2010-11 సంవత్సరంలో గతంలో ఎన్నడూ లేనంత రికార్డు స్ధాయిలో ఆహార ధాన్యాలను ఇండియా ఉత్పత్తి చేసినట్లు భారత ప్రధాని శనివారం ప్రకటించాడు. ఎన్నడూ లేనంతగా 241 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను పండించినప్పటికీ, అధిక ధరలతో పాటు పెరుగుతున్న డిమాండ్ తట్టుకోవడానికీ ఇంకా అధిక ఉత్పత్తి సాధించవలసి ఉన్నదని ప్రధాని మన్మోహన్ తెలిపాడు. 2007 నుండి 2012 వరకూ ఉన్న11 వ పంచ వర్ష ప్రణాళికలో 4 శాతం వ్యవసాయ వృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, వాస్తవంలో 3 శాతం మించకపోవచ్చని ఆయన అన్నారు.
“2006-07 నుండి ఆహార ధాన్యాల ఉత్పత్తి అవసరమైన వృద్ధి వేగాన్ని అందుకున్నప్పటికీ పదకొండవ పంచ వర్ష ప్రణాళికలో వార్షిక వ్యవసాయ వృద్ధి రేటు మూడు శాతం మాత్రమే నమోదు కావడం అంగీకారయోగ్యం కాజాలదు. ఇది మన లక్ష్యం అయిన నాలుగు శాతం కంటే తక్కువని గమనించాలి. ఫలితంగా ఆహార ద్రవ్యోల్బణం అంగీకరించలేని స్ధాయిలో కొనసాగుతున్నది. వ్యవసాయ రంగ వృద్ధి వేగవంతం కావడానికి అవసరమైన అన్ని చర్యలూ పన్నెండవ పంచ వర్ష ప్రణాళికలో పొందుపరచబడతాయని నేను భావిస్తున్నాను” అని ప్రధాని మన్మోహన్ ఐ.సి.ఎ.ర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసర్చి) సంస్ధ వ్యవస్ధాపక దినం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ అన్నారు.
చిత్రం ఏంటంటే ప్రధాని చెప్పిన పదకొండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో మన్మోహన్ సింగే ప్రధానిగా ప్రభుత్వానికి నాయకత్వం వహించారు. పంచవర్ష ప్రణాళికలో ఏర్పరుచుకున్న లక్ష్యాన్ని ఎందుకు చేరుకోలేనిదీ దేశ ప్రజలకు సమాధానం చెప్పవలసింది ఆయనే. లక్ష్యం చేరుకోలేక పోవడానికి కారణం వివరించడానికి బదులు తానే మరెవరినో వివరణ కోరుతున్నట్లుగా మాట్లాడడాన్ని ఏమని అర్ధం చేసుకోవాలో అర్ధం కాని విషయం. వ్యవసాయం వృత్తిగా గల కోట్ల మంది రైతులకు సొంత భూమంటూ లేదు. లాటరీలాగ మారిని వ్యవసాయంపైనే పూర్తిగా ఆధారపడిన కౌలు రైతులు గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే దానికి పరిష్కారాన్ని ఇంతవరకూ పాలకులు చూపలేదు. అదొక సమస్య కాదన్నట్లుగా వ్యవహరించే వీరు వ్యవసాయ లక్ష్యాన్ని సాధించలేదని ఎవర్ని ప్రశ్నిస్తున్నారు?
ఆక్స్ ఫాం అనే అంతర్జాతీయ వ్యవసాయ సంస్ధ విస్తృతంగా వ్యాపించి ఉన్న చిన్న కమతాల రైతులకు ప్రభుత్వాలనుండి ఎటువంటి ప్రోత్సాహం లేకపోవడంతో ఆహార భద్రత సాధించడం కష్టతరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేసింది. పెద్ద పెద్ద కమతాలతో పెట్టుబడిదారీ వ్యవసాయ ఉత్పత్తి విధానం ద్వారా మాత్రమే ఆహార భద్రత సాధించగలమని భావించడంలో వాస్తవం లేదని ఆ సంస్ధ కుండ బద్దలు కొట్టింది. వ్యవసాయ పరిశోధనను నామమాత్రంగా మార్చివేసిన ప్రభుత్వాలు రైతుకు మద్దతుగా తాము ఏ చర్యలు తీసుకున్నదీ నిజాయితీగా సమీక్షించుకోవలసిన అవసరం ఉంది. సాగు చేస్తున్న రైతులకు సొంత భూములు ఇవ్వడానికి వీలుగా భూసంస్కరణలు చేపట్టే కార్యక్రమాన్ని ఎందుకు వదిలిపెట్టారో వారు సమాధానం చెప్పవలసి ఉంది. దానికి బదులు భాద్యత ఎవరిపైనో ఉన్నట్లుగా ఉపన్యాసాలు దంచడం వలన సభలు విజయవంతం అవుతాయేమో గానీ వ్యవసాయ వృద్ధి జరగడం మాత్రం అసంభవం.
నిజానికి అనేక ప్రతికూల పరిస్ధితుల మధ్య కూడా రైతులు రికార్డు స్ధాయిలో ఉత్పత్తి తీయగలిగినందుకు బహుధా అభినందనీయులు. 2010-11 పంట సంవత్సరం (జులై నుండి జూన్ వరకు) లో సాధించిన 241 మిలియన్ టన్నుల వృద్ధి గత ఏప్రిల్ లో వేసిన అంచనా కంటే 5 మిలియన్ టన్నుల అధికం కాగా, గత సంవత్సరం కంటే 23 మిలియన్ టన్నులు అధికం. ఇదయినా గత సంవత్సరం రుతుపవన వర్షాలు ఆశించిన స్ధాయిలొ కురవడం వల్లనే సాధ్యమైంది తప్ప ప్రభుత్వాలు అందుకోసం చేసిన ప్రయత్నాలు శూన్యం. రెండంకెల జిడిపి వృద్ధి కోసం ప్రభుత్వ రంగ సంస్ధలను అమ్మిపారేయడం, విదేశీ పెట్టుబడులకు ప్రాత్సాహం అంటూ పన్నుల్లో కోత విధించడం, వీలయితే విదేశీ పెట్టుబడులకు పన్నులే లేకుండా చేయడం, ఎగుమతిదారులకు పన్నులు రద్దు చేయడం లేదా నామ మాత్రంగా విధించడం, నల్లడబ్బు వలన ద్రవ్యోల్బణం అదుపులోకి రాకుండా పోతుంటే నల్లధనాన్ని అరికట్టే బదులు బ్యాంకుల వడ్డీ రేట్లు పెంచడం తప్ప రైతులకు ప్రభుత్వాలు అందించిన ప్రోత్సాహకాలు ఏమీ లేవు. పైగా ఉన్న సబ్సిడీలను కూడా తగ్గిస్తూ పోవడంతో రైతులకు ఉత్పత్తి ఖర్చులు తడిసి మోపెడై, పంటకు ధరలు లేక అల్లాడుతున్న పరిస్ధితి ఉంటే బ్రోకర్లకు, మిల్లర్లకూ అనుకూలమైన చర్యలు తప్ప రైతుకు అనుకూల చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
గోధుమలు, మొక్క జొన్న, కాయ ధాన్యాలు అధికంగా ఉత్పత్తి కావడం వలన ఈ మాత్రం ఉత్పత్తి సాధించామని మన్మోహన్ చెబుతున్నాడు. పోషకార లోపం దేశంలో ఇంకా నెలకొని ఉన్న సంగతిని ఆయన గుర్తు చేస్తూ ఆయన కాయధాన్యాలు, ఆహార నూనెలు ఇంకా దిగుబడి చేసుకుంటున్నామని ప్రధాని కర్తవ్య ప్రభోధం చేస్తున్నాడు. “మనకు రెండవ హరిత విప్లవం అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. అది విశాల ప్రాతిపదికన, ప్రజలందరికీ ఉపయోగపడే రీతిలో, కలకాలం కొనసాగేవిధంగా ఉండాలి. మనం ఇంకా ఉత్పత్తి చేయాలి.” అని మన్మోహన్ తియ్యటి మాటలు వినిపించాడు. 2020-21 నాటికి 280 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలకు డిమాండ్ పెరుతుందని ఆయన వివరించాడు. దీనిని సాధించాలంటే సంవత్సరానికి ఉత్పత్తిని 2 శాతం పెంచుకుంటూ పోవాలి. ఇది చాలా పెద్ద కర్తవ్యం” అని ప్రధాని చెప్పాడు.
1997-98 నుండి 2006-07 వరకూ గల పది సంవత్సరాల్లో ఆహార ధాన్యాల ఉత్పత్తి సగటున సంవత్సరానికి 1 శాతం మాత్రమే సాధించామని ఆయన గుర్తు చేశాడు. వ్యవసాయ రంగం వృద్ధి స్తంభించిపోయిందనీ, దానిని వేగవంతం చేయాలనీ ఆయన కోరాడు. వ్యవసాయ పరిశోధన, వ్యవసాయ వసతుల కల్పన రంగాలపై ప్రభుత్వ ఖర్చు పెంచి, ఉత్పాదకతను పెంచడానికి బయోటెక్నాలజీ వినియోగాన్ని ఎక్కువ చేయాలని తద్వారా రైతుల ఆదాయాలను పెంచాలని ప్రధాని తెలిపాడు. ప్రస్తుతం వ్యవసాయ ఉత్పత్తిలో కేవలం 0.6 శాతం మాత్రమే వ్యవసాయ పరిశోధన, అభివృద్ధి రంగానికి ఖర్చు పెడుతున్నామని ప్రధాని వెల్లడించాడు. దీనిని 2020 నాటికి 2 నుండి 3 శాతం వరకూ పెంచాలని కోరాడు. వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడం వలన వ్యవసాయ రంగంలో గణనీయమైన వృద్ధి సాధించొచ్చని తెలిపాడు. భారత వ్యవసాయ రంగం ప్రధానంగా రుతుపవన వర్షాలపై ఆధారపడి ఉందనీ, నీటి పారుదల వసతులు పెంచి వాటిపై ఆధారపడే వ్యవసాయాన్ని ఇప్పుడున్న 30 శాతం భూములనుండి 50 శాతం భూములకు పెంచాలని కూడా ప్రధాని వాక్రుచ్చారు.
అయితే ప్రధాని ఇవన్నీ చేస్తానంటే వద్దని ఎవరన్నారో అర్ధం కాని విషయం. ఈ సౌకర్యాలన్నింటినీ రైతులకు కల్పించాలనే గదా ప్రజలు కోరుతున్నది? రైతులకు ప్రోత్సాహం ఇచ్చే బదులు వారినుండి భూముల్ని లాక్కొని విదేశీ కంపెనీలకు అప్పనంగా కట్టబెడుతున్నది ఎవరు? మా భూములు ఇవ్వం, మా కడుపుకి అదే ఆధారం అని రైతులు అంటుంటే పోలీసుల్ని దించి వారిని కొట్టిమరీ భూములు లాక్కుంటున్నది ఎవరు? వాతావరణ మార్పులు వ్యవసాయానికి పెద్ద ఆటంకంగా మారాయనీ కనుక ఆ మార్పులను తట్టుకునే పంట రకాలు, పంటలు పండించే పద్ధతులు, పంటల నిర్వహణ లను అభివృద్ధి చేయాలని ప్రధాని సూచించాడు. దీనర్ధం ప్రధాని బిటి రకం వంగడాలను ప్రోత్సహించాలని చెప్పదలుచుకున్నాడా? బిటి రకం వంగడాలవలనే వాతావరనానికి నష్టం వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతుంటే వాతావరణ రక్షణ కోసమే బిటిని వాడాలని చెప్పడం మన పాలకులు తెంపరితనానికి నిదర్శనం. మాటలు గాలిలో, చేతలు పాతాళంలో అన్న సామెతకు మన్మోహన్ ఉపన్యాసం సరిగ్గా సరిపోతుంది.

