అప్ డేట్ – 3: బుధవారం జరిగిన బాంబు పేలుళ్ళలో మరణించినవారి సంఖ్య 13 కు చేరుకుందని పోలీసులు చెప్పారని ‘ది హిందూ’ పత్రిక తెలిపింది.. మహా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా 13 మంది చనిపోయారని ధృవీకరించాడు. ఐ.ఇ.డి (ఇంప్రూవైజ్‌డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్) లతో పేలుళ్ళు జరిపారని పోలీసులు చెప్పారు. దాదర్ లో కారులో ఉంచిన బాంబు పేలిందని తెలుస్తోంది. గొడుగు కింద ఉంచిన మరొక బాంబుని నిర్వీర్యం చేశారు.
అప్ డేట్ – 2: ఈరోజు అంటే, జులై 13 అజ్మల్ కసబ్ పుట్టిన రోజనీ, ముంబైపై టెర్రరిస్టులు దాడులు చేసిన అనంతరం చనిపోగా మిగిలిన వారు తప్పించుకుపోయారనీ, వారే కసబ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని రాయిటర్స్ అంచనా. ప్రమాద స్ధలంలో ఎవరికీ చెందని ఒక కారు (నెంబరు ఎం.హెచ్ 43A 9384) ఉన్నట్లు ఛానెళ్ళు చూపిస్తున్నాయి.
నాలుగో చోట (లెమింగ్టన్ రోడ్) కూడా పేలుడు సంభవించిందని వార్తలు తెలుపుతున్నాయి. హోమ్ సెక్రటరీ సమాచారం మేరకు బుధవారం పేలుళ్ళలో ఇప్పటివరకూ ఇద్దరు చనిపోగా వందమంది గాయపడ్డారు.
బుధవారం ఉదయమే ఇద్దరు ఇండియన్ ముజాహిదీన్ సంస్ధ సభ్యులు ఇద్దరిని అరెస్టు చేశారని పోలీసులు తెలిపారు. దానికి ప్రతీకారంగానే ఈ పేలుళ్ళు జరిపారా లేక లష్కర్ ఎ తొయిబా పాత్ర ఉన్నదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అధికారికంగా ఏమని భావిస్తున్నదీ తెలియరాలేదు. భారత దేశంలోని ఇతర ప్రధాన నగరాలన్నింటా అలర్ట్ ప్రకటించారు. అందులో హైద్రాబాద్ కూడా ఒకటి.

ముంబైలో మళ్ళీ బాంబు పేలుళ్ళు సంభవించాయి. పూర్తి వివరాలు ఇంకా అందలేదు. రాయిటర్స్ వార్తా సంస్ధ సమాచారం ప్రకారం దక్షిణ ముంబైలో రెండు చోట్ల పేలుళ్ళు సంభవించగా, సెంట్రల్ ముంబైలో ఒక చోట బాంబులు పేలాయి. 15 మందికి గాయాలైనట్లు ఆ సంస్ధ తెలిపింది.
166 మందిని బలి తీసుకున్న 2008 టెర్రరిస్టు దాడులు ఇంకా భారతీయుల మదినుండి చెరిగిపోలేదు. ఆనాటి పేలుళ్ళపై ఇండియా, పాక్ ల మధ్య ఇంకా చర్చలు సరిగా పూర్తి కానేలేదు. మూడు సంవత్సరాల అనంతరం మళ్ళీ బాంబు పేలుళ్ళు చోటు చేసుకోవడం దిగ్భ్రాంతి కలిగించే విషయం. పాకిస్ధాన్ ప్రభుత్వం అనేక సమస్యలతో సతమవుతున్న నేపధ్యంలో తాజా పేలుళ్ళు సంభవించడం గమనార్హం. పాక్ మిలట్రీకి 800 మిలియన్ డాలర్ల తదుపరి విడత సహాయాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన నేపధ్యంలో ఐ.ఎస్.ఐ అధిపతి చర్చల కోసం అమెరికా బయలుదేరి వెళ్ళాడు.
భారత్, పాకిస్ధాన్ ల మధ్య ఇప్పటికే విదేశాంగా కార్యదర్శుల స్ధాయిలో శాంతి చర్చలు జరిగాయి. త్వరలో విదేశాంగ మంత్రుల స్దాయిలో చర్చలు జరగడానికి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.
జనవరిలో సి.ఐ.ఏ ఏజెంటు ఒకరు ఇద్దరు పాక్ పౌరులను కాల్చి చంపినప్పటినుండీ పాక్ మిలట్రీతో పాటు ప్రభుత్వం కూడా ప్రజలనుండి అనేక విమర్శలను ఎదుర్కోంటోది. లాడెన్ హత్యానంతరం పాక్ ప్రభుత్వంపై విమర్శలు మరింత తీవ్రమయ్యాయి. ప్రస్తుత పేలుళ్ళకు ఈ పరిస్ధితి నేపధ్యం కాకూడదని ఆశిద్దాం.
అప్ డేట్స్: ముంబైలో బుధవారం జరిగిన మూడు బాంబు పేలుళ్ళలో కనీసం 8 మంది చనిపోయారనీ 50 మందికి పైగా గాయపడ్డారని పోలీసులు చెబుతున్నారు. దాడులు టెర్రరిజానికి సంబంధించినదీ లేనిదీ ఇప్పుడే వ్యాఖ్యానించలేమని పోలీసు ప్రతినిధి చెప్పాడు. బాంబులు పేలిన మూడు ప్రాంతాలూ జన సమ్మర్ధంతో ఉన్నాయని తెలుస్తోంది. కనుక మృతుల సంఖ్య ఇంకా పెరిగా అవకాశం కనిపిస్తోంది. దక్షిణ ముంబైలోని ఒపేరా హౌస్ ప్రాంతం, జవేరీ బజార్ ప్రాంతాల్లోనూ, సెంట్రల్ ముంబైలోని దాదర్ ప్రాంతంలోని బాంబులు పేలినట్లు తెలుస్తోంది. టీవీ ఛానెళ్ళు లైవ్ ప్రసారం చేస్తున్నాయి.
