పర్యావరణ శాఖ మంత్రిగా పర్యావరణ నిబంధనలను గట్టిగా అమలు చేయడానికి ప్రయత్నించి ఇతర మంత్రుల నుండి వ్యతిరేకతను ఎదుర్కొన్న జైరాం రమేష్ తనకు అప్పజెప్పిన గ్రామిణాభివృద్ధి శాఖలో కూడ తన మార్కు విధానాలను ప్రారంభించాడు. 12వ పంచవర్ష ప్రణాళిక కాలంలో (2012-17) గ్రామీణాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించే పధకాలన్నింటికీ స్వస్తి చెప్పి, పూర్తిగా నిర్వహణ రాష్ట్రాలకే అప్పజెప్పాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా నిర్ణయించగా, దానికి జైరాం రమేష్ పక్కకు నెట్టి కేంద్ర ప్రభుత్వం అధ్వర్యంలోనే 2017 వరకూ గ్రామిణాభివృద్ధి, పారిశ్రామికీకరణ, పట్టణీకరణలను చేపట్టాలని ప్రతిపాదించాడు.
జైరామ్ రమేష్, తన శాఖ వరకూ12 వ పంచవర్ష ప్రణాళికలో మార్గదర్శక సూత్రాలుగా “ACTIONS” అనే పధకాన్ని సిద్ధం చేశాడు. శనివారం అహ్లూవాలియాతో సమావేశం అయ్యాక జైరాం ‘ది హిందూ’ పత్రికతో మాట్లాడినట్లుగా ఆ పత్రిక తెలిపింది. అహ్లూవాలియాతో జరిగిన చర్చ వివరాలను తెలియ జేస్తూ ఆయన గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 9/90 కార్యకలాపాలను ఎలా నిర్వహించవలసిందీ చర్చించుకున్నామని చెప్పాడు. 9 గ్రామీణాభివృద్ధి శాఖ చేపట్టనున్న 9 ప్రధానాక కార్యక్రమాలను సూచిస్తుందని 90 అనేది ఆ కార్యక్రమాలపై ఖర్చు చేయదలచిన 90,000 కోట్ల రూపాయలను సూచిస్తుందనీ అయన తెలిపాడు.
ఈ కార్యక్రమాలన్నింటిపైనా కేంద్ర ప్రభుత్వం అందించే బడ్జెట్ కేటాయింపులను ఒకే ఒక్క కార్యక్రమం కిందికి తెచ్చి 90,000 కోట్లు కేటాయించాలనీ, ఆ నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వాలకే ఇచ్చి వాటిని ఏయే రంగాలకు ఖర్చు చేయవలసిందీ నిర్ణయించే అధికారం కూడా రాష్ట్రాలకే ఇవ్వాలనీ ప్రణాళికా శాఖ ఉపాధ్యక్షుడు నిర్ణయించాడని మంత్రి తెలిపాడు. వివిధ రాష్ట్రాలు తమకు అవసరమైన మొత్తాని నిర్ణయించుకుంటాయనీ, దానిని బట్టి నిధులను కేటాయించాలని అహ్లూవాలియా పధక రచన చేశాడనీ మంత్రి తెలిపాడు. నిధులను ఖర్చు చేయడానికి వివిధ ప్రాధాన్యతా రంగాలను ఎన్నుకునే అధికారం రాష్ట్రాలకే ఇవ్వాలని కూడా అహ్లూవాలియా భావించాడు. కొన్ని రాష్ట్రాలు రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వవచ్చనీ, మరికొన్ని నీటి సౌకర్యాలకూ, ఇంకొన్ని నైపుణ్యం అభివృద్ధికి ఖర్చు చేయవచ్చనీ, ఆయా రాష్ట్రాల అవసరాలను బట్టి ఖర్చు చేయవచ్చని అహ్లూవాలియా మొదట పధక రచన చేసినట్లు రమేష తెలిపాడు.
ఐతే మంత్రి రమేష్, అహ్లూవాలియా ప్రతిపాధనకు విశాల ప్రాతిపదికన అంగీకరిస్తూనే, 12 వ ప్రణాళికను అహ్లూవాలియా పధకం అమలుకు మార్పిడి కాలంగా (ట్రాన్సిషన్ పీరియడ్) నిర్ణయించాలని ప్రతిపాదించాడు ఈ మార్పిడి కాలంలో రాష్ట్రాలను తదనుగుణంగా సిద్ధం చేయడానికి కృషి చేయాలని రమేష్ ప్రతిపాధించాడు. 2017 నుండీ అహ్లూవాలియా చెప్పినట్లుగా రాష్ట్రాలకే నిధులిచ్చి వారి ప్రాధామ్యాల ప్రకారం ఖర్చు చేయడానికి అనుమతించవచ్చని రమేష్ ప్రతిపాదించాడు. జైరాం పధకానికి అహ్లూవాలియా అంగీకరించినట్లు కనపడుతోంది. పన్నెండవ ప్రణాళికకు జైరాం “ACTIONS” పధకం రూపిందించాడు.
“ACTIONS” పదం గ్రామీణాభివృద్ధి శాఖ తలపెట్టిన వివిధ కార్యక్రమాలను సూచిస్తాయి. అవి: accountability, convergence, transparency, innovations, outcomes, next generation and sustainability. ఆర్ధిక, పర్యావరణ అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ భూమి, నీరు ల ఉత్పాదకతలపై కేంద్రీకరణ జరగాలని మంత్రి తెలిపాడు. ప్రతి చర్యా పర్యావరణ పరంగా ఆమోదయోగ్యంగా ఉండడంతో పాటు తదుపరి తరాలకు కూడా ఫలితాలు అందించేదిగా ఉండాలని రమేష్ తెలిపాడు. ఎటువంటి రంగాలో చొరవ తీసుకోవలసిందీ గుర్తించాలని రమేష్, అహ్లూవాలియాలు నిర్ణయించుకుని, చర్చల కోసం మరొక నెల తర్వాత మళ్ళీ సమావేశం కావాలని నిర్ణయించారు. ఒక కేంద్ర మంత్రి కార్యాలయాన్ని అహ్లూవాలియా సందర్శించడం ఇచే మొదటిసారి అని జైరాం తెలిపాడు. గ్రామిణాభివృద్ధి, భూ వనరులు, నీరు, సానిటేషన్ విభాగాల కార్యదర్శులతో అహ్లూవాలియా చర్చలు జరపడం కూడా ఇదే మొదటిసారి అని ఆయన తెలిపాడు.
సోనియా గాంధి నేతృత్వంలోని జాతియా సలహా మండలితో కూదా జైరాం సమావేశమైనాడు. భూ స్వాధీనం, పునరావాసం, ఖాళీ చేయబడ్డవారి పునఃస్ధిరీకరణ అంశాలపై ఆ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. వివిధ అంశాలపై ఏకీభావం సాధించడానికి ఈ సమావేశం జరిగిందని రమేష్ తెలిపాడు. మళ్ళీ మంగళవారం కూడా ఈ సమావేశం జరుగుతుందని ఆయన తెలిపాడు. వివిధ రాష్ట్రాలతో పాటు ఇందులో భాగస్వామ్యం ఉన్నవారందరితో సంప్రతింపులు జరుపుతాననీ, ప్రతిపాదిత బిల్లును ప్రజలకు అందుబాటులో ఉంచుతాననీ తెలిపాడు. పారిశ్రామికీకరణ, పట్టణీకరణల వలన తరలించబడ్డవారితో పాటు రైతుల ప్రయోజనాలను సంరక్షిస్తూనే పారిశ్రామికీకరణ, పట్టణీకరణలను చేపడతామని రమేష్ హామీ ఇచ్చాడు. ఇవి రెండూ అనివార్యమైనవనీ ప్రయోజనాల ఘర్షణ ఏర్పడినప్పుడు పునర్మూల్యాంకనం చేసుకుంటూ ముందుకు సాగవలసిన అవసరం ఉందని రమేష్ తెలిపాడు.
రానున్న రోజుల్లో పారిశ్రామికీరణ, పట్టణీకరణల కోసం మరిన్ని భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చని రమేష్ వెల్లడించిన వివరాలను బట్టి తెలుస్తోంది. రైతులతో పాటు వివిధ వర్గాల ప్రజల ప్రయోజనాలు కాపాడుతూనే భూ స్వాధీనం ఎలా చేస్తారన్నది పరిశీలించాల్సిన విషయం. పరిశ్రమలవలన నష్టపోయినవారికి పరిశ్రమల్లో భాగస్వామ్యం కల్పించడానికి బిల్లు ప్రవేశపెడుతున్నట్లుగా కేంద్ర చెబుతోంది. సదరు బిల్లుని కేబినెట్ ఇటీవల ఆమోదించింది కూడా. భూసేకరణలో అనేక ఆరోపణలూ, ఆందోళనలూ ఎదుర్కొంటున్న ప్రభుత్వం, జైరాం రమేష్ సారధ్యంలో సమస్యలు తలెత్తబోవని ఆశిస్తుందేమో తెలియదు. అదే నిజమైతే అదేలా జరుగుతుందో పరిశీలించడం నిశ్చయంగా ఆసక్తికరంగా ఉండగలదు.
