ముంబై వరుస పేలుళ్ళ నిందితుల్లో ఒకరి ఊహా చిత్రం సిద్ధం చేశామని “యాంటి టెర్రరిస్టు స్క్వాడ్” (ఎ.టి.ఎస్) తెలిపింది. ఊహాచిత్రాన్ని ప్రజలు చూడడానికి విడుదల చేయడం లేదని తెలిపింది. బహుశా నిందితులు అప్రమత్తం అవుతారన్న అనుమానంతో ఎ.టి.ఎస్ ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. బాంబు పేలిన ఒక స్ధలంవద్ద ప్రత్యక్ష సాక్షి కధనంపై ఆధారపడి ఈ ఊహాచిత్రాన్ని గీయించినట్లుగా ఎ.టి.ఎస్ తెలిపింది. చిత్రాన్ని వివిధ దర్యాప్తు సంస్ధలకు అందజేశామని తెలిపింది. దర్యాప్తు సంస్ధలతో పాటు కొద్దిమంది ఎన్నుకున్న ఇన్‌ఫార్మర్లకు కూడా ఊహా చిత్రాన్ని అందజేసినట్లుగా ఎ.టి.ఎస్ తెలిపింది.
“ఒక అనుమానితుని స్కెచ్ సిద్ధమయ్యింది. ఎన్నుకోబడిన అత్యున్నత పరిశోధనాధికారులకు మాత్రమే చిత్రాన్ని అందజేస్తాం. ప్రజలకోసం చిత్రాన్ని విడుదల చేయబోము” అని ఒక ఎ.టి.ఎస్ అధికారి చెప్పినట్లుగా ‘ది హిందూ’ పత్రిక తెలిపింది. ఊహా చిత్రంపై మరిన్ని వివరాలు అందించడానికి ఆ అధికారి నిరాకరించాడని తెలిపింది. పోలీసులు అందించిన తాజా వివరాల ప్రకారం బాంబు పేలుళ్ళలో ఇప్పటివరకూ 19 మంది చనిపోగా, 130 మంది గాయపడ్డారు.
ఇదిలా ఉండగా పేలుళ్ళలో మానవ బాంబు పాత్ర లేదని ఎ.టి.ఎస్ ఛీఫ్ శనివారం తెలిపాడు. అమ్మోనియం నైట్రేట్ ను పేలుడు కోసం వాడారని తెలిపాడు. టైమర్లను కూడా వాడారనీ ఎ.టి.ఎఫ్ చీఫ్ తెలిపాడు. పేలుళ్ల రోజు ఉదయం అరెస్టు చేసిన ఇద్దరు ఇండియన్ ముజాహిదీన్ సంస్ధ సభ్యులతో పాటు గతంలో అరెస్టయిన వారిని కూడా తాజా పేలుళ్ళ విషయమై విచారిస్తున్నట్లు తెలుస్తోంది. పేలుళ్ళను తామే జరిపామని ఇంతవరకూ ఏ సంస్ధా ప్రకటించలేదు. దర్యాప్తు సంస్ధలు తమకు పరిశోధన నిమిత్తం ఘటనా స్ధలాల్లో ఒక్క క్లూ కూడా వదలలేదని తెలుస్తోంది.
కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం, అమ్మోనియం నైట్రేట్ వాడకంపై నియంత్రణ విధించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపాడు. వ్యవసాయ ఎరువుల కోసం, మైనింగ్ కోసం ఈ పదార్ధాన్ని విరివిగా వాడతారు. వ్యవసాయానికి అనుమతిస్తూనే ఇతర వినియోగాలపై కఠినమైన నియంత్రణ ఉంచవలసిన అవసరాన్ని గుర్తించినట్లు చిదంబరం తెలిపాడు. విధివిధానాలకు త్వరలోనే నిర్ణయిస్తామని ఆయన వివరించాడు. ముంబై పేలుళ్ళ నిందితులు చాలా పకడ్బందీగా, అత్యున్నత స్ధాయి సమన్వయంతో, అధునాతన పద్ధతిలో పేలుళ్ళు జరిపారని చిదంబరం తెలిపాడు. అందువల్లనే క్లూలు దొరకడం లేదని ఆయన పరోక్షంగా వివరించాడు.

