అధిక ద్రవ్యోల్బణాన్ని అధిగమించి రికార్డు ఆర్ధిక వృద్ధి నమోదు చేసిన చైనా


అధిక ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ ధరలు, అధిక ధరలు అన్నింటినీ అధిగమిస్తూ చైనా అర్ధిక వ్యవస్ధ ఈ సంవత్సరం రెండో క్వార్టర్ లో 9.5 ఆర్ధిక వృద్ధిని నమోదు చేసి అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఆర్ధికవేత్తలు, మార్కెట్ విశ్లేషకుల అంచనా 9.4 శాతం అంచనాని దాటి చైనా అర్ధిక వ్యవస్ధ వృద్ధి చెందటం గమనార్హం. చైనా ఆర్ధిక వృద్ధి నెమ్మదిస్తూన్నదన్న భయాలను ఈ దెబ్బతో చైనా పటాపంచలు చేసినట్లయింది. తాజా ఆర్ధిక వృద్ధి రేటుతో ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి చైనాకు వడ్డీ రేట్లను పెంచడానికి అవకాశం లభించినట్లయింది. ఆర్ధిక వృద్ధిని త్యాగం చేయాల్సి ఉంటుందన్న భయాలు లేకుండా చైనా ఇప్పుడు నిరభ్యంతరంగా సెంట్రల్ బ్యాంకు వడ్దీ రేట్లను పెంచుకోవచ్చు. తాజా గణాంకాల నేపధ్యంలో చైనా త్వరలోనే మరొకసారి వడ్డీ రేటు పెంచవచ్చని అప్పుడే అంచనాలు కూడా మొదలయ్యాయి.

ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ సంక్లిష్టంగా, అస్ధిరంగా కొనసాగుతున్నప్పటికీ ధరల స్ధిరీకరణపై చైనా దృష్టి సారించే అవకాశం దొరికింది. దేశీయంగా వినియోగం పెరగడంతో పాటు దేశీయ పెట్టుబడులు కూడా పెరగడంతో చైనా 9.5 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదు చేయగలిగిందని భావిస్తున్నారు. చైనా ఆర్ధిక వ్యవస్ధ అవసరమైనదాని కంటే ఎక్కువగా వేడెక్కుతున్నదన్న అంచనాల నేపధ్యంలో, చైనా ప్రభుత్వం సెంట్రల్ బ్యాంకు వడ్డీ రేట్లను మూడు సార్లు పెంచింది. దానితో పాటు బ్యాంకులను ఎక్కువగా అప్పులివ్వకుండా కట్టడి చేసింది. ద్రవ్యోల్బణం తగ్గించడానికి సెంట్రల్ బ్యాంకు, వాణిజ్య బ్యాంకుల వద్ద ఉండవలసిన రిజర్వులను పెంచవచ్చని విశ్లేషకుల్లో అధికులు అంచనా వేస్తున్నారు. అంటె రిజర్వ్ రిక్వైర్‌మెంట్ రేట్ ను మరొకసారి పెంచవచ్చన్నది వారి అంచనా.

యూరప్ దేశాలు సావరిన్ అప్పు సంక్షోభంతో సతమతమవుతుండగా, అమెరికా వృద్ధి రేటు నెమ్మదించింది. చైనా ఎగుమతులు ప్రధానంగా వెళ్ళేవి ఈ రెండు ప్రాంతాలకే కావడం గమనార్హం. ఎగుమతులు పడిపోతున్నప్పటికీ చైనా జిడిపి వృద్ధిని అధిక స్ధాయిలో కొనసాగించగలుగుతున్నది. జూన్ నెలలో ఎగుమతుల ఆర్డర్లు బాగా పడిపోయినప్పుడు చైనా ఆర్ధిక వృద్ధిపై సందేహాలు తలెత్తాయి. ఆ సందేహాలు ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయాయి. చైనా దేశీయ వినియోగం ఈ సంవత్సరం మొదటి అర్ధ భాగంలో జిడిపి కి 4.6 శాతం వృద్ధి రేటుని జతచేసిందని చైనా గణాంకాల విభాగం వెల్లడించింది. చైనా ఆర్ధిక వ్యవస్ధ ఈ సంవత్సరం 9 శాతం కంటే ఎక్కువే నమోదు చేయవచ్చని ఇపుడు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఐతే అమెరికా, యూరప్‌ల పరిస్ధితి వలన మూడవ క్వార్టర్ లో ఆర్ధిక వృద్ధి పడిపోవచ్చని భావిస్తున్నవారు కొద్దిమంది లేకపోలేదు.

జూన్ నెలలో చైనా పారిశ్రామిక ఉత్పత్తి 15.1 శాతం వృద్ధి చెందింది. మే నెలలో ఇది 13.3 శాతంగా ఉంది. ఈ సంవత్సరం మొదటి ఆరునెలల్లో స్ధిరాస్ధుల్లో పెట్టుబడులు 25.6 శాతం వృద్ధి చెందగా, రిటైల్ అమ్మకాలు 16.8 శాతం వృద్ధి చెందాయి. గత సంవత్సరం, ఈ సంవత్సరారంభంలోనూ చైనా దేశీయ డిమాండ్ పెరగడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. ఐ.ఎం.ఎఫ్ కూడా గత సంవత్సరం చైనా దేశీయ మార్కెట్ ను అభివృద్ధి చేసుకోవాలని సలహా ఇస్తూ వచ్చింది. హామీ మేరకు దేశీయ మార్కెట్ ను చైనా అభివృద్ధి చేసుకున్నట్లుగా రెండవ క్వార్టర్ గణాంకాలు ధృవపరుస్తున్నాయి. ఇపుడు ద్రవ్యోల్బణం తగ్గింపును ప్రధాన లక్ష్యంగా చైనా ప్రభుత్వ చర్యలు ఉండవచ్చు. 2011 సంవత్సరం చివరికల్లా ద్రవ్యోల్బణం 4 శాతానికి తగ్గించాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. జూన్ ద్రవ్యోల్బణం 6.4 శాతం నమోదైన నేపధ్యంలో ఆ లక్ష్య సాధన కొంత కఠినతరం కావచ్చు.

వ్యాఖ్యానించండి