలు ట్యాంక్ బండ్ మీదికి రావడంతో ఆ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి టి.ఆర్.ఎస్ కృషి చేయకపోగా, అంతరాంతరాల్లో విఫలమవ్వాలని కోరుకున్నట్లుగా కూడా చాలామంది భావించారు. తమ పాత్ర లేకుండా జె.ఎ.సి ఏమీ చేయలేదని కె.సి.ఆర్ చెప్పదలుచుకోగా, అంతిమంగా జె.ఎ.సి లేకుండా టి.ఆర్.ఎస్ మనుగడ ప్రశ్నార్ధకమే అన్న పరిస్ధితి దాపురించింది. మిలియన్ మార్చ్ కర్యక్రమంలో కార్యక్రమం ముగుస్తున్న సమయంలో ట్యాంక్ బండ్ మీదికి కార్యకర్తలతో వచ్చిన కె.సి.ఆర్, కె.టి.ఆర్, కె.సి.ఆర్ కుమార్తెలు విధ్వంసానికి తమ కార్యకర్తలను పురమాయించారు. తెలుగుజాతి మహనీయులుగా భావిస్తున్న వారి విగ్రహాలను నీళ్ళలో పడేసి, మిలియన్ మార్చ్ కార్యక్రమానికి చెడ్డ పేరు తేవడానికే తోడ్పడ్డారు తప్ప విజయవంతం కావడానికి చేసిందేమీ లేదు. వారు చేసిన విగ్రహాల విధ్వంసానికి తెలంగాణ ఉద్యమం సమాధానం చెప్పుకోవలసిన పరిస్ధితిని తెచ్చి పెట్టారు.
తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్న క్రమంలో కె.సి.ఆర్ కుటుంబం, వారి ఆజ్ఞలకు తలలూపే కొద్దిమంది నాయక సముదాయం ఇటువంటివే అనేక చిన్నా చితకా చర్యలతో పాటు కొన్ని చెప్పుకోదగిన అరాచకాలకు కూడా దిగారు. కంపెనీలను వెళ్ళగొడతామని బెదిరించి డబ్బులు వసూలు చేసారని కంపెనీలవారే చెప్పుకున్న పరిస్ధితి ఉంది. తెలంగాణ ఉద్యమాన్ని కె.సి.ఆర్ కుటుంబం తమ అక్రమ సంపాదనకు సాధనంగా వాడుకున్నారన్నది సర్వాత్రా వ్యాపించి ఉన్న బలమైన అనుమానాలు. వీరి మామూళ్ళ బెదిరింపులకు బెదిరి పెట్టుబడులు పెట్టాలనుకుని వెనక్కి తగ్గిన ఉన్నారో తెలియదు కానీ, అటువంటి వాతావరణం సృష్టించారన్నది నిజం. సీమాంధ్ర దోపిడి పెట్టుబడిదారులంటూ తడవకొకసారి ఒంటికాలిపై లేచే కె.సి.ఆర్, ఆయన కుటుంబ సభ్యులు సీమాంధ్ర పెట్టుబడిదారులతోనే కలిసి ఉమ్మడి కంపెనీలు, వ్యాపారాలు నిర్వహిస్తున్నారని పత్రికలు చెబుతున్నాయి. అదే నిజమైతే తెలంగాణ ఉద్యమానికి అంతకంటే అవమానం ఇంకొకటి ఉంటుందా?!
వీరి అరాచకాల్లో కొనసాగింపే ఎ.పి.భవన్‌లో హరీష్‌రావు వీరంగాన్ని చూడాల్సి ఉంది. యాదిరెడ్డి మృతదేహాన్ని ఏ.పి.భవన్ కి తీసుకువస్తే ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తుతాయని అక్కడి అధికారులు భావించి మృత దేహాన్ని ఎ.పి.భవన్‌కి తేవద్దని పోలీసులకు సూచిస్తూ లేఖరాశారన్నది ఆరోపణ. ఆ లేఖ రాయాలని పై అధికారుల ఆజ్ఞ మేరకు కింది అధికారి ఒ.ఎస్.డి రాసారు. సాధారణంగా ఢిల్లీలో తెలుగువారు కొన్ని నిర్ధిష్ట పరిస్ధితుల్లో చనిపోతే మొదట ఏ.పి.భవన్ కి తెచ్చి నివాళులు అర్పించిన అనంతరం రాష్ట్రానికి తెచ్చే సంప్రదాయం ఉందని చెబుతున్నారు. అది నిజమైతే యాదిరెడ్డి విషయంలో జరిగింది అవమానంగానే భావించాల్సి ఉంటుంది. తెలంగాణ నాయకులు ఒకవైపు ఎ.పి.భవన్‌కి తెమ్మని కోరుతుండగా వద్దని లేఖ రాయడం ఇంకా ఘోరం.
దానికి ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తుతాయని సాకు చూపడం తగనిపని. ఉద్రిక్త పరిస్ధితులపేరు చెప్పి పోలీసులే లేని ఉద్రిక్తలు ఏర్పడేలా నిర్ణయాలు తీసుకోవడం, ఉద్రిక్రతలకు తావివ్వడం ఈ మధ్య కాలంలో ఒక ధోరణిగా ముందుకొచ్చింది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం తలెత్తినప్పటినుండి పోలీసులు అతి జాగ్రత్తలు తీసుకోవడం వల్లనో లేక సీమాంధ్ర రాజకీయులు తెలంగాణ ఉద్యమానికి మరింత ఊపు వస్తుందన్న భయాలతో ఇచ్చే ఆదేశాల వల్లనో ఊహించని విధంగా ఉద్రిక్తలు తలెత్తిన సంఘటనలు అనేకం జరిగాయి. ఉస్మానియా క్యాంపస్ పై పోలీసులు పదే పదే చేస్తున్న దాడులు అందుకు ప్రబల ఉదాహరణ. ఎ.పి.భవన్ అధికారులు అపసవ్య నిర్ణయం తీసుకుంటే దాన్ని అలా ఉండనివ్వాలి. ఉద్యమకారులుగా కొన్ని పద్దతుల్లో అందోళనలు చేసి నిరసన తెలపడం వరకు సబబే. కాని దొరికిందే సందన్నట్లుగా అనుగుగాని చోట వీరంగం వేసి సంబంధం లేని అధికారిపై చెయ్యి చేసుకోవడం ఒక ప్రజా ప్రతినిధి చేయవలసిన పని కాదు. ప్రజా ప్రతినిధి కూడా సెంటిమెంట్లకు, ఆవేశకావేశాలకు లోనయ్యి చెయ్యెత్తితే సామాన్య జనం ఎలా ప్రవర్తించాలి?
ఘటన జరిగిన కొద్ది సేపటి తర్వాత హరీష్ రావు తాను సదరు అధికారిని క్షమాపణ కోరినట్లు ప్రకటించాడు. దానితో సంతృప్తిపడలేదో లేక ఈ సందర్భాన్ని సీమాంధ్ర నాయకులు ఒక అవకాశంగా వినియోగిందుకునే పనిలో ఉన్నారో తెలియదు కాని ఆ అధికారి ఎస్.సి, ఎస్.టి అట్రాసిటీ కేసు నమోదు చేయడం… తెలంగాణ ఆందోళన తన లక్ష్య దిశలో సజావుగా సాగడం లేదనడానికి ఒక నిదర్శనం. అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తున్నవారు తాము అన్యాయంగా ప్రవర్తించకుండా నియంత్రణ పాటించాలి. తెలంగాణ రాష్ట్రం పేరుతో కొంతమంది తెలంగాణ మేధావులు, కవులు, విలేఖరులు, తదితరులు బొత్తిగా సంబంధం లేని విధంగా వ్యాఖ్యానాలు చేస్తూ పరిస్ధితిని తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా మార్చడంలో తమవంతు సహకారం అందిస్తున్నారు. కాస్తో కూస్తో సానుభూతి ఉన్న సిమాంధ్రులను కూడా శతృవులుగా మార్చుకుంటున్నారు.
ఫేస్ బుక్ లోనూ, కొన్ని బ్లాగుల్లోనూ తెలంగాణ అనుకూల, ప్రతికూల రచనలు ఒక్కోసారి శృతి మించుతున్నాయి. ఉద్యమాలలొ సైతం కొద్దిమంది ఉద్యమకారులు తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఉద్యమానికి ఉన్న సానుభూతిని పలచన చేస్తున్నారు. ఒక ఫేస్ బుక్ వినియోగదారుడు హరీష్ రావు చెంపదెబ్బ కొట్టడాన్ని సమర్ధిస్తున్నాని రాశాడు. మరికొందరు కూడా అలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశాడు. ఇదెక్కడి దృక్పధం? ఓవైపు వివక్షకు గురైనామని పోరాటం చేస్తూ, ఇతరులపై అన్యాయంగా దాడి చేయడాన్ని ఎలా సమర్ధించగలం? తెలంగాణ ఉద్యమం కింద ప్రజలు, మేధావులు, ఉద్యోగులు తదితరులు ఉద్యమ నాయకులుగా చెప్పుకుంటున్నవారికి అటువంటి బ్లాంక్ చెక్ ఇచ్చినట్లయితే అది ఉద్యమంతో ఆగదని, తెలంగాణ వస్తే అప్పుడు కూడా ప్రజలపై అలాంటి దాడులే కొనసాగుతాయని గుర్తెరిగితే మంచిది.
తెలంగాణను సీమాంధ్రులు వలసగా చేసుకున్నారని చెప్పడం నిజాన్ని వికృతీకరించడమే. అటువంటివారికి వలస పాలన అంటే వారికి అవగాహన లేదనైనా అనుకోవాలి లేదా అతిగా స్పందిస్తున్నారనైన ఆనుకోవాలి. ఒక దేశం మరొక దేశాన్ని సైనికంగా ఆక్రమించుకుని పాలిస్తుంటే అది వలస పాలన అవుతుంది. కాని ఒక దేశంలోపల పెట్టుబడుదారులు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి కంపెనీలు స్ధాపించడం, స్ధిరపడడం, ఉద్యోగాలు చేయడం, ఆస్తులు సంపాదించడం వలస పాలనగా ఎట్టిపరిస్ధితుల్లోనూ వర్గీకరించలేము. భారత దేశంలో ఒక రాష్ట్రం వారు మరొక రాష్ట్రానికి వెళ్ళి స్ధిరపడడం సర్వ సామాన్యం అటువంటివారిని సెటిలర్లు అనడం మరీ ఘోరం. గత పది, ఇరవై సంవత్సరాల్లో ఇతర రాష్ట్రాల పెట్టుబడిదారులేం ఖర్మ, పరాయి దేశాల పెట్టుబడిదారులనే బొట్టు పెట్టి ఆహ్వానిస్తున్నారు. బతిమాలుకుంటున్నారు. అలాంటి పరిస్ధితుల్లో ఒకే రాష్ట్రంలోని పెట్టుబడిదారులు వేరే జిల్లాకి వెళ్ళి కంపెనీ పెడితే అది వలసగా చేసుకున్నట్లు వర్గీకరించడం ఎంత మాత్రం సమర్ధనీయం కాదు.
సీమాంధ్ర పెట్టుబడిదారుల చర్యలకు సీమాంధ్ర ప్రజలందరినీ బాధ్యులను చేయడం కూడా పెరుగుతోంది. తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయానికి ఎవరు కారకులో వారిని నిందించడంలో అర్ధం ఉంది కానీ సీమాంద్ర ప్రజలందరినీ నిందిస్తూ మాట్లాడ్డం, అందర్నీ ఒకే గాటన కట్టి ద్వేషం ప్రకటించడం తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు మానుకోవాల్సిన అవసరం ఉంది. సీమాంధ్ర ప్రజల్లో అత్యధికులు రైతులు, కూలీలు, కార్మికులే తప్ప అంతా ధనవంతులు, దోపిడీదారులూ కాదని గమనించాలి. సీమాంద్ర ప్రజలను ఉద్దేశించేటప్పుడు వినమ్రత పాటిస్తూ నచ్చజెప్పే పద్ధతిని అవలింబించాలి. తెలంగాణ పట్ల ద్వేషం ప్రకటించే సామాన్యులకు నిజాలు అందలేదని గమనించి వారికి నిజాలను అందజేయడానికి ప్రయత్నించాలి. “అన్నదమ్ములుగా విడిపోదాం” అన్న నినాదాన్ని అక్షరాలా పాటించడానికి ప్రయత్నించాలి. తద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గాన్ని సుగమం చేసుకుంటూ, వ్యతిరేకతను బలహీన పరచాలి.

Objectiveగా, నాన్ జడ్జిమెంటల్ గా రాశారు. చాలా బాగుంది. అసలు ఇలా మాట్లాడేవాళ్ళే కరువయ్యారు…వాద ప్రతివాదనలు చేసేవారు తప్ప.
అవును. వాద ప్రతివాదాల్లో నిజం తేల్చుకోవడంపై దృష్టి తప్పి వాదన నెగ్గించుకోవడంపై దృష్టి కేంద్రీకృతమవుతోంది. ఫలితంగా దూషణ, ప్రతి దూషణలు వెల్లువెత్తుతున్నాయి. మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు.
http://www.greatandhra.com/viewnews.php?id=30750&cat=15&scat=16
The way Telangana Rashtra Samithi legislator T Harish Rao assaulted Chander Rao, officer on special duty at Andhra Pradesh Bhavan in New Delhi on Thursday was no doubt a serious offence and should warrant condemnation from all sides.
The issue subsided with Harish Rao tendering apology to the official with whom he had 10 minute meeting half an hour after the incident.
Harish had also apologized to Chander Rao in front of the national media as well. Even Chander Rao admitted before NDTV and CNN-IBN that Harish Rao said sorry to him.
But the real drama began after the Telangana leaders left the AP Bhavan premises.
Vandana, a TV9 reporter with its New Delhi bureau entered the scene and began creating hungama. And she happens to be the daughter of Chander Rao and hence, she took the lead in launching a campaign against the Telangana leaders.
She, along with other electronic media reporters, asked all the AP Bhavan employees to come out in protest and stage a sit-in on the steps of the building, raising slogans against the TRS legislator.
Since Vandana is the victim’s daughter, the employees obliged to her and she dictated as to who should where and what to say in front of cameras.
It was Vandana, who asked her mother to come there and show her chappal before the cameras, saying she would beat Harish Rao with chappals.
And she ensured that all the channels carried the story prominently, so that the slapping incident and the AP Bhavan staff protest dominated the national news, overshadowing the suicide of Yadi Reddy and Telangana leaders’ protest before AP Bhavan!