ప్రభుత్వ లోక్ పాల్ డ్రాఫ్టు చాలా బలహీనమైనదనీ, తప్పించుకోవడానికి అవసరమైన అనేక రంధ్రాలు కలిగి ఉన్నదనీ కనుక తాము రూపొందించిన జన్ లోక్‌పాల్ డ్రాఫ్టును పార్లమెంటులో ప్రవేశ పెట్టాలని సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నాడు. ప్రభుత్వం రూపిందించిన లోక్ పాల్ డ్రాఫ్టు భారత దేశ ప్రజల మీదికి విసిరిన ఒక పెద్ద జోక్ అని ఆయన అభివర్ణించారు. ప్రధానికి రాసిన లేఖలో అన్నా హజారే, ఆమరణ దీక్షకు దిగుతానన్న తన నిర్ణయాన్ని పునరుద్ఘాటించారు.
“పార్లమెంటు ప్రొసీజర్ ప్రకారం వెళ్ళడానికి మేము సిద్ధమే. కాని, కనీసం మీ ప్రభుత్వం శక్తివంతమైన, ప్రభావవంతమైన బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టాలి. లేనట్లయితే ఏప్రిల్ నెలలో నేను చెప్పినట్లుగానే ఆగష్టు 16 నుండి ‘ఆమరణ నిరాహార దీక్ష’ చేయడం తప్ప నాకు మరొక మార్గం లేదు” అని హజారే ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
ప్రభుత్వానికి శక్తివంతమైన లోక్ పాల్ బిల్లు ను రూపొంచించడానికి తగిన చిత్తశుద్ధి లేదని హజారే ఆరోపించాడు. “ప్రభుత్వ డ్రాఫ్టు దేశం మీదికి వదిలిన ఒక జోక్. ప్రభుత్వం రూపొందించిన బిల్లు పరిధిలోకి ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న కుంభకోణాలేవీ రావు. మనం ఎక్కడైతే ప్రారంభించామో అక్కడే నిలబడి ఉన్నాం” అని హజారే పేర్కొన్నారు. ప్రధానికి రాసిన లేఖను పత్రికలకు విడుదల చేస్తూ సామాజిక కార్యకర్తలు, తాము రూపొందించిన “జన్ లోక్‌పాల్” బిల్లుపై ‘చాంద్‌నీ చౌక్ పార్లమెంటరీ నియోజకవర్గంలో రిఫరెండం నిర్వహిస్తామని ప్రకటించారు. చాందినీ చౌక్ పార్లమెంటరీ నియోజకవర్గానికి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి కపిల్ సిబాల్ ప్రాతినిధ్యం వహిస్తుండడం గమనార్హం. ముఖ్యంగా లోక్‌పాల్ బిల్లు పరిధిలోకి కేవలం గ్రేడ్-ఎ అధికారులు మాత్రమే కాకుండా మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు, ప్రధాన మంత్రి, న్యాయవ్యవస్ధ ఉన్నతాధికారులు తీసుకురావాలో లేదో రిఫరెండంలో ప్రశ్నిస్తామని పౌర సమాజ కార్యకర్తలు తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై మరొకరు వేలెత్తి చూపుకుంటూ అవినీతికి వ్యతిరేకంగా శక్తివంతమైన లోక్‌పాల్ బిల్లు రూపొందకుండా తాత్సారం చేస్తున్నాయని హజారే ఆరోపించాడు. “రాష్ట్ర, కేంద్రాల ఉమ్మడి జాబితాలో ఉన్న అంశంపై లోక్ పాల్, లోకాయుక్త (రాష్ట్రాలకు) వ్యవస్ధలను నియమించడానికి వీలుగా ఒకే చట్టం తేవడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తోంది? రాష్ట్రాలలో అవినీతిని పారద్రొలడానికి ప్రజలు సంవత్సరాల తరబడి వేసి ఉండవలసిందేనా? అవినీతికి సంబంధించిన ఫిర్యాదులపై సామాన్య మానవుడు ఎక్కడికి వెళ్ళాలి?” అని హజారే ప్రశ్నల వర్షం కురిపించారు.
తన నిరసన కూడా బాబా రాందేవ్ నిరసన శిబిరం ఎదుర్కొన్న పరిస్ధితినే ఎదుర్కొనవలసి ఉంటుందని కొందరు నాయకులు, మంత్రులు ప్రకటనలు చేస్తుండడంపై హజారే స్పందించారు. “ఎవరైనా సరే అలా మాట్లాడ్డం కరెక్ట్ కాదు. నిరసన తెలిపే హక్కు ప్రజలకు ఉన్న మౌలిక హాక్కు అని గుర్తించాలి” అని ఆయన వ్యాఖ్యానించాడు. ఆగష్టులో తమ నిరసనకు ప్రభుత్వం అనుమతి ఇవ్వని పక్షంలో తాము సుప్రీం కోర్టుని ఆశ్రయిస్తామని లాయర్ ప్రశాంత్ భూషణ్ తెలిపాడు.
శక్తివంతమైన లోక్ పాల్ బిల్లుని రాజకీయ పార్తీలు వ్యతిరేకించవచ్చు గానీ, తనకు ప్రజలపై గట్టి నమ్మకం ఉన్నదనీ, వారే అంతిమ నిర్ణేతలనీ హజారే విలేఖరులతో మాట్లాడుతూ అన్నాడు. పౌర సమాజ కోర్ టీం సభ్యురాలనియ కిరణ్ బేడి ముంబైలో శాంపిల్ సర్వే జరిపామని తెలిపింది. అక్కడ శక్తివంతమైన అవినీతి వ్యతిరేక బిల్లు కావాలనీ, ఉన్నత న్యాయవ్యవస్ధ, ప్రధానమంత్రిలు కూడా లోక్ పరిధిలోకి రావాలని 95 శాతం మంది కోరారని తెలిపింది.
ఇదిలా ఉండగా ప్రఖ్యాత పౌర సమాజం కార్యకర్త స్వామి అగ్నివేష్, ప్రధాని నిజాయితీపరుడన్న అంశాన్ని ప్రశ్నించాడు. పంజాబ్‌కి చెందిన మన్మోహన్ సింగ్, అస్సామ్ నివాసిగా తప్పుడు రికార్డులు సృష్టించాక అక్కడ నుండి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యాడని అగ్నివేష్ ఆరోపించారు. తాను పుట్టిన ప్రదేశాన్ని కూడా తప్పుగా చూపించి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన ప్రధాని మన్మోహన్ నిజాయితీపరుడుగా చెలామణి కావడాన్ని ఆయన ప్రశ్నించాడు.

అన్నా హజారే వాదన నిజమే, ప్రధానిని కూడా జన్ లోక్పాల్ బిల్లు పరిధిలోకి తీసుకురావడం మంచి పనే, కానీ ప్రధానిని కూడా విచారించడానికి అధికారాలున్న లోక్పాల్ ని ఎలా, ఎవరు – నియమిస్తారు? ఆ నియమించే వారి నిజాయితీ, నిబద్ధతలకి కొలమానం ఏమిటి? అప్పటిదాకా నిజాయితీని శ్వాసించిన వ్యక్తి లోకపాల్ అయిన తరువాత నిజాయితీగా వ్యవహరిస్తాడని ఏమిటి నమ్మకం? వ్యక్తుల, అధికారుల నిజాయితీ దేశానికి ఎంతో అవసరం కానీ నిజాయితీ తప్పిన ఎవరినైనా శిక్షించే చట్టాలు అవసరం, మరి వీటిని తీసుకురావడానికి నిజాయితీ ఉన్న ప్రభుత్వం కావాలి, సాధ్యమేనా??
మీ ప్రశ్నలు సినిసిజం కిందికి వస్తాయేమో వనమాలి గారూ.
నిజమే. నమ్మక పోవడమే ప్రధానమైతే ఎవరినీ నమ్మలేము. మానవుడిగా ఆశావాదిగా ప్రయత్నించడమే కావలసింది. ఫలితాలు కూడా సవ్యంగా ఉండేలా ప్రజల అధికారం నిర్ణయాత్మకం ఐన రోజున ఇన్ని అనుమానాలకు తావు ఉండకపోను.
అన్న హజారే వాదన నాకు విచిత్రంగా అనిపించి ఇలా స్పందిచాల్సి వచ్చింది. ప్రధానిని నమ్మలేని పరిస్థితుల్లో లోక్ పాల్ ని మాత్రం ఎలా నమ్మడం అన్నది మాత్రమే నాప్రశ్న. ఇది సినిసిజం కిందికి వచ్చినా పర్వాలేదు, సమాధానం దొరికితే చాలు.