సుప్రీం కోర్టు తలంటుతో కదిలిన ఢిల్లీ పోలీసులు, ‘నోటుకు ఓటు’ స్కామ్‌లో సంజీవ్ సక్సేనా అరెస్టు


lyngdoh

పిటిషన్ దాఖలు చేసిన ఎన్నికల కమిషన్ మాజీ ప్రధాన కమిషనర్ జె.ఎం.లింగ్డో

ఎట్టకేలకు ఢిల్లీ పోలీసులు ఒకడుగు ముందుకేశారు. ‘నోటుకు ఓటు’ కుంభకోణం పరిశోధనలో రెండు సంవత్సరాలనుండి ఎటువంటి పురోగతి లేకపోవడంపై సుప్రీం కోర్టు రెండ్రోజుల క్రితం తీవ్ర స్ధాయిలో తలంటడంతో, తమ దర్యాప్తుకు శ్రీకారం చుట్టారు. ముగ్గురు బి.జె.పి ఎం.పిలు యు.పి.ఎ ప్రభుత్వ విశ్వాస పరీక్షలో అనుకూలంగా ఓటు వేయడానికి అమర్ సింగ్ అనుచరుడు సంజీవ్ సక్సేనా కోటి రూపాయలు ఇచ్చిన ఆరోపణపై సంజీవ్ సక్సేనాను అరెస్టు చేశారు. అయితే అసలు పాత్రధారుడు సంజీవ్ సక్సేనా కాదు. ఆయన కేవలం చెప్పింది చేసినవాడు మాత్రమే. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా బి.జి.పి ఎం.పి లపై వల వేయడానికి ప్రయత్నించింది సమాజ్ వాదీ పార్టీ మాజీ నాయకుడు అమర్ సింగ్. అమర్ సింగ్ ఇప్పుడు సక్సేనాకు తనకు సంబంధం లేదంటున్నాడు.

జులై 22, 2008 తేదీన బి.జె.పి ఎం.పిలు అశోక్ అర్గాల్, ఫగ్గన్ సింగ్ కులస్తే, మహావీర్ భగోరాలు అమర్ సింగ్ సహాయకుడు సంజీవ్ సక్సేనా తమకు కోటి రూపాయలు ఇచ్చాడని పార్లమెంటులో నోట్ల కట్టలు చూపుతూ ఆరోపించారు. 4 ఫిరోజ్‌షా రోడ్డు లోని అశోక్ అర్గాల్ నివాసంలో విశ్వాస పరీక్ష జరగడానికి కొన్ని గంటల ముందు సంజీవ్ సక్సేనా తమకు కోటి రూపాయలు ఇచ్చాడని బి.జె.పి ఎం.పిలు ఆరోపించారు. ఈ కార్యక్రమం అంతా రహస్యంగా అమర్చిన ఒక కెమేరాలో బంధించబడిందని వారు తెలిపారు. ఒక టీవి న్యూస్ ఛానెల్ వారు కెమేరా అందించారని వారు తెలిపారు. కేసు కోర్టులో ఉండడంతో ఆ ఛానెల్ వారు ఈ దృశ్యాలను ప్రసారం

Sanjeev Saxena

అరెస్టు అయిన అమర్ సింగ్ అనుచరుడు 'సంజీవ్ సక్సేనా'

చేయలేక పోయారు. అర్గాల్ ఇంటినుండి ముగ్గురు ఎం.పిలు ఒక కారులో అమర్ సింగ్ ఇంటికి బయలు దేరారనీ, వారున్న కారును ఛానెల్ కి సంబంధించిన వారు మరొక కారులో అనుసరించారని, తద్వారా ముగ్గురు బి.జె.పి ఎం.పిలు ఉన్న కారు ఎక్కడెక్కడికి వెళ్ళిందీ రికార్డయ్యిందని చెప్పారు.

సక్సేనాను ఆదివారం కొద్దిసేపు విచారించిన అనంతరం అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. “క్రైం బ్రాంచి పోలీసులు ఢిల్లీలొ అతనిని (సక్సేనాను) అరెస్టు చేశారు. ఈ కేసులో అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం ఉంది. రేపు కోర్టులో అతనిని హాజరు పరుస్తాము” అని పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పినట్లుగా ‘ది హిందూ’ తెలిపింది. అవినీతి నిరోధక చట్టం కింద సక్సేనాను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. డబ్బు ఇచ్చిన అనంతరం సక్సేనా మొబైల్ ఫోన్‌లో అమర్ సింగ్ తో ఫోన్లో సంప్రదించి ముగ్గురు ఎం.పిలతో ఒప్పందం కుదుర్చుకోవడానికై అమర్ సింగ్ తో మాట్లాడించాడని కూడా బి.జె.పి ఎం.పి లు ఆరోపించారు. ఢిల్లీ పోలీసులు “ఓటుకు నోటు” కేసులో మందకొడితనంతో వ్యవహరించడం పట్ల సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసులో సంబంధం ఉన్నవారిని రెండు సంవత్సరాలుగా ఎందుకు అదుపులోకి తీసుకుని విచారించలేకపోయారని కోర్టు ప్రశ్నించింది. సుప్రీం కోర్టు తలంటిన రెండురోజుల్లోనే సంజీవ్ సక్సేనా అరెస్టు కావడం విశేషం.

“ఢిల్లీ పోలీసులు చేసిన దర్యాప్తుతొ మాకు అస్సలు సంతోషంగా లేము. ఇటువంటి తీవ్ర స్వభావం గల కేసులను విచారించే పద్ధతి ఇది కాదు” అని సుప్రీం కోర్టు బెంచి ఢిల్లీ పోలీసులపై వ్యాఖ్యానించింది. ఏడుగురు సభ్యుల పార్లమెంటరీ కమిటీ ఈ కేసును విచారించి ఢిల్లీ పోలీసులకు అప్పజెప్పింది. సక్సేనా పాత్రతో పాటు బి.జె.పి మాజీ నాయకుడు, అద్వానికి మాజీ సహాయకుడు ఐన సుధీంద్ర కులకర్ణి పాత్రపైనా విచారణ జరపాలని ఆ కమిటీ కోరింది. బి.జె.పి ఆరోపణల ప్రకారం సమాజ్‌వాది పార్టీ నాయకుడు రియోటి రమణ్ సింగ్ బి.జె.పి ఎం.పిలు అర్గాల్, కులస్తే, భగోరాలను అర్గాల్ ఇంటివద్ద కలిశాడు. అక్కడే ఒప్పందంపై చర్చ జరిగింది. అక్కడనుండి వోటింగ్ రోజున వారున్న కారు 27 లోఢి ఎస్టేట్ కు వెళ్ళింది. అమర్ సింగ్ నివాసానికి వెళ్ళిన ఆ కారును టి.వి ఛానెల్ వారి కారు అనుసరించింది. సక్సేనా పదే పదే ఒక నంబరుకు ఫోన్ చేయడం టేపులో రికార్డయ్యిందని బి.జె.పి ఎం.పిలు తెలిపారు.

ఎన్నికల కమిషన్ మాజీ ప్రధాన కమిషనర్ జె.ఎం.లింగ్డో దాఖలు చేసిన పిటిషన్ ను విచారిస్తూ సుప్రీం కోర్టు ఢిల్లీ పోలీసుల తీరుపై వ్యాఖ్యానించింది. ఓటుకు నోట్లు అందించిన రాజకీయ నాయకులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాల్సిందిగా ఆయన కోర్టుని తన పిటిషన్ లో కోరాడు.

వ్యాఖ్యానించండి