ఐ.ఎస్.ఐ అధిపతి అమెరికా పర్యటన విజయవంతం, బాగుపడిన ఐ.ఎస్.ఐ, సి.ఐ.ఎ ల సంబంధాలు


90 మందికి పైగా సి.ఐ.ఎ గూఢచారులను పాకిస్ధాన్ ప్రభుత్వం దేశం నుండి వెళ్ళగొట్టడంతో పాక్, అమెరికాల మధ్య సంబంధాలు బెడిసి కొట్టిన సంగతి విదితమే. సి.ఐ.ఎ గూఢచారులను వెనక్కి పంపడంతో అమెరికా కూడా పాకిస్ధాన్ కి ఇవ్వవలసిన 800 మిలియన్ డాలర్ల సహయాన్ని నిలిపివేసింది. తమ గూఢచారులు పాకిస్ధాన్ సైన్యానికి శిక్షణ ఇవ్వడానికే అక్కడ ఉన్నారనీ, వారే లేకపోతే ఇక శిక్షణకి ఇచ్చే సొమ్ము ఇవ్వవలసిన అవసరం లేదనీ సి.ఐ.ఏ అధికారులు, సహాయం నిలిపివేస్తున్నట్లు చేసిన ప్రకటన సందర్భంగా వ్యాఖ్యానించారు. కాని నిలిపివేసిన సాయంలో అధిక భాగం పాకిస్ధాన్‌కి న్యాయంగా ఇవ్వవలసిన భాగమేనని వారు చెప్పిన వివరాలను బట్టి వెల్లడయ్యింది. ఆఫ్ఘనిస్ధాన్‌ సరిహద్దు వద్దకు పాకిస్ధాన్ సైన్యాన్ని వేరేచోట నుండి తరలించి మొహరించినందుకు అయిన ఖర్చు అమెరికా నిలిపివేసిన 800మిలియన్ డాలర్లలో కలిసి ఉంది.

ఐ.ఎస్.ఐ అధిపతి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షుజా పాషా గత బుధవారం (జులై 13) అమెరికా సందర్శించాడు. సహాయం నిలిపివేసినపుడు ఐ.ఎస్.ఐ అధికారులు “అమెరికా సహాయాన్ని సైనిక ఉపయోగాలకు కాకుండా పౌర ఉపయోగాలకు వెచ్చించవలసిందిగా తామే అమెరికాని కోరామ”ని తేలిగ్గా తీసివేయడానికి ప్రయత్నించారు. అది “మేకపోతు గాంభీర్యమేన”ని సి.ఐ.ఎ అధికారులు వ్యాఖ్యానించారు. సహాయం నిలిపివేయడాన్ని తేలిగ్గా తీసివేయడానికి ప్రయత్నించినప్పటికీ ఐ.ఎస్.ఐ, దాని పట్ల ఆందోళనగానే ఉందన్న సంగతి, ఐ.ఎస్.ఐ అధిపతి అమెరికా సందర్శనతోనే రుజువైంది. అమెరికా సందర్శించిన అనంతరం ఐ.ఎస్.ఐ ఛీఫ్ పాషా, సి.ఐ.ఎ ఉన్నతాధికారులతో సమావేశమయ్యాడు. సమావేశం వివరాలు వెల్లడి కానప్పటికీ సమావేశం పూర్తిగా విజయవంతమయిందని ఇరు పక్షాలూ తెలిపినట్లుగా రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది.

సి.ఐ.ఎ డైరెక్టర్ లియోన్ పెనెట్టా, డిఫెన్స్ సెక్రటరీగా నియమితుడు కావడంతో యాక్టింగ్ డైరెక్టర్‌గా మైఖేల్ మోరెల్ వ్యవహరిస్తున్నాడు. ఐ.ఎస్.ఐ ఛీఫ్ మోరెల్‌తో గురువారం సమావేశం అయినట్లు తెలిసింది. షుజా పాషా వాస్తవానికి సెనేట్ గూఢచార (ఇంటలిజెన్స్) కమిటీ సభ్యులను కూడా కలవవలసి ఉందనీ, సమయం అనుమతించకపోవడంతో కుదరలేదనీ సి.ఐ.ఎ అధికారి ఒకరు తెలిపారని రాయిటర్స్ తెలిపింది. అటు ఐ.ఎస్.ఐ అధికారులు గానీ, ఇటు సి.ఐ.ఎ అధికారులు గానీ ఈ వివరాలను చెబుతూ తమ పేర్లను వెల్లడించడానికి ఇష్టపడలేదని ఆ సంస్ధ తెలిపింది. దీన్ని బట్టి సమావేశం ప్రధానంగా సి.ఐ.ఎ గూఢచారులను గతంలో అనుమతించిన సంఖ్యలో కాకపోయినా కొంతమందయినా పాక్‌కి తిరిగి రావడానికి ఐ.ఎస్.ఐ అధికారులు అంగీకారం తెలిపినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అమెరికా ప్రభుత్వం నిలిపివేసిన సహాయాన్ని పునరుద్ధరించే అవకాశం ఎలాగూ ఉంటుంది.

నిజానికి సి.ఐ.ఎ, ఐ.ఎస్.ఐ లు రెండూ తమ సంబంధాలు తిరిగి మామాలు స్ధాయికి చేరుకోవాలని కాంక్షిస్తూ అందుకు అనుగుణంగా ప్రకటనలు చేస్తూ వచ్చాయి. ఇరు పక్షాల మధ్య సహకారం తిరిగి గాడినట్లేనని ఆ సంస్ధల అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. “జనరల్ పాషా, సి.ఐ.ఎ యాక్టింగ్ ఛీఫ్ మైఖేల్ మోరెల్ ల మధ్య జరిగిన చర్చలు చక్కగా సాగాయి. పాకిస్ధాన్ అమెరికాల జాతీయ భద్రతలను మెరుగుపడేందుకు వీలుగా వారు అనేక చర్యలు చేపట్టడానికి అంగీకరించారు” అని సి.ఐ.ఎ అధికారి ఒకరు చెప్పినట్లుగా రాయిటర్స్ రాసింది. ఇరు దేశాల మధ్య గూఢచర్య భాగస్వామ్యం మరింత స్ధిరీకరించడానికి ఈ సమావేశం దోహదం చేసిందని అమెరికాలోని పాక్ రాయబార కార్యాలయ సీనియర్ అధికారి కూడా చెప్పారని వార్తా సంస్ధ తెలిపింది. “గూఢచర్యంలో ముందుకు సాగడానికి ఇరు పక్షాలు ఒక అంగీకారానికి వచ్చాయనీ, ఈ సందర్శన ఇరుదేశాల సంబంధాల్లోని గూఢచర్య భాగాన్ని తిరిగి పూర్తిగా పట్టాలపైకి ఎక్కించినట్టేననీ పాక్ అధికారి తెలిపాడు.

సి.ఐ.ఎ గూఢచారుల సంఖ్యను పెద్ద ఎత్తున తగ్గించినందునే పాక్, అమెరికాల సంబంధాలు దెబ్బతిన్నాయన్నది స్పష్టం. అయితే పశ్చిమ దేశాల కార్పొరేట్ పత్రికలు మాత్రం అమెరికా కమెండోలు పాకిస్ధాన్ లోకి జొరబడి ఒసామా బిన్ లాడెన్ ను చంపడంతోనే ఇరు దేశాల సంబంధాలు దెబ్బతిన్నట్లుగా రాస్తున్నాయి. తద్వారా సి.ఐ.ఎ గూఢచారుల సంఖ్యను పెద్ద సంఖ్యలో తగ్గించడానికి గల ప్రాధాన్యతను పూర్వ పక్షం చేయడానికి అవి ప్రయత్నిస్తున్నాయి. అమెరికా అధికారుల ఉనికిని పాకిస్ధాన్ ప్రజలు తీవ్రంగ వ్యతిరేకిస్తున్నారు. జనవరిలో సి.ఐ.ఎ గూఢచారి ఒకరు ఇద్దరు పాక్ పౌరులను కాల్చి చంపినప్పటినుండీ పాక్ ప్రజల ఆగ్రావేశాలు తీవ్రమయ్యాయి. అప్పటినుండీ పాక్ ప్రజలు అమెరికాపై వ్యతిరేకతను ఆందోళనన ద్వారా వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ దేశంలో ఏదో ఒక మూల అమెరికా వ్యతిరేక ప్రదర్శనలు, ఆందోళనలూ జరగడం మామూలు విషయంగా మారింది. ఈ అంశానికి ప్రచారం రాకుండా చేయడానికి పశ్చిమదేశాల పత్రికలు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. పాకిస్ధాన్ ప్రభుత్వం, సైన్యం అనుమతి లేనిదే అమెరికా కమెండోలు పాకిస్ధాన్ లోకి జొరబడే వారు కాదని పాక్ ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు.

వ్యాఖ్యానించండి