రుమేనియాకి చెందిన రైలులో రవాణా అవుతున్న మిసైళ్ళ వార్‌హెడ్స్ ను గుర్తు తెలియని దుండగులు దొంగిలించిన ఉదంతం సంచలన కలిగిస్తోంది. ఆదివారం, రుమేనియా నుండి బల్గేరియాకు రవాణా అవుతున్న మిసైళ్ళనుండి వార్ హెడ్స్ తొలగించి దొంగిలించినట్లుగా రుమేనియా ఇంటీరియర్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రాసిక్యూటర్లు, దొంగతనాన్ని విచారిస్తున్నట్లు తెలిపారు. ఇంటీరియర్ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మేరియస్ మిలిటారు, దొంగిలించబడిన విడిభాగాలు వాటంతట అవే ప్రమాదకరం కావనీ మిసైల్ వ్యవస్ధతో కలిసి ఉంటేనే ప్రమాదకరమనీ తెలిపాడు.
మిలట్రీ పరికరాలతో కూడిన రైలు శనివారం గియుగియు పట్టణానికి చేరినపుడు అక్కడ ఉన్న రైల్వే కార్మికులు రైలు పెట్టెల తలుపులు వేసిన సీలు తొలగించి ఉండడాన్ని గమనించారు. తలుపులు సరిగా మూసి లేకపోవడాన్ని వారు గమనించి అధికారులకు తెలియజేశారు. గియుగియు, డాన్యూబ్ నదిపై పోర్టు ఉన్న నగరం. వార్ హెడ్స్ ను రుమేనియాకి చెందిన తోహాన్ జర్నెస్టీ అనే కంపెనీ తయారు చేసి బల్గేరియాకి తరలిస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.
తోహాన్ కంపెనీ, ఫిరంగులకు మందుగుండు సామాగ్రి, భూ ఉపరితలం నుండి భూ పరితలానికి పేల్చే మిసైళ్ళు, గాల్లో నుండి ఉపరితలం మీదికి పేల్చే మిసైళ్ళు, 122 మి.మీ మిసైళ్ళకు వార్ హేడ్స్ ను తయారు చేస్తుందని తెలుస్తోంది.

