పార్లమెంటు విశ్వాస పరీక్షలో ‘ఓటుకు నోట్లు’ కేసు దర్యాప్తుపై సుప్రీం కోర్టు ఆగ్రహం


cash_for_vote_scam

విశ్వాస పరీక్షకు అనుకూలంగా ఓటువేయాలని కోరుతూ తమకు ఇచ్చిన కోటి రూపాయలను పార్లమెంటులో చూపుతున్న బి.జె.పి ఎం.పిలు

2008 సంవత్సరంలో పార్లమెంటు విశ్వాసం పొందడం కోసం యు.పి.ఎ – 1 ప్రభుత్వం డబ్బులిచ్చి ప్రతిపక్షాల ఓట్లు కొన్న కేసులో దర్యాప్తు కొనసాగుతున్న తీరు పట్ల సుప్రీం కోర్టు శుక్రవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు సంవత్సరాల నుండి కేసు విచారణలో పురోగతి లేకపోవడంతో ఢిల్లీ పోలీసుల పనితీరుపై అసహనం వ్యక్తం చేసింది. “ఢిల్లీ పోలీసులు చేసిన దర్యాప్తు పట్ల మేము ఏ మాత్రం సంతోషంగా లేము. ఇటువంటి తీవ్రమైన నేరంతో కూడిన అంశంలో, నేరం రుజువు చేయడానికి వ్యవహరించవలసిన పద్దతి ఇది కాదు” అని జస్టిస్ అఫ్తాఫ్ ఆలం నేతృత్వంలోని బెంచి వ్యాఖ్యానించింది. రెండు సంవత్సరాలనుండి దర్యాప్తు చేస్తున్నా కేసులో అసలు పురోగతి సాధించకపోవడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.

మాజీ ప్రధాన ఎన్నికల అధికారి జె.ఎం.లింగ్డో దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. యు.పి.ఎ ప్రభుత్వం ఎదుర్కొన్న విశ్వాస పరీక్షలో ఓటుకు నోట్లు తీసుకున్న రాజకీయ నాయకులపై చర్యతీసుకోవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ జె.ఎం.లింగ్డో తన పిటిషన్ లో కోరారు. కేసు హియరింగ్‌కి రావడంతో సుప్రీం బెంచి పోలీసులు సమర్పించిన స్ధాయీ నివేదిక (స్టేటస్ రిపోర్టు) ను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసింది. నివేదికలో పొందుపరిచిన అంశాలను చూసిన బెంచి పోలీసుల విచారణ తీరును ఆక్షేపించింది. “ఇదసలు దర్యాప్తు కాదు. కొద్దిమంది ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా మీరు ఓ కధను తయారు చేసి కోర్టుకి వినిపిస్తున్నారు. ఈ కేసులో విచారణ చేయడానికి ఇంతవరకూ ఎవరినీ ఎందుకు కస్టడీలోకి తీసుకోలేదు?” అని కోర్టు తీవ్రంగా ప్రశ్నించింది.

“లోక్ సభ సెక్రటరీ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఏ మాత్రం పట్టింపు లేకుండా వ్యవహరించారు. ఫిర్యాదుపై సరిగా స్పందించలేదు అని కోర్టు పేర్కొంది. రెండు వారాల్లోగా పోలీసులు మరలా తాజా స్ధాయీ నివేదిక సపర్పించాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. యు.పి.ఎ ప్రభుత్వం విశ్వాస పరీక్ష నెగ్గడానికి తమకు డబ్బు ముట్టజెప్పిందని ముగ్గురు పార్లమెంటు సభ్యులు ఆరోపిస్తూ పార్లమెంటులో కోటి రూపాయల నోట్ల కట్టలను పార్లమెంటులో ప్రదర్శించినపుడు దేశమంతా షాక్ తిన్నదనీ, ఐనా కేసులో నేరస్ధులపై ఇంతవరకూ ఏ చర్యా తీసుకోలేదని జె.ఎం.లింగ్డో తన ఫిర్యాదులో ఆరోపించాడు. సంఘటన, జులై 22, 2008 తేదీన జరిగినప్పటికీ, ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసిన ఢిల్లీ పోలీస్ క్రైం బ్రాంచ్ విభాగంగానీ, జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ గానీ ఇంతవరకూ నేరానికి అనుగుణమైన చర్య తీసుకోలేదని లింగ్డో కోర్టుకు తెలిపారు. ఓటుకు నోటు ఆరొపణలపై త్వరిగతిన దర్యాప్తు పూర్తి చేయడానికి వీలుగా ‘స్పెషల్ ఇన్‌వెస్టిగేషన్ టీమ్’ (సిట్) ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని తన పిటిషన్ లో జె.ఎం.లింగ్డో కోరారు.

జులై 22, 2008 తేదీన విశ్వాస పరీక్ష జరుతున్న సందర్భంగా ముగ్గురు బిజెపి ఎం.పి లు కోటి రూపాయల నోట్లను పార్లమెంటులో ప్రదర్శించారు. తమను ప్రభుత్వానికి మద్దతుగా ఓట్లు వేయాలని కోరుతూ యు.పి.ఎ కూటమికి చెందిన ఫ్లోర్ మేనేజర్లు తమకు ఆ డబ్బుని ఇచ్చారని వారు ఆరోపించారు. ఈ ఘటన అప్పట్లో పెద్ద సంచలనం కలిగించింది. భారత ప్రభుత్వం అమెరికాతో “పౌర అణు ఒప్పందం” కుదుర్చుకున్నందుకు నిరసనగా వామపక్ష పార్టీలు యు.పి.ఎ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించడంతో అది కూలిపోయే పరిస్ధితి తలెత్తింది. ప్రభుత్వం విశ్వాస పరీక్ష కోసం తీర్మానం పెట్టాలని నిర్ణయించాక కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు పెద్ద ఎత్తున ఇతర చిన్న పార్టీల ఎం.పిలకు డబ్బు పంచి ఓట్లు కొనుగోలు చేసిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. సమాజ్ వాది పార్టీ తో పాటు తెలుగుదేశం, తమిళనాడులోని ఎం.డి.ఎం.కె తదితర ప్రాంతీయ పార్టీలకు చెందిన ఎం.పిలు ప్రభుత్వ విశ్వాస పరీక్షకు అనుకూలంగా ఓట్లు వేయడంతో యు.పి.ఎ ప్రభుత్వం బతికి బైటపడింది. తెలుగు దేశం ఎం.పిలు కొద్దిమంది పార్టీ ఇచ్చిన విప్ ను ధిక్కరించి తీర్మానానికి మద్దతునిచ్చారు.

కొనుగోలు చేసిన ఓట్ల ద్వారానే యు.పి.ఏ విశ్వాస పరీక్ష నెగ్గిందన్నది బహిరంగ రహస్యం. అదేం లేదని కాంగ్రెస్ బొంకినా ఎవరూ నమ్మలేదు. సచ్ఛీలుడుగా పేరు పొందిన ప్రధాని మన్మోహన్ సింగ్, కొనుగోలు చేసిన ఓట్లతో నిలబడ్డ ప్రభుత్వానికి నాయకత్వం వహించి దేశ ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా, అమెరికా బహుళజాతి కంపెనీలకు అనుకూలంగా, అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ ను సంతోష పరుస్తూ అమెరికాతో “పౌర అణు ఒప్పందం” కుదుర్చుకున్నాడు. పార్లమెంట్లో బహిరంగంగా నోట్లకట్టలను ప్రదర్శించినా నేరం రుజువు చేయడానికి పోలీసులు ప్రయత్నించలేదు. ఆ తర్వాత వికీలీక్స్ ద్వారా వెల్లడయిన అమెరికా రాయబారుల కేబుల్స్ ద్వారా యు.పి.ఎ ప్రభుత్వం ఎం.పిల ఓట్లను డబ్బుతో కొనుగోలు చేసినట్లు స్పష్టంగా రుజువైంది. కాంగ్రెస్ నాయకులే స్వయంగా అమెరికా రాయబారి వద్ద నోట్ల కట్టలను చూపించి ఇవి ఎం.పిలకు ఇవ్వడానికేనని చెప్పినట్లు వికీలీక్స్ డాక్యుమెంట్లద్వారా వెల్లడయ్యింది.

మన “మిస్టర్ క్లీన్’ ప్రధాని మన్మోహన్, వికీలీక్స్ ని నమ్మలేమని బుకాయిస్తే వెంటనే అమెరికా మాజీ రాయబారి, వికీలీక్స్ వెల్లడించిన కేబుల్స్ నిజమైనవేననీ, అమెరికా రాయబారులు సత్యాలను నిర్ధారించుకున్నాక మాత్రమే తమ ప్రభుత్వానికి వివరాలు అందిస్తారని ప్రకటించి ప్రధాని మన్మోహన సచ్ఛీలత ఏపాటిదో చూపాడు. ఆ తర్వాత మన్మోహన్ దానిపై స్పందించడం మానేశాడు. అటువంటి ప్రధాని నిజాయితీపరుడని పత్రికలు ఇంకా పొగుడుతుండడమే విచిత్రం.

వ్యాఖ్యానించండి