ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరడాన్ని వేర్పాటువాదంగా కొంతమంది సంభోదిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి వేరుపడాలని కోరుతున్నారు గనక అది ‘వేర్పాటు వాదమే’ అని వారి వాదనగా ఉంది. వాస్తవానికి భారత రాజ్యాంగం ప్రకారం చూసినా ఒక రాష్ట్రం నుండి విడిపోయి కొత్త రాష్ట్రంగా ఏర్పడడం వేర్పాటు వాదం కాజాలదు. దేశం నుండి విడిపోయి కొత్త దేశంగా ఏర్పడాలని కోరుకోవడం వేర్పాటువాదం అవుతుంది తప్ప రాష్ట్రాలుగా విడిపోవడం వేర్పాటువాదం కాదు. కాశ్మీరు ప్రజలు తమది ప్రత్యేక దేశమనీ, కాశ్మీరు ప్రజల్లో రిఫరెండం నిర్వహిస్తానని హామీ ఇచ్చి నెహ్రూ దాన్ని ఉల్లంఘించాడనీ, బలవంతంగా కాశ్మీరును ఇండియాలో కలుపుకున్నారనీ చెబుతూ, తమ దేశ స్వతంత్రం కోసం స్వాతంత్ర పోరాటం చేస్తున్నామని చెబుతున్నారు. వారిది వేర్పాటువాదం. శ్రీలంక నుండి ఈలం కావాలని ఎల్.టి.టి.ఇ పోరాటం నడిపింది. వారిదీ వేర్పాటు వాదం అవుతుంది. కాని తెలంగాణ డిమాండ్ అలాంటిది కాదు.
చాలా దేశాల లాగానే భారత దేశం కూడా ఫెడరల్ రాజ్యాంగాన్ని కలిగి ఉంది. వివిధ రాష్ట్రాల సమాఖ్యగా భారత దేశాన్ని ఏర్పరచుకుని దానికి ఫెడరల్ రాజ్యాంగాన్ని ఏర్పరిచారు. వివిధ రాష్ట్రాల సమాఖ్యగా ఉన్న దేశాల్లో రాష్ట్రాలు తమను తాము పాలించుకునే హక్కుని కలిగి ఉంటాయి. అవి తమకు తాము ఒక ప్రభుత్వాన్ని ఏర్పరుచుకునే హక్కుని కలిగి ఉంటాయి. అదే సమయంలో ఒక కేంద్రీకృత రాజ్యాధికారం కలిగి ఉన్న కేంద్ర ప్రభుత్వం కూడా ఉంటుంది. దానిని సాధారణంగా ఫెడరల్ గవర్న్‌మెంట్ అని పిలుస్తారు.
కాని భారత రాజ్యాంగ రూపకర్తలు ఫెడరల్ వ్యవస్ధ అని చెబుతూనే ఫెడరల్ ప్రభుత్వం అని సంభోదించకుండా ‘యూనియన్ గవర్నమెంట్’ అని సంభోదించారు. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వాన్ని అధికారిక ఉత్తర్వుల్లో గానీ, అధికారిక సంభాషణలలో గానీ, రాజ్యాంగ భాషలో గానీ యూనియన్ ప్రభుత్వం అనే సంభోదిస్తారు. మంత్రులను యూనియన్ మంత్రులని సంభోధిస్తారు. ‘ది హిందూ’ లాంటి పద్దతులను నిక్కచ్చిగా పాటించే పత్రికలు కూడా రాజ్యాంగ భాషనే వినియోగించడం మనం చూడవచ్చు. యూనియన్ ప్రభుత్వంలో కంటే ఫెడరల్ ప్రభుత్వం లోనే రాష్ట్రాలకు అధికారాలు కొంత ఎక్కువగా ఉంటాయి. అంటే భారత దేశంలో రాష్ట్రాల అధికారాలు కేంద్ర ప్రభుత్వ అధికారాలకు లోబడి ఉంటాయి అని చెప్పవచ్చు.
రాజ్యాంగం కేంద్రం, రాష్ట్రాల మధ్య వివిధ పాలనాంశాలను మూడు జాబితాలుగా విభజించింది. ఒకటి, రాష్ట్ర జాబితా; రెండు, కేంద్ర జాబితా; మూడు, ఉమ్మడి జాబితా. రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపై రాష్ట్రమే పూర్తిగా నిర్ణయాధికారాన్ని కలిగి ఉంటుంది. కేంద్ర జాబితాలోని అంశాలపై కేంద్రమే పూర్తి నిర్ణయాధికారం కలిగి ఉంటుంది. ఉమ్మడి జాబితాలోని అంశాలపై ఇరు పక్షాలు చర్చించుకుని నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది.
ఈ రాజ్యాంగ నియమ నిబంధనల నేపధ్యంలో ఒక రాష్ట్రం నుండి విడిపోయి మరొక కొత్త రాష్ట్రం ఏర్పడినప్పటికీ అది కేంద్ర ప్రభుత్వ అధికారాలకు లోబడే ఉంటుంది తప్ప కేంద్రానికి అతీతంగా ఉండబోదు. అందుకు రాజ్యాంగం ఒప్పుకోదు. వేరే దేశంగా విడిపోవడం అనేది జాతీయ సమగ్రతకు, సార్వ భౌమాధికారానికి విరుద్ధం కనుక అది దేశ ద్రోహంతో సమానం. అటువంటి వారితో కేంద్ర ప్రభుత్వం నేరుగా సైన్యంతోనే పోరాటం చేస్తుంది. చాలాకాలంగా కాశ్మీరులో జరుగుతున్నది అదే. మొన్నటివరకు శ్రీలంకలో శ్రీలంక ప్రభుత్వానికీ, ఎల్.టి.టి.ఇ కి మధ్య జరిగిందీ అదే.
కాని తెలంగాణ ప్రజలు కోరుతున్నది వేరే దేశం కాదు. కేవలం వేరే రాష్ట్రం మాత్రమే. కనుక తెలంగాణ రాస్ట్ర ఏర్పాటుజు కోరడం వేర్పాటువాదంగా పేర్కొనడం సరైంది కాదు. పైగా లేని భావాల్ని రేకెత్తించడానికి దోహదపడుతుందేమో ఆలోచించాలి కూడా.
కొత్త రాష్ట్రాల ఏర్పాటును భాషాప్రయుక్త ప్రాతిపదికన మొదట ఏర్పాటు చేశారు. అప్పుడే ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అయితే భాషాప్రయుక్త రాష్ట్రాలు అంటే నిర్వచనం ఏమిటి? ఒక భాష మాట్లాడేవారు సాధారణంగా ఒకే సంస్కృతిని కలిగి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకే సంస్కృతి లేక పోనూ వచ్చు. కనుక ఒక భాష మాట్లాడేవారంతా ఒక రాష్ట్రంగా ఉండడమే భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు గా చెప్పుకోవచ్చా?
అదే నిజమైతే హిందీ మాట్లాడే వారికి ఒకటికంటే ఎక్కువగా రాష్ట్రాలు ఉండడాన్ని ఎలా చూడాలి. ఒకే భాష మాట్లాడుతున్నా వివిధ రాష్ట్రాలుగా ఉండటానికి కేంద్ర పభుత్వం ఎలా అనుమతి ఇచ్చింది? ఇచ్చిన అనుమతికి ప్రాతిపదిక ఏమిటి? పూర్తిగా తమిళమే మాట్లాడే పాండిచ్చేరిని కేంద్ర పాలిత పాంత్రంగా రద్దు చేశాక తమిళనాడులో కలప కుండా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయడానికి ప్రాతిపదిక ఏమిటి? భాషాప్రయుక్త సిద్ధాంతం ప్రాతిపదికన తమిళనాడులో ఎందుకు కలపలేదు? పుదుచ్చేరిని రాష్ట్రంగా ఏర్పాటు చేయడానికి పరిపాలనా సొలభ్యమే కారణం అని తేలిగ్గా చెప్పేయడానికి వీలు లేదు. అలా చేస్తే ఇంకా అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి కనుక ఒక ప్రాతిపదికను అనుసరించి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. ఆ ప్రాతిపదిక ఏమిటి?
దానికి సమాధనం ఇది: భాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు అంటే ఒకే భాష మాట్లాడే వారంతా ఒకే రాష్ట్రంగా ఉండాలి అని అర్ధం కాదు. “ఒక రాష్ట్రంలో ఉన్న వారంతా ఒకే భాష మాట్లాడే వారై ఉండాలి” అన్నదే భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ప్రధాన ప్రాతిపదిక. ఇక్కడ మనకు సమస్యలుగా కనిపించినవన్నీ సమస్యలు కాదని తేలిపోతుంది. “ఒక రాష్ట్రంలో ఉన్న వారంతా ఒకే భాష మాట్లాడే వారై ఉండాలి” అన్నపుడు ఒక భాష మాట్లాడేవారంతా ఒకే రాష్ట్రంలో ఉండవలసిన అవసరం లేదు. ఒక భాష మాట్లాడే వారు ఒకటికంటే ఎక్కువ రాష్ట్రాలుగా ఉండవచ్చు. కాని ఒకే రాష్ట్రంలో రెండు భాషలు మాట్లాడేవారు మాత్రం ఉండకూడదు. ఈ సూత్రం మతాలకు వర్తించదని గమనించాలి.
మీ వాదన కరెక్టే, కానీ విడిపోవడానికి చూపుతున్న కారణాలే అసలు సమస్య. విడిపోక తప్పని పరిస్తితులు నిజంగా ఉన్నాయంటారా? విడిపోవడం వల్లే తెలంగాణాకు బంగారు భవిష్యత్తు వస్తుందా? ఇప్పుడు విడి తెలంగాణా కావాలంటున్న వాళ్ళు ఇంతకు ముందు ఎన్నడైనా నిరక్షరాస్యత, పేదరికం, అనారోగ్యం లాంటి వాటిని రూపుమాపడానికి పోరాడారా? ఒకవేళ పోరాడి ఉంటే మరి అవి ఇంకా ఎందుకు అలాగే ఉన్నాయి? చాలా కాలం పాటు వివిధ పార్టీల్లో రకరకాల హోదాలు, అధికారాలు అనుభవిస్తున్నపుడు ఇవి గుర్తుకు రాలేదా? రాష్ట్రం విభజించడం మాత్రమే సమస్యకు పరిష్కారమైతే తప్పకుండా విభజించాలి. ఒకరి స్వార్థ ప్రయోజనాలకోసమో అయితే మాత్రం కూడదు. ఇప్పడు ఉద్యమాన్ని నడిపిస్తున్నది స్వార్థ రాజకీయమే.
మీరు లేవనెత్తిన ప్రశ్నలను ఇదే బ్లాగ్ లో మరో పోస్టులో చర్చించాను. లింక్ ఇదిగోండి:
https://teluguvartalu.wordpress.com/2011/07/07/%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b0%82%e0%b0%97%e0%b0%be%e0%b0%a3-%e0%b0%a1%e0%b0%bf%e0%b0%ae%e0%b0%be%e0%b0%82%e0%b0%a1%e0%b1%8d%e2%80%8c%e0%b0%aa%e0%b1%88-%e0%b0%85%e0%b0%82%e0%b0%a4%e0%b0%b0%e0%b1%8d/
తెలంగాణ డిమాండ్ ఎంతవరకు ప్రజల సమస్యల్ని తీర్చుతుంది అన్న విషయం ఇందులో చర్చించాను. చదివి మీ అభిప్రాయం తెలియ జేయగలరు.