తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గత జులై 4 న చేసిన తమ రాజీనామాలను తక్షణమే ఆమోదించాలని తెలంగాణ ప్రాంతానికి చెందిన తెలుగు దేశం ఎం.ఎల్.ఎ లు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ను శనివారం కలిసి విజ్ఞప్తి చేసారు. టి.డి.పి ఫోరం కన్వీనర్ ఇ.దయాకర రావు తెలుగుదేశం ఎం.ఎల్.ఎ ల బృందానికి నాయకత్వం వహించాడు. రాజీనామాలను ఆమోదించడానికి గానీ కేంద్ర ప్రభుత్వం నుండి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ధిష్ట హామీని పొందడం గానీ చేయాలని వారు స్పీకర్‌ను కోరారు. “మేము సరైన ఫార్మాట్ లోనే రాజీనామా పత్రాలను స్పీకర్‌కు అందజేశాము. కనుక వెంటనే ఆమోదించాలని స్పీకర్‌ను కోరాము” అని దయాకర్ రావు విలేఖరులకు తెలిపాడు.
రాజీనామాలను ఆమోదించడానికి నిర్ణయం తీసుకొనే ముందు తాను అవసరమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తానని ప్రతిపక్ష ఎం.ఎల్.ఎ లకు స్పీకర్ మనోహర్ తెలిపాడు. రాష్ట్రానికి చెందిన 14 మంది ఎం.పిలు కూడా తెలంగాణ అంశంపైనే రాజీనామా చేయడంతో పార్లమెంటు స్పీకర్ మీరా కుమార్ ఈ విషయంలో ఎలా వ్యవహరిస్తున్నదీ తెలుసుకోవడానికి ఆమెను సంప్రదిస్తానని కూడా మనోహర్ టి.డి.పి ఎం.ఎల్.ఎ లకు చెప్పినట్లు తెలుస్తోంది. కామన్ వెల్త్ దేశాల స్పీకర్ల సమావేశం ఇంగ్లండులో జరగనున్నదనీ, అక్కడ నుండి వచ్చాక రాజీనామాల అంశాన్ని చేపడతానని మనోహర్ చెప్పినట్లు తెలుస్తోంది. శుక్రవారం నాడు టి.డి.పి నుండి సస్పెండ్ అయిన నాగం జనార్ధన రెడ్డితో పాటు మరో ఇద్దరు ఎం.ఎ.ఏ లు కూడా స్పీకర్‌ను కలిసి రాజీనామాలను ఆమోదించాలని కోరారు.
మొత్తం మీద తెలంగాణ ప్రాంతం నుండి టి.డి.పి పార్టీ ఎం.ఎల్.ఎ లుగా గెలుపొందిన 37 మంది ఎం.ఎల్.ఎ లు రాజీనామా చేశారు. వీరిలో ముగ్గురు రెబెల్ ఎం.ఎల్.ఎ లు సస్పెన్షన్ కి గురయిన ఒక ఎం.ఎల్.ఎ కూడా ఉన్నారు. అయితే తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎం.ఎల్.ఎ లుగానీ ఇతర చిన్న పార్టీల ఎం.ఎల్.ఎ లుగానీ, తెలంగాణ కోసమే ఏర్పాటయిన టి.ఆర్.ఎస్ ఎం.ఎల్.ఎలు గానీ ఎవరూ ఇంతవరకూ రాజీనామాల ఆమోదానికై ఒత్తిడి చేయడానికి స్పీకర్‌ను కలవకపోవడం విశేషం. తెలంగాణ ప్రాంతం నుండి మొత్తం 118 మంది ఎం.ఎల్.ఎ లు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉండగా, అందులో 101 మంది ఎం.ఎల్.ఎ లు తెలంగాణ రాష్ట్రం డిమాంచ్ చేస్తూ రాజీనామాలను సమర్పించారు.

