భారత దేశంలో నిత్యావసర సరుకులు, వినియోగ సరులులతో పాటు సమస్త వస్తువల ధరలు పెరగడం కొనసాగుతూనే ఉంది. విశ్రాంతి తీసుకోవడానికి ససేమిరా అంటున్నాయి. జూన్ నెలలో ద్రవ్యోల్బణం ఇంకా పెరగడంతో పాటు ఏప్రిల్ నెలలో కూడా గతంలో ప్రకటించిన అంకెను ప్రభుత్వం మరింతగా పైకి సవరించుకుంది. అంటే ఏప్రిల్ నెలలో ధరలు గతంలో భావించినదాని కంటే ఎక్కువగా పెరిగాయన్నమాట.
జూన్ నెలలో (ప్రధాన) ద్రవ్యోల్బణం 9.44 శాతం నమోదయ్యింది. టోకు ధరల సూచి ప్రకారం లెక్కించే ప్రధాన ద్రవ్యోల్బణం గత మే నెలలో 9.06 శాతంగా ఉంది. గత సంవత్సరం జూన్ నెలలో ద్రవ్యోల్బణం 10.25 శాతం ఉండడం గమనార్హం. గత ఏప్రిల్ నెలకుగాను ద్రవ్యోల్బణం 8.66 శాతం అని ప్రకటించిన ప్రభుత్వం తాజా గణాంకాల ప్రకారం అది వాస్తవానికి 9.74 శాతం అని సవరించినట్లుగా ప్రభుత్వం తెలిపింది.
మే 24 తేదీన ప్రభుత్వం డీజెల్, వంట గ్యాసు, కిరోసిన్ ధరలను గణనీయంగా పెంచింది. జూన్ నెల ద్రవ్యోల్బణం పెరుగుదలకు ఈ పెరిగిన ధరలు కొంత వరకు ప్రభావితం చేశాయి. పెట్రోలియం సరుకుల ధరలు పెరగడంతో అవి సరఫరా ఆటంకంగా పరిణమించి ద్రవ్యోల్బణం పెరుగుదలకు దోహదం చేస్తున్నదని నిపుణులు భావిస్తున్నారు.
ఇంధనం, విద్యుత్ రంగాలు రెండూ టోకు ధరల సూచిలో దాదాపు 15 శాతం వాటా కలిగి ఉంది. ఈ రెండింటి టోకు ధరల సూచి గత సంవత్సరం జూన్ నెలతో పోలిస్తే ఈ సంవత్సరం జూన్ నెలలో 12.85 శాతం పెరిగింది. ఇది గత మే నెలలో 12.32 శాతం మాత్రమే ఉండడం గమనార్హం.
వార్షిక ప్రాతిపదికన (గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే) ఎల్.పి.జి గ్యాసు ధర 12.17 శాతం పెరగగా, హై స్పీడ్ పెట్రోలు ధర 6.58 శాతం పెరిగింది. పెట్రోలు ధర అయితే, అధికంగా 30.61 శాతం పెరిగిపోయింది. క్రితం జూన్ నెలతో పోలిస్తే ఈ జూన్ నెలలో మాన్యుఫాక్చర్డ్ ఉత్పత్తుల ధరలు 7.43 శాతం పెరిగాయి. టోకు ధరల సూచిలో మాన్యుఫాక్చర్డ్ ఉత్పత్తుల వాటా 65 శాతం వరకూ ఉంది. ఈ రంగంలో కూడా ద్రవ్యోల్బణం గత ఫిబ్రవరి నెలనుండి స్ధిరంగా పెరుగుతున్నది. మాన్యుఫాక్చర్డ్ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం మే నెలలో 7.27 శాతం నమోదయ్యింది.

