నల్ల డబ్బుపై సిట్ నియామకం సుప్రీం కోర్టు అతి -రివ్యూ పిటిషన్‌లో కేంద్రం


సుప్రీం కోర్టు అతిగా వ్వవహరిస్తోందని కేంద్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది. విదేశాల్లో దాచిన నల్లడబ్బును వెనక్కి తెప్పించడానికి సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో “స్పెషల్ ఇన్‌వెస్టిగేషన్ టీం” ను నియమించడంలో సుప్రీం కోర్టు తన పరిధికి మించి వ్యవహరించిందని ఆరోపిస్తూ సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. సిట్ నియామకంపై జారీ చేసిన ఉత్తర్వును సమీక్షించాలని తన పిటిషన్‌లో కోరింది. ఇది “న్యాయవ్యవస్ధ అతి” అని పిటిషన్ లో కేంద్ర ప్రభుత్వం వ్యాఖ్యానించింది.

రిటైర్డ్ సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో సిట్ ను ఏర్పాటు చేయడం కార్యనిర్వాహక అధికారుల విధుల్లో న్యాయ వ్యవస్ధ జోక్యం చేసుకోవడంతో సమానమని కేంద్ర ప్రభుత్వం పిటిషన్ లో అభ్యంతరం తెలిపింది. “అధికారాల విభజన” సూత్రానికి ఈ నియామకం విరుద్ధమని ఆరోపించింది. ఇది చెడ్డ సాంప్రదాయమని అభివర్ణిస్తూ, దాని ప్రాతిపదికపైన సిట్ నియామకం ఉత్తర్వును వెనక్కి తీసుకోవాలని కోరుతూ, ఆదేశాలను రద్దు చేయాలని కోరింది.

“సుప్రీం కోర్టు ఉత్తర్వు, అది ఉద్దేశించినంతగా, న్యాయ వ్యవస్ధ పరిధిలో లేనటువంటి అంశం. ‘అధికారాల విభజన’ కు సంబంధించి ఇంతవరకూ వ్యవస్ధీకృతమై ఉన్న సిద్ధాంతానికి అది విరుద్ధం. పైగా ప్రభుత్వ ఆర్ధిక విధానాలు న్యాయ వ్యవస్ధ ‘సమీక్ష’ పరిధిలో లేనట్టివి. కనుక జారీ చేయబడిన మధ్యంతర ఉత్తర్వు తప్పు” అని కేంద్ర ప్రభుత్వం తన పిటిషన్‌లో పేర్కొంది. “మాజీ న్యాయశాఖ మంత్రి రాం జేఠ్మలాని తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌లో ‘సిట్’ ను నియమించాలని వారు కోరనప్పటికీ, కోర్టు పిటిషనర్‌ల కోరికలకు అతీతంగా ఉత్తర్వులు జారి చేసింది. నల్ల డబ్బు భూతాన్ని ఎదుర్కోవడంలో కార్యనిర్వాహక వ్యవస్ధ ఏమీ వెనకబడి లేదు. ఆ అంశాన్ని పరిశీలించడానికి ఇప్పటికే ‘హై లెవల్ కమిటీ’ని నియమించింది” అని కేంద్ర ప్రభుత్వం తన పిటిషన్‌లో పేర్కొంది.

నల్లడబ్బు పరిశోధనలో మందకొడితనాన్ని ఎత్తి చూపుతూ సుప్రీం కోర్టు జులై 4 తేదీన ఇచ్చిన ఉత్తర్వులో సిట్ ఏర్పాటును ప్రకటించింది. రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ పి.బి.జీవన్ రెడ్డి చైర్మన్ గా సిట్ నియమించి విదేశీ బ్యాంకుల్లో చట్ట విరుద్ధంగా దాచిన లెక్కకు రాని నల్ల డబ్బుని వెనక్కి తెప్పించడానికి అన్ని చర్యలూ తీసుకోవాలని ఆదేశించింది. అప్పటికే “హై లెవల్ కమిటీ” ని నియమించినందున సిట్ ను నియమించనవసరం లేదన్న కేంద్ర ప్రభుత్వ వాదనను కోర్టు తిరస్కరించింది.

కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను బట్టి నల్లడబ్బు దాచుకున్నవారిని రక్షించడానికే ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని స్పష్టం చేసినట్లయింది. నల్ల డబ్బును వెనక్కి తెప్పించాలన్న సుప్రీం కోర్టు నిర్ణయాన్ని ఏ విధంగానైనా సరే తప్పుపట్టవలసిన అవసరం లేదు. తప్పుపట్టేవారు నల్ల డబ్బుని వెనక్కి తెప్పించడాన్ని వ్యతిరేకిస్తున్నారన్నది స్పష్టమే. నల్లడబ్బు దాచుకోవడం రాజకీయ నాయకులకు, కార్యనిర్వాహకవర్గంగా పేర్కొనబడుతున్న బ్యూరోక్రట్ అధికారులకు ఉన్న జన్మ హక్కు అన్నట్లుగా కేంద్ర ప్రభుత్వ వ్యవహారం ఉంది. నల్లడబ్బును వెనక్కి తెప్పించడం ప్రభుత్వ ఆర్ధిక విధానాలకు వ్యతిరేకం అన్నట్లుగా కేంద్ర ప్రభుత్వ పిటిషన్ ఉంది.

ప్రభుత్వ ఆర్ధిక విధానాలు ప్రజలను వారి ఆస్తులను పరిరక్షించడానికి ఉద్దేశించాలే తప్ప వాటిని కొల్లగొట్టి విదేశాలకు తరలించడానికి కాదన్నది స్పష్టమే. కనుక కొల్లగొట్టబడి విదేశాలకు తరలి వెళ్ళిన నల్ల ధనాన్ని వెనక్కి తెప్పించడం ప్రభుత్వ ఆర్ధిక విధానాల్లో జోక్యం చేసుకోవడం ఎలా అవుతుందో ప్రభుత్వాధిపతి, “మిస్టర్ క్లీన్” మన్మోహన్ సింగ్ భారత ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. నోట్ల కట్టలతో ఎం.పిలను కొనుక్కుని ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్న విషయం “నాకు తెలియదు” అని మన్మోహన్ అన్నట్లే ఈ ‘రివ్యూ పిటిషన్’ వ్యవహారం కూడా తనకు తెలియదంటూ తన “మిస్టర్ క్లీన్” ఇమేజి ని కాపాడుకోవడానికి మన్మోహన్ సింగ్ మరొకసారి ప్రయత్నించవచ్చు.

కేంద్ర ప్రభుత్వం తన పిటిషన్ లో కార్య నిర్వాహక విధుల్లో జోక్యం చేసుకోకూడదు అని వాదించడం సిగ్గులేని తనం, బాధ్యతా రాహిత్యం. ఆ వాదన “ప్రజాస్వామ్యం” అనే గొప్ప భావన పట్ల వారికి ఎంత హీన దృక్పధం ఉన్నదో రుజువు చేస్తున్నది. ప్రభుత్వ విధుల్లో జోక్యం తగదు అని సుప్రీం కోర్టుని ఆక్షేపించడం ఈ “మిస్టర్ క్లీన్” మన్మోహనుడికి ఇదే మొదటి సారి కాదు. ప్రభుత్వం సేకరించిన ధాన్యం నిలవ చేయడానికి గౌడౌన్లు దొరక్క ఆరుబైట నిలవ చేయడంతో వర్షాలకు, ఎండలకు చెడిపోతుండడంతో ప్రజా ప్రయోజన వ్యాజ్యం మేరకు ఆ ధాన్యాన్ని కటిక పేదలకు ఉచితంగా పంచాలని సుప్రీం కోర్టు ఆదేశిస్తే వ్యవసాయ మంత్రి శరద్ పవార్, ప్రధాని మన్మోహన్ తీవ్రంగా ఆక్షేపించారు. “ఉచితంగా ఇవ్వడం కుదర్దు” అని తెగేసి చెప్పారు. అందుకు సుప్రీం కోర్టు ఆగ్రహించి “ఎందుకు పంచగూడదో వివరణ అడిగాం తప్ప తమరికి కుదురుతుందో లేదోనని అడగలేదు” అని అభిశంసించింది. దానితో “మిస్టర్ క్లీన్” మన్మోహనులవారికి తన అధికారాలు గుర్తుకొచ్చాయి. “కోర్టులు ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదు” అని ఒక పనికిమాలిన సూత్రం వల్లించడం ద్వారా కోర్టులకు సమాధానం చెప్పడానికి ప్రయత్నించాడు. ఈయనా మనకి “మిస్టర్ క్లీన్”!?

ఇప్పుడు తగుదునమ్మా అని నల్ల డబ్బు భోక్తలకు అదే సూత్రాన్ని వల్లిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ప్రభుత్వాల వాదనలు చాలా విచిత్రంగా ఉంటాయి. బ్యాంకుల్లొ అప్పులు తీసుకుని ఎగ్గొట్టినవారి పేర్లను వెల్లడించమంటే “దేశ అంతర్గత భద్రతకు పెద్ద ముప్పు. వెల్లడించడం కుదర్దు” అని పార్లమెంటులోనే చెబుతాయి. ఈ విషయంలో యు.పి.ఎ ప్రభుత్వంతో పాటు ఎన్డీఏ ప్రభుత్వం కూడా సరి సమానమే. ఒకరిని మించి మరొకరు బ్యాంకుల “నాన్ పెర్ఫార్మింగ్ అస్సెట్స్” (ఎన్.పి.ఎ) (భారత దేశానికి చెందిన, ప్రపంచ కుబేరుల జాబితాలో స్ధానం సంపాదించుకున్నారని మురిపెంగా చెప్పుకునే మన పారిశ్రామిక వేత్తలు అనేకులు భారత బ్యాంకుల వద్ద అప్పుగా తీసుకొని ఎగ్గొట్టిన డబ్బుకి ఈ ముద్దు పేరు పెట్టాయి మన ప్రభుత్వాలు) ను ఒక్క కలం పోటుతో రద్దు చేశాయి. పాడవుతున్న ధాన్యం పేదలకు పంచడంటే ప్రభుత్వ విధుల్లో జోక్య తగదని వాదిస్తారు. నల్ల డబ్బు వెనక్కి తెప్పించమంటే ఓ కమిటీ వేసి చేతులు దులుపుకుంటారు. అదేమని అడిగినందుకు సుప్రీం కోర్టుని కూడా “అతి చేస్తోంది” అని వాదిస్తూ మా అధికారాలు మా యిష్టం అని వాదిస్తున్నారు.

వీళ్ళా “మిస్టర్ క్లీన్‌లు”? వీళ్ళా దేవతలు? వీళ్ళా పాలకులు? హవ్వ! నవ్వి పోదుగు గాక! నాకేటి సిగ్గు?

వ్యాఖ్యానించండి