సుప్రీం కోర్టు జోక్యంతో “ఓటుకు నోటు” కేసు ముందుకు కదులుతున్నట్లు కనిపిస్తోంది. ముగ్గురు బి.జె.పి ఎం.పిలు యు.పి.ఎ-1 ప్రభుత్వం ప్రవేశ పెట్టిన విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయకుండా ఓటింగ్ నుండి నిష్క్రమించడానికి కాంగ్రెస్ పార్టీవారు తమకు కోటి రూపాయలు ఇచ్చారంటూ, విశ్వాస పరీక్షరోజే ఆరోపించిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం ఈ కేసులో ఢిల్లీ పోలీసులు సమాజ్ వాదీ పార్టీ మాజీ నాయకుడు అమర్ సింగ్‌కు సయాయకుడుగా ఉన్న సంజీవ్ సక్సేనాను అరెస్టు చేశారు. బి.జె.పి పార్టీలో మాజీ నాయకుడుగా పని చేసిన సుహాయిల్ హిందూస్ధాని అనే వ్యక్తిని ఢిల్లీ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. అమర్ సింగ్ ని కూడా ప్రశ్నించడానికి ఢిల్లీ పోలీసులు రాజ్యసభ ఛైర్మన్ అనుమతి కోరినట్లుగా వార్తలు తెలుపుతున్నాయి. రాజ్యసభ సభ్యులను ప్రశ్నించాలంటే పోలీసులు రాజ్యసభ ఛైర్మన్ అనుమతిని తీసుకోవలసి ఉంటుంది.
మంగళవారం పోలీసులు సుహాయిల్ హిందూస్ధానీ తమవద్ద బుధవారం లోపు హాజరు కావలసినదిగా నోటీసులు జారీ చేశామని తెలిపారు. బుధవారం ఉదయం గం.10:30ని.లకు హిందూస్ధానీ తమవద్దకు వచ్చాడనీ, అప్పటినుండి సాయంత్రం గం.6 ల వరకు అతనిని ప్రశ్నించిన అనంతరం అదుపులోకి తీసుకున్నామనీ పోలీసులు తెలిపారు. జులై 16న అరెస్టు చేయబడిన సంజీవ్ సక్సేనా పోలీసుల విచారణలో తనకు అమర్ సింగే కోటి రూపాయల సొమ్మును ముట్టజెప్పాడని తెలుస్తోంది. మధ్యవర్తిగా వ్యవహరించాడని ఆరోపణలున్న సుహాయిల్ హిందూస్ధానీ కూడా ఇవే ఆరోపణలను అమర్ సింగ్ పై చేస్తున్నాడు. ‘ఓటుకు నోటు’ వ్యవహారంలో అమర్ సింగే ప్రధాన పాత్రధారి అని అతను చెప్పినట్లు ఐ.ఎ.ఎన్.ఎస్ వార్తా సంస్ధ వెల్లడించింది. సంజీవ్ సక్సేనా గతంలో అమర్ సింగ్ ప్రైవేటు సెక్రటరీగా పని చేసినప్పటికీ అతనితో తనకసులు సంబంధమే లేదని అమర్ సింగ్ ఇప్పుడు చెబుతున్నాడు.
అమర్ సింగ్ డ్రైవర్ సంజయ్ తో కలిసి తాను ముగ్గురు బి.జె.పి ఎం.పి లకు డబ్బు అందజేయడానికి వెళ్ళానని సంజీవ్ సక్సేనా పోలీసులకు చెప్పినట్లుగా ఐ.ఎ.ఎన్.ఎస్ సంస్ధ వెల్లడించింది. ఇదే విషయాన్ని బి.జె.పి ఎం.పిలు ఫగన్ సింగ్ కులస్తే, మహావీర్ భగోరాలు చెబుతుండడం గమనార్హం. సక్సేనా తన సెక్రటరీగా అమర్ సింగ్ తమకు పరిచయం చేశాడని కూడా బి.జె.పి ఎం.పి లు చెబుతున్నారు. విశ్వాస పరీక్ష రోను, అంతకు ముందు రోజు తాను అనేక సార్లు అమర్ సింగ్‌తో ఫోన్లో మాట్లాడానని సక్సేనా చెప్పాడు. సక్సేనా చెబుతున్న విషయాలన్నింటినీ అమర్ సింగ్ తిరస్కరిస్తున్నాడు. సక్సేనా తన సెక్రటరీయే కాదు పొమ్మని అమర్ సింగ్ చెబుతున్నాడు. ఈ నేపధ్యంలో సక్సేనా ఫోన్‌ను సంపాదించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అమర్ సింగ్ డ్రైవర్ సంజయ్ కోసం కూడా వారు గాలిస్తున్నారు.
ఇదిలా ఉండగా అమర్ సింగ్‌ను ప్రశ్నించడానికి రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారి, పోలీసులకు అనుమతి మంజూరు చేసినట్లు వార్తలు తెలిపుతున్నాయి. మొదట హోం మంత్రిత్వ శాఖను అనుమతి కోరిని పోలీసులు, ఆ శాఖ అధికారులు రాజ్యసభ ఛైర్మన్‌ని అనుమతి కోరవలసి ఉంటుందని చెప్పడంతో హమీద్ అన్సారీకి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అన్సారీ, అమర్ సింగ్ ను ప్రశ్నించడానికి అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ వార్తను ఇంకా ధృవ పరుచుకోవాల్సి ఉంది.
