పాకిస్ధాన్‌కి ఇవ్వవలసిన 800 మిలియన్ డాలర్ల సహాయాన్ని నిలిపివేయడం పట్ల భారత ప్రభుత్వం సంతోషం వ్యక్తం చేసింది. అమెరికా చర్యను ఆహ్వానిస్తున్నట్లు ఇండియా విదేశాంగ శాఖ మంత్రి ఎస్.ఎం.కృష్ణ ప్రకటించాడు. అమెరికా అందజేసే ఆయుధాలవలన ఈ ప్రాంతంలో ఆయుధాల సమతూకాన్ని దెబ్బతీసి ఉండేదని ఆయన అన్నాడు. “ఇండియా, పాకిస్ధాన్ ల మధ్య నెలకొని ఉన్న ప్రత్యేక పరిస్ధితుల దృష్ట్యా, ఈ ప్రాంతాన్ని అమెరికా భారీగా ఆయుధమయం చేయడం వాంఛనీయం కాదని ఇండియా మొదటినుండి చెబుతున్న నేపధ్యంలో, ఆయుధీకరణ ఈ ప్రాంతంలోని ఆయుధ సమతూకాన్ని దెబ్బతీస్తుందన్నది మా అవగాహన. ఆ అవగాహన మేరకు పాక్‌కి సహాయం నిలిపివేస్తూ తీసుకున్న చర్య ఆహ్వానించదగినది” అని ఎస్.ఎం.కృష్ణ వ్యాఖ్యానించాడు.
అమెరికా నిలిపివేసిన సహాయం మొత్తం, పాకిస్ధాన్‌కి అమెరికా ప్రతి సంవత్సరం అందించే సహాయంలో మూడవ వంతు కాగా, అందులో పాకిస్ధాన్ ఆఫ్ఘనిస్ధాన్ సరిహద్దు వెంబడి తన సైన్యంలోని 100,000 మంది సైనికులను మొహరించినందుకు గాను అయిన ఖర్చు 300 మిలియన్ డాలర్లు కలిసి ఉంది. అంటే అమెరికా ప్రకటించిన “టెర్రరిజం పై ప్రపంచ యుద్ధం” లో పాకిస్ధాన్ భాగస్వామ్య పక్షంగా వ్యవహరించడానికి అంగీకరించి ఆ మేరకు చేసిన ఖర్చును కూడా అమెరికా చెల్లించడాన్ని నిలిపివేసింది. అది వాస్తవానికి అమెరికా అందిస్తున్న సహాయం కాదు. పాకిస్ధాన్ చేసిన ఖర్చుని తిరిగి చెల్లించడానికి అమెరికా ఇచ్చిన హామీని నమ్మి పాకిస్ధాన్ చేసిన ఖర్చు. తన హామీని విస్మరించి, ఇవ్వవలసిన సొమ్ముని కూడా ఇవ్వడానికి అమెరికా నిరాకరిస్తుంటే ఇండియా ప్రభుత్వం దానికి సంతోషించడం ఏమిటో అర్ధం కాని విషయం.
అమెరికా నిలిపివేసిన దానిలో మిగిలిన సొమ్ములో కొంత పాక్ సైనికులకు శిక్షణ ఇవ్వడానికీ, మరి కొంత మిలట్రీ ఉపకరణాల (హార్డ్‌వేర్) కోసం ఉద్దేశించిందని “ది హిందూ” పత్రిక తెలిపింది. భారత విదేశాంగ మంత్రి ఎస్.ఎం.కృష్ణ భావించినట్లుగా మిలట్రీ ఉపకరణాలంటె ఆయుధాలే కానవసరం లేదు. రవాణాకి వినియోగించే ట్రక్కులు, ఇతర వాహనాలనుండి ఏమైనా అయి ఉండవచ్చు. భారత దేశం ఇప్పటికే యూరప్ నుండి 126 ఫైటర్ జెట్లనూ, అమెరికా నుండి 10 సి-13 సైనికవాహక విమానాలనూ కొనబోతున్నట్లు ప్రకటించింది. గత సంవత్సరం ఒబామా ఇండియా పర్యటించినప్పుడు సైనిక వాహక విమానాలను కొనడానికి ఒప్పందం జరిగింది. ఈ సంవత్సరం యూరప్ లోని నాలుగు దేశాలు కలిసి తయారు చేస్తున్న ఫైటర్ జెట్‌నూ, ఫ్రాన్సు కి చెందిన మరొక ఫైటర్ జెట్‌నూ ఇండియా షార్ట్ లిస్ట్ చేసింది. ఇండియా చేస్తున్న ఈ ఆయుధాల కొనుగోలు వలన దక్షిణాసియాలో ఆయుధాల సమతూకం దెబ్బతింటుందని పాకిస్ధాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది కూడా.
కనుక దక్షిణాసియాలో ఆయుధ పోటీ కొనసాగకుండా ఉండటానికి అన్ని పక్షాలూ సంమయనంతో ఉండవలసిన అవసరం ఉంది. ఆయుధ పోటీ అంతిమంగా ప్రజల సంక్షేమం కోసం వెచ్చించాల్సిన మొత్తాన్ని తగ్గించడానికి వృధా ఖర్చుని పెంచడానికీ, ఆయుధాల కొనుగోలు పేరుతో రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారులూ కమీషన్లు దిగమింగడానికీ ఊపయోగపడుతుంది. ఇండియా తాను ఆయుధాలు కొనుగోలు చేస్తూ ఇతర దేశాల ఆయుధీకరణను వ్యతిరేకించడం కూడా వాంఛనీయం కాదు. అది ఇరు పక్షాలకూ భద్రతా ప్రయోజనాలను హాని కలిగిస్తుంది. పాకిస్ధాన్‌కి న్యాయంగా రావలసిన సొమ్ముని అమెరికా ఎగవేయడం ఇండియా సంతోషించదగిన విషయం కూడా కాదు.
మరోవైపు అమెరికా దక్షిణాసియాలోనే భాగమైన ఆఫ్ఘనిస్ధాన్‌లో దురాక్రమణ యుద్ధం కొనసాగిస్తోంది. అక్కడ శాశ్వత సైనిక స్ధావరాన్ని ఏర్పాటు చేయడానికి యుద్ధం చేస్తోంది. ఆఫ్ఘనిస్ధాన్‌లొ అమెరికా సైనిక స్దావరం ఉంటే అది ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్ధాన్ ప్రజలకే కాకుండా భారత ప్రజలకు కూడా ప్రమాదకరమే. ఆసియాలో ఎమర్జింగ్ ఆర్ధిక వ్యవస్ధలుగా ముందుకు వస్తున్నాయని భావిస్తున్న చైనా, ఇండియాలపై ఓ కన్నేసి ఉంచడానికి కూడా అమెరికా పధకాలు పన్నుతోంది. నిన్నటివరకూ పాకిస్ధాన్‌ని తన మిత్ర దేశంగా ప్రకటిస్తూ వచ్చిన అమెరికా ఈ రోజు శతృవు లెక్కన కక్ష సాధింపు చర్యలకు దిగినట్లే ఇండియా పట్ల కూడా అమెరికా అదే రీతిన వ్యవహరిస్తుందనడంలో అనుమానం లేదు. పొరుగు దేశాలుగా ఇండియా, పాకిస్ధాన్, ఆఫ్ఘనిస్ధాన్ లు ఒకరినొకరు సహకరించుకుంటూ బైటి శక్తులను ఈ ప్రాంతంలోకి రాకుండా నిరోధించవలసిన అవసరం ఉంది.
అదీ కాక అమెరికా, ఇండియా ప్రభుత్వాలు కోరుకుంటున్నట్లే పాకిస్ధాన్ టెర్రరిజంపై యుద్ధం కోసమే చేసిన ఖర్చుని అమెరికా చెల్లించడాన్ని ఆపేసింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నపుడు పాకిస్ధాన్ తో అమెరికా ఆడుతున్న తొండాటను ఇండియా ఖండించాల్సిన అవసరం ఉంది తప్ప ఆహ్వానించడం సరైంది కాదు. భారత ప్రభుత్వం దీన్ని గమనించి పాక్‌కి చెల్లించాల్సిన సొమ్ముని అమెరికా చెల్లించేలా ఒత్తిడి తేవాలి. అమెరికాతో స్నేహం ఎప్పటికీ పాముతో సహజీవనం లాంటిదేనని పాకిస్ధాన్ ఉదాహరణే ప్రబల సాక్ష్యం.
