కర్ణాటక ముఖ్యమంత్రి, మంత్రులు, గనుల యజమానులే గనుల మాఫియా సృష్టికర్తలు -లోకాయుక్త


కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి, కొందరు మంత్రులు, అధికారులు, గనుల యజమానులు అంతాకలిసి బళ్లారి ఇనుప గనుల్లో మాఫియా లాంటి వ్యవస్ధను సృష్టించారని కర్ణాటక లోకాయుక్త జస్టిస్ సంతోష్ హెగ్డె వెల్లడించారు. సుప్రీం కోర్టులో మాజీ న్యాయమూర్తిగా పని చేసిన జస్టిస్ సంతోష్ హెగ్డే, ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులతో పాటు గనుల యజమానులు అవినీతికి పాల్పడి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి 1800 కోట్ల రూపాయల నష్టం కలగజేశారని వెల్లడించారు. మార్చి 2009 మే 2010 వరకూ 14 నెలల కాలంలో వీరి వలన రాష్ట్రానికి నష్టమొచ్చిందనడానికి పెద్ద మొత్తంలో సాక్ష్యాలు కూడా ఉన్నాయని జస్టిస్ సంతోష్ హెగ్డె వెల్లడించారు. గుణాత్మకంగా, పరిమాణాత్మకంగా కూడా పెద్ద ఎత్తున సాక్ష్యాలు తనకు అందాయని ఆయన తెలిపారు.

చట్ట వ్యతిరేక మైనింగ్ కార్యకలాపాల వెనుక ‘అతి పెద్ద రాకెట్’ ఉన్నదని చెబుతూ “పద్నాలుగు నెలల కాలంలో రు.1800 కోట్లకు పైగా నష్టం సంభవించింది. ఇది రాష్ట్ర ఖజానాకు వాటిల్లిన నష్టం” అని హెగ్డే అన్నారు. అది ముఖ్యమంత్రి కానియండి, మంత్రులు కానివ్వండి లేదా గనుల యజమానులు కానివ్వండి. వారికి వ్యతిరేకంగా గుట్టల కొద్దీ సాక్ష్యాలు లభించాయని ఆయన తెలిపారు. “నిజానికి గనులు సమృద్ధిగా ఉన్న బళ్ళారి జిల్లాలో జరిగినదానికంతటికీ ముఖ్యమంత్రే బాధ్యుడు. ఎందుకంటె బళ్ళారి జిల్లాకు బాధ్యుడైన జి.జనార్ధన రెడ్డి స్వయంగా ‘ఓబులాపురం మైనింగ్ కంపెనీ’ కి యజమాని,” అని ఆయన తెలిపాడు.

“ప్రతి ఒక్క అధికారి భాగస్వామ్యంతో అక్కడ మాఫియా లాంటి పరిస్ధితిని సృష్టించారు. అక్కడ ఉన్న వ్యవస్ధను మొత్తంగా పెళ్ళగించి కొత్త వ్యవస్ధను సృష్టించారు. దాని ద్వారా ఇతర మైనింగ్ కంపెనీలను కూడా పచ్చిగా కొల్లగొట్టారు” అని హెగ్డే  తెలిపాడని పి.టి.ఐ వార్తా సంస్ధ పేర్కొంది. తాను తయారు చేస్తున్న నివేదికలో ఉన్న అంశాలను చెబుతున్నంత మాత్రాన అది ప్రతికూల ప్రభావం చూపబోదని, ఎందుకంటే అది నివేదిక ప్రామాణికతను నష్టం చేయజాలదని ఆయన పేర్కొన్నట్లుగా ఆ సంస్ధ తెలిపింది. చట్ట వ్యతిరేక మైనింగ్ కార్యకలాపాలు వెలుగులోకి రావడం అందులో బి.జె.పి ఆధ్వర్యంలోని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి బాధ్యత ఉన్నదని వెల్లడి కావడంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష బి.జె.పి పై పై చేయి దొరికినట్లయ్యింది.

ఇక ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు గుప్పించుకుంటూ వార్తా పత్రికలనూ, ఛానెళ్ళను కలుషితం చేయడానికి పాలక ప్రతిపక్షాలకు కావలసినంత మేత దొరికినట్లయ్యింది వీరి పరస్పర ఆరోపణలతో అసలు ఇరువరి అవినీతిపై విచారణ జరగాలన్న అంశాన్ని వెనక్కి నెట్టడానికి ఇరుపక్షాలు కుట్రలు పన్నుతాయి. అంతిమంగా అవినీతిపై విచారణను ఏదో విధంగా వాయిదా వేసో, తూతూ మంత్రంగా ముగించో ఇరువురు లాభం పొందటానికి ప్రయత్నించే అవకాశలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. నిజానికి ఆ క్రమం ప్రారంభమయ్యింది కూడా.

కాంగ్రెస్ పార్టీ బి.జె.పి ముఖ్యమంత్రి యెడ్యూరప్ప రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ అధికారిక ప్రతినిధి షకీల్ అహ్మద్ “యెడ్యూరప్ప వెంటనే రాజీనామా చేయాల్సిందే” అని అంటూ కర్ణాటకలోని చట్టవిరుద్ధ మైనింగ్ కార్యకలాపాలపై బి.జె.పి నాయకత్వం మౌనంగా ఉండడాన్ని ప్రశ్నించాడు. బి.జె.పి అగ్ర నాయకత్వం ప్రోద్బలంతోనే ఇది జరుగుతున్నదని ఆరోపించాడు. మరోవైపు బి.జె.పి స్పందన తక్కువగా ఏమీ లేదు. హెగ్డే నివేదికపై ఇప్పుడే వ్యాఖ్యానిండం తొందరపాటు అవుతుందని చెబుతూ, బి.జె.పి ప్రతినిధి ప్రకాష్ జవదేకర్ నివేదిక బహిరంగం అయ్యేదాకా వేచి చూస్తామని తెలిపాడు. దానికంటే ముందు షుంగ్లు కమిటీ, ఢిల్లీ లోకాయుక్తలు ఇచ్చిన నివేదికలపైన కాంగ్రెస్ పార్టీ స్పందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు.

“కామన్‌వెల్త్ గేమ్స్ కుంభకోణంలో షుంగ్లు కమిటీ ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ప్రభుత్వంపై నేరారోపణ చేసింది. షీలా దీక్షిత్ మంత్రివర్గ సభ్యుడు రాజ్‌కుమార్ చౌహాన్ పై తివోలి గార్డెన్ కేసులో చర్య తీసుకోవాలని ఢిల్లీ లోకాయుక్త నివేదిక రాష్ట్రపతికి సిఫారసు చేసింది. ఈ రెండు కేసుల్లో ఇప్పటివరకూ ఏ చర్యలూ తీసుకోలేదు. కాంగ్రెస్ ముందు దీనికి స్పందించాలి” అని ప్రకాష్ జవదేకర్ డిమాండ్ చేశాడు. బి.జె.పి పాపాలపై చర్య తీసుకునే అవకాశం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. కాని కాంగ్రెస్ అందుకు సిద్ధపడదు. బి.జె.పి నాయకులపై చర్యలు తీసుకుంటే కాంగ్రెస్ నాయకులపై కూడా చర్యలు తీసుకోవలని ఒత్తిడి పెరుగుతుంది. దాని బదులు కాంగ్రెస్, బి.జె.పిలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ కాలం గడిపితే ఆ దుమ్ము కళ్ళలో పడిన జనం వాస్తవాలను చూడలేరని ఈ ఇద్దరూ పాపులకి బాగానే తెలుసు. ప్రజల్లోని కొని సెక్షన్లు సైతం ఇరువైపులా చేరి వారి పాపాలను నెత్తిపై వేసుకుని కొట్టుకున్నా ఆశ్చర్యం లేదు.

అంతిమంగా పాలకులు, ప్రతిపక్షాల అవినీతి ససాక్ష్యాలతో రుజువైనా చర్యలు తీసుకునేవారు ఉండరు. ప్రజలు ఆ అవకాశాలను తమ చేతుల్లోకి తీసుకుంటే తప్ప.

వ్యాఖ్యానించండి